సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఎలా ఉన్నాడు?

భాస్కర్ కుటుంబం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కుటుంబసభ్యులను గుర్తు పట్టలేడు.. ఎదుటి వ్యక్తి మాటలు అర్థం చేసుకోలేడు.. అచేతనంగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ ను సికింద్రాబాద్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రి విడుదల చేసింది.

దాదాపు మూడున్నర నెలలుగా శ్రీతేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రూల్ సినిమా విడుదల సందర్భంగా డిసెంబరు 4వ తేదీ రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది.

అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో.. సినిమా చూసేందుకు వచ్చిన దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ అనే వ్యక్తి భార్య రేవతి చనిపోయారు. కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో అప్పట్నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డాక్టర్లు ఏం చెబుతున్నారు?

నెలలు గడిచినా బాలుడు ఇంకా కోలుకోలేదని చెబుతున్నారు వైద్యులు.

గతంతో పోల్చితే కొంత నిలకడగా ఉన్నప్పటికీ, నాడీ సంబంధిత సమస్యలతో శ్రీతేజ్ ఇబ్బంది పడుతున్నట్లుగా అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు చేతన్ ఆర్.ముందాడ, విష్ణు తేజ్ పూడి చెప్పారు.

''నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో స్పర్శ తెలియడం లేదు. కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్నాడు. మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడు.'' అని డాక్టర్లు చెప్పారు.

ఆసుపత్రిలో చేరినప్పుడు వెంటిలేటర్ పై చికిత్స అందించగా.. ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండా శ్రీతేజ్ శ్వాస తీసుకోగలుగుతున్నాడని వైద్యులు చెబుతున్నారు.

గత నెల రోజులలో ఒకట్రెండు రోజులపాటు మాత్రమే వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించారు. పది రోజుల కిందట ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టోమీ చేసి నేరుగా పొట్టలోకి ట్యూబ్ అమర్చి అవసరమైన ఆహారాన్ని పంపిస్తున్నామని వైద్యులు చెప్పారు.

''శరీర పైభాగం కదలికలు ఇప్పటికీ కష్టంగానే ఉన్నాయి. ఫిజియోథెరపీ కొనసాగుతోంది'' అని వైద్యులు చేతన్, విష్ణుతేజ్ చెప్పారు.

గ్యాస్ట్రోస్టోమీ ద్వారా అందిస్తున్న ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారని వివరించారు.

కుమారుడి ఆరోగ్య విషయంపై శ్రీతేజ్ తండ్రి భాస్కర్ బీబీసీతో మాట్లాడారు. ''శ్రీతేజ్ ఇంకా మమ్మల్ని గుర్తు పట్టలేకపోతున్నాడు. మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. చికిత్స కొనసాగుతోంది.'' అని చెప్పారు.

చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులు అల్లు అర్జున్ టీం తరఫున భరిస్తున్నారని వివరించారు.

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 4, 2025వ తేదీ రాత్రి అల్లు అర్జున్ సంథ్య థియేటర్ వద్దకు వచ్చారు

అసలేం జరిగిందంటే..

నిరుడు డిసెంబర్ 5న 'పుష్ప 2:ది రూల్'సినిమా విడుదలైంది. దీనికి ఒకరోజు ముందు అంటే డిసెంబరు 4వ తేదీన ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు.

సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్, ఆయన భార్య రేవతి (35), కుమారుడు శ్రీతేజ (9), కుమార్తె శాన్వికతో కలిసి అక్కడికి వచ్చారు.

అదే సమయంలో నటుడు అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోగా, శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనలో 18 మందిపై చిక్కడపల్లి పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది. కేసులో అల్లు అర్జున్ ఎ11గా ఉన్నారు.

దీనిపై డిసెంబరు 13న అల్లు అర్జున్ ను అరెస్టు చేయగా.. బెయిలుపై బయటకు వచ్చారు.

అప్పట్లో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనం రేపింది.

ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు,దర్శకుడు సుకుమార్, పుష్ప సినిమా నిర్మాతలు సహా సినీ ప్రముఖులు పరామర్శించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి రూ.25లక్షలు సాయం అందించారు.

డిసెంబరు 25న శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, దర్శకుడు సుకుమార్, పుష్ప నిర్మాతలు తరఫున చెరో రూ.50లక్షల చొప్పున సాయం చేస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు.

''రూ.2కోట్ల సాయం అందించారు. పిల్లల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. చికిత్స కోసం విదేశాలకు తీసుకెళతారనే ప్రచారం నిజం కాదు. ప్రస్తుతం అవసరమైన వైద్యం ఇక్కడే అందిస్తున్నారు.'' అని బీబీసీతో చెప్పారు భాస్కర్.

మరోవైపు, గాయపడిన బాలుడు శ్రీతేజ్ అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)