ముండచ్చి టాక్స్: భర్త చనిపోతే భార్య ఈ పన్ను కట్టాలి, దేశానికి స్వాతంత్య్రం వచ్చినా కొనసాగిన ఈ విచిత్రమైన టాక్స్ ఏంటి?

తమిళనాడు, ముండాచి పన్ను
ఫొటో క్యాప్షన్, బచ్చేరి గ్రామానికి చెందిన తేని
    • రచయిత, మాయాకృష్ణన్ కన్నన్
    • హోదా, బీబీసీ కోసం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తమిళనాడులోని కల్వరయన్ హిల్స్ గ్రామాలలో వితంతు పన్ను కొనసాగింది.

ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కల్వరయన్ హిల్స్‌లోని అనేక గ్రామాలు జాగీర్దార్ల నిర్వహణలోనే ఉన్నాయి. వీరి నిర్వహణలోని గ్రామాలలో భర్త చనిపోయిన మహిళలు ‘ముండచ్చి పన్ను’ (వితంతు పన్ను) చెల్లించాల్సి వచ్చేది. 1976వరకు ఈ పద్ధతి అమలులో ఉండేది. తరువాత ఈ పన్ను ఎలా రద్దయింది? అసలు అప్పట్లో ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముండచ్చి పన్ను

"పన్ను కోసం పొలాన్ని అమ్మేసింది"

కల్వరయన్ పర్వతాలు సేలం, కల్లకురిచ్చి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వెల్లరికాడ గ్రామంలో తీర్థన్, ఆయన భార్య చిన్నమ్మ 50ఏళ్ల క్రితం నాటి పరిస్థితుల గురించి బీబీసీకి వివరించారు.

"మా తాతగారు చనిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆమె వితంతువుగా మిగిలిపోవడంతో, పన్ను చెల్లించాలని ఆదేశించారు. ఆ సమయంలో పొలంలో దిగుబడి లేకపోవడంతో ఆమె పన్ను కట్టలేకపోయారు. దీంతో పొలాన్ని అమ్మేసి దొరకు పన్ను కట్టారు" అని తీర్ధన్ చెప్పారు.

"ఇక్కడ ముసలివాళ్లను ఎవరిని అడిగినా ఆ పన్ను గురించి చెబుతారు. భర్తను కోల్పోయిన వారు చెల్లించాల్సిన పన్ను కావడంతో దీన్ని ‘ముండచ్చి పన్ను’ అని పిలిచేవారు’’ అని తీర్థన్ భార్య చిన్నమ్మ చెప్పింది.

వెల్లరికాడ సమీపంలో బచ్చేరి గ్రామానికి చెందిన తేనికి 75 ఏళ్లు.

"నాకు చిన్న వయసులోనే పెళ్లయింది. మా ఆయన చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో ముండచ్చి పన్ను ఉండేది. ఈ ప్రాంతం తమిళనాడు ప్రభుత్వం కిందకు వచ్చే వరకు అది కొనసాగింది" అని ఆమె గుర్తు చేసుకున్నారు.

మెల్‌బచ్చేరి గ్రామానికి చెందిన 65 ఏళ్ల అమ్మాసి అనే మహిళకు ఆరుగురు పిల్లలు. వారి చివరి బిడ్డ పుట్టిన కొన్ని నెలలకే ఆమె భర్త మరణించాడు.

"నా చిన్న అత్త నా కోసం ముండచ్చి పన్ను చెల్లించడం నాకింకా గుర్తుంది" అని అమ్మాసి చెప్పారు.

ముండచ్చి పన్ను

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అనేక ఏళ్లపాటు కల్వరయన్ హిల్స్ ‌ప్రాంతంలోని గ్రామాలు జాగీర్దార్ల నియంత్రణలో ఉన్నాయి.

1918లో ప్రచురించిన మద్రాస్ గెజిట్‌లో ఇక్కడి పాలనా వ్యవస్థకు సంబంధించిన సమాచారం ఉంది.

కల్వరయన్ హిల్స్‌ను ఐదు జాగీర్లుగా విభజించారు. అవి లిటిల్ కల్వరికంట్రీ, ది గ్రేట్ కల్వరి కింగ్‌డమ్, మెటీరియల్ కౌంట్‌డౌన్ కంట్రీ, నాటీ కౌంట్‌డౌన్ కంట్రీ, ఆర్యన్ కౌంట్‌డౌన్ కంట్రీ.

ఈ ఐదు జాగీర్లను మలయాళీ రాజవంశం నుండి వచ్చిన నాయకులు పాలించారు. ఈ ప్రాంతం వారి నియంత్రణలోకి ఎలా వచ్చిందనే విషయమై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నా, కచ్చితమైన సమాచారం లేదు.

అయితే, జతాయ గౌడ రాజ వంశానికి చెందిన రెండు రాగి ఫలకాల మీద లభించిన సమాచారం మేరకు ఈ ప్రాంతం విజయనగర రాజుల ఆధీనంలో ఉన్నట్లు తేలింది. రాగి ఫలకాలలో ఒకటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది, మరొకటి అచ్యుత దేవరాయల కాలం నాటిదని గెజిట్ చెబుతోంది.

తమిళనాడు, ముండాచి పన్ను
ఫొటో క్యాప్షన్, రచయిత చెరియన్

ఆదాయం కోసం జాగీర్లు స్థానిక ప్రజల నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేసేవారు.

"భూమి, తాగునీరు, ఇళ్లు, మేకలు, పశువులు, పొలం, గడ్డి, భూమి, గాలి, వివాహం, అవివాహితులు, వితంతువుల మీద పన్నులు విధించారు. వితంతువుల మీద పన్నులతో పాటు 15శాతం అదనపు రుసుము చెల్లించాలి" అని "తూర్పు కనుమల కారాళ వంశం" పుస్తక రచయిత చెరియన్ చెప్పారు.

పర్వతాలలో స్త్రీకి తోడు లేకుండా ఉండకూడదనేది ఆచారం అని తోరడిపట్టుకు చెందిన కోనమ్మాళ్ అన్నారు.

"వివాహిత భర్తను కోల్పోయినా, ఇష్టపడకపోయినా తిరిగి పుట్టింటికి వస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటారు. దీనిని వివాహం అని కాకుండా ముడి వేయడం అని పిలుస్తారు. ముసలితనంలో భర్తను కోల్పోయినా, భర్తను కోల్పోయిన మహిళలు తిరిగి పెళ్లి చేసుకోకపోయినా ముండచ్చి పన్ను చెల్లించాలి" అని కోనమ్మాళ్ చెప్పారు.

తమిళనాడు, ముండాచి పన్ను
ఫొటో క్యాప్షన్, జాగీర్దారుల ఒకప్పటి కోట

జాగీర్దార్లు ఇప్పుడేం చేస్తున్నారు?

పుదుప్పాలపట్టు జాగీర్దార్ అని పిలిచే చిన్నయ కురుంబ గౌండర్ ప్రస్తుతం పుదుప్పాలపట్టు కొండల్లోని ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు.

"మా తాతగారి కాలంలో మాకు వెయ్యి ఎకరాలకు పైగా భూమి ఉండేది. మా రాజభవనంలో వంద మందికి పైగా సేవకులు పనిచేసేవారు. మేం ప్రజల నుండి 15 కంటే ఎక్కువ పన్నులు వసూలు చేశామని నాకు బాగా గుర్తుంది" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

జాగీర్దార్లు నివసించిన రాజభవనం ఉన్న ప్రదేశానికి బీబీసీకోసం పనిచేస్తున్న ఈ రిపోర్టర్‌ను తీసుకెళ్లారు. ఒకప్పుడు అద్భుతంగా ఉండే ఆ రాజభవనం ఇప్పుడు సగానికి పైగా శిథిలావస్థకు చేరుకుంది. శిథిలమైన ఈ రాజభవనం ఒక అద్భుతం, స్నానం చేయడానికి ప్రత్యేక బావి, గుర్రపుశాల, చెక్క శిల్పాలతో అలంకరించిన గోడ ఉన్నాయి.

తమిళనాడు, ముండాచి పన్ను
ఫొటో క్యాప్షన్, చిన్నయ కురుంబ గౌండర్

1976లో తమిళనాడు కిందకు

2014లో సమాచార హక్కు చట్టం కింద ఈ విషయంలో ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు, "1963 బానిసత్వ నిర్మూలన చట్టం ప్రకారం, ఈ ప్రాంతాలను జూన్ 25, 1976న తమిళనాడు ప్రభుత్వం కిందకు తీసుకువచ్చారు" అని పేర్కొన్నారు.

2024 కల్లకురిచ్చి మద్యం మరణాల సంఘటన తర్వాత, మద్రాస్ హైకోర్టు ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

ఆ కేసులో అటవీశాఖ దాఖలుచేసిన పిటిషన్‌లో 'జాగీర్దార్లు అటవీ వనరులను దోపిడీ చేస్తున్నారని' పేర్కొంది.

ఈ కేసు విచారణ సమయంలోనే కల్వరయన్ హిల్స్‌కు సంబంధించిన మరి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది.

1963 చట్టం ప్రకారం కల్వరయన్ కొండలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్ 31, 1965న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిపై జాగీర్దార్లు దావా వేశారు.

1976లోనే కల్వరయన్ కొండలను ప్రభుత్వానికి కేటాయిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

కల్వరయన్ కొండలు తమిళనాడులో విలీనం అయిన తర్వాత, తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇక్కడి ప్రజలకు కూడా అందించారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు తమ పిల్లలను స్కూళ్లకు పంపించడం మొదలు పెట్టారు.

"కొన్ని సంవత్సరాల క్రితం, ఈ పర్వత ప్రాంతంలో 70కి పైగా గ్రామాల్లో, భర్తలను కోల్పోయిన స్త్రీలు ముండచ్చి పన్ను చెల్లించాల్సి వచ్చేది. అందుకే వారికి ఇష్టం ఉన్నా లేకున్నా మళ్లీ పెళ్లి చేసుకున్నారు" అని చెరియన్ చెప్పారు.

"కొండ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తోంది. భర్తలు వదిలేసిన మహిళలు, వితంతువులు, నిరాశ్రయులైన మహిళలు సహా 1,565 మంది మహిళలకు తమిళనాడు ప్రభుత్వం నెలవారీ స్టైఫండ్‌ అందిస్తోంది" అని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఎం.ఎస్ ప్రశాంత్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)