ప్రపంచకప్ ఓటమి తరువాత టీమ్ ఇండియా 15 నెలల్లో రెండు పెద్ద టైటిళ్లను ఎలా గెలుచుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"2007 ఓటమి తర్వాత, ప్రపంచ కప్ గెలవడం నా కలగా మారింది. దానిని సవాలుగా తీసుకున్నాను. ట్రోఫీని గెలవాలని నాకు నేనే చెప్పుకున్నాను. అదొక సవాలు. దాని కోసమే పని చేశాను."
ఇండియన్ క్రికెట్ టీమ్ 28ఏళ్ల తర్వాత 2011లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు, సచిన్ టెండూల్కర్ మిడ్ డే వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి.
సచిన్ టెండూల్కర్ ఆడిన చివరి ప్రపంచ కప్ అది. విరాట్ కోహ్లీ, క్రికెట్ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటున్న రోజులవి. ఆ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడలేదు. కానీ టీమ్ ఇండియా భవిష్యత్ అతనిలో కూడా కనిపించింది.
12ఏళ్ల తర్వాత, టీమ్ ఇండియా ప్రపంచకప్ టైటిల్‌కు చాలా దగ్గరగా వచ్చింది. కానీ దాన్ని గెలవలేక పోయింది.
సచిన్ మాదిరిగానే రోహిత్ శర్మ కూడా టైటిల్ గెలవడాన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు.
ఈ సవాళ్లకు సమాధానం చెప్పేందుకు టీమ్ ఇండియా కేవలం15 నెలల వ్యవధిలో రెండు పెద్ద టైటిళ్లను గెలుచుకుంది. 2024 జూన్ 29న ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు అప్రతిహత విజయాలతో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

2007 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోని వంటి స్టార్లు ఉన్న టీం ఇండియా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
ఆ తర్వాత ఆరు నెలలకే తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2011లో భారత క్రికెట్ జట్టు 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2013లో రెండోసారి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. భారత క్రికెట్‌కు సంబంధించినంత వరకు దీన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు.
ఈ టోర్నమెంట్‌ను రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంగా కూడా భావిస్తారు. ఎందుకంటే ఈ టోర్నీలోనే రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశం లభించింది. తర్వాత కాలంలో అతన్ని హిట్‌మ్యాన్‌ను చేసింది.
2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, మరో టైటిల్ కోసం మొదలు పెట్టిన వేట చాలా కాలం కొనసాగింది.

ఫొటో సోర్స్, Getty Images
2013 నుంచి 2023 వరకు..
2014లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కానీ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
2015 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రయాణం సెమీ-ఫైనల్స్‌తో ముగిసింది. 2016లో టీ20 ప్రపంచ కప్‌లో కూడా టీం ఇండియా సెమీఫైనల్స్‌లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో ఓడించింది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది.
2021లో ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజీలాండ్ భారత్ మీద విజయం సాధించింది. అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది.
2022 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రయాణం సెమీ ఫైనల్స్ వరకు మాత్రమే కొనసాగింది.
2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా భారత జట్టుకు నిరాశ ఎదురైంది.
2023లో భారత గడ్డపై ప్రపంచ కప్ జరిగింది. వరుసగా 10 మ్యాచ్‌లను గెలవడం ద్వారా, టీమ్ ఇండియా గత పదేళ్లుగా ఎదురైన చేదు అనుభవాలను అధిగమించాలని భావించింది.
అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రోహిత్ సేన ఆశల్ని వమ్ము చేసింది.
ఈ ఓటములన్నీ చూస్తే.. భారత్ సెమీస్, ఫైనల్స్ వరకు వస్తున్నా... కప్ గెలవడంలో ఒకటి, రెండు అడుగుల దూరంలో ఆగిపోతోంది.
చివరి క్షణంలో టైటిల్ తమ చేతుల్లోంచి జారిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలనే దానిపై భారత ఆటగాళ్ళతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ కూడా కసరత్తు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత
2023 ప్రపంచ కప్ ఓటమి నుంచి టీం ఇండియా కోలుకునే ప్రక్రియ ఎనిమిది నెలల తర్వాత ప్రారంభమైంది.
టీ20 ప్రపంచ కప్‌లో, జూన్ 9న, గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 119 పరుగులకే ఆలౌట్ అయింది.
చేజింగ్‌లో పాకిస్తాన్ 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. పాకిస్తాన్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే 13వ ఓవర్ నుంచి పరిస్థితి మారిపోయింది.
జస్‌ప్రీత్ బూమ్రా విజృంభించడంతో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు విజయాల పరంపర అజేయంగా సాగింది. గెలవడం కష్టం, అసాధ్యం అనుకున్న మ్యాచ్‌లను కూడా, సమష్టి ప్రదర్శనతో గెలవవచ్చని నిరూపించింది. కొన్ని విజయాలు జట్టులో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి.
జూన్ 29న జరిగిన ఫైనల్‌లో కూడా ఇలాంటిదే కనిపించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా గెలవడానికి 30 బంతుల్లో 29 పరుగులు అవసరం. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సౌతాఫ్రికా లాంటి జట్టుకు ఇది చాలా తేలికైన వ్యవహారం.
అయితే 16వ ఓవర్లో బుమ్రా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
17వ ఓవర్ మొదటి బంతికే పాండ్యా క్లాసెన్‌ను పెవిలియన్‌కు వెనక్కి పంపాడు. మ్యాచ్ మీద ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో బుమ్రా తన మ్యాజిక్‌ను ప్రదర్శించి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్‌లో భారత్ తిరిగి పుంజుకుంది. మిగిలిన పనిని అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా పూర్తి చేశారు.
ఆ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది.
దీంతో ఐసీసీ టోర్నమెంట్లలో 11 ఏళ్ల వరుస ఓటములకు తెరపడింది.

ఫొటో సోర్స్, Getty Images
టీ 20 వరల్డ్ కప్ గెలిచాక..
ఈ విజయం తర్వాత "మూడు-నాలుగేళ్లుగా మేము ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నామో చెప్పలేను. మేమంతా ఒక జట్టుగా చాలా కష్టపడ్డాం. ఈ విజయం తర్వాత అదంతా మర్చిపోయాం" అని రోహిత్ శర్మ చెప్పాడు.
"మేము గెలవడం ఇదేమీ తొలిసారి కాదు. నాలుగేళ్ల నుంచి మేం బాగానే ఆడుతున్నాం. ఎంతో ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లు ఆడాం. అయితే ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు" అని రోహిత్ శర్మ చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
చాంపియన్స్ ట్రోఫీలో ఓటమి ఎరుగని జట్టు
టీ20 ప్రపంచ కప్ విజయ పరంపరను టీం ఇండియా చాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకువచ్చింది. ఈ టోర్నీలో భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు అద్బుతమైన ఫామ్‌లో కనిపించారు. ఫీల్డింగ్‌లోనూ జట్టు ప్రదర్శన గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది.
టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో, ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రత్యర్థి జట్టు 300 సాధించే అవకాశం ఇవ్వలేదు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు ఉన్నారు.
వరుణ్ చక్రవర్తి టీమ్ ఇండియాకు "ట్రంప్ కార్డ్" అని నిరూపించుకున్నాడు. మూడు మ్యాచ్‌లలో 9 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ కూడా ఐదు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఐదు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన 15 మంది ఆటగాళ్లలో టీమ్ ఇండియా ప్లేయర్లు ఐదుగురు ఉన్నారు. ఐదు మ్యాచ్‌లలో శ్రేయస్ అయ్యర్ 243 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 218 పరుగులు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టులోని ఆటగాళ్లందరూ విజయం కోసం శ్రమించారు. ప్రత్యర్థి జట్టును ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓడించారు.

ఫొటో సోర్స్, Getty Images
విజయం తర్వాత రోహిత్ శర్మ ఏం అన్నాడంటే...
ఫైనల్‌లో చేజింగ్‌కు దిగిన భారత్ జట్టుకు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ శుభారంభాన్ని ఇచ్చింది. ఫైనల్‌లో రోహిత్ 76 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
"ఇది చాలా బాగుంది. మేం మంచి క్రికెట్ ఆడాం. ఫలితాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. నేను ప్రత్యర్థి జట్టు బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తూ ఆడుతున్నాను. దీని వల్ల కొన్ని సందర్భాల్లో మంచి స్కోర్లు చేయలేకపోవచ్చు" అని రోహిత్ శర్మ అన్నాడు.
"అందుకే నేను చిన్నగా ఆడాలి. ఎనిమిదో నెంబర్‌లో జడేజా ఉండటం, జట్టు మొత్తానికి నమ్మకాన్ని కలిగిస్తుంది. నాకు ఏం కావాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంది" అని హిట్‌మ్యాన్ చెప్పాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














