తమిళనాడులో అడవి పందులను ఎందుకు చంపేస్తున్నారు?

పొలాల్లోకి అడవి పందులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడులో అడవి పందులను కాల్చి చంపడానికి అక్కడి అటవీ అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికోసం శిక్షణ కూడా తీసుకుంటున్నారు.

అయితే, ఆ జంతువులు అడవి వృద్ధికి సాయంగా ఉంటాయని పలువురు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ పందులను చంపాల్సిన అవసరం ఏంటి? వాటితో వచ్చిన సమస్యలేంటి?

తమిళనాడులో ముఖ్యంగా కొండలు, అడవులు సమీపంలో ఉన్న ప్రాంతాలలో వన్యప్రాణుల వల్ల మనుషులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి.

పంటలకు వన్యప్రాణులు.. ముఖ్యంగా అడవి పందులు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఫిర్యాదులు చేస్తుంటారు.

అడవి పందులను చంపేందుకు అనుమతి కావాలంటూ రైతు సంఘాలు గతంలో డిమాండ్ చేశాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఆ అనుమతి ఇవ్వబోమని అధికారులూ స్పష్టంచేశారు.

దీంతో తమిళనాడు ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌లో రైతులకు పరిష్కారం చూపారు. ఏనుగులు, అడవి పందులు, ఇతర వన్యప్రాణుల వల్ల మనుషులపై దాడులు జరగకుండా, పంటలకు నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు అటవీ శాఖ
ఫొటో క్యాప్షన్, శిక్షణలో అడవి పందులను చంపడం కంటే వాటిని తరమడం ఎలాగో నేర్చుకున్నామని అటవీశాఖ అధికారి శంకర్ రాజా చెప్పారు.

ప్రత్యేక కమిటీ ఏం చెప్పింది?

తమిళనాడు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) నేతృత్వంలో వేసిన కమిటీలో రైతులు, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, శాస్త్రవేత్తలు, వన్యప్రాణి సంరక్షకులు, పలువురు ప్రతినిధులు ఉన్నారు.

కేరళలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. తర్వాత తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. దాని ఆధారంగా జనవరి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మానవ-వన్యప్రాణుల సంఘర్షణను నివారించడానికి, ఇరు వైపులా నష్టాలను నియంత్రించడానికి కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి అటవీ శాఖకు అనుమతి ఇచ్చారు.

అడవి పందులు

ఫొటో సోర్స్, Getty Images

అటవీ పరిసర భూముల్లో పశువుల పెంపకానికి బదులు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, అడవిలోకి మేత కోసం పశువులను తీసుకెళ్లడానికి నివారించేలా రైతులకు పశుగ్రాసం సాగుకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించడం.. కలుపు మొక్కలను తొలగించడం, కంచెల నిర్మాణానికి సహకరించడం వంటి వివిధ కార్యక్రమాలను అమలు చేయాలని కమిటీ సూచించింది.

ముఖ్యంగా కేరళ తరహాలో తమిళనాడులోనూ అడవి పందులను కాల్చేందుకు అనుమతించాలన్న వ్యవసాయ సంఘాల అభ్యర్థనతో ప్రభుత్వం పలు ఆదేశాలిచ్చింది. వాటిని అధికారులు మాత్రమే కాల్చేలా ఉత్తర్వులిచ్చింది.

దీని ప్రకారం అడవి పందులు సంచరించే ప్రాంతాలను 3 జోన్లుగా విభజించారు.

రిజర్వ్ నుంచి ఒక కి.మీ. వరకు ఉన్న ప్రాంతాన్ని 'ఏ' జోన్‌గా నిర్వచించారు. ఇక్కడ అడవి పందులను కాల్చడానికి అనుమతి లేదు.

రిజర్వ్‌కు 1-3 కి.మీ.లోపు ఉన్న ప్రాంతాన్ని జోన్ 'బీ'గా నిర్వచించారు. ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన అడవి పందులను పట్టుకుని అడవుల్లోకి వదలాలి.

రిజర్వ్‌ నుంచి 3 కి.మీ.ల దూరం దాటిన ప్రాంతాలను జోన్ 'సీ'గా పేర్కొన్నారు, ఆ ప్రాంతాల్లో సంచరించే అడవి పందులను కాల్చేందుకు అటవీ శాఖను అనుమతించవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

చంపిన అడవి పందులను రసాయనాలతో పూడ్చివేయాలి లేదా పూర్తిగా కాల్చివేయాలి. దీనికి సంబంధించిన డేటాను అటవీ శాఖ నిర్వహించాలి.

కోయంబత్తూరు
ఫొటో క్యాప్షన్, కోయంబత్తూరులో షూటింగ్ ట్రైనింగ్

ఫీల్డ్ వర్కర్లకు షూటింగ్ శిక్షణ

అడవి పందులు ఉన్న ప్రతి ప్రాంతం నుంచి ఫీల్డ్ వర్కర్లుగా ఉన్న ఫారెస్ట్ రేంజర్, ఆ స్థాయిలలోని అటవీ అధికారులకు శిక్షణ అందించనున్నారు. కోయంబత్తూరులోని తమిళనాడు వన్యప్రాణి శిక్షణ సంస్థలో ఈ శిక్షణ ఇస్తారు.

"తమిళనాడులోని అటవీ అధికారులకు ఈ నెలలో ఐదు లేదా ఆరు విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నాం. వారికి అడవి పందులను కాల్చడంపై శిక్షణ ఇవ్వడమే కాకుండా, వ్యవసాయ భూములు, జనావాసాలను ఆక్రమించే వన్యప్రాణులను ఎలా వెంబడించాలి, ఎలా రక్షించాలి అనే దానిపై శిక్షణ కూడా ఇవ్వనున్నాం'' అని తమిళనాడు వన్యప్రాణి శిక్షణ సంస్థ డైరెక్టర్ సేవా సింగ్ బీబీసీతో అన్నారు.

అటవీ శాఖ ఫీల్డ్ వర్కర్లకు ఈ శిక్షణ కోసం రిటైర్డ్ జిల్లా అటవీ అధికారి చంద్రశేఖరన్ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. అటవీ శాఖలో పనిచేస్తున్న మాజీ సైనిక సిబ్బంది మాత్రమే కాకుండా సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ సహా సీనియర్ పోలీసు అధికారులను కూడా షూటింగ్ శిక్షణకు వినియోగించుకుంటామని చంద్రశేఖరన్ తెలిపారు.

"అడవి పందులను కాల్చడం అంత తేలికైన పని కాదు. గుండె, మెదడు, ఊపిరితిత్తులకు తూటా తగిలితే అవి వెంటనే చనిపోతాయి. లేకుంటే పారిపోతాయి. అలాగే అడవి పందులు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయి. అందుకే వాటిని కాల్చేటప్పుడు ఇతరులకు హాని కలగని విధంగా తుపాకీలను వాడాలి" అని చంద్రశేఖరన్ చెప్పారు.

అడవి పందులు

ఫొటో సోర్స్, Getty Images

చంపితే కలిగే నష్టాలేంటి?

అడవి పందులు అడవులను శుభ్రపరిచేవి కాబట్టి, వాటిని చంపడం వల్ల పర్యావరణం, అటవీ, వన్యప్రాణుల జీవన చక్రంపై ప్రభావం చూపుతుందని శిక్షణలో బోధిస్తున్నట్లు కొంతమంది ఫీల్డ్ వర్కర్లు బీబీసీతో చెప్పారు. అందువల్ల, వాటిని వలలో బంధించాలని.. లేదా అడవిలోకి వెళ్లేలా చేయాలని, చివరి ప్రయత్నంగా మాత్రమే కాల్చాలని ట్రైనర్లు చెబుతున్నట్లు వారు వివరించారు.

ఈ శిక్షణ పొందిన కుర్తాళం అటవీశాఖ అధికారి శంకర్ రాజా మాట్లాడుతూ.. ఈ శిక్షణలో అడవి పందులను చంపడం కంటే వాటిని తరమడం ఎలాగో నేర్చుకున్నామని, రైఫిల్స్‌ హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకున్నామని తెలిపారు.

అడవి పందులు లేకుంటే అడవుల్లో విత్తనాల వ్యాప్తికి, అడవిని శుభ్రపరిచే పనులకు ఆటంకం ఏర్పడుతుందని, అడవి పందులను దట్టమైన అడవుల్లోకి వదిలేస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అటవీశాఖ అధికారి అంబాలవానన్‌ తెలిపారు.

అడవిలో వన్యమృగాలు

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో ఎలాంటి విధానం ఉంది?

కేరళలో అడవి పందులను కాల్చేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది, 2020 నుంచి దీన్ని అమలు చేస్తోంది. తమిళనాడుతో పోలిస్తే అక్కడ వేరే పద్దతిని అవలంబిస్తున్నారు.

కేరళకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ విజయ్ ఆనంద్ బీబీసీతో మాట్లాడుతూ "కేరళలో 2020 నుంచి అటవీ శాఖ నుంచి శిక్షణ పొందిన షూటర్లు అడవి పందులను కాలుస్తున్నారు. అడవి పందుల సమస్య పాలక్కాడ్, మలప్పురం, వాయనాడ్ వంటి జిల్లాల్లో ఎక్కువగా ఉంది. మేం అక్కడ 1,500కు పైగా పందులను చంపాం" అని అన్నారు.

ఆ తర్వాత ఈ విధానంలో కొన్ని మార్పులు చేశామని విజయ్ ఆనంద్ చెప్పారు. గ్రామ పంచాయతీ హెడ్‌ని గౌరవ అటవీ అధికారిగా, గ్రామ కార్యదర్శిని అనుమతులు మంజూరు చేసే అధికారిగా గుర్తిస్తూ, వ్యవస్థలో కొన్ని మార్పులు చేశామని విజయ్ ఆనంద్ తెలిపారు. అడవి పందుల బెడదపై గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.

"లైసెన్స్ ఉన్న రైఫిల్ షూటర్లు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నారు. వారు అడవి పందులను చంపుతారు. పందుల కళేబరాలను నాశనం చేసే బాధ్యత పంచాయతీలదే అయినప్పటికీ ఈ పనులు రైతులే చేస్తుంటారు"అని విజయ్ ఆనంద్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)