ఆంధ్రప్రదేశ్: ఇ-ట్రాఫిక్ చలాన్ పేరుతో మార్కెట్లోకి కొత్త మోసం

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
ఫొటో క్యాప్షన్, మొబైల్‌కు వచ్చే సందేశాలలోని అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయకూడదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

మీ ఫోన్‌కు ఒక సందేశం వస్తుంది. అది చూస్తే ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చినట్లు అర్థమవుతుంది. కంగారుపడి అందులోని లింక్‌ని ఓపెన్ చేసి, క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్‌లోని సొమ్ము ఖాళీ అయిపోతుంది.

ట్రాఫిక్ పోలీసులు నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేస్తే అకౌంట్లో డబ్బులు పోయాయంటూ మళ్లీ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లాల్సిన పరిస్థితి మీకు వస్తుంది.

సైబర్ క్రైమ్ మోసాల్లో ఇదో రకం. సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ట్రాఫిక్ చలాన్ల పేరుతో ఈ తరహా మోసానికి పాల్పడుతున్నారు. విశాఖలో ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదవుతూ ఉండటంతో అక్కడి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

అయితే, ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఈ విషయాలపై విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్‌లతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సైబర్ నేరాలు
ఫొటో క్యాప్షన్, సైబర్ మోసగాళ్లు పంపుతున్న మెసేజ్

ఎలాంటి సందేశాలు వస్తాయి?

''ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మీ వాహనానికి జరిమానా విధించాం. దీనికి సంబంధించిన ఇ-చలాన్ జనరేట్ అయింది. మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న దృశ్యాలు మా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ విషయంలో మా (ట్రాఫిక్ పోలీసులు) వైపు నుంచి ఏదైనా తప్పు జరిగి ఉంటుందని మీరు భావిస్తుంటే.. ఈ లింక్ ద్వారా NextGen mParivahan అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పరిశీలించుకోవచ్చు.''

ఇలాంటి సందేశాలు సెల్‌ఫోన్లకు పంపుతున్నారు సైబర్ మోసగాళ్లు.

పైగా ఇవి ట్రాఫిక్ పోలీసుల పేరుతో రావడంతో.. తెలియకుండా ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డామేమోనని బాధితులు అనుకుంటున్నారు.

ఒకసారి చెక్ చేద్దామని ఆ సందేశంతో పాటు వచ్చిన లింక్‌ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వారి బ్యాంకు అకౌంట్లోని డబ్బులు సైబర్ మోసగాళ్లు దోచేసేలా చేస్తోంది.

"ఈ తరహా సందేశాలలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ (APK) ఫైల్ ఉంటుంది. దీనిని క్లిక్ చేయగానే మన డివైజ్‌లోని సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఏ లింక్ అయినా కంగారు పడి ఓపెన్ చేయకుండా, అది పోలీసుల నుంచి వచ్చిందా? కాదా అనేది ధ్రువీకరించుకోవాలి" అని విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి బీబీసీతో చెప్పారు.

సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్‌
ఫొటో క్యాప్షన్, ఏదైనా సంస్థ నుంచి తప్పుడు మార్గాల్లో మన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సమాచారాన్ని సేకరిస్తారని సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ తెలిపారు.

ఈ మోసాలు ఎలా జరుగుతాయి?

కంబోడియాలో ఉద్యోగాలు, కాస్మటిక్స్ అమ్మకాలు, హోటల్స్ రేటింగ్, ఫెడెక్స్, టాస్క్ గేమ్స్.. ఇలా అనేక రకాల్లో సైబర్ మోసగాళ్లు ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇ-చలాన్ పేరుతో సరికొత్త మోసంతో వచ్చారని సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

వియత్నాం, చైనా, కంబోడియా వంటి దేశాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి ఇండియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో వీరిని పట్టుకోవడం కూడా కష్టమవుతోందన్నారు. ట్రాఫిక్ చలాన్ మోసాలపై సైబర్ క్రైమ్ స్టేషన్‌కు ప్రతిరోజూ ఫిర్యాదులు వస్తుంటాయని ఆయన చెప్పారు.

''ఏదైనా సంస్థ నుంచి తప్పుడు మార్గాల్లో మన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సమాచారాన్ని సేకరించి, ముందుగా మన వాట్సాప్ నంబరుకు ఒక నకిలీ ఇ-చలాన్ పంపుతారు. ఇది పోలీసులు పంపించే నిజమైన చలాన్లలాగే ఉంటుంది. ఆ చలాన్‌తో పాటు మరో సందేశం కూడా వస్తుంది.

అందులో పైన చెప్పినట్లు... 'మీరు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మీకు ఫైన్ విధిస్తూ చలాన్ పంపించాం. అనుమానముంటే NextGen mParivahan అనే యాప్ ద్వారా పరిశీలించుకోండి అని ఉంటుంది.''

ఇంకా ఆయన వివరిస్తూ, ''ఈ యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కింది లింక్ క్లిక్ చేయమంటూ ఏపీకే ఫైల్ ఇస్తారు. దానిపై క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్లు ఉపయోగించే మాల్‌వేర్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఆ మాల్‌వేర్ మన ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్‌లు, ఫోన్ కాల్స్‌కు డీఫాల్ట్ యాప్ అయ్యేందుకు అనుమతి కోరుతుంది.

ఒకవేళ అది ఓకే చేస్తే అప్పటి నుంచి మనకు వచ్చే ఓటీపీలు, సందేశాలు అన్నీ సైబర్ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దాంతో వారు మన బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను కాజేయడమే కాకుండా మన ఈ-కామర్స్ అకౌంట్లను కూడా హ్యక్ చేసి వెబ్‌సైట్లలోకి వెళ్లి గిప్ట్ కార్డులు కొనడం వంటివి చేస్తుంటారు. అలాగే, మన వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని తీసుకుంటారు'' అని ఇన్‌స్పెక్టర్ భవానీ ప్రసాద్ వివరించారు.

బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు

అలాంటి లింకులు వస్తే ఏం చేయాలి?

ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోవడానికి సీఐ భవానీ ప్రసాద్ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు.

  • ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే.. అది గూగుల్ ప్లే స్టోర్ వంటి నమ్మదగిన ఫ్లాట్ ఫాం నుంచే చేసుకోవాలి.
  • ఫోన్లకు వచ్చే ప్రతి లింక్‌ను క్లిక్ చేయకూడదు.
  • లింకులు వచ్చినప్పుడు ముందుగా అది మోసాలకు అవకాశం కల్పించే ఏపీకే ఫైలా కాదా అనేది చూసుకోవాలి.
  • ఏదైనా అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకునే ముందు దానికి సంబంధించిన సమాచారం చదవాలి.
  • అనవసరమైన అనుమతులు అడిగితే, దాన్ని ఇన్‌స్టాల్ చేయకూడదు.
  • లింకుల విషయంలో ఏదైనా అనుమానం ఉంటే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
  • బ్యాంకులు, ఇ-చలాన్లు, ఇతర సేవల పేరుతో ఏదైనా లింక్ రాగానే వాటిని వెంటనే ఓపెన్ చేసి క్లిక్ చేయాలనుకోకండి. అన్ని విషయాలూ పరిశీలించాకే.. ముందుకు వెళ్లండి.
సైబర్ నేరాలు, మాల్‌వేర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సైబర్ నేరగాళ్లు ఆఫర్లు, గిఫ్ట్‌కార్డులు, లాటరీ అంటూ రకరకాల ప్లాన్స్‌తో వస్తుంటారు.

ఏమిటీ APK ఫైల్స్?

ఏదైనా ఫోన్‌ను హ్యాక్ చేయాలంటే మాల్‌వేర్‌ను ఆ ఫోన్‌లో ప్రవేశపెట్టాలి.

ఇలా చేసేందుకు సైబర్ మోసగాళ్లు ఎంచుకునే మార్గమే ఏపీకే ఫైల్. ఈ ఫార్మాట్‌లో మాల్‌ వేర్‌ను పెట్టి మెసేజ్‌లు, మెయిల్స్ రూపంలో పంపుతారు.

దాంతో సైబర్‌ నేరగాళ్లు మన ఫోనులో ఉన్న సమాచారం, వీడియోలు, ఫొటోలు, బ్యాంకు ఖాతా వివరాలు, మెసేజ్‌లు, వాట్సాప్ ఇలా ప్రతి యాప్‌పై కంట్రోల్ సాధిస్తారు. ఆ తర్వాత ఆ సమాచారం వినియోగించి మన బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తారు.

కొందరు ఫోన్‌లోని సందేశాలు, ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు కూడా పాల్పడతారు.

గిప్టులు, కూపన్లు, బ్యాంకింగ్ సేవల పేరుతో..

సైబర్‌ నేరగాళ్లు తాము పంపిన ఏపీకే ఫైల్స్ ద్వారా యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా రకరకాలైన ప్లాన్స్‌తో వస్తుంటారు.

"వివిధ ఆఫర్లు, గిఫ్ట్‌కార్డులు, లాటరీ, ఈ కామర్స్‌ సైట్ల కూపన్లు అంటూ వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియాల్లో ఏపీకే లింక్‌లను పోస్ట్‌ చేస్తున్నారు. ఈ తరహా మోసాల గురించి అవగాహన లేని కొందరు లింకులు క్లిక్‌ చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. మరో పద్దతిలో బ్యాంకు సేవల పేరుతో లింకులు వస్తుంటాయి. అలాగే, పోస్టల్‌ శాఖ సేవలు పేరుతో కూడా.. అంటే మీకు పార్సిల్ వచ్చిందంటూ వివరాలు సేకరించి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్పి.. ఏపీకే ఫైల్స్ ద్వారా యాప్‌లను ఇన్‌స్టాల్ చేయిస్తుంటారు" అని సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ హెచ్చరిస్తున్నారు.

"ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసంతో వస్తున్నారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే సైబర్ నేరాలు, అవి జరుగుతున్న తీరుపై అవగాహన పెంచుకోవడం ఒక్కటే మార్గం" అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు.

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏపీకే ఫైల్స్ అన్నింటిలో మాల్‌వేర్ ఉండదు.

ఈ APK ఫైల్స్‌ను ఎలా గుర్తించాలి?

ఏపీకే ఫైల్ అంటే ఏదైనా యాప్‌ను ఉచితంగా ఇన్‌‌స్టాల్ చేసుకోవడానికి సహాయపడే ఆండ్రాయిడ్ ఫైల్ ప్యాకేజ్.

ఏపీకే ఫైల్స్ అన్నీ కూడా మాల్‌వేర్‌ను కలిగి ఉండవు. కాకపోతే ఏదైనా మాల్‌వేర్‌ను మన ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసేందుకు ఏపీకే ఫైల్స్ రూపంలో పంపుతారు.

ఈ ఫైల్స్ లింక్ చివరన .apk అని ఉంటుంది. ఇవి నమ్మదిగిన సోర్స్ (గూగుల్ ప్లే స్టోర్) నుంచి అయితే తీసుకోవచ్చు. లేకుంటే వీటిలో మాల్‌వేర్‌ ఉండే అవకాశం ఉంది.

ఇవి డౌన్‌లోడ్ చేసుకునే ముందు వీటిలో మాల్‌వేర్‌ ఉండే అవకాశం ఉందని కూడా చూపిస్తాయి. అటువంటి సమయంలో జాగ్రత్త వహించాలి. అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చేయకూడదు.

ఎప్పుడు అనుమానించాలంటే...

  • మాల్‌వేర్ కలిగిన ఏపీకే ఫైల్స్ మన ఫోన్‌లోని కాంటాక్ట్స్, లొకేషన్లు, మైక్రోఫోన్‌లతో పాటు అనేక ఇతర అనవసరపు పర్మిషన్లు అడుగుతాయి.
  • ఈ యాప్ సైజ్ ఆధారంగా కూడా గుర్తించవచ్చు. యాప్‌లు ఉండే సాధారణ సైజు కంటే బాగా ఎక్కువగానో, తక్కువగానో ఉంటాయి.
  • మాల్‌వేర్ కలిగిన ఏపీకే ఫైల్‌ను తయారు చేసిన డెవలపర్ సమాచారం చూస్తే.. కచ్చితంగా అవి నెగెటివ్ రివ్యూలను కలిగి ఉంటాయి.
  • మాల్‌వేర్ ఫైల్స్‌ను పరిమితంగానే పంపుతారు. కాబట్టి వీటి డౌన్‌లోడ్స్ నంబర్ కూడా తక్కువగానే ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)