అమెరికా: వైట్‌హౌస్ వద్ద సాయుధుడిపై సీక్రెట్ సర్వీస్ అధికారుల కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెలుపల ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘర్షణలో తుపాకీ బయటకు తీసిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపినట్టు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఒకరు ఇండియానా నుంచి వాషింగ్టన్‌డీసీకి ప్రయాణిస్తున్నట్టుగా స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందుకున్న సీక్రెట్ సర్వీసు అధికారులు, ఆ సమాచారంతో సరిపోలిన వ్యక్తి వద్దకు వెళ్లారు.
అయితే అతను తుపాకీ తీయడంతో సర్వీస్ అధికారులు అతనిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

ఘర్షణ జరిగిన సమయంలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో లేరు. ఆయన వారాంతాన్ని ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో నివాసంలో గడుపుతున్నారు.
''అధికారులు గుర్తుతెలియని వ్యక్తిని సమీపించగానే అతను తుపాకీ బయటకు తీశాడు. ఈ ఘర్షణలో మా అధికారులు కాల్పులు జరిపారు'' అని సీక్రెట్ సర్వీస్ తన ప్రకటనలో తెలిపింది.
ఈ సంఘటనపై వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














