ఉత్తర సముద్రంలో ఢీకొన్న రెండు భారీ నౌకలు, ఎగసిపడిన మంటలు

ఆయిల్ ట్యాంకర్ అమెరికాకు చెందిన స్టెనా, కంటైనర్ షిప్ పోర్చుగీసుకు చెందిన సోలాంగ్.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, అమెరికాకు చెందిన 'స్టెనా' ఆయిల్ ట్యాంకర్, పోర్చుగీసుకు చెందిన కంటైనర్ షిప్ సోలాంగ్ ఢీకొన్నాయి.
    • రచయిత, కెవిన్ షూస్మిత్, స్టువర్ట్ హారాట్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇంగ్లండ్‌లోని తూర్పు యార్క్‌షైర్ తీరంలో రెండు భారీ నౌకలు ఢీకొన్నాయి. ఉత్తర సముద్రంలో జరిగిన ఆ ప్రమాదంలో ఒకటి ఆయిల్ ట్యాంకర్ కాగా, మరొకటి కార్గో నౌక. రెండు నౌకలూ మంటల్లో చిక్కుకున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.

జెట్ ఇంధనం ఉత్తర సముద్రంలోకి కారుతోందని ట్యాంకర్ యజమాని చెప్పారు.

షిప్ ట్రాకింగ్ సైట్ 'మెరైన్ ట్రాఫిక్' డేటా ప్రకారం, అమెరికాకు చెందిన ఎంవీ 'స్టెనా' ఆయిల్ ట్యాంకర్, పోర్చుగీసుకు చెందిన కంటైనర్ షిప్ సోలాంగ్ ఢీకొన్నాయి.

హంబర్ నదీముఖద్వారం సమీపంలో ఈ సంఘటన జరిగిందని, సోమవారం (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:18 గంటల సమయంలో) సాయం కోసం అలారం మోగిందని యూకే హెచ్ఎం కోస్ట్‌గార్డ్ తెలిపింది.

అనంతరం లైఫ్ బోట్లు, ఒక కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్‌ను సంఘటనా స్థలానికి పంపామని తెలిపారు.

ఇప్పటివరకు, ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 37 మందిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే, కొంతమంది సిబ్బంది ఇంకా కనిపించడం లేదని గ్రిమ్స్‌బీ ఈస్ట్ పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బోయర్స్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నౌకలు ఢీ

ఫొటో సోర్స్, PA Media

స్టెనా బల్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ హానెల్‌తో బీబీసీ మాట్లాడింది. స్టెనా నౌక సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఆయన ధ్రువీకరించారు.

"నౌకలు ఢీకొన్న వెంటనే అందులోని కొందరు తప్పించుకున్నారు. రెండు నౌకలలో మంటలు చెలరేగాయి. ఘటనా ప్రదేశానికి రెస్క్యూ బృందాలు చేరుకుంటున్నాయి" అని రాయల్ నేషనల్ లైఫ్‌బోట్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్ఎన్ఎల్ఐ) ఏజెన్సీ వెల్లడించింది.

కాగా, క్షతగాత్రుల పరిస్థితి అస్పష్టంగానే ఉంది.

ఉత్తర సముద్రంలో భారీ ఆపరేషన్ జరుగుతోందని హల్ సిటీ కౌన్సిల్ నాయకుడు మైక్ రాస్ అన్నారు. ఘటన వినాశకరమైనదిగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

బీబీసీతో రాస్ మాట్లాడుతూ, ఘటన గురించి ఆందోళన చెందుతున్న పలువురు తనను సంప్రదించారని తెలిపారు. ఇది "భయంకరమైన సంఘటన" అని రాస్ వివరించారు.

షిప్

ఫొటో సోర్స్, Submitted

ఏం జరిగింది?

షిప్ ట్రాకింగ్ సైట్ మెరైన్ ట్రాఫిక్ నుంచి అందిన డేటా ప్రకారం, నౌకలు ఢీకొనే సమయంలో ఒక నౌక కదులుతుండగా, మరొకటి ఆగి ఉంది.

సోలాంగ్ నౌక ఉత్తరం నుంచి 16 నాట్ల వేగంతో వస్తోంది. స్కాట్లండ్ ఓడరేవు గ్రాంజ్‌మౌత్ నుంచి నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌కు ఈ కార్గో ఓడ ప్రయాణిస్తోంది.

గ్రీకు ఓడరేవు అగియోయ్ థియోడోరోయ్ నుంచి స్టెనా నౌక వస్తోంది. ఇది 0.1 నాట్ల వేగంతో వెళుతోంది. కాగా, ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదం నేపథ్యంలో గ్రిమ్స్‌బైకి ఒక బృందాన్ని పంపించినట్లు మెరైన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

''ఈ ఉదయం ఉత్తర సముద్రంలో ఢీకొన్న పోర్చుగీస్ రిజిస్టర్డ్ కంటైనర్ షిప్ సోలాంగ్, యూఎస్ రిజిస్టర్డ్ ఆయిల్ ట్యాంకర్ స్టెనా ఇమ్మాక్యులేట్ ఢీకొన్న తర్వాత మెరైన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ గ్రిమ్స్‌బైకి ఒక బృందాన్ని పంపించింది'' అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)