చాంపియన్స్ ట్రోఫీ: పాతికేళ్ల వేదన ఈసారైనా తీరేనా, ఆ రోజు గంగూలీ సెంచరీ చేసినా..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చరిత్ర పునరావృతం అవుతుందని చెబుతుంటారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో మరోసారి పాతికేళ్ల నాటి చరిత్ర మనముందుకొచ్చింది.
25 ఏళ్ల కిందట, 2000వ సంవత్సరం అక్టోబర్ 15న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నైరోబీలోని జింఖానా క్లబ్ మైదానంలో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్- న్యూజీలాండ్ తలపడ్డాయి.
ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌పై న్యూజీలాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
పాతికేళ్ల తర్వాత మళ్లీ, ఇప్పుడు దుబయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు జట్లు మరోసారి ఇదే ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం ఏదైనా చరిత్ర సృష్టించినట్లే.


ఫొటో సోర్స్, Getty Images
25 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
పాతికేళ్ల క్రితం భారత జట్టు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, తుది జట్టులో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత కూడా టీమ్ ఇండియా ఫైనల్స్‌కు చేరుకుంది.
అప్పటి వరకూ కోచ్‌గా ఉన్న కపిల్ దేవ్, కెప్టెన్‌గా తెందూల్కర్ తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. భారత జట్టు కోచ్‌గా న్యూజీలాండ్ క్రికెటర్ జాన్‌రైట్, కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ ఉన్నారు. వాళ్లిద్దరికీ చాంపియన్స్ ట్రోఫీ మొట్టమొదటి పరీక్ష పెట్టింది.
ఆ పరీక్షలో గంగూలీ తాను సమర్థుడినైన కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. చాంపియన్స్ ట్రోపీ సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ 142 బంతుల్లో 11 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు బాది 141 పరుగులు చేశాడు.
ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన గంగూలీ చివరి వరకు క్రీజులోనే ఉండి భారత జట్టు స్కోరును 295 పరుగులకు చేర్చాడు. ఈ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు చతికిలపడింది.

ఫొటో సోర్స్, Getty Images
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
న్యూజీలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సచిన్, సౌరవ్ జోడీ జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది. 27 ఓవర్లు పూర్తయ్యేప్పటికి జట్టు స్కోరును 141 పరుగులకు చేర్చారు.
సచిన్ 83 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. సచిన్ ఈ మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. అప్పట్లో సచిన్ ఫామ్ చూస్తుంటే, అతనిని ఎవరైనా ఔట్ చేయగలరా అన్నట్లుగా కనిపించింది.
వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు చాలా పేలవంగా పరుగులు తీస్తాడని, కెరీర్ పొడవునా అపవాదు ఎదుర్కొన్న గంగూలీ ఫైనల్స్‌లో చాలా జాగ్రత్తగా ఆడాడు. ఫైనల్‌లో కూడా సెంచరీ చేశాడు.130 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 117 పరుగులు చేశాడు.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు.
దుబయిలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు, భారత జట్టు ఇప్పటివరకు 11 సార్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో తీవ్రమైన ఒత్తిడి మధ్య సెంచరీ సాధించడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా చాలా కష్టం. గంగూలీ అలాంటి కష్టమైన ఫీట్ సాధించాడు.
గంగూలీ తర్వాత ఐసీసీ టోర్నీ ఫైనల్‌లో ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ కొట్టలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్రిస్ కెయిర్న్స్
ఫైనల్‌లో గంగూలీ సెంచరీ చేసినా భారత్ మ్యాచ్ గెలవలేదు. సచిన్, సౌరవ్ జోడీ మంచి భాగస్వామ్యాన్ని అందించినా, తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. యువరాజ్ సింగ్, వినోద్ కాంబ్లీ, రాబిన్ సింగ్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
దీంతో భారత్ 50 ఓవర్లలో 264 పరుగులు మాత్రమే చేయగలిగింది.
264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన న్యూజీలాండ్ మొదట్లోనే రెండు వికెట్లు పోగొట్టుకుంది. వెంకటేశ్ ప్రసాద్ రెండు వికెట్లు తీసి.. భారత జట్టులో ఆశలు రేపాడు.
ఒక దశలో భారత్ తేలిగ్గా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. న్యూజీలాండ్ 132 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి న్యూజీలాండ్‌కు ట్రోఫీని అందించాడు.
క్రిస్ కెయిర్న్స్‌కు మరో ఆల్ రౌండర్ క్రిస్ హారిస్ జత కలవడంతో ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరో వికెట్‌కు122 పరుగులు జోడించి జట్టుని విజయ పథంలోకి నడిపారు.
క్రిస్ హారిస్ 72 బంతుల్లో నాలుగు ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటైనా, కివీస్ పటిష్టంగా ఉంది. చివర్లో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే క్రిస్ కెయిర్న్స్ న్యూజీలాండ్‌ను గెలిపించాడు.
కెయిర్న్స్ 113 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ వేడుకల్లో మాట్లాడిన కెయిర్న్స్ "ఇది మరుపురాని క్షణం. నేను కొన్ని సంవత్సరాలుగా ఆడుతున్నాను. కానీ, ఇలాంటి అనుభూతి ఇంతకు ముందెన్నడూ లేదు. గెలవడం గురించి మర్చిపోండి, మా జట్టు ఇప్పటివరకు ఏ ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. అందుకే ఇది అత్యుత్తమం" అన్నాడు.
మ్యాచ్‌కు ముందు మోకాలి నొప్పితో బాధ పడిన క్రిస్ కెయిర్న్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుని మ్యాచ్ ఆడినట్లు తర్వాత కథనాలు వచ్చాయి.
కివీస్ తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడే తుది జట్టు కోసం జట్టు సభ్యులంతా సమావేశమైనప్పుడు కెయిర్న్స్ ప్లేస్‌లో వేరే ఆటగాడి పేరును ఖరారు చేశారు.
అయితే, టీమ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కెయిర్న్స్ మీద నమ్మకం ఉంచాడు. ఫ్లెమింగ్ నమ్మకం నూటికి నూరు శాతం కరెక్టని కెయిర్న్స్ నిరూపించాడు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ గురించి తన పుస్తకంలో రాసుకున్న గంగూలీ
ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత గంగూలీ జట్టు సభ్యుల మీద అసహనం వ్యక్తం చేశాడు. శుభారంభాన్ని పెద్ద స్కోరుగా మలచడంలో మిడిలార్డర్ విఫలమైందని అన్నాడు.
మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లలో ఒకరిద్దరు నిలదొక్కుకున్నా భారత్ తేలిగ్గా 300 పరుగులు దాటేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత గంగూలీ తన కెరీర్‌లోని ఒడిదొడుకులపై గౌతమ్ భట్టాచార్యతో కలిసి 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్' అనే పుస్తకం రాశాడు.
ఈ పుస్తకంలో కివీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. "టోర్నీలో మాకు గొప్ప ప్రారంభం ఉంది. ఆస్ట్రేలియాపై విజయంతో మా ప్రయాణం మొదలైంది. అయితే, మేం ఫైనల్‌లో ఓడిపోయాం. ఇది మేం గెలవవలసిన మ్యాచ్" అని అందులో రాశాడు.
ఈ టోర్నమెంట్ ద్వారా యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం గురించి కూడా గంగూలీ తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఫైనల్‌లో ఓడిపోయినా, టోర్నీలో భారత్ సాధించిన విజయాలతో జట్టు ఫిక్సింగ్ ఆరోపణల నుంచి తేరుకుంది.
సెమీస్, ఫైనల్‌లో గంగూలీ చేసిన సెంచరీలు ఆనాటి మ్యాచ్ చూసిన వారి స్మృతి పథం నుంచి దూరమై ఉండవచ్చు. ఇప్పటి యువతరం ప్రత్యక్షంగా చూసి ఉండకపోవచ్చు. కానీ, ఆ రెండు మ్యాచ్‌లలో గంగూలీ బ్యాటింగ్ ఎవరికైనా కావాల్సినంత ఆత్మ విశ్వాసాన్ని అందిస్తుంది.
ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటే చెప్పడం కష్టం కావొచ్చు కానీ, గెలిచిన జట్టులో నాడు గంగూలీలో కనిపించిన ఆత్మ విశ్వాసాన్ని నేటి యువతరం చూడవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














