సిరియా: వందలాదిమంది పౌరులను చంపిన భద్రతా బలగాలు.. అలవైట్లే లక్ష్యమా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఇయాన్ ఐక్మన్
- హోదా, బీబీసీ న్యూస్
సిరియా భద్రతా దళాలు అలవైట్ మైనార్టీ వర్గానికి చెందిన వందలాదిమంది పౌరులను చంపినట్టు ఆరోపణలు వచ్చిన తరువాత సిరియా ప్రజలందరూ దేశం కోసం ఏకతాటిపైకి రావాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ షారా పిలుపునిచ్చారు.
శుక్రవారం, శనివారాలలో అలవైట్లను లక్ష్యంగా చేసుకొని 30 సార్లు సాగించిన మారణకాండలో 745 మంది పౌరులు చనిపోయినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ (ఎస్‌ఓహెచ్‌ఆర్) తెలిపింది. అయితే ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
‘‘మనం సాధ్యమైనంతవరకు జాతీయ ఐక్యతను, పౌరశాంతిని పరిరక్షించాలి, దేవుడు కోరుకుంటే మనమందరం కలిసిమెలిసి జీవించగలుగుతాం’’ అని డమాస్కస్‌లో ఓ మసీదు నుంచి షరా చెప్పారు.
తాజా పరిణామాలన్నీ అసద్ ప్రభుత్వ పతనం తరువాత ‘‘ఊహించిన సవాళ్లలో భాగమేనని’’ అని ఆయన ఓ వీడియో సందేశంలో చెప్పారు.
లటాకియా, టార్టస్ తీర ప్రాంతాల నుంచి వందలాదిమంది ప్రజలు ఇళ్లు విడిచి పారిపోతున్నారు. పదవీచ్యుతుడైన బషర్ అల్ అసద్‌కు ఈ ప్రాంతాలు గుండె లాంటివి. ఆయన కూడా అలవైట్ తెగకు చెందినవారే.


ఫొటో సోర్స్, Reuters
గత రెండు రోజుల్లో మొత్తం 1000 మందికిపైగా మరణించినట్లు ఎస్‌ఓహెచ్ఆర్ తెలిపింది. తిరుగుబాటుదారులు డిసెంబర్‌లో అసద్ ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత సిరియాలో జరిగిన అత్యంత దారుణమైన హింస ఇదేనని వెల్లడించింది.
మృతుల్లో డజన్ల కొద్ది ప్రభుత్వ దళాలు, అసద్‌కు విధేయులైన సాయుధులు కూడా ఉన్నారు. గురువారం నుంచి లటాకియా తీరం, టార్టస్ ప్రావిన్సుల్లోజరుగుతున్న ఘర్షణల్లో వీరు చిక్కుకున్నారు.
ఎస్‌ఓహెచ్‌ఆర్ నివేదిక ప్రకారం, ఇస్లామిస్టుల నేతృత్వంలోని ప్రభుత్వ భద్రతా దళాలకు చెందిన 125 మంది సభ్యులు, అసద్ అనుకూల ఫైటర్లు 148 మంది ఈ హింసలో మరణించారు.
సున్నీ ముస్లింలు మెజారిటీగా ఉండే సిరియా జనాభాలో అలవైట్లు దాదాపు 10 శాతంగా ఉన్నారు. అలవైట్లు షియా ముస్లింలు.
తమ భద్రతా సిబ్బందిపై దాడులు జరిగిన తర్వాత అక్కడి పరిస్థితిని ప్రభుత్వం అదుపులోకి తెచ్చిందని సిరియాలోని సనా న్యూస్ ఏజెన్సీతో దేశ రక్షణమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ హింసతో అలవైట్ల సమాజంలో భయాందోళనలు నెలకొన్నాయని బీబీసీతో శుక్రవారం స్థానిక కార్యకర్త ఒకరు అన్నారు. హింస ప్రభావిత ప్రాంతాల నుంచి వందల మంది తమ ఇళ్లను వదిలి పారిపోయినట్లు ఆయన చెప్పారు.
రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, భారీ సంఖ్యలో ప్రజలు, లటాకియాలోని ఒక రష్యా మిలిటరీ స్థావరంలో ఆశ్రయం పొందారు.
రష్యా రక్షణను ప్రజలు కోరుకుంటున్నారంటూ డజన్ల కొద్దీ ప్రజలు నినాదాలు చేయడం రాయిటర్స్ షేర్ చేసిన వీడియో పుటేజీలో కనిపించింది.
మరోవైపు చాలా కుటుంబాలు పొరుగున ఉన్న లెబనాన్‌కు పారిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
సిరియా తీర ప్రాంతాల్లో పౌర మరణాల గురించి వెలువడిన నివేదికలు చాలా కలిచివేశాయని సిరియాలోని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి గీర్ పెడెర్సన్ అన్నారు.
దేశాన్ని అస్థిరపరిచే, విశ్వసనీయమైన, భాగస్వామ్య రాజకీయాలకు హాని కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు ఆయన పిలుపునిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














