బయేసియన్ నౌక మునక: చివరి 16 నిమిషాల్లో ఏం జరిగింది, ప్రమాదంపై అనుమానాలేంటి?

సిసిలీ, బయేసియన్, మైక్ లించ్, బ్రిటన్

ఫొటో సోర్స్, Mateo Brenninkmeijer

    • రచయిత, మార్క్ లోవెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత ఆదివారం అర్థరాత్రి వరకు పోర్టిసెల్లోలో సముద్రాన్ని చూస్తూ తీరంలో ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉన్నారు మేట్టియో కాన్నియా. ఆ రాత్రి చాలా వేడిగా ఉంది.

“నాకు మెరుపు, గాలి శబ్దం వినిపించింది. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నా” అని ఆయన చెప్పారు. పదేళ్ల వయసు నుంచి చేపలు పడుతున్న 78 ఏళ్ల మేట్టియో చాలా కాలం నుంచి రుతుపవనాల రాకకు ముందు వచ్చే మెరుపుల్ని చూస్తున్నారు.

“తుపాను తీవ్రత పెరగడంతో, అందరూ నిద్ర లేచారు. నా స్నేహితుడి ఇంట్లోకి నీళ్లు వచ్చాయి” అని ఆయన చెప్పారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.15 గంటలకు మత్స్యకారుడు ఫేబియో సెఫల్ ఆ రోజు కూడా చేపలు పట్టేందుకు వెళ్లాలని అనుకున్నారు. అయితే బయటికొచ్చి వాతావరణాన్ని చూసి ఆగిపోయారు. ఆయన సముద్రంవైపు చూస్తుండగా అక్కడ ఒక పెద్ద మంట కనిపించింది.

సముద్రంలో ఏదో జరిగిందని అర్ధం కావడంతో చూసేందుకు అటు వెళ్లారు సెఫల్. కొన్ని చెక్కముక్కలు, సోఫాల మీద వాడే కుషన్లు తేలుతూ కనిపించాయి.

అక్కడకు కొన్ని వందల మీటర్ల దూరంలో లంగరు వేసి ఉన్న విలాసవంతమైన నౌక అప్పటికే మునిగిపోయింది.

ఆ విపత్తు, విధ్వంసం, గందరగోళం అంతా కేవలం 16 నిముషాల్లో జరిగింది. సిసిలీలోని ఒక ఫిషింగ్ పోర్టులో జరిగిన ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా పత్రికలు, ప్రసార సాధనాల పతాక శీర్షికల్లో నిలిచింది.

బయేసియన్‌ అనే ఆ విలాస నౌక (యాట్) మునుగుతుండగా అందులో ఉన్న 22 మందిలో ఏడుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

చార్లెంట్ గొలున్‌స్కీ అనే బ్రిటిష్ మహిళ తాను నీటిలో పడిపోయిన తర్వాత శక్తినంతా కూడదీసుకుని కూతురు మునిగిపోకుండా కాపాడుకోగలిగారు.

“నా చుట్టూ అంతా చీకటిగా ఉంది. ఆ సమయంలో నాకు వినిపించిందల్లా వారి అరుపులు మాత్రమే” అని ఆమె చెప్పారు.

ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన వారిలో ఆమె, ఆమె భర్త, కుమార్తె ఉన్నారు. వారిని స్థానికంగా ఉన్న ఒక పడవలో ఒడ్డుకు తీసుకువచ్చారు. బయేసియన్ యాట్‌లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నవారిలో ఆమె సహచరుడు, ‘బ్రిటన్ బిల్‌గేట్స్‌’గా గుర్తింపు పొందిన బ్రిటన్ టాప్ టెక్ పారిశ్రామికవేత్త మైక్ లించ్ కూడా ఉన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మైక్ లించ్, సిసిలీ, నౌక ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పడవ ప్రమాదంలో మరణించిన మైక్ లించ్, ఆయన కూతురు హన్నా లించ్

విషాదంగా మారిన విలాసం

లించ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులతో కలిసి ఈ యాట్‌లో విహారానికి వచ్చారు. 56 మీటర్ల పొడవున్న ఈ నౌక డిజైన్ అవార్డు గెలుచుకుంది. దీనికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన అల్యూమినియం ఇరుసు ఉంది.

మైక్ లించ్ 2011లో తన సంస్థ ‘అటానమీ’ని హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్‌పీ)కు అమ్మారు. అయితే అంతకు ముందు కంపెనీ విలువను మోసపూరిత పద్ధతిలో పెంచి చూపించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో విచారణ జరిగింది. 2024 జూన్‌లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు.

ప్రజల దృష్టిలో తాను నిర్దోషిగా బయటపడటంతో దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆయన ఈ ట్రిప్‌ను ప్లాన్ చేశారు.

పడవ మునిగిపోయిన 3 రోజుల తర్వాత పడవ శిథిలాల నుంచి ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు.

లించ్ మృత దేహం దొరికిన తర్వాతి రోజు, ఆయన 18 ఏళ్ల కుమార్తె హన్నా మృతదేహం కూడా లభించింది. సెప్టెంబర్‌ నుంచి ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌‌కు చదువుకునేందుకు వెళ్లాల్సి ఉంది.

వీరు కాక చనిపోయిన వారిలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ప్రెసిడెంట్ జోనాథన్ బ్లూమర్, ఆయన భార్య జూడి, లించ్ న్యాయవాది క్రిస్ మోర్‌విల్లో ఆయన భార్య నెడా, పడవ షెఫ్ రికాల్డ్ థామస్ ఉన్నారు. లించ్ భార్య ఏంజెలా బకారెస్ ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ సంఘటనతో “మేమంతా షాక్‌లో ఉన్నాం. ఇది మాటల్లో చెప్పలేని విషాదం” అని లించ్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది.

తుపాను కారణంగా సూపర్ యాట్ వేగంగా మునిగిపోగా, దానిపక్కనే ఉన్న చిన్న పడవలకు ఎలాంటి నష్టం జరక్కపోవడం నిపుణుల్ని నిశ్చేష్టుల్ని చేసింది.

ఇందులో ఏదైనా నేర పూరిత కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ప్రాసిక్యూటర్లు తెలిపారు.

దర్యాప్తు ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉందని, ప్రత్యేకంగా ఇందులో ఎవరినీ ప్రశ్నించలేదని ఈ ప్రాంతపు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఏంబ్రోజియో కార్టోసియో మీడియాతో చెప్పారు.

“నేరం జరగడానికి అనేక సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. అది కెప్టెన్ కావచ్చు, లేదా పడవ సిబ్బంది కావచ్చు. మేము దేన్నీ కొట్టి పారేయడం లేదు.’’ అని కార్టోసియో అన్నారు.

బ్రిటన్ నుంచి ఒక మెరైన్ దర్యాప్తు బృందాన్ని ఇటలీలోని దర్యాప్తు బృందానికి తోడుగా సిసిలీకి పంపారు.

డౌన్ బరస్ట్ వల్ల పడవకు ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు. తుపాను సమయంలో ఉరుములు, మెరుపులు, అనూహ్యంగా వీచే బలమైన గాలులు రావడాన్ని డౌన్ బరస్ట్ అంటారు.

ప్రమాదానికి సంబంధించి అంతకు ముందు విడుదలైన రిపోర్టులకు ఈ వాదన భిన్నంగా ఉంది. జలధారలు(వాటర్ స్ప్రౌట్) లేదా, మినీ టోర్నడో వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అంతకు ముందు చెప్పారు.

నౌక శిధిలాలు, సిసిలీ, ఇటలీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, నౌక శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసిన ఇటలీ అధికారులు

అత్యంత కీలకమైన ఆ 16 నిముషాలు

ప్రస్తుతం దర్యాప్తు బృందం దృష్టంతా న్యూజీలాండ్‌కు చెందిన కెప్టెన్ జేమ్స్ కట్‌ఫీల్డ్ ప్రవర్తన మీద ఉంది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు నౌకకు చెందిన 8 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని దర్యాప్తు బృందాలు ప్రశ్నిస్తున్నాయి.

“అది రావడాన్ని మేము గుర్తించలేదు” అని తుపాను గురించి ఆయన ఇటాలియన్ మీడియాకు చెప్పారు. ఈ ఘటనపై ఆయన నుంచి వచ్చిన తొలి బహిరంగ స్పందన ఇదే.

అసలు సమస్య ఏంటంటే: మిగిలిన వాళ్లందరికీ ఈ వాతావరణ పరిస్థితుల గురించి తెలుసు. కొన్ని రోజులుగా వేడి పరిస్థితుల తర్వాత భయంకరమైన గాలులు వీస్తాయని, వర్షాలు కురుస్తాయని చెప్పారు. బయేసియన్ పడవ నిర్మించిన సంస్థ యజమాని గియోవన్ని కొస్టాంటినో కూడా పడవలో కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చని బీబీసీతో చెప్పారు.

“పడవ వెనుక ఉండే హ్యాచ్‌ను ఓపెన్‌గా వదిలేయాలి. బహుశా పక్కనే ఉన్న ద్వారం గుండా నీళ్లు లోపలకు వచ్చి ఉండవచ్చు.” అని ఆయన చెప్పారు.

“తుపానుకు ముందు, కెప్టెన్ అన్ని ద్వారాలను మూసివేయాలి. యాంకర్‌ను పైకి లేపాలి. ఇంజన్ ఆన్ చేసి గాలికి ఎదురుగా షిప్‌ను నిలబెట్టి, కీల్ ఎత్తును తగ్గించి ఉంచాలి.” అని ఆయన చెప్పారు.

కీల్ అంటే పడవలో పెద్ద రెక్క లాంటి ముందు భాగం. అది పడవ కిందనుంచి పై వరకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటుంది.

ఇటలీ, సిసిలీ పోర్టి సెల్లో, బయేసియన్

“అలా చేస్తే నౌక స్థిరంగా ఉంటుంది. అప్పుడు వాళ్లు తుపానును తేలిగ్గా తప్పించుకోగలరు. తమ పడవను సౌకర్యవంతంగా ముందుకు నడపగలరు.” అని కొస్టాంటినో చెప్పారు.

బయేసియన్ శకలాలను సహాయ బృందాలు నీటికి 50 మీటర్ల లోతులో గుర్తించారు. అప్పుడు పది మీటర్ల పొడవున్న కీల్ పైకి లేచి ఉండటాన్ని గమనించారు.

కీల్‌ను సరిగ్గా మోహరించి ఉంటే, బయేసియన్ 75 మీటర్ల పొడవైన మాస్ట్‌ నౌకను స్థిరంగా ఉంచడానికి సహాయపడి ఉండేది. గాలిని ఎదుర్కోవడానికి వీలయ్యేది. అలా చేయకపోతే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా పడవ మునిగిపోతుందని ఇటలీ వార్తా పత్రిక లా రిపబ్లికాతో నిపుణులు చెప్పారు. సోమవారం వచ్చిన గాలులు వంద కిలోమీటర్ల కంటే చాలా ఎక్కువ వేగంతో వీచాయి.

“స్థిరత్వం, పెర్ఫార్మెన్స్‌లో ఇతర పడవలకు బయే‌సియన్‌ మార్గదర్శి. కచ్చితంగా దానిలో ఎలాంటి సమస్య లేదు. నీళ్లు అందులోకి వెళ్లకపోతే అది మునిగిపోయే అవకాశమే లేదు.” అని కొస్టాంటినో చెప్పారు.

ఆ 16 నిముషాల వ్యవధిలోనే అంటే తెల్లవారు జామున 3.56 గం.లకు కరెంట్ సరఫరా నిలిచిపోవడం, నీళ్లు లోపలకు రావడం, అవి ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లలోకి చేరడం, జీపీఎస్ సిగ్నల్స్ పోవడం చూస్తే ఆ క్షణంలోనే పడవ మునిగిపోయినట్లు అర్థం చేసుకోవచ్చని కొస్టాంటినో బీబీసీకి చెప్పారు.

ఆ సమయంలో, వాతావరణం వల్ల ఏర్పడిన పరిస్థితుల్ని తట్టుకునేందుకు ఏదైనా చేశారా అనే దాని గురించి నౌకకు సంబంధించిన బ్లాక్‌బాక్స్ దొరికితే ఇన్వెస్టిగేటర్లు తేల్చే అవకాశం ఉంది.

సిసిలీ ఇటలీ పోర్టిసెల్లో

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, పోర్టిసెల్లోలో నిశ్శబ్ద వాతావరణం

స్పష్టత కోసం వెదుకులాట

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పడవ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయి ఉండవచ్చని సిసిలీలో షిప్ సర్వేయర్లలో ప్రముఖుడైన రినొ కసిలి చెప్పారు.

“తుపాను హెచ్చరిక జారీ చేసినప్పుడు సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు రాత్రంతా కాపలా ఉండాలి.” అని ఆయన చెప్పారు. ఆ పడవ బయేసియన్ సైజులో మూడింట ఒకవంతు మాత్రమే ఉంది. నౌకల్ని సముద్రంలో కాకుండా హార్బర్‌లో ఉంచి లంగరు వేయాలని కూడా అన్నారు.

ఆ రోజు రాత్రి సముద్రంలో వాతావరణ పరిస్థితుల్ని గమనించేందుకు కాక్‌పిట్ నుంచి ఒక వ్యక్తి మాత్రమే కాపలా కాసినట్లు భావిస్తున్నామని ప్రాసిక్యూటర్లు చెప్పారు.

బయేసియన్ మునిగిపోయిన ప్రాంతానికి వెళ్లేందుకు చాలా అరుదుగా లభించే అనుమతి నాకు లభించింది. రినో కసిలి నడుపుతున్న పడవ ఎక్కి నేను అక్కడకు వెళ్లాను. మా చుట్టూ ఓ ఇటాలియన్ పోలీస్ నౌక తిరుగుతోంది. మమ్మల్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరించింది. అంతలోనే అక్కడ సహాయ చర్యలు చేపడుతున్న డైవర్లలో కదలిక పెరిగింది. దీంతో మరిన్ని పడవలు అక్కడకు వచ్చాయి.

వాళ్లు మరికొన్ని మృతదేహాలు గుర్తించినట్లు ఆ సమయంలో మాకు అర్థం కాలేదు.

శిధిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడం సహాయ బృందాలకు సవాలుగా మారింది. అవి నీటి అడుగున 50 మీటర్ల లోతులో ఉండటంతో ప్రతీ డైవర్ పైకి రావడానికి ముందు 10 నిముషాలు నీటిలోనే ఉండేవారు. అలా మొత్తం 120 డైవ్‌లు పూర్తయ్యాయి. వారికి సాయం చేసేందుకు ఒక రిమోట్ కంట్రోల్ నౌకను కూడా తీసుకొచ్చారు. దానికి సముద్రంలో అడుగున ఉండి చాలాసేపు పని చేయగల సామర్థ్యం ఉంది.

ఈ ప్రమాదం నుంచి బయటపడిన బాధితులు పడవ మునిగిపోయే సమయంలో తాము ఎడమ వైపున ఉన్న క్యాబిన్లలోకి చేరుకున్నారని, అక్కడకు చేరుకునేసరికి గాలి బుడగలు ఏర్పడ్డాయని, వారిని కాపాడిన సహాయ సిబ్బంది చెప్పారు.

ఎడమ వైపున ఉన్న మొదటి క్యాబిన్‌లో ఐదు మృతదేహాలు లభించాయని వారు చెప్పారు. తాము వెలికి తీసిన చివరి మృతదేహం హనా లించ్‌దని ఆమె ఎడమ వైపున ఉన్న మూడో క్యాబిన్‌లో ఉన్నారని తెలిపారు.

పడవ ప్రమాదం జరిగిన తర్వాత లోపల ఉన్న ఫర్నిచర్ అంతా చెల్లాచెదురైంది. దీంతో పడవ లోపలకు వెళ్లడం ఎమర్జెన్సీ బృందాలకు చాలా కష్టమైంది.

ఇటలీ, సిసిలీ, పోర్టిసెల్లో

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, సహాయ చర్యల కేంద్రంగా మారిన అందమైన పోర్టిసెల్లో ప్రాంతం

శిధిలాలను ఎలా భద్రపరచాలి అనేది ప్రస్తుతం సహాయ బృందాల ముందున్న పెద్దసవాలు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే శిధిలాలను భద్రపరచడం తప్పనిసరి. బయేసియన్‌ను బయటకు తీసుకురావడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పట్టవచ్చు. దీనికి 15 మిలియన్ యూరోలు ( రూ.140 కోట్లు) ఖర్చవుతుందని అంచనా.

మృతదేహాలను బయటకు తెచ్చేందుకు డైవర్లు చేపట్టిన ఆపరేషన్ ముగిస్తే, అసలు ప్రమాదం ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు ఇన్వెస్టిగేటర్లు పని మొదలుపెడతారు.

ఇన్వెస్టిగేటర్లు, సహాయ బృందాలు, ప్రమాదం నుంచి బయటపడిన వారు పొర్టిసెల్లో సమీపంలోని ఒక హోటల్‌లో ఉంటున్నారు. ఈ ప్రాంతంలోకి జర్నలిస్టుల్ని అనుమతించడం లేదు. మమ్మల్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సెక్యూరిటీ గార్డులు చెప్పారు.

బయేసియన్ నౌక ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చడం అవసరం. బాధితులకు, వారి బంధువులకు అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. విహార నౌకల పరిశ్రమకు కూడా మరోసారి అలాంటి తప్పులు జరక్కుండా చర్యలు తీసుకునేలా అవకాశం లభిస్తుంది.

కెప్టెన్ జేమ్స్ కట్‌ఫీల్డ్ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని పడవల్లోనే గడిపారని, ఆయనకు పరిశ్రమలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయని ఆయన సోదరుడు చెప్పారు. అలాంటి అనుభవం ఉన్న నావికుడు భయంకరమైన తప్పులు చేస్తారా?

బయేసియన్ సిబ్బంది, కెప్టెన్ మీద తీర్పులు చెప్పే ముందు కొంత సంయమనం పాటించాలని నౌకలో పని చేసే ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రేడ్ యూనియన్ నౌటిలస్ కోరింది.

“ఎలాంటి ఆధారాలు లేకుండా వారి ప్రవర్తనను ప్రశ్నించే ప్రయత్నం చెయ్యడం సరైన పద్ధతి కాదు. అది దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీని వల్ల ఒక ఘోర ప్రమాదం నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతాం.” అని నౌటిలస్ పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచ మీడియా అంతా పోర్టిసెల్లోను విడిచి వెళుతోంది. ఆ ప్రాంతంలో నెమ్మదిగా ప్రమాదానికి ముందున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చేపలు పట్టేందుకు ఉపయోగించే పాత పడవల్లో పిల్లులు తిరుగుతున్నాయి. ఇసుక తిన్నెల్లో చిన్నారులు ఆడుకుంటున్నారు. మత్స్యకార కుటుంబాలు సముద్రం పక్కనే ఉన్న రెస్టారెంట్లలో తింటున్నారు.

అయితే గత వారంలో జరిగిన సంఘటన ఇక్కడ అందరినీ నిశ్చేష్టుల్ని చేసింది.

“గత ఆదివారం రాత్రి పోర్టిసెల్లోలో ప్రపంచం అంతం కావడాన్ని మేము చూశాం.” అని స్థానికురాలు మరియా విజ్జో చెప్పారు.

“ఇలాంటిది గతంలో ఎన్నడూ మేము చూడలేదు. అందరూ నిర్ఘాంతపోయారు.” అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)