పున్నమి రాత్రి మనుషులు తోడేళ్లుగా మారే కథ ఎక్కడి నుంచి వచ్చింది, 1589లో ఏం జరిగింది?

పౌర్ణమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పౌర్ణమి సమయంలో కొంతమంది పిచ్చివాళ్లవుతారని పురాతన కాలం నుంచి యూరప్‌లో నమ్మేవారు.
    • రచయిత, జెరెమీ హోవెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు ఏర్పడడంలో పౌర్ణమిది కీలకపాత్ర.

సూర్యుడికి, చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది, ఆ రోజు చంద్రుడు పూర్తిగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

ఇప్పటికీ ప్రేమికుల రోజున కనిపించే చంద్రుడు, సాయంత్రం వేళకు మరింత రొమాంటిక్ టచ్ ఇస్తాడు.

ఈ అందమైన ఖగోళ సంఘటనకు సంబంధించిన కొన్ని అపోహలు, ఆ రోజు జరిగే కార్యకలాపాలు, వాటి అర్థాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వాలెంటైన్స్ డే

ఫొటో సోర్స్, Getty Images

పూర్వీకులకు పౌర్ణమి ఎంత ముఖ్యమైనదంటే..

రోజురోజుకీ పెరుగుతూ, క్షీణిస్తూ ఉండే చంద్రుని దశలు కాలాన్ని లెక్కించేందుకు ఆదిమకాలం నుంచి ఉపయోగించేవారని నమ్ముతారు.

ప్రస్తుతం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, 1957లో కనుగొన్న 'ఇషాంగో బోన్' (ఇషాంగో ఎముక)ను తీసుకోండి.

బబూన్ షిన్ (భారీ కోతి) నుంచి తీసుకున్నట్లు చెప్పే, 20 వేల ఏళ్లనాటిదిగా లెక్కించిన ఈ ఎముకను క్యాలెండర్ ప్రారంభ రూపంగా భావిస్తారు.

బెల్జియన్ జియాలజిస్ట్ తవ్వకాల్లో బయటపడిన ఈ ఎముకపై వివిధ రకాలుగా చెక్కి ఉంది. వాటిలో పగలును సూచించే వృత్తాలు, రాత్రిని సూచించే వృత్తాలు, పాక్షిక వృత్తాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి వివిధ దశలను సూచిస్తున్నాయని, ఈ ఎముకను ఆరునెలల క్యాలెండర్‌గా ఉపయోగించి ఉండొచ్చని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ మార్షాక్ అభిప్రాయపడ్డారు.

శరదృతువు సమయంలో వచ్చే (సెప్టెంబర్ చివరన లేదా అక్టోబర్ ప్రారంభంలో) పౌర్ణమిని 'హార్వెస్ట్ మూన్'(వ్యవసాయ పౌర్ణమి)గా పిలిచేవారు.

ఆ సమయంలో సూర్యుడు అస్తమించిన వెంటనే చంద్రుడు ఉదయిస్తాడు. ఈ వెలుతురు కారణంగా గతంలో రైతులు ఎక్కువగా పనిచేసుకునేవారు. ఇప్పుడు విద్యుత్ దీపాలు వాడడం కనిపిస్తుంది.

బౌద్ధమతం, కుంభమేళా, హిందూ సంస్కృతి, శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలోని బాలిలో పౌర్ణమిని 'పూర్ణమ' అంటారు.

ప్రపంచంలో పౌర్ణమి రోజు ఎన్నో పండుగలు..

ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులలో పౌర్ణమి రోజుల్లో వేర్వేరు పండుగలు జరుపుకుంటారు.

శరదృతువు కాలంలో, చైనాలో జరుపుకునే ఝాంగ్‌కీ జీ పండుగను 'మూన్ ఫెస్టివల్' అని కూడా పిలుస్తారు. 'హార్వెస్ట్ మూన్' రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజు ప్రభుత్వ సెలవు కూడా. ఈ పండుగ దాదాపు 3,000 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. పంటలు బాగా పండాలని ఈ పండుగను జరుపుకుంటారు.

కొరియాలో కూడా ఇలాంటి పండుగే జరుపుకుంటారు. కొరియాలో 'చుసియోక్' అని పిలిచే ఈ పండుగ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పండుగ కూడా 'హార్వెస్ట్ మూన్' రోజునే వస్తుంది.

హిందూ సంస్కృతిలో, చంద్రుడు పూర్తిగా కనిపించే రోజును పౌర్ణమిగా పిలుస్తారు. ఆ రోజున ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తారు. నవంబర్‌‌లో వచ్చే కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రం. ఆ రోజు శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిపై విజయం సాధించడంతో పాటు విష్ణువు అదే రోజు మత్స్యావతారం ధరించినట్లు చెబుతారు. నదీస్నానాలు ఆచరించడం, దీపారాధన వంటివి చేస్తారు.

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా కూడా పౌర్ణమి రోజే ప్రారంభమవుతుంది.

బౌద్ధమతంలో కూడా పౌర్ణమికి ప్రముఖ స్థానం ఉంది. ఎందుకంటే, గౌతమ బుద్ధుడు 2,500 సంవత్సరాల కిందట పౌర్ణమి నాడు జన్మించారని చెబుతారు. ఆయనకు 'జ్ఞానోదయం, మహానిర్వాణం' కూడా పౌర్ణమి రోజునే సంభవించాయని నమ్ముతారు. బుద్ధుని జన్మదినాన్ని బుద్ధ పూర్ణిమ అంటారు. ఇది సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది.

శ్రీలంకలో పౌర్ణమికి మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, ప్రతి పౌర్ణమికి ప్రభుత్వ సెలవు ఉంటుంది. ఆ రోజును 'పోయా' అంటారు. ఈ రోజున మద్యం, మాంసం నిషిద్ధం.

ఇక, ఇండోనేషియాలోని బాలిలో పౌర్ణమిని 'పూర్ణమ' అంటారు. ఈ రోజున 'దేవుళ్లు' భూమికి దిగివచ్చారని (వస్తారని) అక్కడి ప్రజలు నమ్ముతారు.

ముస్లిం సంస్కృతిలోనూ పౌర్ణమికి ప్రాధాన్యం ఉంది. ముస్లింలు పౌర్ణమి సమయంలో మూడు రోజులు ఉపవాసం ఉంటారు. ఈ రోజులను 'అల్-అయ్యమ్ అల్-బిద్' అని పిలుస్తారు.

అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున ప్రవక్త మొహమ్మద్ ఉపవాసం ఉండేవారని చెబుతారు.

క్రైస్తవ మతంలో 'ఈస్టర్' పండుగ కూడా పౌర్ణమి రోజున వస్తుంది. వసంత రుతువు తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత, వచ్చే మొదటి ఆదివారం ఈ పండుగను జరుపుకుంటారు.

తోడేలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో ఏ సంస్కృతి ఉన్నా, అది చంద్రుడికి కొంత ప్రాముఖ్యతను ఇచ్చింది. అయితే, అనేక అపోహలు కూడా ఉన్నాయి.

పౌర్ణమికి సంబంధించిన అపోహలు

పౌర్ణమి సమయంలో కొంతమంది పిచ్చివాళ్లవుతారని, మూర్ఖత్వం, పిచ్చి పౌర్ణమితో ముడిపడి ఉంటుందని యూరప్‌లో పురాతన కాలం నుంచి నమ్ముతారు. అందుకే 'మ్యాడ్నెస్' కు పర్యాయపదంగా ఉండే 'లూనసీ' అనే ఆంగ్ల పదం లాటిన్ పదం 'లూనా' (చంద్రుడు) నుంచి వచ్చినదే.

ఇలాంటివి, పౌర్ణమి మనిషిలోని క్రూర ప్రవర్తనకు కారణమవుతుందని, తోడేళ్లుగా మారతారనే భావనకు, పౌర్ణమి రాత్రిళ్లు తోడేళ్లుగా మారి, భయభ్రాంతులకు గురిచేస్తారనే అపోహకు దారితీశాయి.

గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో సిథియా అనే తెగ (ప్రస్తుతం రష్యాలోని న్యూరి తెగ) గురించి రాశారు. ఈ తెగ వారు ఏడాదిలో చాలా రోజులు తోడేళ్లుగా మారిపోతారని పేర్కొన్నారు.

యూరప్‌లో 15, 17వ శతాబ్దాల మధ్య చాలామందిని తోడేళ్లుగా భావించి విచారణ కూడా జరిపారు.

వీటిలో అత్యంత అపఖ్యాతి పాలైన కేసు, 1589లో జర్మనీకి చెందిన పీటర్ స్టబ్ అనే భూస్వామి కేసు. ఆయన తోడేలు నుంచి మనిషిగా మారడం చూశామని స్థానిక వేటగాళ్లు చెప్పారు. ఆయన్ను చాలాకాలం హింసించిన తర్వాత విసిగిపోయిన పీటర్ స్టబ్.. తన వద్ద మ్యాజిక్ బెల్ట్ ఉందని, అది తనను తోడేలుగా మార్చేస్తుందని, తోడేలుగా మారి చాలామందిని వేటాడి తిన్నట్లు అంగీకరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)