రుషికొండ బీచ్‌లో ఎగిరే నీలం జెండాను ఎందుకు తొలగించారు?

రుషికొండ బీచ్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక బ్లూ ప్లాగ్ బీచ్ విశాఖపట్నంలోని రుషికొండ. దీనికున్న బ్లూ ప్లాగ్ బీచ్ హోదా ప్రస్తుతం తాత్కలికంగా రద్దయింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్‌లలో శుభ్రత, నీటి నాణ్యత, పర్యటకుల రక్షణ వంటి 33 రకాల అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తుంది.

ఇప్పుడు ఆ సంస్థే...రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా రద్దు చేసింది.

దీంతో, బ్లూ ఫ్లాగ్ హోదాకు గుర్తుగా రుషికొండలో ఎగిరే నీలం రంగు జెండాను తొలగించారు.

మళ్లీ ఈ జెండాను ఎలాగైనా రుషికొండ బీచ్‌లో ఎగరవేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు .

మరోవైపు ఈ 'బ్లూ ఫ్లాగ్' గుర్తింపు మీ వల్లనే పోయిందంటే... మీ వల్లనే అంటూ కూటమి, వైసీపీ విమర్శలు చేసుకుంటున్నాయి.

అసలు ఈ బ్లూ ప్లాగ్ గుర్తింపు ఎందుకు రద్దయింది? మళ్లీ రావాలంటే ఏం చేయాలి? ఇందుకు అధికారులు ఏం చేస్తున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రుషికొండ బీచ్
ఫొటో క్యాప్షన్, 2020లో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వచ్చింది

ఎఫ్ఈఈకి ఏ అంశాలపై ఫిర్యాదు చేశారంటే...

2020లో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వచ్చింది. దేశంలో ప్రస్తుతం ఉన్న 10 బ్లూ ఫ్లాగ్ బీచ్‌లలో రుషికొండ ఒకటి.

ఏపీలో రుషికొండ బీచ్‌కు మాత్రమే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. అయితే, రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని పర్యటకులు నుంచి తమకి మెయిల్స్ వచ్చినట్లు డెన్మార్క్ చెందిన ఎఫ్ఈఈ సంస్థ జిల్లా అధికారులకు తెలిపింది.

ఫిర్యాదులు అందిన అంశాలేవంటే...

1. రుషికొండ బీచ్ పరిసరాల్లో వ్యర్ధాలు పేరుకుపోవడం.

2. బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించటం.

3. బీచ్ పరిసరాల్లోని పర్యటకులు నడిచే దారి బాగోకపోవడం.

4. బీచ్ లోపలకు కుక్కలు, ఆవులు రావడం.

5. సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం.

ఈ విషయాన్ని ఎఫ్ఈఈ సంస్థ జిల్లా అధికారులకు తెలియజేసింది. ఫిర్యాదులు అందిన అంశాలపై పరిశీలన చేసి, వాటిపై చర్యలు తీసుకునే వరకు రుషికొండ బీచ్‌లో ఎగురుతున్న 'బ్లూ ఫ్లాగ్' (నీలం జెండా)ను దింపేయమని కోరింది.

"ఇది రుషికొండ బీచ్‌కు ఉన్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు పూర్తిగా రద్దయినట్లు కాదు. తాత్కాలిక రద్దుగా భావించాలి. తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని పునరుద్ధరిస్తారు. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం." అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ చెప్పారు.

"2025 మార్చి అంటే ఈ నెలలో రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ నిర్వహించే ఆడిట్ తర్వాత బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరించే అవకాశం ఉంది" అని కలెక్టర్ తెలిపారు.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్
ఫొటో క్యాప్షన్, దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న పది బీచ్‌లలో రుషికొండ బీచ్ ఒకటి.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌తో ఉపయోగం ఏంటి?

అంతర్జాతీయ గుర్తింపు కలిగిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ టూరిస్టులను ముఖ్యంగా విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది.

బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల వలన బీచ్‌ల వద్ద భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలవుతాయి. లైఫ్ గార్డ్స్, ప్రథమ చికిత్సా సౌకర్యాలు వంటివి అందుబాటులో ఉంటాయి.

ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరీక్షించి పర్యటకులకు అనుకూలంగా ఉండేలా చూస్తారు.

పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తారు.

బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చేస్తారు.

జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. "బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం, బీచ్‌లో జెండాను ఎగురవేయకూడదు. అలాగే తాత్కాలిక ఉపసంహరణ గురించి సందర్శకులకు తెలియజేస్తూ బీచ్‌లో నోటీసు బోర్డులు ఉంచాలి. బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల ప్రకారం చర్యలు తీసుకుంటే ఆ తర్వాత సర్టిఫికేషన్ పునరుద్ధరిస్తారు. అప్పుడు మళ్లీ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఎగర వేయవచ్చు." అన్నారు.

రుషికొండ బీచ్
ఫొటో క్యాప్షన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది.

కారణమెవరు?

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు విషయంలో ఒకరిద్దరు అధికారులను బదిలీ చేయడం వలన కూటమి ప్రభుత్వం తాను చేసిన తప్పుల నుంచి బయటపడ లేదని వైసీపీ విమర్శించింది.

తమ ప్రభుత్వంలో సాధించిన బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే పోగొట్టిందని మాజీ మంత్రి వైకాపా నాయకులు గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు.

అయితే, అంతకు ముందు తాము అధికారంలో ఉండగా తీసుకున్న చర్యల వల్లే అది సాధ్యమైందని టీడీపీ అంటోంది.

‘వైసీపీ హయాంలో అధికారులు, ప్రభుత్వ పెద్దలు చూపించిన నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లతో కుమ్మకై పర్యవేక్షణ గాలికి వదిలేయడం వలనే ఈ పరిస్థితి వచ్చింది’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను పునరుద్దరించే దిశగా చర్యలు తీసుకోవాలి. అంతేకానీ, దీనిని కూడా రాజకీయం చేసి పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి మంచిది కాదని సీనియర్ జర్నలిస్ట్ వీవీ రమణమూర్తి బీబీసీతో అన్నారు.

రుషికొండ బీచ్‌ వద్ద అధికారులు

అధికారుల హడావుడి

ఫిబ్రవరి రెండో వారంలోనే రుషికొండ బీచ్‌ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కలిక రద్దు జరిగిందంటూ డెన్మార్మ్ సంస్థ ఎఫ్ఈఈ సమాచారం ఇచ్చింది.

దీంతో, జిల్లా యంత్రాంగం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.

రుషికొండ బీచ్‌కు బీబీసీ వెళ్లినప్పుడు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులు బ్లూ ఫ్లాగ్ పునరుద్దరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

" బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్దరణ పనులు ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యాయి. ఖచ్చితంగా బ్లూ ఫ్లాగ్ సాధిస్తాం." అని జీవిఎంసీ అధికారులు బీబీసీతో అన్నారు.

రుషికొండ బీచ్

రుషికొండ బీచ్‌లో పరిశుభ్రతను, ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు తాత్కలిక రద్దుకు కారణమంటూ కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా జిల్లా టూరిజం అధికారి కె.జ్ఞానవేణిని, పర్యటక శాఖ రీజనల్ డైరెక్టర్ (ఇన్‌చార్జ్) రమణను కూడా బాధ్యతల నుంచి తప్పించింది.

"ప్రభుత్వాలు బీచ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కూడా సరిగా చేయలేరా? అందమైన తీర ప్రాంతాల పర్యవేక్షణను పట్టించుకోపోతే పర్యటనకు ఎలా వస్తారు? రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంశం విశాఖకు రాబోయే పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అధికారులు తక్షణం రుషికొండ బీచ్‌కు తిరిగి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలి." అని పొలిటికల్ ఎనలిస్ట్ ఊహ మహంతి బీబీసీతో అన్నారు.

రుషికొండ బీచ్
ఫొటో క్యాప్షన్, టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులు, సీసీ కెమెరాలు వంటి 33 రకాల ప్రమాణాలు పాటించే బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు.

బ్లూ ఫాగ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది డెన్మార్క్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఇచ్చే సర్టిఫికేషన్.

ఈ సంస్థ అధిక భద్రతా ప్రమాణాలు, నాణ్యమైన నీరు, పర్యటకులకు నడక దారులు, టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులు, సీసీ కెమెరాలు వంటి 33 రకాల ప్రమాణాలు పాటించే బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది.

1985లో డెన్మార్క్‌లో ప్రారంభించిన 'ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్' ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్‌ని ఇస్తోంది.

ప్రపంచంలో తొలిసారి ఈ సర్టిఫికేట్ పొందిన దేశం స్పెయిన్.

ఇక భారతదేశంలో, అలాగే ఆసియా ఖండంలో ఈ సర్టిఫికేట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని 'చంద్రబాగ్' బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికేట్ పొందింది.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కలిగిన బీచ్‌లో నీలి జెండా ఎగుర వేస్తారు. అది ఆ బీచ్ శుభ్రత, నీటి నాణ్యత, అధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉందని, తీర ప్రాంతాల పర్యావరణాన్ని రక్షించే వ్యవస్థ ఉందని పర్యటకులు ఈ తరహా బీచ్‌లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు.

ప్రస్తుతం మన దేశంలో ఒడిశాలోని గోల్డెన్ బీచ్, గుజరాత్‌లోని శివరాజ్పూర్ బీచ్, కేరళలోని కప్పడ్ బీచ్, డయ్యోని ఘోమ్లా బీచ్, అండమాన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్, కర్నాటకలోని కాసర్కోడ్, పడుబిద్రి బీచ్‌లు, తమిళనాడులోని కోవలం బీచ్, పుదుచ్ఛేరిలోని ఈడెన్ బీచ్, ఆంధ్రప్రదేశ్‌లోని రుషికొండ బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి.

అయితే, పర్యటకుల ఫిర్యాదుల మేరకు రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రస్తుతం తాత్కలికంగా రద్దయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)