సౌత్ కొరియా : వైమానిక దళ విన్యాసాలలో ప్రమాదవశాత్తు జారిపడిన బాంబులు, 15 మందికి గాయాలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జేక్ క్వోన్, కోఇవే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ కొరియాలో నిర్వహిస్తున్న వైమానిక దళ విన్యాసాలలో భాగంగా ఓ రెండు ఫైటర్ జెట్స్ ప్రమాదవశాత్తు జారవిడిచిన 8 బాంబులు జనావాసాలపై పడటంతో 15 మంది గాయపడ్డారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా తెలిపింది.
సౌత్ కొరియా- నార్త్ కొరియా సరిహద్దుల్లోని పోచియన్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌ఫోర్స్ కేఎఫ్ 16 యుద్ధ విమానం జారవిడిచిన 8 బాంబుల్లో ఒక బాంబు పేలింది. మిగిలిన ఏడు బాంబులను నిర్వీర్యం చేసేందుకు బాంబు డిస్పోజల్ టీమ్ కృషి చేస్తోందని పోచియన్ నగర అధికారులు బీబీసీతో చెప్పారు.
బాంబులు పడిన ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు నిర్వహించే సమయంలో కొన్ని సార్లు బాంబులు జనావాసాలకు సమీపంలో పడినప్పటికీ వాటి వల్ల ప్రజలు గాయపడే సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి.
ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు మెడ, భుజాలపై గాయాలైనట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
బాంబు పేలినప్పుడు అటుగా కారులో వెళుతున్న 60 ఏళ్ల వ్యక్తికి మెడ మీద గాయాలయ్యాయని యోన్‌హాప్ రిపోర్ట్ చేసింది.
"అది పేలినప్పుడు నేను కారులో వెళుతున్నాను. నాకు మెలకువ వచ్చిన తర్వాత అంబులెన్స్‌లో ఉన్నాను" అని బాధితుడు చెప్పారు.
"మా కేఎఫ్-16 ఫైటర్ జెట్ విమానం ఎనిమిది ఎంకే-82 బాంబులను అనూహ్యంగా జారవిడిచింది. అవి ఫైరింగ్ రేంజ్ బయటపడ్డాయి" అని సౌత్ కొరియా ఎయిర్‌ఫోర్స్ బీబీసీకి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
‘నష్టపరిహారం చెల్లిస్తాం’
ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధితులకు నష్ట పరిహారం చెల్లిస్తామని, జరిగిన విధ్వంసానికి క్షమాపణలు కోరుతున్నట్లు సౌత్ కొరియా ఎయిర్‌ఫోర్స్ ఆ ప్రకటనలో వెల్లడించింది.
పేలని బాంబుల గురించి వివరిస్తూ "వాటిని నిర్ణయించిన ఎత్తు కంటే తక్కువ ఎత్తులో జారవిడిచి ఉంటారు" అని రక్షణ రంగ నిపుణుడు యాంగ్ యూక్ చెప్పారు.
ఈ సంఘటనలో ఒక చర్చితో పాటు కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు స్థానిక మీడియాలో ఫోటోలు ప్రచురితమయ్యాయి. చర్చి కిటికీతో పాటు పైకప్పు కూడా పగిలిపోయింది.
పేలుడు సంభవించినప్పుడు తాను ఇంట్లో టీవీ చూస్తున్నానని స్థానికుడొకరు యోన్‌హాప్‌తో చెప్పారు. ఏదో పిడుగు పడిన శబ్ధం వచ్చిందని, ఆ శబ్ధానికి ఇల్లంతా కంపించిందని వివరించారు.
బాంబు పేలుడు ధాటికి భవనం కిటికీల అద్దాలు పగిలిపోయాయని, తమ టీచర్లలో ఒకరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీనియర్ సిటిజన్ కేర్ సెంటర్ డైరెక్టర్ చెప్పారు.
తమ సెంటర్‌లో ఎవరికీ గాయాలు కాకున్నా అందరూ భయపడినట్లు తెలిపారు.
గురువారంనాటి విన్యాసాలు అమెరికాతో కలిసి నిర్వహిస్తున్నట్లు సౌత్ కోరియా రక్షణ శాఖ వెల్లడించింది.
డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌత్ కోరియా, అమెరికా కలిసి మార్చ్ 10 నుంచి మార్చ్ 20 వరకు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించాయి.
2022లోనూ అమెరికా సైన్యంతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలు నిర్వహించినప్పుడు స్వల్ప శ్రేణి క్షిపణి ఒకటి మిలటరీ బేస్‌లోని గోల్ఫ్ కోర్స్‌లో పడింది. అయితే అది పేలకపోయినా మంటలు రేగడంతో చుట్టు పక్కల ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














