పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్, ఆకాశం నుంచి నిప్పులు కక్కుతూ వర్షంలా పడిన శకలాలు

స్పేస్ఎక్స్ స్టార్‌షిప్, ఎలాన్ మస్క్, ఎక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్టార్‌షిప్ పేలిపోవడంతో నిప్పులు చిమ్ముతూ రాలిపోతున్న శకలాలు
    • రచయిత, మ్యాక్స్ మట్జా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలోని టెక్సస్ నుంచి స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన రాకెట్ ఆకాశంలో పేలిపోయింది. రాకెట్ శకలాలు పడే ప్రమాదం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు, ఆ ప్రాంతంలో విమానాలను నిలిపివేశారు.

ఈ మానవరహిత అంతరిక్ష వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లే క్రమంలో సమాచార సంబంధాలను కోల్పోయి "వేగంగా విడిపోయింది" అని స్పేస్ ఎక్స్ సంస్థ స్పష్టం చేసింది.

అంతరిక్ష ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన అతిపెద్ద స్టార్‌షిప్(వ్యోమనౌక) ఇది. దీన్ని ప్రయోగించిన తర్వాత అదుపుతప్పి సుడులు తిరుగుతూ పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, కరేబియన్ ఐలాండ్స్ మీదుగా రాకెట్ కూలిపోతున్నప్పుడు దాని శకలాలు మండుతూ కనిపించాయి.

ఈ దృశ్యాలను చిత్రీకరించిన కొంతమంది "ఎక్స్"లో పోస్ట్ చేశారు. ఫైర్ క్రాకర్స్ కాల్చినట్లుగా కనిపించిందని కామెంట్లు చేశారు.

ఈ రాకెట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇది ఎనిమిదో సారి. ఇది విఫలం కావడం వరుసగా రెండోసారి. 403 అడుగుల ఈ స్పేస్ షిప్ హిందూ మహాసముద్రం మీదుగా గంట సేపు ప్రయాణించిన తర్వాత తిరికి భూకక్ష్యలోకి రావాల్సి ఉంది.

ఇందులో అమర్చిన భారీ బూస్టర్ .. దీన్ని ఆకాశంలోకి తీసుకువెళ్లడంతో పాటు లాంచ్‌ప్యాడ్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు సాయపడుతుంది.

ప్రయోగం విఫలం అయిన వెంటనే "ఆకస్మిక చర్యల ముందస్తు ప్రణాళిక ప్రకారం'' బృందాలు భద్రతా అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టాయని స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రకటించింది.

"ప్రయోగం విఫలమై రాకెట్ ఆకాశంలో పేలిపోవడానికి, ఇంజిన్లు ధ్వంసం కావడానికి కారణాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు" స్పేస్‌ఎక్స్ సంస్థ డేటాను విశ్లేషిస్తోందని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

"ఎప్పటిలాగే, మనం నేర్చుకునే అంశాలే మనకు విజయాన్ని అందిస్తాయి. ఈ వైఫల్యం స్టార్‌షిప్‌ను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు అవసరమైన అదనపు పాఠాలు నేర్పుతుంది" అని అందులో ప్రస్తావించింది.

రాకెట్‌లో ఎలాంటి విషపూరిత పదార్దాలు లేవని, ఒకవేళ అది కూలిపోతే శకలాలు ఎవరి మీద పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు స్పేస్‌ఎక్స్ సంస్థ వెల్లడించింది.

శకలాలను ఎవరైనా గుర్తిస్తే వాటిని తమకు అప్పగించాలని కోరుతూ ఒక ఫోన్ నెంబర్, ఈమెయిల్‌‌ను జత చేసింది.

రాకెట్ ప్రయోగ వైఫల్యంపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్పేస్ఎక్స్ స్టార్‌షిప్, ఎలాన్ మస్క్, ఎక్స్

ఫొటో సోర్స్, spacex.com/vehicles/starship

ఫొటో క్యాప్షన్, స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది.

డేటాను విశ్లేషిస్తున్నాం: స్పేస్ఎక్స్

రాకెట్ పేలిపోగానే ఫ్లోరిడాతో పాటు మియామి, ఒర్లాండోలోని విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను ఆపేశారు. మండుతున్న శకలాలు విమానాలకు తగిలితే ప్రమాదం జరగొచ్చనే అంచనాలతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

"అంతరిక్షనౌక ఘటన" కారణంగా విమానాల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

జనవరిలోనూ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్, ప్రయోగించిన కొన్ని నిముషాలకే పేలిపోయింది.

అప్పుడు కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి చర్యలే చేపట్టింది.

జనవరిలో స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైనప్పుడు రాకెట్ శకలాలు పడి కరేబియన్ ఐలాండ్స్‌లోని తుర్క్స్, కైకోస్ దీవుల్లో ఆస్తి నష్టం జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది.

"దురదృష్టత్తువశాత్తూ గతంలోనూ ఇలాగే జరిగింది. అందుకే మేము ఇప్పుడు కొన్ని చర్యలు చేపట్టాం" అని స్పేస్‌ఎక్స్ రాకెట్ వ్యాఖ్యాత డాన్ హ్యూయోట్ చెప్పారు.

జనవరిలో రాకెట్ పేలిపోయిన సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఏఏ చేపట్టిన దర్యాప్తు పూర్తి కాకముందే స్టార్‌షిప్‌ను మరోసారి ప్రయోగించారని అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి.

తాము అమెరికా అధికారులు, స్పేస్ఎక్స్ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు తుర్క్స్, కైకోస్ ఐలాండ్స్ ప్రభుత్వాలు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి.

"మా దీవుల రక్షణ, భద్రతపై మేం పనిచేస్తున్నామని, ఈ విషయంపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం'' అని అందులో పేర్కొన్నాయి.

కరేబియన్ సముద్రం మీదుగా పడిపోతున్న స్టార్‌షిప్ శకలల దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. శకలాల నుంచి కాపాడుకునేందుకు ఆశ్రయం కోసం చూస్తున్నట్లు బహమాస్‌‌కి చెందిన కొందరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మార్స్‌పై జనావాసాలను ఏర్పాటు చేయాలన్న మస్క్ లక్ష్యాలకు ఈ స్టార్‌షిప్ ప్రయోగం కీలకం. అంతరిక్ష ప్రయోగాల కోసం ఇప్పటి వరకు రూపొందించిన రాకెట్లలో ఇదే అత్యంత పెద్దది, శక్తివంతమైనది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)