ట్రంప్ టారిఫ్‌లు ఏమిటి? ఏయే దేశాలపై ప్రభావం ఉంటుంది

 డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెరెమీ హోవెల్, ఆనర్ ఎరెమ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

కెనడా, మెక్సికోలపై సుంకాల విధింపు ప్రారంభించనున్నట్టు మార్చి 4న అమెరికా ప్రకటించింది. అక్రమ వలసలను ఆపుతామని, చట్టవిరుద్ధంగా తయారు చేసిన ఫెంటానిల్ అమెరికాలోకి రావడాన్ని నిరోధిస్తామని ఆ దేశం చెబుతోంది.

అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ఫిబ్రవరి ప్రారంభంలోనే టారిఫ్‌లు విధించాల్సి ఉంది. కానీ, ఒక నెల వాయిదా పడింది.

కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ, తుది రేటు కాస్త తక్కువగా ఉండొచ్చని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలు టారిఫ్‌లు ఏంటి?

దిగుమతి అయ్యే వస్తువులపై విధించే పన్నులే సుంకాలు.

టారిఫ్ అనేది ఒక వస్తువు ధరలో కొంత శాతంగా ఉంటుంది.

విదేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునే సంస్థలు ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి సరకు తీసుకొస్తాయి.

ఒకవేళ ఒక సంస్థ దిగుమతి చేసే కార్ల ధర ఒక్కోటి 50 వేల డాలర్లు (రూ.43,59,091) ఉంటే.. దానిపై 25 శాతం టారిఫ్ అంటే, ఒక్కో దానిపై 12,500 డాలర్ల (రూ.10,89,744) ఛార్జీని చెల్లించాలి.

దిగుమతి చేసుకునే సంస్థలు తాము చెల్లించిన టారిఫ్‌ల భారాన్ని పూర్తిగా కానీ, కొంతమేరకు కానీ వినియోగదారులపై వేస్తాయి.

ఒకవేళ అమెరికా దిగుమతిదారులు రిటైల్ ధరలను పెంచడం ద్వారా ఈ టారిఫ్‌ల ఖర్చును వినియోగదారులకు బదలాయిస్తే, తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

trump's tariffs

ట్రంప్ టారిఫ్‌లకు ఎందుకు అనుకూలంగా ఉన్నారు?

టారిఫ్‌లు అమెరికా దేశీయ ఉద్యోగాలను కాపాడతాయని, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని డోనల్డ్ ట్రంప్ తరచూ చెబుతుంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, పన్ను ఆదాయాలు పెరిగేందుకు ఇదొక మార్గంగా ఆయన చూస్తున్నారు.

‘‘విదేశాల కారణంతో ఉద్యోగాలు పోతాయని అమెరికా వర్కర్లు ఇక భయపడాల్సినవసరం లేదు. దీనికి బదులుగా, అమెరికా వల్ల తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటామని విదేశాలు ఆందోళన చెందుతాయి’’ అని ట్రంప్ అన్నారు.

స్టీల్‌పై టారిఫ్‌లు విధించడం అమెరికా జాతి భద్రతకు కూడా చాలా ముఖ్యమని ట్రంప్ చెప్పారు. ఎందుకంటే, దేశీయ స్టీల్‌తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా ప్రోత్సహించనున్నారు.

దిగుమతులపై ఆధారపడకుండా యుద్ధాల సమయంలో ఆయుధాలను ఉత్పత్తి చేసేందుకు సరిపడా స్టీల్‌ను అమెరికా ఉత్పత్తి చేయగలగాలని ట్రంప్ కోరుకుంటున్నారు.

టాప్ దిగుమతిదారులు
ఫొటో క్యాప్షన్, అమెరికాకు టాప్ దిగుమతిదారులుగా మెక్సికో, కెనడా, చైనాలున్నాయి.

దిగుమతి ఉత్పత్తుల అమ్మకాలను తగ్గించి, దేశీయ ఉత్పత్తుల అమ్మకాలను పెంచే టారిఫ్‌లకు ట్రంప్ అనుకూలంగా ఉన్నారు. ఉదాహరణకు, అంతకుముందు కూడా ఈయూపై ఇదే ఉద్దేశంతో టారిఫ్‌లను విధించారు.

‘‘వారు మా కార్లను తీసుకోరు. మా వ్యవసాయ ఉత్పత్తులను అంగీకరించరు. వాళ్లేం తీసుకోరు. కానీ, మేం అన్నీ వారి నుంచి తీసుకోవాలి’’ అని ట్రంప్ అన్నారు.

ఫార్మాస్యూటికల్స్, కంప్యూటర్ చిప్స్‌ వంటి వాటిపై టారిఫ్‌లు విధించాలని సూచించిన ఆయన.. '' పరిశ్రమలు అమెరికాకు వచ్చేందుకు ఇదే సరైన సమయం. చాలా వాటిల్లో ఇదొకటి'' అని అన్నారు.

దిగుమతి అయ్యే స్టీల్‌పై ట్రంప్ టారిఫ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా ఉత్పత్తిదారులను కాపాడేందుకు దిగుమతి అయ్యే స్టీల్‌పై ట్రంప్ టారిఫ్‌లు విధించారు.

ట్రంప్ తొలి పదవీ కాలంలో ఏ టారిఫ్‌లు విధించారు?

2018లో డోనల్ట్ ట్రంప్ వాషింగ్ మెషిన్లు, సోలార్ ప్యానల్స్‌పై 50 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. ఈ రెండు రంగాలలోని అమెరికా తయారీదారులు విదేశాల నుంచి అన్యాయమైన పోటీని ఎదుర్కొంటున్నారని అప్పట్లో అమెరికా ప్రభుత్వం చెప్పింది.

అదే ఏడాది, ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం (నాఫ్తా)లో అమెరికాతో భాగస్వాములుగా ఉన్న కెనడా, మెక్సికోలతో సహా దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

నాఫ్తాకు బదులుగా 2020లో యూనైటెడ్ నేషన్స్-మెక్సికో-కెనడా అగ్రిమెంట్‌పై దేశాలు సంతకం పెట్టడంతో ఈ టారిఫ్‌లను ఎత్తివేశారు. ఈ వాణిజ్య ఒప్పందం అమెరికాకు అనుకూలంగా ఉంది.

ఈయూపై విధించిన టారిఫ్‌లు ముఖ్యంగా జర్మనీ, నెదర్లాండ్స్‌పై ప్రభావం చూపాయి. ఎందుకంటే, ఈ దేశాలు పెద్ద మొత్తంలో ఉక్కును అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. అలాగే, ఈయూ కూడా జీన్స్, బార్బన్ విస్కీ, మోటార్ సైకిల్స్ వంటి అమెరికా ఎగుమతులపై టారిఫ్‌లు విధిస్తూ ప్రతీకారం తీర్చుకుంది.

మాంసం నుంచి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ వరకు 360 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31,41,895 కోట్లు) చైనా ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్‌లు వేశారు. దానికి ప్రతిగా చైనా కూడా 110 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,60,063 కోట్లు) విలువైన అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించింది.

జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా చైనాపై టారిఫ్‌లను అలానే ఉంచారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వంటి కొన్ని ఉత్పత్తులపై కొత్తగా టారిఫ్‌లు విధించారు.

దిగుమతుల కోసం అమెరికా మార్కెట్లో ఉన్న మెక్సికో, చైనా, కెనడా వాటాలను చూపించే గ్రాఫ్
ఫొటో క్యాప్షన్, దిగుమతుల కోసం అమెరికా మార్కెట్లో ఉన్న మెక్సికో, చైనా, కెనడా వాటాలను చూపించే గ్రాఫ్

ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు విధించిన టారిఫ్‌లు ఇతర దేశాలపై ఏ మేర ప్రభావం చూపాయి?

ట్రంప్ టారిఫ్‌ల వల్ల అమెరికా కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తాలను తగ్గించగా.. మరికొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తాన్ని పెంచింది.

2018 వరకు, అమెరికా మొత్తం దిగుమతుల్లో చైనా వస్తువులు 22 శాతం వరకు ఉండేవి. అమెరికా సెన్సస్ బ్యూరో ప్రకారం, 2024లో ఇవి కేవలం 13.5 శాతమేనని తెలిసింది.

2023 నాటికి అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశంగా చైనాను మెక్సికో అధిగమించింది. ప్రస్తుతం ఈ దేశం 476 బిలియన్ డాలర్ల (రూ. (రూ.41,54,067 కోట్లు) విలువైన వస్తువులను అమెరికాకు పంపుతుంది. చైనా నుంచి 427 బిలియన్ డాలర్ల (రూ.37,26,619 కోట్లు) విలువైన వస్తువులు వస్తున్నాయి.

అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పంద ప్రయోజనాన్ని పొందేందుకు అనేక కంపెనీలు ముఖ్యంగా కార్ల తయారీదారులు ఉత్పత్తిని మెక్సికోకు తరలించడమే దీనికి కొంత కారణం. అక్కడ ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంది.

 కార్ల ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా మెక్సికో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

తూర్పు ఆసియాలోని దేశాల నుంచి కూడా అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. దీనికి కారణం చైనాపై అత్యధిక మొత్తంలో ట్రంప్ టారిఫ్‌లు విధించడమే.

అమెరికా వినియోగదారులకు చైనా ఉత్పత్తులతో పోలిస్తే వారి ఉత్పత్తులు చౌకగా లభ్యమవుతున్నాయి. చాలా చైనా సంస్థలు అమెరికా టారిఫ్‌లను తప్పించుకునేందుకు ఆ దేశాలకు తరలి వెళ్లాయి.

అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ డేటా ప్రకారం.. ఏసియన్ ట్రేడింగ్ బ్లాక్‌లోని దేశాలు అంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల నుంచి అమెరికాకు 2016లో 158 బిలియన్ డాలర్ల (రూ.13,78,983 కోట్లు) విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తే, 2022 నాటికి ఎగుమతుల మొత్తం సుమారు 336 బిలియన్ డాలర్లకు (రూ.29,32,121 కోట్లకు) చేరుకుంది.

''2018 టారిఫ్‌ల సమయంలో అత్యధిక ఎక్కువగా ప్రభావితమైంది చైనా'' అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ ఎకనామిస్ట్ డాక్టర్ నికోలో తాంబెరి అన్నారు.

''ఈ టారిఫ్‌ల నుంచి వియత్నాం ఎక్కువగా లాభపడింది.'' అని భావిస్తున్నట్లు చెప్పారు.

టారిఫ్‌ల వల్ల అమెరికాలో స్టీల్, అల్యూమినియం అవుట్‌పుట్ పెరిగిందని పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పేర్కొంది. కానీ, మెటల్స్ ధరలు పెరిగినట్లు చెప్పింది. దీనివల్ల, ఇతర తయారీ పరిశ్రమల్లో వేల ఉద్యోగాలు పోయాయని వెల్లడించింది.

అమెరికాలోకి అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోకి అక్రమ వలసలను ఆపేందుకు, ఫెంటానిల్ డ్రగ్ సరఫరాను నిరోధించేందుకు మెక్సికో, కెనడాలపై టారిఫ్‌లు విధించాలనుకుంటున్న ట్రంప్ చెప్పారు.

ఏ టారిఫ్‌లను అమెరికా విధించింది? ఇంకేం టారిఫ్‌లు విధించబోతుంది?

కెనడా, మెక్సికో నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను విధిస్తుందని మార్చి 4న అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్‌నిక్ వెల్లడించారు. బోర్డర్ సెక్యూరిటీని మెరుగుపరుచుకునేందుకు రెండు దేశాలకు సమయం ఇవ్వడం వల్ల నెల పాటు ఆలస్యమైందని తెలిపారు.

అమెరికాకు పంపించే చమురు వంటి ఎనర్జీ ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్‌లను కెనడా ఎదుర్కోబోతుంది.

ఫిబ్రవరి 4నే చైనా దిగుమతులపై 10 శాతం టారిఫ్‌లను అమెరికా విధిస్తున్నట్లు ప్రకటించింది. అక్రమంగా ఫెంటానిల్ తయారీకి అవసరమైన పదార్థాలను చైనా నుంచి తరలిస్తున్నారని, ఈ ట్రేడ్‌ను ప్రభుత్వం అరికట్టాల్సి ఉందని అమెరికా చెబుతోంది.

మార్చి 4న చైనా ఎగుమతులపై మరో 10 శాతం టారిఫ్‌లను విధించనున్నామని ట్రంప్ చెప్పారు.

దీనికి ప్రతిగా చైనా ఇప్పటికే అమెరికా బొగ్గు, చమురు, గ్యాస్, ఫామ్ మెషినరీ, పెద్ద ఇంజిన్ కార్ల ఎగుమతులపై పన్నులను విధించింది. ఎలక్ట్రిక్, మిలటరీ పరికరాల తయారీలో వాడే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది.

ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్‌లను విధించడం మార్చి 12 నుంచి ప్రారంభించబోతుంది.

దీనివల్ల, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, సౌత్ కొరియా, వియత్నాం వంటి కీలక స్టీల్ ఉత్పత్తి దేశాలు ప్రభావితం కానున్నాయి. యూఏఈ, బహ్రెయిన్ వంటి అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారులు కూడా ప్రభావితం చెందనున్నాయి. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాలో స్టీల్ ధరలు పెరుగుతాయనే వచ్చే సలహాలను కూడా ట్రంప్ కొట్టివేస్తున్నారు.

''చివరకు, ఇవి చౌకగానే లభ్యమవుతాయి.'' అని అంటున్నారు.

అమెరికాకు వెళ్లే తమ ఎగుమతులపై టారిఫ్‌ల వల్ల మెక్సికోలో నిరుద్యోగం పెరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాకు వెళ్లే తమ ఎగుమతులపై టారిఫ్‌ల వల్ల మెక్సికోలో నిరుద్యోగం పెరగనుంది.

ప్రస్తుత టారిఫ్‌లు మెక్సికో, కెనడాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి

టారిఫ్‌ల వల్ల కెనడా, మెక్సికో రెండూ తీవ్రంగా ఇబ్బంది పడనున్నాయని బ్రిటన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్ ప్రొఫెసర్ స్టీఫెన్ మిల్లార్డ్ చెప్పారు.

ఈ రెండు దేశాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడ్డాయి. మెక్సికో తన ఉత్పత్తుల్లో 83 శాతం కెనడా 76 శాతం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తుంది.

కెనడా పెద్ద మొత్తంలో చమురు, మెషినరీని అమెరికాకు పంపుతుందని మిల్లార్డ్ చెప్పారు. 25 శాతం టారిఫ్‌లు వచ్చే ఐదేళ్లలో తమ జీడీపీని 7.5 శాతానికి కుదించనున్నాయని అన్నారు. అలాగే, మెక్సికో జీడీపీ వచ్చే ఐదేళ్లలో 12.5 శాతానికి పడిపోనుంది. మెక్సికో కార్మికులకు అమెరికా టారిఫ్‌లు ప్రమాదకరంగా మారాయని అమెరికా థింక్ ట్యాంక్ విల్సన్ సెంటర్‌లోని మెక్సికో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన లీలా అబేద్ చెప్పారు.

అమెరికా-మెక్సికో ట్రేడ్‌పై ఆధారపడి సుమారు 50 లక్షల ఉద్యోగులున్నాయని చెప్పారు. మెక్సికోలో సుమారు 1.46 కోట్ల ఉద్యోగాలు ఉత్తర అమెరికా భాగస్వాములతో కలిసి జరిపే వాణిజ్యంపై ఆధారపడ్డాయని ఇటీవల ఒక అధ్యయనం చెప్పినట్లు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)