సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? బాధిత కుటుంబం ఏమంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
సుగాలి ప్రీతి మృతి 2017లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది.
2017 ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఒక స్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు ప్రారంభిస్తే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
ఇప్పుడు 2025లో, సుగాలి ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేయడంతో ఈ కేసు మరోసారి చర్చకొచ్చింది.

సీబీఐ ఏం చెప్పింది?
2019లో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఆ తర్వాత 8 నెలలు గడిచినా సీబీఐ దర్యాప్తు ప్రారంభించకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసుపై సమాధానం చెప్పాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
'సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తమ దగ్గర తగినన్ని వనరులు లేవు' అంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న కోర్టుకు తెలిపింది సీబీఐ.
సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసిన సున్నితమైన కేసుల్లో తాము ఇప్పటికే తలమునకలై ఉన్నామనీ, సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తగినన్ని వనరులు తమ దగ్గర లేకుండా పోయాయని, ఈ కేసు దర్యాప్తు చేయడం తమకు సాధ్యం కాదని కోర్టుకు సీబీఐ తెలిపింది.

ఫొటో సోర్స్, UGC
సుగాలి ప్రీతి కుటుంబం ఏమంటోంది?
కేసును దర్యాప్తు చేయలేమని సీబీఐ చెప్పడంపై సుగాలి ప్రీతి కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది.
"2017లో రేప్ అండ్ మర్డర్ కేసు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మేం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాము. కేసు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.'' అని ప్రీతి తల్లి పార్వతి దేవి బీబీసీతో అన్నారు.
ఎంతో కష్టపడి ప్రీతి కేసును కోర్టు బెంచ్ వరకూ వచ్చేలా చేస్తే, ఇప్పుడు ఈ కేసును తాము దర్యాప్తు చేయలేమని కోర్టుకు సీబీఐ ఎలా చెబుతుందని ప్రశ్నించారు.
ప్రీతి మరణం వెనుక ఏం జరిగిందో తేలాలని, ఆమెను ఎవరు, ఎందుకు, ఎలా చంపారో తమకు తెలియాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు.
తమ బిడ్డ పోస్టుమార్టం రిపోర్టు, ఇతర రిపోర్టుల ఆధారంగా తమకు న్యాయం చేయాలని ప్రీతి తండ్రి సుగాలి రాజు నాయక్ కోరారు.
''మేము ఆధారాలతో అడుగుతున్నాం. పాప చనిపోయిన వెంటనే పోస్టుమార్టం చేసిన డాక్టర్ తన రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేశారు. పాప గర్భాశయం నిండా సెమన్ ఉన్నట్టుగా సర్టిఫికెట్ ఇచ్చారు. మా పాప ఉరి వేసుకుందని అంటున్నారు. కానీ ఆ ఉరి ఈ చీరతో జరగలేదు, వేరే తాడుతో బిగించి చంపినట్టు ఉందని పాథాలజిస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. మేం ఆ రిపోర్టుల ఆధారంగానే ప్రశ్నిస్తున్నాం. మా పాపను కచ్చితంగా రేప్ చేసి చంపారు.'' అని రాజు నాయక్ అన్నారు.
ఈ రిపోర్టులను బీబీసీ స్వయంగా చూడలేదు. వీటిని బీబీసీ స్వయంగా ధ్రువీకరించడం లేదు.

ఫొటో సోర్స్, TWITTER
సుగాలి ప్రీతి కేసులో అసలేం జరిగింది?
కర్నూలు పట్టణ శివార్లలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ అక్కడ హాస్టల్‌లో ఉంటున్న సుగాలి ప్రీతి, 2017లో హాస్టల్ రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
స్కూలు యాజమాన్యం మాత్రం బాలికది ఆత్మహత్య అని పేర్కొంది.
ప్రీతి తల్లిదండ్రులేమో స్కూలు యాజమాన్యానికి చెందిన కుటుంబ సభ్యులు అంటే తండ్రి, ఇద్దరు కుమారులు తమ బిడ్డపై అత్యాచారం చేసి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ముగ్గురిపై హత్యానేరం సెక్షన్ 302, పోక్సో యాక్ట్ 2012, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన 30 రోజుల తర్వాత నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నిందితుల్లో మూడో వ్యక్తి, కుటుంబ పెద్ద ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అయితే, ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు.
‘‘ప్రీతి గర్భాశయం జెల్లీ లాంటి జిగురు పదార్థంతో నిండివుందని డా.శంకర్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ తెలిపింది. ఈ విషయాల్లో మరింత స్పష్టత కోసం, డా.శంకర్ రిపోర్ట్‌తోపాటు ప్రీతి శరీరం నుంచి సేకరించిన కొన్ని నమూనాలను కర్నూలు మెడికల్ కాలేజ్ పాథాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ బాలేశ్వరికి పంపారు. ఆమె కూడా ఈ నమూనాలను పరిశీలించి, ఆ జిగురు పదార్థం మానవ వీర్యమేనని చెప్పారు. గర్భాశయం మొత్తం మానవ వీర్యంతో నిండిపోయిందని, హెడ్, బాడీ, టెయిల్‌తో సంపూర్ణంగా తయారై ఉన్న మానవ వీర్యకణాలను గర్భాశయంలో గుర్తించామని ప్రొఫెసర్ బాలేశ్వరి రిపోర్ట్ ఇచ్చారు.’’ అని ప్రీతి తల్లిదండ్రులు గతంలో బీబీసీకి చెప్పారు.
వైద్యుల నివేదికలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఐదుగురు సభ్యుల కమిటీ, ముగ్గురు సభ్యుల కమిటీ, నిపుణుల కమిటీల పేర్లతో రెండేళ్లు గడిపారని, కేసును నీరుగార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని వారు అప్పట్లో ఆరోపించారు.
ప్రీతి శరీరం నుంచి డా.శంకర్ సేకరించిన స్లైడ్స్, శ్వాబ్స్, రక్త నమూనాలను, ప్రీతి ఒంటిపై ఉన్న దుస్తులను డీఎన్ఏ పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపారు.
కానీ, తమకు అందిన నమూనాల్లో పురుషుడి వీర్యం లేదని, ఈ ఆధారాలతో ప్రీతిపై అత్యాచారం జరిగినట్లు చెప్పలేమని ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ వచ్చింది.

ప్రీతిపై అత్యాచారం జరగలేదని, ఆమెది హత్య కాదు, ఆత్మహత్య అని డా.లక్ష్మినారాయణ సభ్యుడిగావున్న ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత, పోలీసులు చార్జ్‌షీట్ ఫైల్ చేశారు.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక, ఎక్స్‌పర్ట్స్ నివేదిక తర్వాత, ఈ కేసులోని నిందితులపై హత్యానేరం, పోక్సో చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను తొలగించి, చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ పరిణామాలతో ఆందోళన చెందిన ప్రీతి తల్లిదండ్రులు, కేసును సీబీఐకు అప్పగించాలని మానవహక్కుల కమిషన్‌ను కోరారు. స్పందించిన కమిషన్, కేసును సీబీసీఐడీకి అప్పగించాలని ఆదేశించింది.
అలాగే సీబీఐ దర్యాప్తునకు అనుమతించాలంటూ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.
సుగాలి ప్రీతిది హత్యేనని తల్లిదండ్రులు ఆరోపించడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కానీ, ఈలోపు గవర్నమెంట్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పజెప్పింది.
సుగాలి కేసులో న్యాయం జరగాలంటూ నిరసనలు చేపట్టిన పవన్ కల్యాణ్.. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసుపై పూర్తిగా దృష్టి పెడతానని, 100 రోజుల్లో ఈ కేసును పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు తొమ్మిది నెలలైంది. ఈ కేసును తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ఫొటో సోర్స్, UGC
ప్రీతి తల్లిదండ్రులు ఏం చేయబోతున్నారు?
మొదటి నుంచి ఈ కేసులో న్యాయం చేస్తానని చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీదనే తాము ఆశలు పెట్టుకున్నామని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చెబుతున్నారు.
''మేం 2019 అక్టోబర్లో పవన్ కల్యాణ్‌ను కలిశాం. ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలేదని మేం ఆయనతో చెప్పాం. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ సుగాలి ప్రీతి కేసులో మాకు వెన్నంటి తోడుగా ఉన్నది ఆయనే.
లక్షలాదిమందితో ఇక్కడికి వచ్చి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఆయన ర్యాలీ కూడా చేశారు. అప్పటినుంచి కూడా ప్రీతికి న్యాయం జరగాలని అందరూ కలిసికట్టుగా పోరాడారు. అసలు ప్రీతి ఎవరు, ఆమెకు ఏం జరిగింది అనేది అందరికీ తెలిసింది పవన్ కల్యాణ్ మా దగ్గరకు వచ్చిన తర్వాతే.." అని సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్ చెప్పారు.
(గమనిక: సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తమ బిడ్డ పేరును మార్చవద్దని బీబీసీని కోరారు. ఇందుకు సంబంధించిన అనుమతిని బీబీసీకి ఇచ్చారు. వారి కోరిక మేరకు బాధితురాలి అసలు పేరునే కథనంలో పేర్కొన్నాం.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














