థామస్ గాబ్రియెల్ పెరీరా: నెలకు మూడున్నర లక్షల జీతమని ఆశతో వెళ్లిన ఈయనను భద్రతా బలగాలు ఎందుకు కాల్చి చంపాయి?

- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం, బెంగళూరు
ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న సమయంలో కాల్పుల్లో చనిపోయిన భారతీయుడు ఓ జాబ్ స్కామ్ బాధితుడని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 10న ఇజ్రాయెల్ సరిహద్దుల్లో జోర్డాన్ భద్రతా బలగాల చేతుల్లో థామస్ గాబ్రియెల్ పెరీరా చనిపోయారు.
ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆయనను జోర్డాన్‌కు తీసుకెళ్లారని, తర్వాత ఇజ్రాయెల్‌లో పని దొరుకుతుందని చెప్పడంతో ఆయన ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారని బీబీసీతో ఆయన కుటుంబీకులు చెప్పారు.
భారతీయులు ఉద్యోగాలకు సంబంధించి స్కాముల్లో చిక్కుకోవడం, ఉపాధి వెదుక్కుంటూ అక్రమంగా ఇతర దేశాల్లోకి ప్రవేశించడం వంటి ఘటనలు పెరగడం చాలా సాధారణంగా మారింది.

థామస్ గాబ్రియెల్ పెరీరా వయస్సు 47 ఏళ్లు. ఆయన తన బావమరిది ఎడిసన్ చార్లెస్‌తో కలిసి జోర్డాన్‌కు వెళ్లారు. భద్రతా బలగాల కాల్పుల్లో చార్లెస్ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం రెండు వారాలకు పైగా జైలులో ఉంచారు. తర్వాత ఆయనను భారత్‌కు తిరిగి పంపించారు.
థామస్, చార్లెస్ కేరళకు చెందినవారు. అక్కడ ఆటో రిక్షా డ్రైవర్లుగా పనిచేశారు.
జోర్డాన్‌కు వెళితే నెలకు రూ.3,50,000 వరకు సంపాదించవచ్చంటూ ఒక ఏజెంట్ వారికి హామీ ఇచ్చారు. అక్కడ నిర్మాణ రంగంలో (బ్లూ కాలర్ జాబ్స్) పని దొరుకుతుందని వారిని నమ్మించారు.
భారత్ నుంచి వెళ్లేముందు ఒక ఏజెంట్‌కు రూ. 2,10,000 చెల్లించామని, తర్వాత టూరిస్టు వీసా మీద జోర్డాన్‌కు చేరుకున్నాక అదనంగా మరో రూ.52,000 ఇచ్చామని చార్లెస్ బీబీసీకి చెప్పారు. వీరిద్దరూ ఫిబ్రవరిలో జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు చేరుకున్నాక, అక్కడ ఉద్యోగాలేమీ లేవని ఏజెంట్ వారికి చెప్పారు.
కానీ, ఇజ్రాయెల్‌లో పని చేయడానికి చాలా అవకాశాలున్నాయని చెబుతూ, అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాలని వారిద్దరికి సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి 10న చార్లెస్, పెరీరా ఒక గ్రూపుతో కలిశారు. చాలా గంటల పాటు ప్రయాణించి ఇజ్రాయెల్‌కు సమీపంలోని జోర్డాన్ సరిహద్దుకు చేరుకున్నారు.
''మమ్మల్ని ఒక కారులో తీసుకెళ్లారు. అది చాలా దూరం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు మేం కారు ఎక్కాం. అక్కడికి వెళ్లేసరికి అర్ధరాత్రి అయింది. తర్వాత తీరం వెంట కొన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లాం. రాత్రిపూట అక్కడ నడుస్తున్నప్పుడే మమ్మల్ని కాల్చారు'' అని చార్లెస్ వివరించారు.
పెరీరా కుటుంబానికి జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం పంపిన ఒక లేఖను బీబీసీ చూసింది.
''భద్రతా బలగాలు వారిని ఆపేందుకు ప్రయత్నించాయి. కానీ, ఆ హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. అందుకే గార్డులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ థామస్ తలకు తగలడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే, గార్డుల నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదని, వాళ్లు నేరుగా కాల్చారని చార్లెస్ అంటున్నారు. ''నేను చీకట్లో వారి వెంట నెమ్మదిగా నడుస్తున్నాను. అప్పుడే ఒక బుల్లెట్ నాకు తగిలింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. థామస్‌కు ఏం జరిగిందో నాకేం తెలియదు'' అని చార్లెస్ వివరించారు.
చికిత్స కోసం తనను ఆసుపత్రికి తరలించారని, తర్వాత జైలుకు తరలించడానికి ముందు జోర్డాన్‌లోని అనేక ప్రభుత్వ ఆఫీసులకు తీసుకెళ్లారని చార్లెస్ తెలిపారు. అక్కడ 18 రోజుల పాటు జైలులో ఉన్నానని ఆయన చెప్పారు.
జైలులో ఉన్నప్పుడు, తన భార్యతో మాట్లాడి జరిగిన విషయాన్నిఆమెకు చెప్పానని చార్లెస్ వివరించారు. తర్వాత ఆమె భారత రాయబార కార్యాలయం అధికారులను సంప్రదించారు.
ఫిబ్రవరి 28న చార్లెస్‌ను భారత్‌కు పంపించారు.
చార్లెస్ ఆరోపణలపై స్పందించాల్సిందిగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, జోర్డాన్ అధికారులను బీబీసీ కోరింది.
పెరీరా మృతదేహం ఇంకా జోర్డాన్‌లోనే ఉంది. బీబీసీ ప్రశ్నలకు స్పందించిన భారత విదేశాంగ శాఖ, వీలైనంత త్వరగా ఆయన మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది.
''డాక్యుమెంటేషన్ ప్రాసెస్, ఇతర ప్రక్రియలు పూర్తి కావడానికి ఒకట్రెండు రోజుల సమయం పడుతుందని నాకు చెప్పారు'' అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.
పెరీరా నివసించే తిరువనంతపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ, జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం సభ్యులు బాధితుని గుర్తింపును ధ్రువీకరించారని, మృతదేహాన్ని రవాణా చేసే ప్రక్రియ మొదలైందని అన్నారు.

ఫొటో సోర్స్, US Government/Representative
ప్రభుత్వం అనేకసార్లు హెచ్చరించినప్పటికీ, చాలామంది భారతీయులు ఉద్యోగాల పేరిట మోసపోతున్నారని, పని కోసం ఇతర దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు రిస్క్ తీసుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు.
''ఒక దేశానికి టూరిస్ట్ వీసా తీసుకొని, తర్వాత పొరుగు దేశంలోకి ప్రవేశిస్తారు. ఏ దేశం కూడా అక్రమంగా తమ భూభాగంలోకి వస్తే అంగీకరించదు. జాబ్ రాకెట్స్ గురించి మేం నిరంతరం ప్రజలకు సలహాలు, సూచనలు జారీ చేస్తున్నాం. కానీ, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి'' అని కేరళ ప్రభుత్వ ఆధీనంలోని వలసలను పర్యవేక్షించే శాఖ 'నోర్కా' సీఈవో అజిత్ కొలస్సెరీ చెప్పారు.
కంబోడియా, ఆగ్నేయాసియాకు చెందిన ఇతర ప్రాంతాల్లోని స్కామ్ సెంటర్ల నుంచి ఇటీవలి ఏళ్లలో వందల మంది భారతీయులను కాపాడారు. మంచి ఉద్యోగాల ఆశ చూపి వారిని ఈ సెంటర్లకు అక్రమ రవాణా చేశారు.
నకిలీ ఉద్యోగాలు, విదేశాల్లో చదువుకునే అవకాశాలను చూపిస్తూ యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడటానికి అనేక మంది భారతీయులను మోసగించారు.
అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొని గత నెలలో అమెరికా నుంచి తిరిగొచ్చిన 100 మంది భారతీయులు కూడా మెరుగైన జీవితంపై ఆశతోనే మోసపోయారని తిరువనంతపురంలోని ఇంటర్‌నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ అధికారి ఇరుదయ రాజన్ అన్నారు.
''వారు కూడా ఏజెంట్లకు డబ్బు చెల్లించి మోసపోయారు. మంచి ఉద్యోగాలు, జీతాలు అందుకోవాలనే ఆరాటమే ఇదంతా చేయిస్తోంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














