చాంపియన్స్ ట్రోఫీ: భారత్‌ను కలవరపెడుతున్న ఆ ఐదుగురు న్యూజీలాండ్ ఆటగాళ్లు ఎవరు?

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్, దుబయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె.బోతిరాజ్
    • హోదా, బీబీసీ కోసం

దుబయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆదివారం భారత్, న్యూజీలాండ్ తలపడనున్నాయి. 25 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి.

చివరిసారిగా న్యూజీలాండ్ 2000 సంవత్సరంలో భారత్‌ను ఓడించి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

ఈ రెండు జట్లు ఇప్పటివరకూ ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో 4 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. న్యూజీలాండ్ 3 సార్లు గెలిచి బలంగా ఉంది.

అయితే, ప్రస్తుత టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. న్యూజీలాండ్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ జట్టు 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.

2000 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టును ఓడించడం ద్వారా న్యూజీలాండ్ కోట్లాది మంది భారతీయుల హృదయాలను కుదిపేసింది.

అయితే, 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో న్యూజీలాండ్‌ను ఓడించి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

లెక్కల్లో న్యూజీలాండ్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం రెండు జట్ల ఆటగాళ్లు ప్రస్తుత ఫామ్ ఫైనల్లో కూడా కొనసాగిస్తే.. ఇది పూర్తిగా పైసావసూల్ మ్యాచ్‌గా చెప్పొచ్చు.

ఇప్పటివరకూ ఈ రెండు జట్లు119 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 60, న్యూజీలాండ్ 50 మ్యాచ్‌లు గెలిచాయి. 7 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

భారత జట్టు 2013 తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు. న్యూజీలాండ్ ఈ ట్రోఫీ గెలుచుకుని 25 ఏళ్లయింది.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్, దుబయి

ఫొటో సోర్స్, Getty Images

పోటాపోటీ

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రెండు జట్లూ సమానంగా ఉన్నాయి. ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేము.

భారత జట్టులో షమీ, అర్ష్‌దీప్, హార్దిక్ ఉన్నట్లే కివీస్ జట్టులో హెన్రీ, రూర్కీ, జామిసన్ ఉన్నారు. అయితే హెన్రీ భుజానికి గాయం కారణంగా ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు.

దీంతో, తుదిజట్టులో హెన్రీ ఆడటంపై సందేహాలు ఉన్నాయి.

స్పిన్ బౌలింగ్ లైనప్‌లో వరుణ్, జడేజా, కుల్దీప్, అక్షర్, అలాగే శాంట్నర్, రచిన్ రవీంద్ర, బ్రేస్‌వెల్, డారెల్ మిషెల్ ఉన్నారు.

భారత జట్టు లాగే, న్యూజీలాండ్ టీమ్‌లోనూ 8వ ఆటగాడి వరకు ధాటిగా బ్యాటింగ్ చేయగలరు.

న్యూజీలాండ్ జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా చూస్తే, భారత జట్టుకు సవాల్ విసరగల ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు.

ఈ ఐదుగురు ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్నవారే.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్, దుబయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెవాన్ కార్వే

డెవాన్ కాన్వే

ఇప్పటివరకు చాంపియన్స్ ట్రోఫీలో కాన్వే పెద్దగా పరుగులు చేయలేదు.

అయితే, ఫైనల్‌లోనూ కాన్వే అలాగే ఆడతాడని భావించలేం.

ఈ టోర్నీలో కాన్వే 4 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన కాన్వే ప్రదర్శన భారత జట్టుకు సవాల్‌గా మారొచ్చు.

కాన్వే భారత్‌తో 8 మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ సహా 230 పరుగులు చేశాడు.

స్ట్రైక్ రేట్ 92. వన్డేల్లో ప్రత్యర్థి జట్టును కలవరపరిచే అంశం ఇది. ఇలాంటి ఆటగాళ్లు నాలుగైదు ఓవర్లు క్రీజులో ఉంటే పరిస్థితి మారిపోతుంది.

భారత జట్టు మొదట్లోనే కాన్వే వికెట్ తీస్తే మ్యాచ్‌ను శాసించొచ్చు. అతను ఎక్కువ సేపు క్రీజులో ఉండటం వల్ల భారత్‌కు సవాళ్లు పెరగొచ్చు.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్, దుబయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రచిన్ రవీంద్ర

రచిన్ రవీంద్ర

రవీంద్ర న్యూజిలాండ్ జట్టులో నమ్మకమైన ఆల్‌రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్‌లో రవీంద్ర భారత జట్టుకు పెద్ద సవాల్.

చాంపియన్స్ ట్రోఫీలో రెండు సెంచరీలు కొట్టాడు. రవీంద్ర ఫామ్ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచుతుంది.

అతను ఈ ట్రోఫీలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 75 సగటుతో 226 పరుగులు చేశాడు.

రవీంద్ర మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థుల్ని తిప్పలు పెడుతున్నాడు.

ఈ ఎడమ చేతివాటం స్పిన్నర్ నెమ్మదిగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయగలడు.

అయితే, స్పిన్ బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు.

భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రవీంద్ర 3 పరుగుల వద్ద ఉండగా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కాకపోతే, ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర లాంటి ఆటగాళ్లు జట్టు విజయంలో కీలకంగా మారిన సందర్బాలు క్రికెట్ చరిత్రలో అనేకం ఉన్నాయి.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్, దుబయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిచెల్ శాంట్నర్

మ్యాచ్‌ను మలుపు తిప్పగల శాంట్నర్

ఇటీవలి టెస్ట్ సిరీస్‌లో మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్ మర్చిపోయి ఉండకపోవచ్చు.

స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో అతనికి తెలుసు.

స్లో బాల్స్ సంధిస్తూ, దాన్ని టాస్ చేస్తూ బ్యాట్స్‌మెన్లను ముప్పు తిప్పలు పెట్టగల సత్తా శాంట్నర్ సొంతం. మిడిల్ ఓవర్లలో శాంట్నర్ బౌలింగ్ భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలుగా మారవచ్చు.

దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో కూడా మధ్యలో బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

ఆటను మలుపు తిప్పగల విధంగా బౌలింగ్ చేయడంలో అతను ఎక్స్‌పర్ట్. ఈ ట్రోఫీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. భారత మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కోహ్లీ, రాహుల్, అక్షర్ పటేల్‌కు ఇతన్ని ఎదుర్కోవడం సవాలే.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్, దుబయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలియమ్సన్

విలియమ్సన్ బ్యాటింగ్ ఫామ్

చాంపియన్స్ ట్రోఫీలో మాజీ కెప్టెన్ విలియమ్సన్ మంచి ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశం.

ఒకసారి అతను మైదానంలో స్థిరపడితే, అతని వికెట్ తీయడం కష్టం.

దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన విలియమ్సన్.. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 81 పరుగులు చేసి తన ఫామ్‌ని చాటి చెప్పాడు.

దక్షిణాఫ్రికాపై విలియమ్సన్, రవీంద్ర 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కాబట్టి భారత జట్టు జాగ్రత్తగా ఉండవలసిన ఆటగాళ్లలో విలియమ్సన్ ఒకరు.

వన్డేల్లో స్పిన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం విలియమ్సన్‌కు ఉంది.

విలియమ్సన్ భారత్‌తో 30 వన్డేలు ఆడి 45 సగటు, 75 స్ట్రైక్ రేట్‌తో 1228 పరుగులు చేశాడు.

విలియమ్సన్ వన్డేల్లో రెండు జట్లపై మాత్రమే 1,000 పరుగులు చేశాడు. అందులో ఒకటి భారత్, మరొకటి పాకిస్తాన్.

ఫైనల్ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించే ఆటగాళ్లలో విలియమ్సన్ ఒకడు.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్, దుబాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విలియం హెన్రీ

ఫాస్ట్ బౌలర్ హెన్రీ

మాట్ హెన్రీ భారత జట్టు ఓపెనింగ్ బ్యాటింగ్ ఆర్డర్‌కు పెద్ద ముప్పుగా మారగల బౌలర్. చివరి మ్యాచ్‌లో హెన్రీ మొదటి 10 ఓవర్లలోనే గిల్, కోహ్లీ వికెట్లను పడగొట్టాడు.

ఈ ట్రోఫీలో హెన్రీ ఇప్పటి వరకు 10 వికెట్లు పడగొట్టాడు.

ఫైనల్‌లో మొదటి 10 ఓవర్లు హెన్రీ బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్ తట్టుకోగలిగితే, ఆ తర్వాత పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించదు.

కాబట్టి, మొదటి పది ఓవర్లు వికెట్ కాపాడుకుంటూ పరుగులు తీయడం భారత్ ముందున్న అతి పెద్దసవాల్.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ భుజం గాయం కారణంగా కేవలం 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి సగంలోనే వెళ్లిపోయాడు. హెన్రీ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని కోచ్ గ్యారీ స్టీడ్ చెప్పారు.

ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజీలాండ్ బౌలింగ్ బలహీనంగా మారుతుంది.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఇండియా- న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్, న్యూజీలాండ్ సమఉజ్జీలుగా ఉన్నాయి.

మరపురాని వైఫల్యాలు

న్యూజీలాండ్‌తో జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో భారత జట్టు ఎదుర్కొన్న ఓటములన్నీ ఇప్పటికీ మానని గాయాలుగానే ఉన్నాయి.

2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో, భారతదేశం గెలుస్తుందని భావించినప్పుడు కివీస్ ఆటగాడు క్రిస్ క్రెయిన్స్ మ్యాచ్‌ను తమ వైపు తిప్పాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున గంగూలీ (113), సచిన్ తెందూల్కర్ (69) తొలి వికెట్‌కు 149 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ (28), యువరాజ్ సింగ్ (18), వినోద్ కాంబ్లీ (1), రాబిన్ సింగ్ (13) విఫలమయ్యారు. దీంతో జట్టు 269 పరుగులు మాత్రమే చేయగలిగింది.

269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజీలాండ్ ఒక దశలో 24 ఓవర్లలో 132 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రిస్ క్రెయిన్స్, క్రిస్ హారిస్‌ల122 పరుగుల పార్ట్‌నర్ షిప్ మ్యా‌చ్ ఫలితాన్ని మార్చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)