'వైఎస్‌ జగన్‌ను క్షమిస్తున్నా' అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఎందుకన్నారు?

జగన్, అయ్యన్నపాత్రుడు

ఫొటో సోర్స్, x.com/AyyannaPatruduC/YS Jaganmohanreddy/FB

ఫొటో క్యాప్షన్, గతంలో వైఎస్‌ జగన్‌ తనకు రాసిన లేఖపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో స్పందించారు.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను ఉద్దేశించి ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది.

11మంది సభ్యులతో ఏకైక విపక్షంగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కొన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ మేరకు 2024 జూన్‌ 24న శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు.

ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఆయన తన పార్టీ సభ్యులు సహా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరువుతున్నారు.

గతంలో వైఎస్‌ జగన్‌ తనకు రాసిన లేఖపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో స్పందించారు.

సమావేశం ప్రారంభం కాగానే ఆయన ఈ విషయంపై రూలింగ్‌ ఇస్తున్నానని ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Andhrapradesh Assembly

ఫొటో సోర్స్, aplegislature.org

స్పీకర్ రూలింగ్‌లో ఏమున్నదంటే..

స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన రూలింగ్‌లో ఏముందంటే..

ప్రతిపక్ష నాయకుని హోదాకు ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్థరించగలరు.

ఆంధ్ర ప్రదేశ్ వేతనాలు, పింఛనుల చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్టం-1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది.

ఆ చట్టంలో సెక్షన్ – 12 బీ ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే

  • వారు చట్ట సభలో సభ్యులై ఉండాలి.
  • వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలి.
  • ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వారి పార్టీకి అత్యధిక సంఖ్యా బలం ఉండాలి.
  • మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి ని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి.

ఒక వేళ అత్యధిక సంఖ్యా బలం గల ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే, పార్టీల హోదాను దృష్టిలో ఉంచుకొని, వాటిలో ఏదో ఒక పార్టీ నాయకుడికి సభాపతి... ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్ - 12 బీ చెబుతోంది.

పైన పేర్కొన్న చట్టం ప్రకారం, సభాపతులకు ఈ విషయంలో అవధుల్లేని అధికారాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పార్లమెంటులోనూ, రాష్ట్రాల చట్టసభల్లోనూ సభాపతులు ఈ అధికారాల వాడకంలో, లోక్‌సభ మొదటి స్పీకర్ జీవీ మావలంకర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటున్నారు.

లోక్ సభ డైరెక్షన్ 121 ఏం చెబుతోందంటే...

"పార్లమెంటరీ పార్టీ లేదా గ్రూపును గుర్తించేటప్పుడు స్పీకర్ కొన్ని సూత్రాలను పాటించాలి: (సి) సభ సమావేశం కావడానికి అవసరమైన కోరానికి కనీసం సరిసమానంగా అంటే సభలో మొత్తం సభ్యుల్లో పదింట ఒక వంతు సంఖ్యా బలం తప్పక కలిగి ఉండాలి."

ఈ చారిత్రక డైరెక్షన్‌ను పార్లమెంటులోనూ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సహా వివిధ రాష్ట్రాల చట్టసభలలోనూ పాటిస్తున్నారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటిదే డైరెక్షన్ నం. 56 జారీ చేశారు. ఈ డైరెక్షన్‌కు మూలాలు రాజ్యాంగంలో 100 (3), 189 (3) అధికరణాలలో ఉన్నాయి.

చట్టసభల నిర్వహణకు కనీసం పదింట ఒక వంతు సభ్యుల హాజరును కోరంగా ఈ అధికరణాల్లో నిర్దేశించారు.

ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పింఛనుల చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్టం, 1953 ప్రకారం విచక్షణాధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్‌కు మార్గం చూపేది ఈ డైరెక్షనే.

ఆంధ్రప్రదేశ్‌లో 1972-77 మధ్యకాలంలో 5వ శాసనసభలోనూ, 1994-99 మధ్యకాలంలో 10వ శాసన సభలోనూ ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకీ ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు.

అలాగే 5, 7, 8, 16, 17వ లోక్‌సభలలోనూ 10 శాతం సూత్రాన్ని పాటించడంతో, ప్రతి పక్ష నాయకుడిగా ఎవరూ గుర్తింపు పొందలేక పోయారు.

ఇటీవలే పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలో 20.1.2019 న ప్రతిపక్షంలో ఉన్న అతి పెద్ద పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు.

కానీ, కొద్ది నెలల తరువాత 9.6.2019న సభలో ఆ ప్రతిపక్ష సంఖ్యా బలం 10 శాతాని కంటే తగ్గిందనే నిర్థరణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు.

చింతకాయల అయ్యన్నపాత్రుడు

ఫొటో సోర్స్, Ayyanna Patrudu Chinthakayala/FB

‘‘జగన్ చెప్పినవన్నీ సత్యదూరాాలు’’

''జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ఉదాహరణగా పేర్కొన్న ఎన్నో అంశాలు సత్యదూరాలు. ఆయన చెప్పినట్లుగా పి.జనార్ధన రెడ్డికి 1994లో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. పి.జనార్ధన రెడ్డిని అప్పటి సభాపతి భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభా పక్షానికి ఉపనాయకుడిగా మాత్రమే గుర్తించారు.

అలాగే 8వ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి 10 శాతం సంఖ్యాబలం లేకపోయినా పి.ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. ఉపేంద్రను ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడిగా మాత్రమే గుర్తించారు.

175మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్‌ శానససభలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని అందరికీ అర్ధమవుతోంది.

ఈ విషయం వైఎస్‌ జగన్‌కూ తెలుసు. ఎందుకంటే 2019 జూన్‌ 13న ఇదే సభలో జగన్‌ ప్రసంగిస్తూ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

చంద్రబాబుకి 23మంది శాసనసభ్యులు ఉన్నారు. ఐదారుగురిని ఇటుపక్కకు లాగేస్తే ఆయనకి 18మంది కంటే సభ్యులు తక్కువైతే ప్రతిపక్ష హోదా కూడా మిగలదని ఇదే సభలో మాట్లాడటం అందరికీ తెలుసు.

ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నేతగా ఆయన హోదాకు తగదని నా అభిప్రాయం.

స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం రాజ్యాంగం, సభా నిబంధనల ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీకందరికీ తెలుసు. అయినప్పటికీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటివరకు సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల విజ్ఞతకు వదిలేస్తున్నాను" అని అయ్యన్న పాత్రుడు అన్నారు.

''శాసనసభ దేవాలయం. ఈ దేవాలయానికి నేను పూజారిగా చేస్తున్నాను అంతే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం ఎంత తప్పండీ. అది దేవుడి నిర్ణయం. ఆయనకు 11మందిని ఇచ్చాడు. నేను పూజారిని.. ఏం చేయగలను'' అని అయ్యన్న వ్యాఖ్యానించారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన రూలింగ్

ఫొటో సోర్స్, aplegislature.org/

ఫొటో క్యాప్షన్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన రూలింగ్

రూలింగ్‌ ఎందుకిస్తున్నానంటే..

''ప్రతిపక్ష హోదా కావాలంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టును కూడా ఆశ్రయించారు.

తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ ఇప్పటికీ విచారణకు స్వీకరించాలా వద్దా అనే దశలోనే ఉంది. అయినా ప్రతిపక్ష హోదాపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు.

తప్పుడు ప్రచారానికి తెరదించేందుకే మొత్తం సభ్యుల్లో పదిశాతం సభ్యులున్న పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేస్తూ రూలింగ్‌ ఇవ్వాలని నిర్ణయించాను'' అని అయ్యన్న స్పష్టం చేశారు.

వైఎస్ జగన్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఏపీ శాసనసభ

ఫొటో సోర్స్, facebook.com/konachambers.konaraghupathi/

ఫొటో క్యాప్షన్, అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయని వైసీపీ నేత కోన రఘుపతి చెప్పారు.

అయ్యన్న వ్యాఖ్యలు సరికాదు: వైసీపీ

"శాసనసభ స్పీకర్‌గా పార్టీలకతీతంగా హుందాగా వ్యవహరించాల్సిన అయ్యన్న పాత్రుడు బుధవారం నాటి సభలో చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను ఉద్దేశించి చాలా పరుషంగా మాట్లాడారు. బెదిరింపు, వ్యంగ్యం, వెటకారపు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం" అని వైఎస్సార్‌సీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన, ఆ పార్టీ సీనియర్‌ నేత కోన రఘుపతి స్పష్టం చేశారు.

"మీకున్న 23 మందిలో ఐదారుగురిని లాగేస్తే.. అని వైఎస్‌ జగన్‌ గతంలో అన్న మాటలను చీటికీమాటికీ స్పీకర్‌ సహా చాలామంది టీడీపీ నేతలు తెరపైకి తెస్తుంటారు. వాస్తవానికి నాడు వైఎస్‌ జగన్‌ అన్న ఉద్దేశం వేరు. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ 23మంది సభ్యులను లాగేసుకుని.. అందులో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఆ దుష్ట రాజకీయాన్ని బాబుకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే నాడు సీఎంగా జగన్‌ ఆ మాటలు అన్నారే గానీ... ఇప్పటిలా కక్ష సాధింపు రాజకీయాల మాదిరి కాదు" అని కోన రఘుపతి అన్నారు.

నాడు వైఎస్‌ జగన్‌ అన్న ఆ మాటను పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌గా చూడాలని ఆయన కోరారు.

వైఎస్ జగన్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఏపీ శాసనసభ

ఫొటో సోర్స్, facebook.com/buragaddavedavyas

ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టే బదులు జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించాలని టీడీపీ నేత వేదవ్యాస్ సూచించారు.

స్పీకర్ చెప్పింది వాస్తవమే: టీడీపీ

ప్రతిపక్ష హోదాకి సంబంధించి స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు నిబంధనలు ఏమున్నాయో వాటినే చెప్పారని టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు.

"ప్రతిపక్ష హోదాకోసం రచ్చ చేసే బదులు.. తనకున్న సభ్యులతో అసెంబ్లీకి రావడం గౌరవం. వచ్చిన తర్వాత కావాలంటే మాట్లాడే అంశాన్ని బట్టి సమయం కోరవచ్చు. అంతే గానీ సభలను బహిష్కరించడం అంటే తమను ఎన్నుకున్న ప్రజలను అవమానించినట్టే" అని సమైక్యాంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌, ప్రస్తుతం టీడీపీ సీనియర్‌ నేత బూరగడ్డ వేదవ్యాస్‌ బీబీసీతో అన్నారు.

"నాకు తెలిసి కోర్టుల్లో కూడా దీనిపై స్పష్టత రాకపోవచ్చు. పార్లమెంటు చట్టం ప్రకారమే నడుచుకోవాలని న్యాయస్థానాలు చెప్పే అవకాశం ఉంటుంది. అయినా సరే దీనిపై కోర్టులు ఏం చెబుతాయో చూడాలి" అని వేదవ్యాస్‌ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)