ఇజ్రాయెలీ టూరిస్ట్‌తో సహా ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్, ఆపేందుకు ప్రయత్నించిన యువకుడి హత్య

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖరేషి, లూసీ క్లార్క్ బిల్లింగ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇజ్రాయెల్‌కు చెందిన మహిళా టూరిస్టుతో సహా ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురయ్యారని, ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని కూడా దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఈ ఘటన కర్ణాటకలోని ప్రముఖ పర్యటక కేంద్రం హంపిలో జరిగింది.
మహిళలను అత్యాచారం నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని నిందితులు చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది?
కర్ణాటకలోని కొప్పాళ్ జిల్లా పరిధిలో, తుంగభద్ర కాల్వలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ఒడిశాకు చెందిన 26 ఏళ్ల బిభాష్‌గా గుర్తించారు.
మహిళలపై అత్యాచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈయన్ను నిందితులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ సమయంలో ఈయనతో పాటు అమెరికన్ పౌరుడు డేనియెల్, పంకజ్ పాటిల్ అనే మరో ఇద్దరు ఉన్నారు. ఈ ముగ్గురిపై ముగ్గురు నిందితులు దాడి చేసి తుంగభద్ర కాల్వలోకి తోసేశారు.
వారితో ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు గ్యాంగ్ రేప్(సామూహిక అత్యాచారం) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఈ ఇద్దరిలో ఒకరు ఇజ్రాయెల్‌కి చెందిన పర్యటకురాలు కాగా, మరొకరు కేరళకు చెందిన మహిళ. ఆమె ఒక హోంస్టేలో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
పోలీసులు ఏం చెప్పారు?
ఇప్పటి వరకూ ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
అరెస్టులపై కొప్పల్ జిల్లా ఎస్పీ రామ్.ఎల్.అరసిద్ధి బీబీసీతో మాట్లాడుతూ, ''బిభాష్ మృతదేహాన్ని తుంగభద్ర కాల్వలో గుర్తించాం. హత్య కేసుతో పాటు హత్యాయత్నం, రేప్ అభియోగాలను కూడా చేర్చాం'' అని చెప్పారు.
మార్చి 6వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఐదుగురు రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాల వెలుగులను వీక్షించేందుకు హంపి సమీపంలోని సనపూర్ దుర్గామాత ఆలయం వద్దకు వెళ్లారు.
కేరళకు చెందిన మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
''ముగ్గురు నిందితులు ఒక బైక్‌పై సంఘటన స్థలానికి వచ్చారు, పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని వారిని అడిగారు. కేరళకు చెందిన మహిళ వారికి అడ్రస్ చెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత నిందితులు రూ.100లు ఇవ్వాలని టూరిస్టులను డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో గొడవపడి, వారిపై దాడి చేశారు'' అని పోలీసులు చెప్పారు.
ముగ్గురు నిందితులు టూరిస్టులను అనుసరిస్తూ వారి వెనకే వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
''వాళ్లు డేనియెల్, పంకజ్, బిభాష్‌లను నీళ్లలోకి తోసేశారు. మూడో వ్యక్తి నా మీదకి రాయి విసిరాడు. నాకు దెబ్బతగిలి రక్తం వచ్చింది. ఆ ముగ్గురిలో ఇద్దరు నన్ను నది ఒడ్డుకు ఈడ్చుకెళ్లి నా బట్టలు చించేశారు. ఆ తర్వాత, ఆమెను (ఇజ్రాయెల్ పర్యటకురాలు) కూడా లాక్కెళ్లి రేప్ చేశారు.''
''ఆ ముగ్గురు నిందితులు కన్నడ, తెలుగులో మాట్లాడారు'' అని కేరళకు చెందిన పర్యటకురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
''బహుశా డబ్బుల కోసం మహిళలపై దాడి చేసి ఉండొచ్చు. ఈ కేసులోని నిందితులంతా కొప్పల్‌లోని గంగావతి తాలూకాకు చెందినవారే.''
''అరెస్టైన ఇద్దరూ భవన నిర్మాణ పనులు చేసుకునే తాపీమేస్త్రీలు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నాం. అతను కూడా తాపీమేస్త్రీనే'' అని ఎస్పీ చెప్పారు.
ఈ ఘటనపై గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దోపిడీ, హత్య, గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
బాధిత మహిళలకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
స్పందించిన ముఖ్యమంత్రి
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందించారు. ''ఇజ్రాయెల్ పౌరురాలు, హోం స్టే నిర్వాహకురాలిపై దాడి, రేప్ అత్యంత హేయమైన చర్య'' అని రాశారు.
''సంఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులను అడిగి సమాచారం తెలుసుకున్నా. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలిచ్చాను.''
''ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది'' అని ఆయన పోస్ట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














