నిగర్ షాజీ: సూర్యుడి గుట్టు విప్పే ‘సన్ మిషన్’ బాధ్యతలు చూసిన ఈ మహిళా శాస్త్రవేత్త ఎవరు?

ఇస్రో, స్పేస్ సైంటిస్ట్, నిగర్ షాజీ, మహిళా దినోత్సవం

ఫొటో సోర్స్, Dr. Anubha Jain

ఫొటో క్యాప్షన్, నిగర్ షాజీ ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
    • రచయిత, డాక్టర్ అనుభా జైన్
    • హోదా, బీబీసీ కోసం

నిగర్ షాజీ. ఈ ఇస్రో సీనియర్ మహిళా శాస్త్రవేత్త సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆదిత్య ఎల్ -1 సోలార్ మిషన్‌కు చీఫ్ ప్రాజెక్ట్ డైరక్టర్‌‌గా ఉన్నారు.

నిగర్ షాజీకి చిన్నతనంలో ఆమె తండ్రి నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ జీవిత విశేషాలను కథలుగా చెప్పేవారు. అలా చిన్న తనంలోనే సైన్స్, మ్యాథ్స్ మీద అవగాహన పెరగడంతో ఆమె శాస్త్ర పరిశోధనల వైపు ఆకర్షితులయ్యారు

నిగర్ షాజీ ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారని, వారికి ఏదైనా సాధించే శక్తి ఉందని ఆమె చెప్పారు. నిరంతర కృషితో ఇస్రోలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఈ రంగంలో మహిళలకు ఆదర్శంగా నిలిచారు.

ఆదిత్య ఎల్-1 మిషన్, ఇస్రో, సైన్స్ ప్రపంచంలో మహిళల బాట, అందులో ఎదురవుతున్న సవాళ్లు సహా అనేక అంశాలపై ఆమె డాక్టర్ అనుభా జైన్‌తో మాట్లాడారు

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సైన్స్‌పై ఆసక్తి ఎలా కలిగింది?

మా నాన్న ఫిజిక్స్, గణితంలో కాన్సెప్టులు చెప్పే తీరువల్లే నాకు ఈ సబ్జెక్టుల మీద ఆసక్తి పెరిగింది. ఆయన చెప్పే పద్ధతివల్ల అవి చాలా సరళంగా అనిపించేవి. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న సమయంలో నేను సైన్సుకు బదులుగా టెక్నాలజీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాను. టెక్నాలజీ వల్ల అసలు సైన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాను.

నిగర్ షాజీ మొదట ఇంజనీరింగ్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం కోసం ఇస్రోతో పాటు మరి కొన్ని సంస్థలకు దరఖాస్తు చేశారు.

ఇస్రోలో ఉద్యోగం వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో చేరిన తర్వాత ప్రతీ రోజూ సవాళ్లను ఎదుర్కొన్నానని, వాటిని అధిగమించానని ఆమె చెప్పారు.

సైన్స్ రంగంలోకి మహిళల ప్రవేశం కష్టమా?

సైన్స్, రీసర్చ్ విభాగాల విషయానికొస్తే , మహిళలు సైన్స్, మ్యాథ్స్ కష్టమైనవిగా భావిస్తారు. అయితే ఈ రెండు సబ్జెక్టులు తర్కం, తార్కికం మీద ఆధారపడి ఉంటాయి. వాటిని బట్టీ పట్టి నేర్చుకోలేం. ఆలోచించి అర్థం చేసుకోవాలి. మహిళలు వాటిని తేలిగ్గా అర్ధం చేసుకోగలరని ఆమె చెప్పారు.

"గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు, పరిశోధనా రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. వారు ఈ రంగంలో రాణించడం నాకు సంతోషోన్ని కలిగిస్తోంది" అని నిగర్ షాజీ చెప్పారు.

ఇస్రో, స్పేస్ సైంటిస్ట్, నిగర్ షాజీ, మహిళా దినోత్సవం

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, సోలార్ మిషన్ ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తుతించారు.

ఇంజనీరింగ్‌ రంగంలో మహిళల పరిస్థితులు

"నేను ఇంజినీరింగ్ లో చేరినప్పుడు ఈ రంగం మహిళలకు అంతగా అందుబాటులో ఉండేది కాదు. నాకు మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఆసక్తి ఉండేది, కానీ ఆ సమయంలో ఈ రంగం మహిళలకు అంతగా అందుబాటులో లేదు, కాబట్టి నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాన్ని ఎంచుకున్నాను" అని ఆమె అన్నారు.

కాలేజీలో తాను నేర్చుకున్నపరిజ్ఞానం, ఇస్రోకు రావడం ద్వారా స్పష్టమైన రూపంలో సాకారమైందని, ఇప్పుడు సాంకేతిక రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో గొప్ప అభివృద్ధి జరుగుతోందన్నారు.

ఇస్రో, స్పేస్ సైంటిస్ట్, నిగర్ షాజీ, మహిళా దినోత్సవం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్టును విజయవంతం చేసిన టీమ్‌తో పాటు ఆదిత్య L1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సత్కరించారు.

ఆదిత్య ఎల్ 1 మిషన్ గురించి..

చంద్రుడి దక్షిణ ధృవం వద్ద 2023 ఆగస్టు 5న చంద్రయాన్ -3 విజయవంతంగా దిగిన వారం తరువాత, భారతదేశం సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఒక మిషన్ ను ప్రారంభించింది. అదే ఆదిత్య-ఎల్ 1 మిషన్.

"ఆదిత్య ఎల్ 1 మిషన్ సూర్యుడు, సూర్య కణాలు, సూర్యుడి ఉపరితలం మీద మంటలు లాంటి వాటి గురించి తెలుసుకునేందుకు ఉద్దేశించింది. ఇది అంతరిక్ష వాతావరణం గురించి తెలుసుకోవడానికి, భవిష్యత్ సంఘటనలను అంచనా వెయ్యడానికి ఉపయోగ పడుతుంది. దీని వల్ల స్పేస్ రాకెట్లకు నష్టం జరగకుండా ఆపవచ్చు" అని నిగర్ షాజీ చెప్పారు.

"ఇస్రో వద్ద 50కి పైగా స్పేస్ రాకెట్లు ఉన్నాయి. సౌర వికిరణం కొన్నిసార్లు స్పేస్ రాకెట్‌ను దెబ్బ తీస్తుందని చాలా సార్లు రుజువైంది. అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భూమి వాతావరణాన్ని శాస్త్రవేత్తలు కచ్చితంగా అంచనా వేస్తున్నారు".

భూమి మీద వాతావరణ మార్పుల గురించి ముందుగా తెలుసుకుంటున్నట్లే అంతరిక్షంలో వాతావరణాన్ని ముందుగా తెలుసుకోవడం ద్వారా అక్కడ జరిగే నష్టాలను నివారించవచ్చు. ఆదిత్య ఎల్ 1 మిషన్ ద్వారా ఇస్రో మెరుగైన అంతరిక్ష వాతావరణ నమూనాలు, అంచనాలను రూపొందించగలదు. ఈ మిషన్ అంతరిక్ష వాతావరణంపై స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది" అని నిగర్ షాజీ అన్నారు.

మహిళా శాస్త్రవేత్త ఒక పెద్ద మిషన్ కు నాయకత్వం వహించడం గురించి ఇస్రో గతంలో చర్చించింది. మిషన్ చంద్రయాన్ నుంచి మార్స్ మిషన్ వరకు మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. ఇది సైన్స్ కు సంబంధించిన విషయమే కాదు, ప్రతి రంగానికి సంబంధించిన విషయమని నిగర్ షాజీ చెప్పారు.

మహిళలు ఏ దిశలో వెళ్లాలన్నా పూర్తి అంకితభావం, ఏకాగ్రతతో ప్రయత్నిస్తే లక్ష్యాన్ని సాధించగలరని ఆమె అభిప్రాయపడ్డారు. అంతరిక్ష ప్రయోగాల్లోనే కాకుండా టెక్నాలజీ అనేది ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కీలకంగా మారింది.

మహిళలు తమ ప్రతిభను చాటడానికి పురుషుల కంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది. దీనిపైనా నిగర్ షాజీ స్పందించారు.

"మహిళలు ఇంటిపనులు, ఉద్యోగ బాధ్యతల్ని సమతుల్యం చేసుకోవాలి. నా విషయంలో ఈ సమతుల్యాన్ని సాధించేందుకు మా అమ్మ చాలా సాయపడ్డారు. స్త్రీ, పురుషుల సమానత్వం, గౌరవం అనే భావనను అర్థం చేసుకునే విధంగా పిల్లలను పెంచాలి.’’

ఇస్రో, స్పేస్ సైంటిస్ట్, నిగర్ షాజీ, మహిళా దినోత్సవం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిషన్ చంద్రయాన్ నుంచి మార్స్ మిషన్ వరకు ఇస్రో నిర్వహిస్తున్న ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

సైంటిస్ట్ కాకుంటే..

నిగర్ షాజీ ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం. తోటపని చేయడాన్ని ఇష్టపడతారు. మీరు సైంటిస్ట్ కాకపోతే ఏం చేసేవారని అడిగినప్పుడు తనకు స్పోర్ట్స్, యుద్ధ విమానాల నడపడం గురించి ఆసక్తి ఉందన్నారు. ఆ రెంటిలో ఏదో ఒక దానిని కెరీర్‌గా ఎంచుకుంటానని ఆమె చెప్పారు.

ఇస్రోలో 35 ఏళ్ల కెరీర్‌లో, ఆమె అనేక ప్రయోగాల్లో కీలకంగా ఉన్నారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాల డిజైనింగ్, నియంత్రణ వ్యవస్థలతో సహా అనేక ఇతర రంగాలలో నిగర్ షాజీ ఇస్రోకు సహకారం అందించారు

ఆమె రిసోర్స్ శాట్ -2ఎ ఉపగ్రహ అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, ఇస్రో శాటిలైట్ టెలిమెట్రీ సెంటర్ అధిపతిగా పనిచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)