పారిశ్రామికవేత్త శ్యామ్ సుందర్ భర్తియా పై అత్యాచారం కేసు, ఆరోపణలను ఖండించిన భర్తియా

శ్యామ్‌సుందర్ భర్తియా

ఫొటో సోర్స్, Youtube/WorldEconomicForum

ఫొటో క్యాప్షన్, శ్యామ్‌సుందర్ భర్తియా

పారిశ్రామికవేత్త శ్యామ్ సుందర్ భర్తియాపై అత్యాచారం ఆరోపణల కింద మహారాష్ట్రలోని థానేలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

భర్తియాపై ఒక సినీ నటి థానే పోలీసులకు నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

ఈ కేసును విచారించిన జస్టిస్ రేవతీ డేరా, జస్టిస్ నీలా గోఖలే ధర్మాసనం, ఫిర్యాదు చేసిన మహిళ వాంగ్మూలం తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడంతో ఆ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సి ఉంది.

ఫిబ్రవరి 22న ముంబై సమీపంలోని థానేలోని కపూర్‌బావ్డి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్‌లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ చైర్మన్ శ్యామ్ సుందర్ భర్తియాతో పాటు మరో ముగ్గురి పేర్లు కూడా ఉన్నాయి.

అయితే, ఈ ఆరోపణలను నిరాధారమైనవనీ, అబద్ధమని శ్యామ్ సుందర్ భర్తియా ఖండించారు.

అత్యాచారం ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్ఐఆర్‌లో ఏముంది?

తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, బెదిరించారని, కులం పేరుతో దూషించారని శ్యామ్ సుందర్ భర్తియాపై సదరు నటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం పరిధిలోకి వస్తాయి.

ఈ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, సదరు నటి మరో నిందితురాలు పూజా కమల్జీత్ సింగ్‌ను సినిమా అవకాశాల కోసం సంప్రదించారు. చిత్ర పరిశ్రమలో అవకాశాలు పొందడానికి సహాయపడే వ్యక్తులను పరిచయం చేస్తానని పూజా తనకు హామీ ఇచ్చారని ఆ నటి పేర్కొన్నారు.

తాను మే 3, 2023న ముంబైలోని శాంతాక్రజ్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో మొదటిసారిగా శ్యామ్‌సుందర్ భర్తియాను కలిశానని నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత శ్యామ్‌సుందర్ భర్తియా తనను సింగపూర్‌కు ఆహ్వానించారని ఆమె తెలిపారు.

ఎఫ్ఐఆర్‌లో చెప్పిన వివరాల ప్రకారం, మే 19, 2023న పూజా సింగ్‌తో కలిసి తాను సింగపూర్ వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ భర్తియా తనను ఒక ఇంటికి తీసుకెళ్లి, మద్యంసేవించి, తనతో బలవంతంగా మద్యం తాగించి, ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. దీన్నంతటినీ పూజా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు చెప్పారు.

ఈ విషయాన్ని రహస్యంగా ఉంచకపోతే, ఆ వీడియోను బయటపెడతామని తనను బెదిరించినట్లు బాధిత మహిళ ఆరోపించారు.

అత్యాచారం ఆరోపణలు, కోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

భర్తియా ఏం చెప్పారు?

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ దిల్లీకి సమీపంలోని నోయిడాలో ప్రధాన కార్యాలయంగా పని చేసే ఒక ఇండియ ఫుడ్ సర్వీస్ కంపెనీ.

దాని వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, ఈ కంపెనీ భారతదేశం‌తోపాటు, దాని పొరుగు దేశాలలో అంతర్జాతీయ ఆహార బ్రాండ్‌లకు మాస్టర్ ఫ్రాంచైజీని నిర్వహిస్తోంది. వీటిలో డొమినోస్ పిజ్జా, పోపీస్, డంకిన్ డోనట్స్ ఉన్నాయి.

భర్తియాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. శ్యామ్ సుందర్ భర్తియా నుంచి వ్యక్తిగతంగా వచ్చిన ప్రకటన అంటూ కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. సదరు నటి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని, దురుద్దేశంతో చేసినవనీ, తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

భర్తియా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారని, విచారణ కొనసాగుతున్నందున దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలేరని ఆ ప్రకటన తెలిపింది.

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ భారతదేశ వ్యాప్తంగా 400కి పైగా నగరాల్లో పనిచేస్తోంది. ఈ సంస్థలో 30వేలమందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన మీడియా రిపోర్టులు తమ సంస్థ కార్యకలాపాలు లేదా వ్యాపారాన్ని ప్రభావితం చేయబోవని కంపెనీ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)