మిత్ర్ క్లినిక్: డోనల్డ్ ట్రంప్ నిర్ణయానికి హైదరాబాద్‌లోని ఈ ఆసుపత్రి మూతపడటానికి సంబంధం ఏంటి?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ, ఇటికాల భవాని
- హోదా, బీబీసీ ప్రతినిధులు
'మిత్ర్ క్లినిక్ అంటే ఒక ఫ్యామిలీ.అమ్మనాన్నల దగ్గర కూడా కొన్ని చెప్పుకోలేం కానీ మిత్ర్ క్లినిక్‌లో అన్ని విషయాలూ చెప్పగలం'' అన్నారు హైదరాబాద్‌కు చెందిన అను.
30 ఏళ్ల అను ఓ ట్రాన్స్‌జెండర్. నాలుగేళ్లుగా మిత్ర్ క్లినిక్ నుంచి సేవలు పొందుతున్నారు.
''నేను ఈ క్లినిక్ మొదలైనప్పటి నుంచి ఇక్కడకు వస్తున్నాను. నా సర్జరీకి ముందు ఇక్కడే కౌన్సెలింగ్ తీసుకున్నాను. నేను వేయబోయే అడుగు రైటా.. కాదా.. అనే సందిగ్ధంతో మిత్ర్ క్లినిక్‌కు వెళ్లాను. అక్కడ నేను 3 నెలలు కౌన్సెలింగ్ తీసుకున్నాను. నా నిర్ణయం సరైనదేనని నిర్ణయించుకున్నాక, ఏ హాస్పిటల్‌కు వెళ్లి సర్జరీ చేయించుకోవాలి, సర్జరీ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎంతవుతుంది... ఇలా అన్ని విషయాలపై అవగాహన కల్పించారు'' అని బీబీసీతో చెప్పారు అను.
భారత్‌లో మొదటిసారిగా హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం మిత్ర్ క్లినిక్ ఏర్పాటైంది.
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తీసుకున్న నిర్ణయంతో ఈ క్లినిక్ మూత పడింది. ఎక్కడో అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం హైదరాబాద్‌లో నడుస్తున్న క్లినిక్‌పై ఎందుకు ప్రభావం చూపిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.


ఫొటో సోర్స్, ACCELERATE/FACEBOOK
అసలేమిటీ మిత్ర్ క్లినిక్?
హైదరాబాద్‌లో 2021 మార్చిలో మిత్ర్ క్లినిక్ ప్రారంభమైంది.
'ప్రాజెక్టు యాక్సలరేట్'లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, యూఎస్ ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ కింద అమెరికా నుంచి వచ్చే నిధులతో ఇది నడిచేది.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం దీని పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, వైఆర్‌జీ కేర్ సహా వివిధ సంస్థలు క్లినిక్ నిర్వహణలో భాగస్వాములయ్యాయి.
మిత్ర్ క్లినిక్ ట్రాన్స్‌జెండర్లకు 'వన్-స్టాప్ సెంటర్'గా ఉండేదని ట్రాన్స్‌హెల్త్ కౌన్సెలర్ రచన ముద్రబోయిన బీబీసీతో చెప్పారు.
''క్లినిక్‌కు ప్రతినెలా 200 నుంచి 250 మంది వచ్చి సేవలు పొందుతుంటారు. ఇప్పటివరకు 4వేల మంది క్లయింట్స్ రిజిస్టర్ అయ్యారు'' అని చెప్పారు రచన.
ఆమె ఇదే క్లినిక్‌లో నాలుగేళ్లుగా కౌన్సెలర్‌గా ఉన్నారు.
ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటైన క్లినిక్ కావడంతో ఆ కమ్యూనిటీకి చెందిన వారే ఏడుగురు ఇందులో పనిచేసేవారు.
"క్లినిక్ ప్రారంభమైన ఆరు నెలలకే రోజుకు దాదాపు 20 మంది క్లయింట్లు నన్ను సంప్రదించేవారు'' అని బీబీసీతో చెప్పారు డాక్టర్ ప్రాచీ రాథోడ్.
ప్రాచీ గతంలో మిత్ర్ క్లినిక్‌లో డాక్టర్‌గా పనిచేశారు.
''సర్జరీలు చేయించుకోవాలనుకున్న వారికి అవసరమైన సమాచారంతో పాటు సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ వివరాలను క్లినిక్‌లో అందించేవాళ్లం'' అని చెప్పారు.
హైదరాబాద్‌లోని క్లినిక్‌ను ఆదర్శంగా తీసుకుని 2021 జులైలో మహారాష్ట్రలోని థానె, పుణెలో క్లినిక్‌లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో హెల్ప్ డెస్క్ కూడా ప్రారంభించారు.

మిత్ర్ క్లినిక్‌లో ఏయే సేవలందించేవారంటే..
30 ఏళ్ల మానస సెక్స్‌వర్క్ వృత్తిలో ఉన్నారు. ఓ సారి దిల్లీకి వెళ్లినప్పుడు హెచ్ఐవి బారిన పడినట్టు తనకు సందేహం వచ్చింది. చాలా గాబరా పడ్డారు. వెంటనే ఆమె మిత్ర క్లినిక్‌కు కాల్ చేశారు. "ఇక నాకు వృత్తి ఉండదనుకున్నాను. కాల్ చేస్తే నన్ను భయపెట్టకుండా, అవసరమైన సమాచారాన్ని అందించారు. 72 గంటలలోపు వరకు హెచ్ఐవిని నివారించవచ్చని చెప్పారు. వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి క్లినిక్ తెరిచే అర గంట ముందే అక్కడికి చేరుకున్నాను. వారు ఇచ్చిన 21 రోజుల పెప్ మందులు (పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్) సమాయానికి వేసుకున్నాను. ఇదంతా పూర్తి ఉచితంగా జరిగింది.." అని మానస అన్నారు.
మానసకి తన ఆరోగ్యం గురించి ఎటువంటి సందేహం వచ్చినా నారాయణగూడలో ఉన్న మిత్ర క్లినిక్‌కు వెళతారు. తన స్నేహితురాళ్లకి కూడా అదే సలహా ఇచ్చేవారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్సే కాదు, తోడు కూడా..
మిత్ర్ క్లినిక్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి కౌన్సెలింగ్, న్యాయ సహాయం, హార్మోన్ థెరపీ, సాధారణ వైద్య పరీక్షలతోపాటు హెచ్ఐవీ సంబంధిత పరీక్షల స్క్రీనింగ్, మందుల పంపిణీ ముఖ్య ఉద్దేశంగా ఉండేది.
సాధారణ జనాభాతో పోలిస్తే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో హెచ్‌ఐవీ బాధితులు 14 రెట్లు ఎక్కువగా ఉన్నారని ప్రాజెక్ట్ యాక్సిలరేట్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. హెచ్ఐవీ సోకిన వారికి కూడా ఈ క్లినిక్‌లో అవసరమైన వైద్య సాయం అందించేవారు. హెచ్ఐవి పాజిటివ్ వస్తే మిత్ర క్లినిక్‌లో కౌన్సెలింగ్ ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఏఆర్‌టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ) సెంటర్‌కు రెఫర్ చేస్తారు. టెస్టు ఫలితాలు నెగిటివ్ వస్తే మూడు నెలలకొక సారి ఫాలో- అప్ టెస్టు కోసం క్లైంట్‌లను పిలుస్తారు.
''క్లినిక్ మూసివేయడంతో హెచ్ఐవీ సేవలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. జనరల్ హెల్త్ చెకప్స్‌కు వచ్చినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు బయటపడేవి. ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీకి ఆ సేవలన్నీ నిలిచిపోయాయి'' అని చెప్పారు రచన ముద్రబోయిన.
క్లినిక్‌లో సేవల కోసం దూర ప్రదేశాలనుండి క్లైంట్స్ వచ్చేవారని క్లినిక్ సిబ్బంది అన్నారు.
ప్రతి చిన్న సవాలుని ఎదుర్కొనేలా సేవలు అందించినట్టు క్లినిక్‌లో కౌన్సెలర్‌గా పని చేసే అయేషా అన్నారు. "హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఒంటరిగా పోరాడుతున్నాం అని అనిపించకుండా ఏఆర్‌టీ సెంటర్‌కు ఆరు నెలల వరకు నర్సు తోడుగా వెళతారు. మొదట్లో ఏఆర్‌టీ సెంటర్‌లో డాక్టర్, ఇతర సిబ్బంది అడిగే ప్రశ్నలకు భయపడకుండా సమాధానం ఇచ్చేలా నర్సు ధైర్యం చెబుతారు. మందుల కోసం ఏఆర్‌టీ సెంటర్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంటే, నర్సే మందులు సేకరించి, క్లైంటుకు పార్సిల్ చేస్తారు" అని ఆయేషా అన్నారు.
ప్రస్తుతం ఆయేషా ఇతర ఉద్యోగాలు వెతుక్కునే పనిలో ఉన్నట్టు చెప్పారు.

ఫొటో సోర్స్, Mitr Clinic - Thane/Facebook
క్లినిక్ ఎందుకు మూతపడింది?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే యూఎస్ ఎయిడ్ నిధులను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో భారత్‌లో యూఎస్ ఎయిడ్ నిధులతో నడుస్తున్న మిత్ర్ క్లినిక్‌లు కూడా మూతపడ్డాయి.
అమెరికా సెనేట్‌లో యూఎస్ ఎయిడ్ నిధుల అంశంపై మాట్లాడుతూ మిత్ర్ క్లినిక్ గురించి ప్రస్తావించారు సెనేటర్ జాన్ కెన్నడీ.
"భారత్‌లో యూఎస్ ఎయిడ్ నిధులతో ట్రాన్స్‌జెండర్ క్లినిక్ నడుస్తోందని అమెరికన్లకు తెలియదు. అమెరికన్లు చెల్లించిన పన్నులతో మాజీ అధ్యక్షుడు బైడెన్ వృథా ఖర్చులు చేశారు"అని ఆయన ఆరోపించారు.
ట్రంప్ అధ్యక్షుడైతే ఈ క్లినిక్‌లపై ప్రభావం ఉంటుందని ఊహించినా, ఇంత తీవ్రత ఉంటుందని అనుకోలేదని ప్రాజెక్ట్ యాక్సిలరేట్‌లో పనిచేస్తున్న పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి బీబీసీతో అన్నారు.
''మొదట మేం 90 రోజులకే నిధులు నిలిచిపోయాయని భావించాం. ఆర్డర్ అందిన వెంటనే క్లినిక్ మూసివేశాం. తాజాగా మార్చి 14 నుంచి క్లినిక్ శాశ్వతంగా మూసివేస్తున్నట్లుగా సమాచారం వచ్చింది'' అని అన్నారాయన.
ట్రాన్స్‌జెండర్లపై వివక్ష
ప్రాజెక్ట్ యాక్సిలరేట్ ట్రాన్స్‌జెండర్లకే కాకుండా, దేశంలో 18 ఏళ్ల లోపు ఉన్నదాదాపు 8000 మంది పెచ్ఐవి బాధిత పిల్లలకు వైద్య, విద్య, మానసిక మద్దతును ఇస్తుంది. యూఎస్ ఎయిడ్ నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ఇచ్చిన ఆర్డర్ లో ప్రాణాంతక వ్యాధులకు అందించే సేవలకు ఉపశమన సౌకర్యం కల్పించారు. దీనివల్ల హెచ్ఐవీ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రజలకు సేవలందించే కార్యక్రమాలకు వెసులుబాటు దొరికిందని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు.
"హెచ్ఐవి ఓ మహమ్మారి... పిల్లలకు అందించే సేవలకు ఉపశమనం దొరికింది కానీ, ట్రాన్స్‌జెండర్ల కోసం అటువంటి సేవలే అందించే మిత్ర క్లినిక్‌లను మాత్రం మూసివేయమన్నారు. ఇది ట్రాన్స్‌జెండర్లను వివక్షకు గురి చేసే ఆర్డర్. ఎంతో శ్రద్ధతో వారికి స్క్రీనింగ్ సహా సమగ్ర సేవలు అందించగలిగాం. ఇప్పుడు ఎంతో మందికి స్క్రీనింగ్ చేసే అవకాశం కోల్పోయాం.." అని ప్రాజెక్ట్ అధికారి అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు కేవలం మందులిస్తే సరిపోదని, సామాజిక కోణంలోనూ చూడాలన్నారు.

మిత్ర్ క్లినిక్ ఇప్పుడు ఎలా ఉందంటే...
హైదరాబాద్‌లో మూతపడిన మిత్ర్ క్లినిక్‌ను బీబీసీ సందర్శించింది. నారాయణగూడా చౌరస్తా సమీపంలోని వైఆర్‌జీ ఫార్మసీ పక్కన చిన్న సందులో ఈ క్లినిక్ ఉంది.
తలుపులు మూసివేసి ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి బోర్డులు లేవు. బయట ఉన్న వాటినీ తొలగించారు. భవనానికి పైభాగంలో ఉన్న బోర్డు కనిపించకుండా కప్పి ఉంది.
క్లినిక్ లోపలకు వెళ్లేందుకు అనుమతి లేదని అక్కడే ఉన్న వైఆర్‌జీ సిబ్బంది మాకు చెప్పారు.
''జనవరి 27 నుంచే క్లినిక్ మూసివేసి ఉంది. క్లయింట్లు వస్తుంటే, క్లినిక్ మూసివేశారని చెప్పి పంపిస్తున్నాం'' అని వైఆర్‌జీ ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు.
క్లినిక్ మూతపడటంతో అప్పటికే అపాయింట్‌మెంట్ తీసుకున్నవారిని ఉస్మానియా సహా వేర్వేరు ఆసుపత్రులకు పంపిస్తున్నామని చెప్పారు రచన.
''క్లినిక్ తరఫున హమాలీ అడ్డాలు, మురికివాడలు, డ్రగ్స్ బారిన పడే అవకాశం ఉన్న యువతీ యువకులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేవాళ్లం. ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మూతబడిందని కొన్ని లక్షల మంది ప్రజలు సోషల్ మీడియాలో హర్షిస్తుంటే ఆశ్చర్యంగానూ, బాధగానూ ఉంది'' అన్నారు రచన.
‘మిత్ర్ క్లినిక్ ఓ భరోసా’
యాక్సిలరేట్ వార్షిక నివేదిక ప్రకారం 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు మహారాష్ట్రలో దాదాపు 1481 మంది క్లయింట్స్ రిజిస్టర్ అయితే, 980 మంది హెచ్ఐవీ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సహాయాన్ని పొందారు. అన్ని క్లినిక్‌లలో 782 మంది క్లయింట్లు హెచ్‌ఐవీ నిరోధక సేవలు అందుకుంటే.. కరీంనగర్‌లోని మిత్ర క్లినిక్ హెల్ప్ డెస్క్‌లో 541 మంది సేవల కోసం నమోదు చేసుకున్నారు.
''మిత్ర్ క్లినిక్ పనిచేసినంత కాలం మాకు హెల్త్ గురించి గాని, లైఫ్ గురించి ఎలాంటి భయం ఉండేది కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ గురించే చూస్తారు. ఇక్కడ అలా కాదు, ఏ టూ జడ్ చూస్తారు. ఇప్పుడు అలా అన్ని సేవలు ఒకే చోట పొందాలంటే ఇబ్బందే'' అని బీబీసీతో చెప్పారు ట్రాన్స్‌జెండర్ అను.
''మా కమ్యూనిటీలో కొందరు హెచ్ఐవీ సహా చాలా రకాల వ్యాధులకు మందులు బయట కొనడానికి వేలరూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇక్కడ అన్ని సేవలు ఉచితంగా అందించేవారు'' అని వివరించారామె.

తెలంగాణలో మైత్రి క్లినిక్స్
ట్రాన్స్‌జెండర్లకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 32 మైత్రి క్లినిక్స్‌ను 2024 డిసెంబర్ 2న ఏర్పాటు చేసింది. అప్పటికే ఉస్మానియాలో ఓ మైత్రి క్లినిక్ నిర్వహిస్తున్నారు. దీంతో మొత్తం మైత్రి క్లినిక్‌ల సంఖ్య 33కు చేరుకుంది. కరీంనగర్ హెల్ప్ డెస్క్ ఇప్పుడు మైత్రి క్లినిక్‌గా మారింది.
ఇవి వారానికి ఒకరోజు మాత్రమే పనిచేస్తున్నాయి.
ఇక్కడి సిబ్బంది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకీ చెందిన వారు కాకపోవడంతో వ్యక్తిగత విషయాలను, ప్రత్యేకించి తమ శరీరానికి సంబంధించిన సమస్యలను అందరూ చెప్పుకోలేకపోవచ్చని డాక్టర్ ప్రాచీ అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్‌లకు మిత్ర్ క్లినిక్ ఒక మార్గదర్శిగా ఉండేదని చెప్పారు రచన ముద్రబోయిన.
''మైత్రి క్లినిక్‌ల కారణంగా కొంత మేర సమస్యలు తగ్గాయి కానీ ఒక్క రోజుకే పరిమితం కావడం వల్ల ఇబ్బందిగా మారింది'' అని ఆమె వివరించారు.
మళ్లీ మిత్ర్ క్లినిక్‌లు తెరుచుకునే అవకాశం ఉందా అని బీబీసీ ప్రశ్నించగా 'ఎవరైనా దాతలు వచ్చి నిధులు సమకూరిస్తే, ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పారు రచన.
గతంలో క్లినిక్ నిర్వహణ, జీతాలకు నెలకు 2-3లక్షల రూపాయల వరకు ఖర్చయ్యేదన్నారు.
దీనిపై తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్.చొంగ్తూ బీబీసీతో మాట్లాడారు.
''మిత్ర్ క్లినిక్ మూత పడిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ప్రతిపాదనలతో రావాలని నిర్వాహకులకు సూచించాం. క్లినిక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది'' అని క్రిస్టినా వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














