చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

ఫొటో సోర్స్, Getty Images
చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ఆయన్ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అరెస్టు చేశారు.
తొలుత నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, ఆ తీర్పు పత్రాలు జైలు అధికారులకు రాత్రి ఆలస్యంగా అందాయి. దాంతో, ఆయన రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది.
చంచల్‌గూడ జైలులోని మంజీరా బ్యారక్‌లో అల్లు అర్జున్‌ను ఉంచారు. ఉదయం ఆయన్ను విడుదల చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
అల్లు అర్జున్‌పై కేసు ఎందుకు పెట్టారు?
డిసెంబర్ 5న 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలైంది. ఒకరోజు ముందు అంటే డిసెంబరు 4న ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి (35), కుమారుడు శ్రీతేజ (9), కుమార్తె శాన్వికతో కలిసి అక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు. థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట, తోపులాట కారణంగా రేవతి, శ్రీతేజకు ఊపిరి ఆడలేదని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనలో రేవతి చనిపోగా, శ్రీతేజ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీనిపై చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీన 376/2024 కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ1గా సంధ్య 70ఎంఎం థియేటర్ యాజమాన్యం, సిబ్బందితో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు.
రిమాండ్ రిపోర్టులో అల్లు అర్జున్‌ను ఎ11గా పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్చార్జిని అరెస్టు చేయగా, డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు.
ఈ కేసులో మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:
‘‘సంధ్య థియేటర్ యజమానులు ఎ.రాంరెడ్డి( పెద్దరాంరెడ్డి), ఎ.రాంరెడ్డి, ఎ.సందీప్, ఎ.సుమిత్, ఎ.వినయ్ కుమార్, ఎ.అశుతోష్ రెడ్డి, ఎం.రేణుకా దేవి, ఎ.అరుణరెడ్డి, థియేటర్ మేనేజర్ ఎం.నాగరాజు లోయర్ బాల్కనీ ఇన్చార్జి విజయ చందర్, సినీ నటుడు అల్లు అర్జున్, అల్లు అర్జున్ మేనేజర్ జేబి.సంతోష్ కుమార్, శరత్ బన్నీ, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది రమేష్, రాజు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు టీ.వినయ్ కుమార్, మహమ్మద్ పర్వేజ్, మైత్రిమూవీస్, పుష్ప 2 నిర్మాతలు, ఇతరులు’’ అని పోలీసులు పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














