భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా: స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లా? టీమిండియా ట్రంప్ కార్డు ఎవరు?

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీమిండియా
    • రచయిత, ప్రవీణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం దుబయి వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కూర్పు ఎలా ఉండనుందనే చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఏకంగా నలుగురు స్పిన్నర్లతో దిగడమే.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఫిబ్రవరి 11న అకస్మాత్తు మార్పు జరిగింది. యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తికి జట్టులో చోటు కల్పించారు. దీంతో స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెరిగింది.

అయితే, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో "టీమ్ ఇండియా దుబయికు అంతమంది స్పిన్నర్లను ఎందుకు తీసుకెళ్తోందో నాకు అర్థం కావడం లేదు" అని అన్నారు.

అశ్విన్ మాత్రమే కాదు, భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా దీనిపై స్పందించారు. క్రిక్‌బజ్‌తో కార్తీక్ మాట్లాడుతూ "జట్టులో ఐదుగురు స్పిన్నర్ల ఎంపిక బహుశా చాలా ఎక్కువే" అని అన్నారు.

కానీ, దాదాపు 20 రోజుల తర్వాత సెలెక్టర్ల నిర్ణయం సరైనదని నిరూపించేలా కనిపిస్తోంది.

భారత్ ఇప్పటికే సెమీఫైనల్ చేరుకుంది. దీంతో చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు స్పిన్నర్లను తీసుకున్నాడు. ఇది చాలాబాగా వర్కవుట్ అయింది.

న్యూజీలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టారు. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్‌లో స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇది.

2004లో అంతకుముందు పాకిస్తాన్ స్పిన్నర్లు కెన్యాపై ఎనిమిది వికెట్లు తీశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత జట్టు, వరుణ్ చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరుణ్ చక్రవర్తి

వరుణ్ చక్రవర్తి: ట్రంప్ కార్డ్

"తనలో ప్రత్యేకత ఉంది. అవకాశం ఇస్తే జట్టుకు ఎలా ఉపయోగపడతాడో చూడాలనుకున్నాం"

న్యూజీలాండ్‌తో మ్యాచ్ తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తి గురించి చెప్పిన మాటలివి.

2021 టీ20 ప్రపంచ కప్‌లో వరుణ్ చక్రవర్తి తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించాడు. ఆ సమయంలో, అతన్ని భారత క్రికెట్‌లో 'మిస్టరీ స్పిన్నర్'గా పరిగణించేవారు. కానీ, భారత ప్రయత్నం విఫలమైంది. మూడు మ్యాచ్‌లు ఆడిన వరుణ్ చక్రవర్తి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ టోర్నీ తర్వాత వరుణ్ చక్రవర్తికి జట్టులో స్థానం కష్టమైంది.

అయితే, తర్వాత వరుణ్ చక్రవర్తి ఐపీఎల్‌లో రాణిస్తూ వచ్చాడు. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. రీ ఎంట్రీలో వరుణ్ 15 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో తన ఎంపికను ఖాయం చేసుకున్నాడు.

మొదటి రెండు మ్యాచ్‌లలో కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గురు స్పిన్నర్లను ఆడించాడు. అయితే, వరుణ్‌కు అవకాశం రాలేదు. భారత్‌కు సెమీస్ స్థానం ఖాయం అయ్యాక వరుణ్ చక్రవర్తిని మైదానంలోకి దింపాడు రోహిత్. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదు వికెట్లు తీశాడు వరుణ్.

మ్యాచ్ తర్వాత వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ "నేను ఎక్కువ వన్డేలు ఆడలేదు, ముందుగా భయపడ్డాను. నేను ఆడుతున్నానని నిన్న రాత్రే నాకు తెలిసింది. అదేమీ టర్నింగ్ పిచ్ కాదుగానీ, సరైన ప్లేస్‌లో బంతిని వేయడం వల్ల నాకు సాయపడింది" అని అన్నారు.

కుల్దీప్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుల్దీప్ యాదవ్

ఫామ్‌లో భారత స్పిన్నర్లు

వరుణ్ చక్రవర్తి మాత్రమే కాదు, ఈ టోర్నమెంట్‌లో మిగతా భారత స్పిన్నర్లు కూడా రాణించారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఇలా...

మూడు మ్యాచ్‌లలో ఈ ముగ్గురు స్పిన్నర్లలో ఎవరూ కూడా 6 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇవ్వలేదు. గ్రూప్ దశలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసింది స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అతను ఈ టోర్నీలో 6 వికెట్లు తీశాడు.

అక్షర్ పటేల్ మూడు మ్యాచ్‌లలో 29 ఓవర్లు బౌలింగ్ చేసి 129 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు తీశాడు. అక్షర్ ఎకానమీ రేటు 4.4 మాత్రమే.

రవీంద్ర జడేజా మూడు మ్యాచ్‌ల్లో పడగొట్టింది రెండు వికెట్లే అయినా, అతని బౌలింగ్‌ ఆడటానికి ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. 24 ఓవర్లు వేసిన జడేజా 4.7 ఎకానమీ రేటుతో 113 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

భారత స్పిన్నర్లు కీలక సమయాల్లో జట్టుకు వికెట్లు అందించారు. ప్రత్యర్థి బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కొనేటపుడు ఒత్తిడికి గురైనట్లు స్పష్టంగానే కనిపించింది.

మరోవైపు, భారత్ అన్ని మ్యాచ్‌లను దుబయిలోనే ఆడుతోంది. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తున్నాయి. దుబయిలో ఆడుతూ భారత్ ప్రయోజనం పొందుతోందని పాట్ కమిన్స్, రాస్సీ వాన్‌డెర్ డస్సెన్ వంటి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)