తిరుమల గగనతలంలో విమానాలు ఎగరకూడదా, నో ఫ్లై జోన్ పై టీటీడీ ఏం చెబుతోంది, కేంద్రం ఏమంటోంది?

తిరుమల తిరుపతి
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

తిరుమలను నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో తిరుమలపై విమానాలు తిరగకూడదా, నో ఫ్లైజోన్‌ ప్రకటన కోసం టీటీడీ ఎందుకు లేఖ రాసిందనే విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఎలాంటి ప్రాంతాలను నో ఫ్లై జోన్లుగా ప్రకటిస్తారు? కేంద్రం నిబంధనలు ఏం చెబుతున్నాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కేంద్రానికి టీటీడీ లేఖ

శ్రీవారి ఆలయం కొలువైన తిరుమల ప్రాంతాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని, ఆలయంపై విమానసంచారం లేకుండా చూడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును ఆయన ఈమేరకు కోరారు.

ఆగమ శాస్త్రం ప్రకారం, ఆలయ పవిత్రతను కాపాడటం, దేవాలయ పరిసరాల్లో పవిత్ర వాతావరణానికి అంతరాయం కలగకుండా చూడటంతోపాటు, భక్తుల భద్రత, మనోభావాల దృష్ట్యా తమ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

మార్చి 1న తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఒక ఫోటోను అప్‌లోడ్ చేసిన టీటీడీ, నో ఫ్లై జోన్ కోసం కేంద్రమంత్రికి చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారని తెలిపింది. కేంద్రం దీనిపై తక్షణం స్పందించాలని ఆ లేఖలో కోరారని చెప్పింది.

టీటీడీ, ఫిబ్రవరి 17న కేంద్ర మంత్రికి ఈ లేఖ రాసింది.

ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పవిత్రత కాపాడటం చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఆలయ సమీపంలో తక్కువ ఎత్తులో వచ్చిపోయే విమానాలు, హెలికాప్టర్ల శబ్దాల వల్ల ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత దెబ్బతినే ప్రమాదం ఉందని లేఖలో టీటీడీ ఆందోళన వ్యక్తం చేసింది.

తిరుమలలో డ్రోన్ల ద్వారా చిత్రీకరణను టీటీడీ ఇప్పటికే నిషేధించింది. గతంలో ఎన్నో సందర్భాల్లో డ్రోన్లు స్వాధీనం చేసుకోవడమే కాక, డ్రోన్లు ఎగరేసిన వారిపై టీటీడీ చర్యలు తీసుకుంది.

కింజారపు రామ్మోహన్ నాయుడు

ఫొటో సోర్స్, FaceBook/Ram Mohan Naidu Kinjarapu

ఫొటో క్యాప్షన్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్రం ఏం చెబుతోంది?

మార్చి 2న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టీటీడీ లేఖపై స్పష్టత ఇచ్చారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆ వివరాలు మీడియాతో పంచుకోడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన టీటీడీ లేఖపై కూడా స్పందించారు.

''దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి మాకు ఇలాంటి వినతులు వస్తున్నాయి. ఇప్పటివరకైతే మేం వేటికి నో ఫ్లై జోన్ ఇవ్వలేదు. తిరుపతికి కూడా నో ఫ్లై జోన్ ఇవ్వడం కుదరదు. కాకపోతే తిరుమల గగనతలంపైకి విమానాలు రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం" అన్నారు.

తిరుమల తిరుపతి

ఫొటో సోర్స్, FACEBOOK

2016లోనూ లేఖ

తిరుమలలో నో ఫ్లై జోన్ కోసం కేంద్రానికి వినతులు పంపడం ఇది మొదటిసారి కాదు. 2016లో కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాసింది.

అప్పుడు కూడా టీడీపీ నేత అశోక గజపతి రాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.

తిరుమల గగనతలంపై ఎలాంటి ఆంక్షలు విధించినా, దానివల్ల తిరుపతి ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మరింత సంక్లిష్టంగా మారుతాయని కేంద్రం ఆ సమయంలో ఈ ప్రతిపాదనకు నో చెప్పింది.

ఈ విషయంపై ఆ సమయంలో పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్న జయంత్ సిన్హా స్పందించారు.

తిరుపతిలో ఒకే రన్ వే ఉండటంతో దానిపై విమానాల రాకపోకలు కష్టంగా ఉన్నాయని, దీనికి తోడు తిరుమల తిరుపతిని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తే తిరుపతి విమానాశ్రయంలో రోజువారీ విమానాల రాకపోకలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అప్పట్లో ఆయన చెప్పారు.

తిరుమల తిరుపతి

ఆగమంలో ఏముంది?

దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం పేర్కొన్నట్టు వైఖానస పీఠం అధ్యక్షుడు గంజం ప్రభాకరాచార్యులు చెప్పారు. తిరుమల ఆలయంపై విమానాలు ఎందుకు ఎగరకూడదో ఆయన బీబీసీకి వివరించారు.

"స్వయంవ్యక్త క్షేత్రం అనేది కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాంటి క్షేత్రంపైన విమానాలు, రాకెట్లు ఎగరడం సమర్ధనీయం కాదు. భగవంతుడి కంటే ఎత్తులో నిర్మాణాలు ఉండకూడదని, ఆలయ ప్రాంతాన్ని ఉన్నతంగా భావించాలని ఆగమ శాస్త్రాలు చెబుతాయి. అందుకే భగవంతుడిపైన విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం సమర్థనీయం కాదు. అయితే ప్రత్యేకించి ఆగమ శాస్త్రంలోవిమానాలు, రాకెట్ల పేరు పెట్టి ఫలానావి ఎగరకూడదని నేరుగా పేర్కొనరు. అత్యంత గౌరవంగా ఆ స్థానాన్ని పరిరక్షించుకోవాలి అని చెబుతాయి. సముచితమైన రీతిలో దాన్ని కాపాడుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శాస్త్రాలలో నేరుగా విమనాాలు, హెలికాప్టర్లు పేర్లు రాయనంత మాత్రానా అవి ఆలయంపైన ఎగరొచ్చు అని భావించకూడదు. భగవంతుడికి నివేదన చేసేటప్పుడు గంటానాదం, ఢమరుకం, వాయిద్యాలు తప్పితే ఇతరత్రా శబ్దాలు వినిపించడం సరి కాదు. పైగా స్వామివారికి నైవేద్యం జరిపేటప్పుడు ఆకాశంలో విమాన సంచారం సమర్థనీయం కాదు. తిరుమల ఆనంద నిలయం పైన ఎటువంటి సంచారం ఉండకూడదు. అది అపచారం, దోషం కిందకు వస్తుంది. తెలిసో తెలియక జరగొచ్చు. కానీ అది దోషమని తెలిసిన తరువాత, దానిని నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. " అని చెప్పారు ప్రభాకరాచార్యులు.

నో ఫ్లై జోన్

భారత్‌లో నో ఫ్లై జోన్ ఉందా

అసలు భారత్‌లో ఎక్కడైనా నో ఫ్లై జోన్ ఉందా? అనే విషయంపై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ వెబ్‌సైట్‌లో ఎలాంటి వివరాలూ కనిపించలేదు.

కానీ, ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌ ఇండియా సైట్‌లో కొన్ని వివరాలు కనిపించాయి.

అయితే అందులో నో ఫ్లై జోన్ అని కాకుండా భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో విమానాల రాకపోకలను నిషేధించినట్లుగా పేర్కొంటూ వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు.

1. నిషేధిత ప్రాంతం.

2. నిరోధిత ప్రాంతం.

3. ప్రమాదకరమైన ప్రాంతం.

వీటిని పీ అంటే ప్రొటెక్టెడ్, ఆర్ అంటే రిస్ట్రిక్టెడ్, డీ అంటే డేంజరస్‌గా సూచించారు.

దేశ సరిహద్దు జలాలు, దేశంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోకి విమానాల రాకపోకలను భారత ప్రభుత్వం నిషేధించింది.

ఆయా ప్రాంతాల్లోని సైనిక, వైమానిక, నౌకాదళ స్థావరాలు, ఆయిల్ రిఫైనరీలు, క్షిపణి పరీక్షా కేంద్రాలు, అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు జరిగే ప్రాంతాలు, అణుశుద్ధి కర్మాగారాలు వంటి దేశ భద్రతకు కీలకమైన ప్రాంతాలు, అభయారణ్యాలపైనా విమానాల రాకపోకలను నిషేధించిందే తప్పా ఎక్కడా నో ఫ్లై జోన్ అనే పదాన్ని ఉపయోగించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)