చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు ఈజీయేనా?

Team India

ఫొటో సోర్స్, Getty Images

'మాకు బలమైన జట్టు సవాల్ విసురుతోంది. ఇప్పుడు మేం దుబయి వెళ్తాం. ఇంతకుముందు మేం అక్కడ ఇండియాను ఎదుర్కొన్నాం'

..లాహోర్‌లో మంగళవారం చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన తరువాత న్యూజీలాండ్ జట్టు కెప్టెన్ మిషెల్ సాంట్నర్ అన్న మాటలివి.

ఈ మాటలు చెప్తున్నప్పుడు సాంట్నర్‌లో ఎలాంటి ఒత్తిడి కనిపించలేదు.

ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఓటమి అనేది లేకుండా సాగుతోంది. కానీ, గత రికార్డులను చూస్తే మాత్రం మార్చి 9న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌తో తలపడడం భారత్‌కు సవాల్‌గా మారొచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
న్యూజీలాండ్ ఆటగాళ్లు

ఫొటో సోర్స్, Getty Images

25 ఏళ్ల కిందట..

పాతికేళ్ల కిందట 2000 సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, న్యూజీలాండ్‌లు తలపడ్డాయి.

ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ భారత్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం అందుకుంది.

అయితే, లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో న్యూజీలాండ్‌కు ఇదొక్కటే విజయం. ఆ టోర్నీలో భారత్ ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఆ తరువాత అయిదు సార్లు లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ టైటిల్స్‌ను భారత్ గెలుచుకుంది. అందులో రెండు చాంపియన్స్ ట్రోఫీలు కూడా ఉన్నాయి.

మరోవైపు న్యూజీలాండ్ ఇలాంటి టైటిల్స్‌ను ఆ తరువాత గెలవనప్పటికీ ఆ జట్టు ప్రదర్శన మాత్రం స్థిరంగా ఉంది.

2007 నుంచి 2023 మధ్య కాలంలో వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో న్యూజీలాండ్ ప్రతిసారి సెమీఫైనల్ వరకు చేరింది. రెండుసార్లు ఫైనల్‌కూ చేరింది.

విలియమ్సన్

ఫొటో సోర్స్, Getty Images

అంకెల్లో ఆ జట్టే టాప్

ఐసీసీ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ టోర్నీలో భారత్, న్యూజీలాండ్‌లు 16 సార్లు తలపడగా టీమ్ ఇండియా 6, న్యూజీలాండ్ 9 సార్లు విజయం సాధించాయి.

ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే.. ఫైనల్స్ ఆడే విషయం చూస్తే న్యూజీలాండ్ కంటే భారత్‌కు అనుభవం ఎక్కువ.

మార్చ్ 9న భారత్ ఆడబోయే ఫైనల్ మ్యాచ్ ఆ జట్టుకు చాంపియన్స్ ట్రోఫీలో అయిదో ఫైనల్ మ్యాచ్.

2025 చాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజీలాండ్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి.

దక్షిణాఫ్రికా ప్లేయర్స్

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికాతో సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్ విజయం

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజీలాండ్ విజయం సాధించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజీలాండ్ 6 వికెట్లను కోల్పోయి 362 పరుగులు చేసింది. ఆ తర్వాత, 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది.

న్యూజీలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, కేన్ విల్లియమ్స్ సెంచరీలు చేశారు. రచిన్ రవీంద్ర 108 పరుగులు, కేన్ విల్లియమ్స్ 102 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగుల చొప్పున చేశారు.

న్యూజీలాండ్ సాధించిన 362 భారీ స్కోరును ఛేదించేందుకు దక్షిణాఫ్రికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

న్యూజీలాండ్‌ బ్యాటర్లలో ఇద్దరు సెంచరీలు చేయడం, మరో ఇద్దరు 49 పరుగుల చొప్పున మంచి పరుగులు సాధించడంతో బ్యాటింగ్ ఆర్డర్ అంతా ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ బలం ఇదే..

భారత జట్టులో నలుగురు స్పిన్నర్లున్నారు. ఇది న్యూజీలాండ్‌కు అతి పెద్ద సవాల్ అని విశ్లేషకులు చెప్తున్నారు.

అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఈ టోర్నీలోని నాలుగు మ్యాచ్‌లలో చెరో అయిదు వికెట్లు తీసుకున్నారు.

మరోవైపు వరుణ్ చక్రవర్తి రెండు మ్యాచుల్లోనే ఏడు వికెట్లు తీసుకుని ఫామ్‌లో ఉన్నాడు.

పేసర్ల విషయానికొస్తే మహ్మద్ షమీ నాలుగు మ్యాచ్‌లలో 8 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్నాడు.

ఇక బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. ఈ టోర్నీలో పరుగుల పరంగా టాప్ 10 బ్యాటర్లలో ముగ్గురు టీమ్ ఇండియా ప్లేయర్లే.

కోహ్లీ నాలుగు మ్యాచ్‌లలో 217 పరుగులు చేశాడు.

ఈ గణాంకాలన్నీ చూస్తుంటే మార్చ్ 9న జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నువ్వానేనా అన్నట్లు సాగడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)