అంట్లు ఎవరు తోముతున్నారు? ఈ సినిమాపై మగవారి హక్కుల సంఘాలు ఎందుకు కోప్పడుతున్నాయి?

ఫొటో సోర్స్, Jio Studios / Twitter
- రచయిత, చెరిలాన్ మొలాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం మిసెస్, అనేక భారతీయ కుటుంబాలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న ఒక వాస్తవికతను హైలైట్ చేసింది. బాగా చదువుకున్న కుటుంబాల్లో కూడా స్త్రీ పాత్ర తరచుగా జీతం లేని ఇంటి పనికే పరిమితం అవుతోంది.
గైనకాలజిస్టుని వివాహం చేసుకున్న ప్రధాన పాత్ర.. ఇంట్లో వంట చేయడం, శుభ్రం చేయడం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనే చక్రంలో చిక్కుకుపోయినట్లు భావిస్తుంది. నిరంతర విమర్శలు, ఒత్తిడి కారణంగా ఆమె కలలు పక్కకుపోతాయి.
ప్రముఖ మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' ఆధారంగా రూపొందిన మిసెస్ చిత్రం ఇప్పుడు చర్చనీయమైంది. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో కొందరు పురుషుల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది.
అయితే, ఈ సినిమాకు డేటా బలమైన మద్దతునిస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
వంట పనులకే పరిమితం..
ఇటీవలి ప్రభుత్వ సర్వే ప్రకారం, భారతీయ మహిళలు రోజుకు ఏడు గంటలకు పైగా జీతం లేని ఇంటి, సంరక్షణ పనులు చేస్తున్నారు. పురుషులు వెచ్చిస్తున్న సమయం కంటే ఇది రెట్టింపు. మహిళలు ఇంటి పనిని 289 నిమిషాలు, సంరక్షణ బాధ్యతలు 137 నిమిషాలు నిర్వహిస్తుండగా, పురుషులు ఇంటి పనికి 88 నిమిషాలు, సంరక్షణ విధులకు 75 నిమిషాలు కేటాయిస్తున్నారు.
స్త్రీలు జీతంతో కూడిన పని, వ్యక్తిగత సంరక్షణలో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు. ఇది పురుషులతో పోలిస్తే చాలా తక్కువ.
చివరిసారిగా ఆరేళ్ల కిందట జరిపిన సర్వే ఫలితాలు కూడా ఇలాగే ఉండటం ఆందోళనకరమైన విషయం. మహిళలకు సాధికారత కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ, పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు.
ప్రజలు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో భారతదేశ సమయ వినియోగ సర్వేలు (టైమ్ యూజ్ సర్వే - టీయూఎస్) ట్రాక్ చేస్తుంటాయి. దేశవ్యాప్తంగా 6 నుంచి 59 ఏళ్ల వయసు గల వారి నుంచి సర్వేయర్లు డేటాను సేకరిస్తారు. వారు ముందు రోజు ఎలా గడిపారో అడిగి నమోదు చేసుకుంటారు. మొదటి టీయూఎస్ 2019లో విడుదలైంది, రెండవది గత వారం ప్రచురితమైంది.
రెండో టీయూఎస్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రెండు ముఖ్యమైన మార్పులను హైలైట్ చేశారు.15 నుంచి 59 ఏళ్ల వయస్సు గల మహిళలు జీతం లేని ఇంటి పనిలో గతంతో పోలిస్తే 10 నిమిషాలు తక్కువ గడిపారు. ఉద్యోగాలు, సంబంధిత కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యం 3 శాతం కంటే కొంచెం పెరిగింది.
ఈ మార్పు మహిళలు జీతం లేని పని నుంచి జీతం వచ్చే పనికి మారుతున్నారని సర్వే తేల్చింది. వారు ఇంటి పనులకు కేటాయిస్తున్న సమయం తగ్గడం, జీతం వచ్చే పనికి కేటాయిస్తున్న సమయం పెరగడం సానుకూల సంకేతం. కానీ, ఆర్థికవేత్తలు దీనితో ఏకీభవించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల డబుల్ షిఫ్టులు
జీతం ఇచ్చే ఉద్యోగంతో పాటు, జీతం లేని అధిక పనిని కూడా మహిళలు బ్యాలెన్స్ చేస్తున్నట్లు పైసర్వే సూచిస్తోందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.
మహిళలు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో బాగా అర్థం చేసుకోవడానికి భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎఫ్ఎల్ఎఫ్‌పీఆర్)తో పాటు సమయ వినియోగ సర్వే డేటాను విశ్లేషించాలని అశోకా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అశ్విని దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు.
ఎఫ్ఎల్ఎఫ్‌పీఆర్ అనేది, శ్రామిక శక్తిలో భాగమైన 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల శాతాన్ని లెక్కిస్తుంది.
ప్రభుత్వ డేటా ప్రకారం, ఎఫ్ఎల్ఎఫ్‌పీఆర్ 2017-18లో 23 శాతం ఉండగా 2022-23లో 37 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండటం వల్లనే కాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా జరిగిందని ప్రొఫెసర్ దేశ్‌పాండే అభిప్రాయపడ్డారు.
"ఇంటి సంపాదనకు మద్దతుగా నిలవడానికి మహిళలు పని చేయాలనుకుంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వారు రెండు పనులు చేస్తారు. ఇంటి వెలుపల జీతం తీసుకొని పని చేయడం, ఇంట్లో జీతం లేకుండా పని చేయడం" అని దేశ్‌పాండే చెప్పారు.
గృహ, సంరక్షణ పనులలో మహిళలు ఎక్కువగా గడపడం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అయితే, ఇంటి పనికి వెచ్చించే సమయంలో తేడా ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గృహ, సంరక్షణ పనులలో మహిళలు పురుషుల కంటే దాదాపు 2.8 గంటలు ఎక్కువగా గడుపుతారు. భారతదేశంలో ఈ వ్యత్యాసం 4 గంటలకు దగ్గరగా ఉంది.
దేశంలో పాతుకుపోయిన పితృస్వామ్య సమాజం దీనికి కారణమని సామాజిక శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు, ఇది కఠినమైన లింగ నిబంధనలను అమలు చేస్తూనే ఉంది. విద్యావంతులైన కుటుంబాలలో కూడా ఇలాగే జరుగుతోంది. దీనికి పురుషులు మాత్రమే కాకుండా చాలావరకు మహిళలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. లింగం ఆధారంగా చేసే ఈ పనులు మహిళల దైనందిన జీవితాలనే కాదు, సమాజం చూసే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
"మిసెస్" చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలామందికి ఇది నచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో కొందరు పురుషుల నుంచి విమర్శలు వచ్చాయి. సంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై విషం కక్కుతోందని పురుషుల హక్కుల సంఘం ఆరోపించింది. కొందరు అసలు ఆ ప్రతిపాదననే తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'మా నాన్నకి వారంలోనే అర్థమైంది'
ఈ చిత్రం సమాజంలోని అసౌకర్యకరమైన సత్యాన్ని చూపించి, ప్రజలను కలవరపెట్టిందని ముంబయికి చెందిన కమెడియన్ కాజోల్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
కాజోల్ తన సొంత జీవితం నుంచి ఒక ఉదాహరణను బీబీసీతో పంచుకున్నారు. కాజోల్ తండ్రి 40 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్ని వదిలి ఇంటిని చూసుకోవాలనుకున్నారు. అయితే, ఇంటి పని తాను ఊహించిన దానికంటే చాలా కష్టమని గ్రహించారు.
"మొదటి వారం ఆయన ఉత్సాహంగా ఉన్నారు, వేర్వేరు వంటకాలు వండారు. ఇంటిని పూర్తిగా శుభ్రం చేశారు" అని కాజోల్ గుర్తుచేసుకున్నారు.
అయితే, ఇంటి పని అలసిపోయేలా ఉందని ఆమె తండ్రికి త్వరగానే అర్థమైంది. వారం కంటే ఎక్కువ కాలం చేయలేకపోయారు. ఇంటి పని అంటే కేవలం ఒక పని మాత్రమే కాదు, చాలా విషయాలుంటాయని తన తండ్రి గ్రహించారని కాజోల్ వివరించారు.
"అధికారం ఎల్లప్పుడూ ఆహారం సంపాదించే వ్యక్తితోనే ఉంటుంది, మీరు ఎంత బాగా వంట చేసినా ప్రశంసలు ఉండవు" అని ఆమె అన్నారు.
ఇంట్లో తమకు అధికారం పెద్దగా లేకపోవడాన్ని అంగీకరించేలా మహిళలు పెరిగారని ఆమె భావిస్తున్నారు.
భారతీయ పురుషులు తమ భార్యలు లేదా తల్లుల గురించి మాట్లాడేటప్పుడు, వాళ్లు ఎంత త్యాగం చేశారో లేదా కుటుంబం లేదా ఇంటిని ఎంత బాగా చూసుకుంటారో అంటూ హైలైట్ చేస్తారని కూడా కాజోల్ గుర్తుచేశారు.
మార్పు నెమ్మదిగా జరుగుతోందని భారతదేశ సమయ వినియోగ సర్వే చూపిస్తోంది. మహిళలు ఇంటి పనికి తక్కువ సమయం కేటాయించడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. ఈలోగా, మిసెస్ వంటి సినిమాలు.. వంట ఎవరు వండుతున్నారు? అంట్లు ఎవరు తోముతున్నారు? వంటి చాలామంది వినడానికి ఇష్టపడని రోజువారీ సమస్యల గురించి చర్చించడానికి సహాయపడతాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














