విదేశీ మిరపకాయ గుంటూరు మిర్చిని దెబ్బతీసిందా, కేంద్రం ప్రకటించిన ధర కూడా ఎందుకు చెల్లించడం లేదు?

మిర్చి
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

ఐదారేళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈసారి పెద్దయెత్తున పంటను సాగు చేశారు. అయితే, అనూహ్యంగా ఈ ఏడాది ధరలు తగ్గిపోయాయి.

గుంటూరు మిర్చి యార్డులో గతేడాది క్వింటాల్ రూ.25 వేలు పలికిన మిర్చి ధర, ఈ ఏడాది కనీసం రూ.11 వేలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.

మిర్చి రైతుల ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వ వినతులతో కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద క్వింటాల్‌కు రూ. 11,781 రూపాయలిస్తామని వెల్లడించింది.

కానీ, ఈ ధర ఏ మాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. క్వింటాల్ మిర్చికి కనీసం రూ.20 వేలు వస్తే గానీ నష్టాల నుంచి గట్టెక్కగలమని చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పెరిగిన పెట్టుబడి, తగ్గిన దిగుబడి..

ఈ ఏడాది సాగు దశలో మిర్చి పంటకు చీడపీడలు, నల్లి అధికంగా అంటుకోవడంతో పురుగు మందులు ఎక్కువగా వాడామని, దాంతో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు.

'' నేను 20 ఏళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నా. ఏటా మూడెకరాలు వేస్తా. పోయిన సంవత్సరం మందు కట్ట ధర 1,200 రూపాయలు. అదే కంపెనీ మందు కట్ట ధర ఈ ఏడాది రూ.1,800 అయింది. పురుగు మందు చల్లేందుకు గతేడాది ఎకరానికి రూ.15 వేలు ఖర్చయితే ఈ ఏడాది రూ.20 వేలు దాటింది '' అని పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన రైతు గొల్లమూడి వెంకటరావు బీబీసీతో చెప్పారు.

గతేడాది 3 ఎకరాలకు 90 క్వింటాళ్ల దిగుబడి వస్తే, ఈ ఏడాది 60 క్వింటాళ్లు కూడా రాలేదని ఆయన చెప్పారు.

అదే ప్రాంతానికి చెందిన రైతు ఏపూరి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ, ''గత ఏడాది వేసిన సన్న రకాలు, తేజా రకాలను కళ్లాల్లోనే కూ.18 వేల నుంచి కూ.19 వేలకు అమ్మాం. అవే రకాలు ఈ ఏడాది రూ.12 వేల నుంచి కూ.12,500కే అమ్ముకోవాల్సి వస్తోంది'' అని చెప్పారు.

మిర్చి రైతులు
ఫొటో క్యాప్షన్, కళ్లాంలో మిర్చిని బస్తాల్లోకి ఎక్కిస్తున్న దృశ్యం

కౌలు రైతుకు మరింత కష్టం

క్వింటాల్‌కు రూ.10 వేలు, రూ.11 వేలు కూడా రాకపోతే పొలం యజమానికి ఏం కట్టాలనేది కౌలు రైతుల ఆందోళన.

''ప్రభుత్వం ప్రకటించిన రేటు కరెక్ట్‌ కాదు. పోయిన ఏడాది క్వింటాల్ రూ.20 వేలు చేసి కళ్లాల్లోనే అమ్మాం. ఈ ఏడాది రూ.11 వేలకే అమ్మాల్సి వస్తోంది. క్వింటాల్‌కి 6 వేల రూపాయలను నష్టపోతున్నాం. ఇక మేం కౌలు ఏం కట్టాలి'' అని కౌలు రైతు నల్లగుండ నరసింహా రావు ప్రశ్నిస్తున్నారు.

మరో కౌలు రైతు, పగడాల ఎలమంద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మిర్చి ధరలు

మిర్చి ధరలు ఎందుకు తగ్గాయి?

గత ఐదారేళ్లుగా మిర్చికి మార్కెట్‌లో మంచి ధరలే వస్తుండటంతో రైతులు ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించి పెద్దమొత్తంలో పంట వేశారు.

దీంతో, భారీ స్థాయిలో మిర్చి విక్రయానికి తరలిరావడం, గతేడాది మార్చి నుంచి తగ్గిన ధరలతో త్వరలో పెరుగుతాయన్న ఆశతో రైతులు గోదాముల్లోనే పాత సరుకు దాచుకోవడం, అలా పెద్ద మొత్తంలో పంట పేరుకుపోయిందని పల్నాడు రైతు సంఘం కార్యదర్శి గోపాల్‌ బీబీసీకి తెలిపారు.

మళ్లీ ఈ ఏడాది కొత్త పంట రావడం.. సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గడం వంటి కారణాలతో మిరపకాయల ధర పడిపోయిందని గోపాల్‌ చెప్పారు.

కళ్లాంలో మిర్చి

గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్‌ దేశాలకు ఎగుమతయ్యేది.

అయితే, ఇటీవల ఎగుమతులు తగ్గడంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి.

చైనాకు ఆర్డర్లు పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ, ఆ మేరకు ఫలితం కానరాలేదని రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి అజయ్‌ ఆరోపించారు.

ఎగుమతులు తగ్గడం, మరోవైపు పంట సాగు పెరగడం కూడా ధరలు తగ్గిపోవడానికి కారణమయ్యాయని రైతు సంఘం నాయకుడు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ బీబీసీతో చెప్పారు.

మిర్చి సాగు

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

మిర్చి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయి రైతుల ఆందోళన నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు.

మార్కెట్‌ ఇంటర్వెన్షన్ స్కీమ్‌ (ఎంఐఎస్‌) కింద సేకరణ పరిమితులను పెంచాలని కోరారు. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి చతుర్వేదితో కూడా ఆయన దిల్లీలో సమావేశమయ్యారు.

ఆ తర్వాత స్పందించిన కేంద్రం, వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చికి 11,781 రూపాయల ధరను ఇస్తామని ప్రకటించింది.

అయితే, ఇప్పటి వరకు ఇంకా విధివిధానాలు రాలేదని మార్కెటింగ్‌ శాఖ అధికారి గుంటూరు మిర్చి యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక బీబీసీకి తెలిపారు.

అయితే, కేంద్రం ప్రకటించిన రూ.11,781 ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. కనీసం రూ.20 వేలు వస్తే గానీ పంటకు మద్దతుగా నిలవదని యార్డులో రైతులు చెబుతున్నారు.

''రూ. 20 వేలు ఇవ్వకుంటే అనవసరం. నిజానికి ఆ ధర ఇచ్చినా మాకు లాభం మిగిలేదేం లేదు. పంటకు తెచ్చిన అప్పులు పోతాయంతే..'' అని మహిళా రైతు సీతామహాలక్ష్మి అన్నారు.

మిర్చి సాగు

'సాగు పరికరాలపై జీఎస్టీ ఎత్తేయాలి'

రైతువారీ వ్యవస్థలో జీఎస్టీ లేకుండా పాలకులు చూస్తే పెట్టుబడి ఖర్చులు కాస్త తగ్గుతాయని మిర్చి రైతు లేళ్ల హరి రామారావు కోరారు.

రైతులు సాగు కోసం ఉపయోగించే పరికరాలపై జీఎస్టీ విధించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని ఆయన కోరారు.

మార్కెట్ యార్డు

విదేశాల్లోనూ మిర్చి పంట

''గతంలో లేని విధంగా ఇప్పుడు విదేశాల్లో కూడా మిర్చి సాగు చేస్తున్నారు. దాంతో ఎగుమతులు తగ్గుతున్న పరిస్థితిల్లో మిర్చి మార్కెట్‌ అంతగా లేదని భావిస్తే పాలకులు రైతులను అప్రమత్తం చేయాలి. లేదంటే, అప్పులే పెట్టుబడిగా పెట్టి సాగు చేసే రైతు చివరికి కన్నీళ్ల పాలయ్యే పరిస్థితి ఉంటుంది'' అని యలమంచిలి శివాజీ బీబీసీతో అన్నారు.

''కేంద్రం మార్కెట్‌ ఇంటర్వెన్షన్ స్కీం కింద ప్రకటించిన ధరపై రైతులు అసంతృపిగా ఉన్నారు. దీన్ని పాలకులు గమనించాలి. అసలు ఇప్పటి వరకు ఆ స్కీం విధి విధానాలు, ఏ క్వాలిటీకి ఆ ధర చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. మార్కెట్‌లో మిర్చి ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోతున్నాయనే దానిపై అధికారులు దృష్టిసారించాలి'' అని ఆయన కోరారు.

''మార్కెట్‌లో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 341 రకం మిర్చి ధర రూ.15 వేలు పలుకుతోంది. తేజా రకం కూడా రూ. 14 వేల వరకు వెళ్తోంది. ఇంకా రేట్లు పెరిగే అవకాశమున్నందున రైతులు కంగారు పడొద్దు'' అని గుంటూరు మిర్చి యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక బీబీసీతో అన్నారు.

చైనా, బంగ్లాదేశ్‌లో ఇప్పుడు మిర్చి సాగు చేయడంతో కొంత ఎగుమతులు తగ్గాయని, అయితే, అక్కడ సాగు విస్తీర్ణం చాలా తక్కువ అందుకే మళ్లీ మన మిర్చి కావాలని అడుగుతున్నారని, ఎగుమతులు పెరుగుతున్నాయని ఆమె తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)