ఇండియా vs ఆస్ట్రేలియా: శుభ్‌మన్‌ గిల్ క్యాచ్‌పై అంపైర్ ఏమన్నారు, దీనిపై చర్చ ఎందుకు..

శుభ్‌మన్‌ గిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుభ్‌మన్‌ గిల్ క్యాచ్‌పై చర్చ జరుగుతోంది.

భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అప్పటి వరకు అందరి దృష్టి ట్రావిస్ హెడ్ పైనే ఉంది. అతను అవుటైతే భారత్ అవకాశాలు పెరుగుతాయన్నది ఫ్యాన్స్ ఆశ. అయితే, అతను అవుటైన తర్వాత అతని మీదకన్నా, శుభ్‌మన్ గిల్‌తో అంపైర్ మాట్లాడిన అంశంపై చర్చ మొదలైంది.

2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ ఫ్యాన్స్ మరచిపోకపోవచ్చు. మొత్తం టోర్నమెంట్‌లో ఓటమి చూడని భారత్ జట్టు, ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

ఆ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ హీరో. 137 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను విజయం వైపు నడిపించాడు.

అప్పటి నుండి, భారత జట్టు ఆస్ట్రేలియాను ఎదుర్కొన్నప్పుడల్లా, ట్రావిస్ హెడ్ గురించి ఫ్యాన్స్ కచ్చితంగా చర్చిస్తారు.

మంగళవారంనాడు చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుందని ఖరారైన వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. వీటిల్లో చాలావరకు మీమ్స్ ట్రావిస్ హెడ్‌పైనే.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి కొన్ని బంతులను కొంత నెమ్మదిగా ఆడినా, తర్వాత అద్భుతమైన ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరుగులు పెట్టించాడు ట్రావిస్ హెడ్.

దీంతో భారత శిబిరంలో భయం కూడా మొదలైంది. అప్పటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మ పన్నిన వ్యూహాలేవీ పనిచేయలేదు.

కానీ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంతిని చేతికి తీసుకున్న కాసేపటికే ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేశాడు. అతను కొట్టిన బంతి శుభ్‌మన్ గిల్‌ చేతికి చిక్కింది.

దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన శుభ్‌మన్ గిల్, అద్భుతంగా ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. స్టేడియంలోని టీమిండియా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్, పెవిలియన్‌ బాటపట్టాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో హెడ్ 39 పరుగులు చేశాడు.

చాంపియన్స్ ట్రోఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శుభ్‌మన్‌ గిల్

శుభ్‌మన్ గిల్ క్యాచ్‌పై చర్చ ఎందుకు మొదలైంది?

అయితే, ట్రావిస్‌ హెడ్ అవుట్ అయిన కొద్దిసేపటికే శుభ్‌మన్‌ గిల్‌‌ను పిలిచి అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ అతని చెవిలో ఏదో మాట్లాడటం కనిపించింది.

శుభ్‌మన్ గిల్‌ చేసిన క్యాచ్ గురించే అంపైర్ ‌అతనితో మాట్లాడి ఉంటాడని కామెంటరీ బాక్స్‌లో ఉన్న హర్షా భోగ్లే, మైక్ ఆథర్టన్, మాథ్యూ హేడెన్‌లు ఊహించారు.

అద్భుతమైన క్యాచ్ పట్టిన శుభ్‌మన్, మరుక్షణమే ఆ బంతిని నేల మీదకు విసిరాడు. అప్పటికే భారత అభిమానులు సంబరాలలో మునిగిపోయారు.

అయితే, క్రికెట్ నియమాల ప్రకారం, ఆటగాళ్లు క్యాచ్ తీసుకునేటప్పుడు బంతి మీద పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. లేకపోతే అది సరైన క్యాచ్‌గా పరిగణనలోకి రాదు.

బంతి మీద కంట్రోల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని శుభ్‌మన్‌కు అంపైర్ సూచించి ఉంటారని ఊహించిన కామెంటేటర్లు, శుభ్‌మన్ ఈ విషయంలో పొరపాటు చేసినట్లు భావించారాదని వ్యాఖ్యానించారు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ శుభ్‌మన్ గిల్ క్యాచ్‌ను పూర్తిగా సమర్థించారు. బంతి మీద గిల్‌కు పూర్తి కంట్రోల్ ఉందని, ఆ క్యాచ్‌‌ను సందేహించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

మరోవైపు ఈ క్యాచ్‌ను మాథ్యూ హేడెన్ కూడా సమర్ధించారు. అయితే, గిల్ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

మొత్తం మీద ఈ క్యాచ్‌ గురించి ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినప్పటికీ, మ్యాచ్‌లో ఇదొక చర్చనీయాంశంగా మాత్రం మిగిలింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)