అమెరికా ఎఫ్-35, రష్యా సుఖోయ్: భారత వైమానిక దళం మొగ్గు ఎటువైపు?

ఎఫ్-35

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఏరో ఇండియా- 2025 కార్యక్రమంలో కనిపించిన ఎఫ్-35 యుద్ధ విమానం
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ తన వైమానిక దళాన్ని ఆధునీకరణలో భాగంగా ఎలాంటి ఫైటర్ జెట్లను ఎంపిక చేసుకోవాలా అనే సమస్యను ఎదుర్కొంటోంది. మరి ఆ సమస్యకు అమెరికన్ ఫైటర్ జెట్ సమాధానం కానుందా?

గతనెలలో వాషింగ్టన్ పర్యటన సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని భేటీ అయ్యారు. భారత్‌కు ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు.

అమెరికా కేవలం సన్నిహిత మిత్రదేశాలకు, భాగస్వాములకు మాత్రమే ఈ ఫైటర్ జెట్‌లను విక్రయిస్తుంది.

ఎఫ్-35 ఫైటర్ జెట్ అయిదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం. అధునాతన సెన్సార్లతో అనేక పనులను చేస్తుంది. ఏఐ ఆధారిత పోరాట వ్యవస్థలు, డేటా షేరింగ్ సామర్థ్యాలు దీని సొంతం.

రాడార్ల కళ్లుగప్పేలా రూపొందిన ఈ జెట్‌ ఆకాశంలో ఎదురులేకుండా దూసుకుపోతుంది. అయిదో తరం ఫైటర్ జెట్లలో స్టెల్త్ సాంకేతికత అత్యంత కీలక అంశం. కానీ ఈ జెట్ ధర ఒకొక్కటి 80 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ. 696 కోట్ల పైమాటే. ధర ప్రకారం చూస్తే, అత్యంత ఖరీదైన వాటిలో ఇదొకటి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికానా, రష్యానా?

తన ఫైటర్ స్క్వాడ్రన్లు తగ్గిపోతూ, చైనా మిలిటరీ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ఒక కీలక సవాలును ఎదుర్కొంటోందని చాలామంది భావిస్తున్నారు. అమెరికా నుంచి అత్యంత ఖరీదుతో కూడిన అత్యుత్తమమైన ఎఫ్-35 లను కొనుగోలు చేయడమా లేక, రష్యాతో సైనిక బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆ దేశం తయారుచేసే అడ్వాన్స్‌డ్ స్టెల్త్ సాంకేతికతతో తయారయ్యే సుఖోయ్ ఎస్‌యు-57 విమానాలను కొనుగోలు చేయడమా అనే డోలాయమాన స్థితిని ఎదుర్కొంటోంది.

కానీ పరిస్థితి పైకి కనిపించేదానికన్నా సంక్లిష్టంగా ఉందని నిపుణులు నమ్ముతున్నారు. అమెరికా, రష్యా మధ్య పోటీని మీడియా మరీ ఎక్కువగా చూపుతోందని నిపుణులు అంటున్నారు. దీనికితోడు ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో అమెరికా, రష్యా యుద్ధ విమానాలు ప్రత్యక్షం కావడంతో మీడియా ఈ హైప్‌ని మరింత పెద్దది చేసింది.

సుఖోయ్ ఎస్‌యూ 57

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఎయిర్ షోలో రష్యాకు చెందిన సుఖోయ్ ఎస్‌యూ 57 విమానాన్ని కూడా ప్రదర్శించారు

‘ట్రంప్ ఆఫర్ ప్రతీకాత్మకం’

ఎఫ్-35ల గురించి ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ఆచరణాత్మకంగా కంటే ప్రతీకాత్మకంగా కనిపిస్తుందని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన సీనియర్ ఫెలో ఆష్లే జె టెల్లిస్ అన్నారు. అమెరికా ఆయుధాలు విక్రయించాలనే ఒత్తిడితో ఈ ఆఫర్ చేసినట్లుగా ఆయన భావిస్తున్నారు.

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ప్రణాళికల్లో అయిదో తరం యుద్ధ విమానాన్ని చేర్చడం సవాలే. మరీ ముఖ్యంగా సహ ఉత్పత్తి హక్కులు లేని పరిస్థితుల్లో.

స్టెల్త్ ఫైటర్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)ను భారత్ సొంతంగా తయారుచేసుకుంది. దీన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది.

''భారత్‌కు ఎఫ్-35 సహ ఉత్పత్తి హక్కులు లభించే అవకాశం లేదు. వీటికి సంబంధించి ఏదైనా అమెరికా నేరుగా విక్రయిస్తుంది. మోదీ నొక్కిచెప్పే 'భారత్‌లో తయారీ' అనే విధానాన్ని కూడా దీనికి వర్తింపచేయలేం'' అని టెల్లిస్ చెప్పారు.

ఎఫ్-35 విషయంలో భారత్‌కు ధర, ఖరీదైన నిర్వహణ, కార్యాచరణ సమస్యలు వంటి సవాళ్లు ఎదురవుతాయి. అమెరికా వైమానిక దళంలో ఎఫ్-35 యుద్ధ విమానాల లభ్యత 51 శాతమని సెక్యూరిటీ ఎక్స్‌ఫర్ట్, వెపన్స్ అండ్ స్ట్రాటజీ కాలమ్ రచయిత స్టీఫెన్ బ్రియాన్ అన్నారు.

''రష్యా జెట్‌లను కొనుగోలు చేయడం మెరుగ్గా ఉంటుందని తెలిసి కూడా ఎఫ్-35ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నదా అనేదే ఇక్కడ ప్రశ్న'' అని ఆయన వ్యాఖ్యానించారు.

కానీ, చాలామంది ఎస్‌యూ-57 నిజమైన పోటీదారు అనే విషయాన్ని తోసిపుచ్చారు. రష్యాతో కలిసి ఈ జెట్‌లను సహ ఉత్పత్తి చేయడం కోసం భారత్ దశాబ్ద కాలం పాటు కృషిచేసి సాంకేతికత బదిలీ, ఖర్చులు, ప్రామాణికతలపై వివాదాల కారణంగా 2018లో ఈ కార్యక్రమం నుంచి తప్పుకుందని వారు చెబుతున్నారు.

రాఫెల్ ఫైటర్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2021లో జరిగిన ఎయిర్ షోలో రాఫెల్ యుద్ధ విమానాలు

భారత్‌కు యుద్ద విమానాల కొరత

భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల కొరత ఉంది. పైగా పాతకాలపు పరికరాలను వాడుతోంది.

భారత వైమానిక దళం 31 ఫైటర్, కంబాట్ స్క్వాడ్రన్లను నిర్వహిస్తోంది. వీటిలో చాలాభాగం రష్యన్, సోవియట్ కాలం నాటి విమానాలే. పైగా భారత్ వద్ద ఉండాల్సిన నిర్ణీత 42 స్క్వాడ్రన్ల కన్నా 11 తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సుఖోయ్-30 యుద్ధ విమానానికి దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం భారత్ ముందున్న అతి ముఖ్యమైన సవాలు. సుఖోయ్-30 బహుముఖ ప్రజ్ఞాశాలి. దీన్ని రష్యా నుంచి భారత్ పొందింది.

క్రిస్టోఫర్ క్లారీ ఒక పొలిటికల్ సైంటిస్ట్. యూనివర్సిటీ ఆఫ్ ఆల్బనీలో పని చేస్తారు. ఐఎస్‌ఎస్ మిలిటరీ బ్యాలెన్స్ ఫర్ ఇండియా డేటాలోని కలవరపరిచే అంశాలను ఆయన ఎత్తిచూపారు. 2014-2024 మధ్య చైనా 435 ఫైటర్, గ్రౌండ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తన దళానికి జోడిస్తే, పాకిస్తాన్ తన వైమానిక దళంలో 31 విమానాలను చేర్చింది. ఇక భారత్ విషయానికొస్తే, భారత ఫ్లీట్ 151కి తగ్గింది.

స్వదేశీ పద్ధతిలో 500కు పైగా యుద్ధ విమానాలను జోడించాలని భారత్ ప్రణాళికలు రచించింది. వీటిలో ఎక్కువగా తేలికపాటి యుద్ధ విమానాలే.

83 తేజస్ మార్క్ 1ఎ యుద్ధవిమానాలకు సంబంధించిన ఆర్డర్లు ఇచ్చారు. మరో 97 యుద్ధవిమానాలను త్వరలోనే ఆర్డర్ చేయనున్నట్లు అంచనా. మరోవైపు బరువైన, అత్యంత అధునాతన మార్క్ 2 యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక స్వదేశీ స్టెల్త్ జెట్ తయారీకి కనీసం ఒక పదేళ్ల కాలం పట్టొచ్చు.

ఐఏఎఫ్‌కు చెందిన 20 బిలియన్ డాలర్ల మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్‌ఎఫ్‌ఏ) కార్యక్రమం కింద 114 మల్టిరోల్ ఫైటర్ జెట్‌లను కొనాలని భారత్ అనుకుంటోంది. ఈ విదేశీ జెట్‌లను సాంకేతిక బదిలీ ద్వారా భారత్‌లో తయారు చేయాల్సి ఉంటుంది. కానీ, సాంకేతికత బదిలీ జరుగడమే ఇందులోని అతిపెద్ద అడ్డంకి.

తేజస్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఎయిర్ షోలో టేకాఫ్ అవుతున్న స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఫైటర్ జెట్

అవే అసలైన అడ్డంకులు

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత భారత ప్రభుత్వం పారదర్శక, వివాదరహిత ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియను పరిశీలిస్తోంది. 2019 నుంచి రాఫెల్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. అయిదు జెట్‌లు పోటీలో నిలవగా, ఇప్పటికే ఐఏఎఫ్‌కు సేవలు అందిస్తోన్న రాఫెల్ పోటీలో ముందు నిలిచింది.

నిధులు, జాప్యం, విదేశీ జెట్‌లపై ఆధారపడటం అనే మూడు కీలక సవాళ్లను భారత వైమానిక దళం ఎదుర్కొంటోందని నిపుణులు అంటున్నారు.

రక్షణరంగం చేసే ఖర్చు వాస్తవంగా క్షీణించిపోయింది. విదేశీ యుద్ధవిమానాల కార్యక్రమంతో ఆలస్యం జరిగే ముప్పు ఉంటుంది. భారత్‌లో తయారీ (హోమ్ మేడ్)కి భారత్ ప్రాధాన్యం ఇస్తుండగా డీఆర్‌డీఏ వద్ద జరిగే జాప్యాలతో విదేశీ కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ఇదే పునరావృతం అవుతోంది. ఇలా జరగకూడదంటే సకాలంలో సమర్థమైన స్వదేశీ జెట్‌‌లను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది.

రక్షణ శాఖ లక్ష్యాలకు, ఐఏఎఫ్ అవసరాల మధ్య సమతుల్యత లేకపోవడం మరో సవాలు అని జియోపొలిటికల్ రిస్క్ కన్సల్టింగ్ సంస్థ యూరేషియా గ్రూప్‌కు చెందిన అనలిస్ట్ రాహుల్ భాటియా అన్నారు.

తేజస్ మార్క్ 1పై ఎయిర్‌ఫోర్స్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేయడంతో మార్క్ 1ఎ, మార్క్ 2 వంటి అప్‌గ్రేడ్‌లు వచ్చాయి.

''సాంకేతికత అభివృద్ధి అనేది దశాబ్దాల పాటు సాగుతుంటే సైనిక బలగాలు విసుగు చెందుతాయి. ఎందుకంటే కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ వాటి అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. దీనికి తగినట్లుగా మరింత ఆలస్యం జరగుతుంటుంది'' అని బీబీసీతో రాహుల్ చెప్పారు.

జాప్యానికి సంబంధించి భారత వైమానిక దళం చీఫ్ ఏపీ సింగ్ తన విసుగును దాచలేదు.

''బయట నుంచి ఏమీ కొననని, భారత్‌లో అభివృద్ధి అయిన వాటికోసం వేచి ఉంటానని మాట ఇచ్చి దానికి కట్టుబడి ఉండగలను. కానీ, సకాలంలో అవి అందుబాటులోకి రాకపోతే ఇలా చేయడం సాధ్యం కాదు'' అని ఇటీవల ఒక సెమినార్‌లో ఎయిర్ మార్షల్ సింగ్ అన్నారు.

''ప్రస్తుతానికి మన దగ్గర యుద్ధ విమానాలు తక్కువగా ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. అందుబాటులోకి వస్తాయని చెప్పినవి కూడా ఇంకాస్త ఆలస్యం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ఖాళీలను పూరించగలిగే ప్రత్యామ్నాయాలను చూడాల్సిన అవసరం ఉంది'' అని తేజస్ మార్క్ 1ఎ డెలివరీల్లో జరిగిన ఆలస్యాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. గత ఫిబ్రవరిలోనే మార్క్ 1ఎ డెలివరీ కావాల్సి ఉండగా ఇప్పటికీ ప్రారంభమే కాలేదు.

సుఖోయ్ యుద్ధ విమానం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత వైమానిక దళం వెన్నెముక సుఖోయ్ యుద్ధ విమానం

భారత్ ప్రాధాన్యం అదే

స్వదేశీ స్టెల్త్ ఫైటర్లను తయారు చేయడమే భారత్ ప్రాధాన్యత. వీటి అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక బిలియన్ డాలర్లకు పైగా కేటాయించారు.

చైనా వద్ద జె-20, జె-35 అనే రెండు స్టెల్త్ ఫైటర్లు ఉన్నాయి. కానీ, అమెరికా ప్రమాణాలకు తగినట్లుగా ఇవి ఉండకపోవచ్చు.

భారత్ ఇటు అమెరికా, అటు రష్యా ఫైటర్లు రెండింటినీ ఎంచుకోదని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.

''స్వల్ప కాలానికైతే, అత్యవసర కొనుగోళ్లు చేసి ఈ ఖాళీలను నింపవచ్చు, మధ్యకాల ప్రయోజనాల కోసం సహ ఉత్పత్తిపై, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సొంతంగా తయారు చేసుకోవాలి'' అన భాటియా అన్నారు.

భారత వైమానిక శక్తి భవిష్యత్ కేవలం జెట్‌లను కొనడం కాదు, బలమైన పశ్చిమ భాగస్వామితో కలిసి వాటిని తయారు చేసుకోవడం. ఈ విజన్ విజయవంతం కావాలంటే భారత్ సకాలంలో స్వదేశీ ఫైటర్లను డెలివరీ చేయాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)