బ్యాక్టీరియల్ వాజినోసిస్‌: సెక్స్ ద్వారానూ సోకుతుందంటున్న పరిశోధకులు

ఎస్టీఐ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిచెల్ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్

మహిళల్లో కనిపించే బ్యాక్టీరియల్ వాజినోసిస్ (బీవీ) లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ (ఎస్టీఐ) కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఎన్‌హెచ్ఎస్ ప్రకారం.. యోనిలో బ్యాక్టీరియా సమతుల్యత లోపించినప్పుడు బ్యాక్టీరియల్ వాజినోసిస్ సంభవిస్తుంది. సెక్స్ ద్వారా అది ప్రేరేపితమైనప్పటికీ దానిని ఎస్టీఐగా పరిగణించడం లేదు. కానీ తాజా పరిశోధన ఈ భావన సరైనది కాదని చెబుతోంది.

బీవీ అనేది శృంగార సమయంలో వ్యాపిస్తుందని, దీనిని ఎస్టీఐగా పరిగణించాలని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన జర్నల్ సూచిస్తోంది. ఇలా సంక్రమించే బ్యాక్టీరియల్ వాజినోసిస్‌ను పూర్తిగా నయం చేయడానికి ఆ సమస్య ఉన్న వ్యక్తిని మాత్రమే కాకుండా లైంగిక భాగస్వామికీ చికిత్స చేయాలని ఈ అధ్యయనం కనుగొంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట ఒక వంతు మంది మహిళలను బీవీ ప్రభావితం చేస్తోంది. వంధ్యత్వం, అకాల జననాలు, నవజాత శిశువుల మరణం వంటి సమస్యలకు దారితీస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బాక్టీరియల్ వాజినోసిస్

ఫొటో సోర్స్, Getty Images

బీవీ అంటే ఏమిటి?

అసాధారణమైన యోని స్రావాలకు బ్యాక్టీరియల్ వాజినోసిస్ ఒక సాధారణ కారణం, ఈ స్రావాల నుంచి ఘాటైన చేపల వాసన వస్తుంటుంది. దీని రంగు మారుతుంటుంది, బూడిద-తెలుపులో స్రావాలు వస్తాయి.

అయితే, బీవీ ఉన్న సగంమంది స్త్రీలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఇది సాధారణంగా నొప్పి లేదా దురదను కలిగించదు.

బీవీ సమస్యకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్, జెల్స్ లేదా క్రీములతో చికిత్స చేయవచ్చు.

పరిశోధకులు 164 జంటలపై జరిపిన ఒక ప్రయోగంలో బీవీకి లైంగిక సంక్రమణ వ్యాధుల మాదిరే చికిత్స చేశారు . ఇంతకుముందు మహిళకు మాత్రమే యాంటీ బయాటిక్స్ ఇచ్చేవారు, ఈసారి భాగస్వాములిద్దరికీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా బీవీని నివారించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విధానం ఇన్ఫెక్షన్ తిరిగి వచ్చే అవకాశాలను సగానికి తగ్గించిందని తెలుసుకున్నాక అధ్యయనాన్ని ముందుగానే నిలిపివేశారు.

పరిశోధనలో నిమగ్నమైన మహిళ

పరిశోధకులు ఏమంటున్నారు?

"భాగస్వామి నుంచి తిరిగి ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా బీవీ కేసులు మళ్లీ మళ్లీ వస్తున్నాయని మా అధ్యయనం ద్వారా తెలుస్తోంది. నిజానికి బీవీ కూడా ఎస్టీఐ అని ఇది సూచిస్తోంది" అని ప్రధాన పరిశోధకులలో ఒకరైన ప్రొఫెసర్ కాట్రియోనా బ్రాడ్‌షా అన్నారు.

''బీవీ లైంగికంగా సంక్రమిస్తుందో లేదో కచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే దానికి కారణమయ్యే బ్యాక్టీరియా ఏంటనేది మాకు స్పష్టంగా తెలియదు. కానీ, ఈ సమాధానాలను చేరుకోవడానికి జీనోమిక్ సీక్వెన్సింగ్ కొత్త సాంకేతికత మాకు సహాయపడుతుంది'' అని ఆమె అన్నారు.

మెల్‌బోర్న్ లైంగిక ఆరోగ్య కేంద్రంలో మోనాష్ విశ్వవిద్యాలయం, ఆల్ఫ్రెడ్ హెల్త్ నిర్వహించిన ఈ అధ్యయనంలో పరిశోధనలో పాల్గొన్న వారిలో సగంమంది పురుషులకు నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్, చర్మానికి పూయడానికి ఒక క్రీమ్ ఇచ్చారు. మిగిలిన సగం మంది పురుషులకు ఎటువంటి చికిత్సా చేయలేదు.

అధ్యయన ఫలితాల కారణంగా పరిశోధకులు ప్రయోగ పద్ధతిని మార్చేశారు. భాగస్వాములిద్దరికీ చికిత్స చేయడం ప్రారంభించారు. బీవీ లైంగికంగా సంక్రమించవచ్చని, ముఖ్యంగా పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ప్రభావితమవ్వొచ్చనే ఆధారాలను ఈ అధ్యయనం అందించిందని బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ సెక్సువల్ హెల్త్ అండ్ హెచ్ఐవీ తెలిపింది.

"ఈ పరిశోధన బీవీని బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది. మరింత మొండి కేసులకు మెరుగైన చికిత్స చేయవచ్చు" అని తెలిపింది.

మీకు ఎస్టీఐ లక్షణాలు ఉంటే లేదా బీవీ గురించి ఆందోళన చెందుతుంటే మీ వైద్యుడిని సంప్రదించండి లేదా సెక్సువల్ హెల్త్ క్లినిక్‌ని సందర్శించండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)