బుల్లెట్ రైలుకు బ్రేకులు వేసిన పాము.. అసలేం జరిగింది?

బుల్లెట్ రైలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హఫ్సా ఖాలిల్
    • హోదా, బీబీసీ న్యూస్

ఓ పాము కారణంగా బుల్లెట్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటన జపాన్‌లో జరిగింది. రైల్వే విద్యుత్ లైన్‌పై పాము చిక్కుకుపోవడంతో బుల్లెట్ రైళ్లు ఆగిపోవాల్సి వచ్చింది.

జపాన్‌లో అత్యంత రద్దీ ఉండే ఓ బుల్లెట్ రైలు మార్గంలోని విద్యుత్ లైన్‌పై పాము చిక్కుకుపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొంతసేపు రైళ్లను నిలిపివేశారు.

టోక్యో-ఒసాకా మధ్యలో నడిచే టోకైడో షింకెన్‌షెన్ రైళ్లను బుధవారం అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 5.25 గంటలకు (భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు) నిలిపివేయాల్సి వచ్చింది. తిరిగి రాత్రి 7 గంటలకు సర్వీసులను పునరుద్ధరించినట్టు సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రయాణికుల రద్దీ

జపాన్‌లో ప్రస్తుతం వారంలో నాలుగురోజులు జాతీయ సెలవు దినాలతో కూడిన ‘గోల్డెన్ వీక్’ సీజన్ నడుస్తోంది. దీనివల్ల చాలామంది ప్రజలు తమ సొంతూర్లకు ప్రయాణమయ్యారు. దీంతో, రైళ్లు, విమానాశ్రయాలు, హాలిడే స్పాట్లు రద్దీగా మారుతున్నాయి.

అలాగే, ఒసాకా ఈ ఏడాది వరల్డ్ ఎక్స్‌పో నిర్వహిస్తోంది. ఈ ఎక్స్‌పో ముగిసే అక్టోబర్ చివరినాటికి లక్షల సంఖ్యలో విదేశీయులు, స్థానికులు ఈ నగరానికి రానున్నారు.

గిఫు – హషిమా, మైబారా స్టేషన్ల మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లలో పాము చిక్కుకుపోయింది. దీనివల్ల, షిన్-ఒసాకా, నగోయా మధ్యలో నడిచే టోక్యో వైపు రైళ్లను, షిన్-ఒసాకా, టోక్యో మధ్యలో నడిచే ఒసాకా వైపు రైళ్లను నిలిపివేసినట్లు జపాన్‌కు చెందిన న్యూస్ ఏజెన్సీ క్యోడో న్యూస్ తెలిపింది.

విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నించారు. పాము వల్ల కలిగిన విద్యుత్‌ అంతరాయంతో టిక్కెట్ మెషిన్ల వద్ద పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బారులు తీరారు. ఓ స్టేషన్‌లో ప్రయాణికులు సిబ్బందిని చుట్టుముట్టడం కనిపించింది.

జపాన్ ఒసాకాలోని ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఇదే తొలిసారి కాదు

పాము వల్ల ఇలా బుల్లెట్ రైళ్లు నిలిచిపోవడం తాను తొలిసారి చూసినట్లు టోక్యోకు ప్రయాణిస్తున్న ఒక షింకెన్‌షెన్ ప్యాసెంజర్ చెప్పారు.

'' నెలలో చాలాసార్లు నేను షింకెన్‌షెన్‌లో ప్రయాణిస్తుంటాను. కానీ, విద్యుత్ అంతరాయం కారణంగా ఇలా రైళ్లు ఆగిపోవడం నేను తొలిసారి చూశాను.'' అని క్యోడో న్యూస్‌కు సతోషి తగవా అనే 46 ఏళ్ల వ్యక్తి చెప్పారు.

ఈ సేవల్లో కలిగే ఇబ్బందులతో తాను విసిగిపోయానని 26 ఏళ్ల కజుతోషి తాచి చెప్పారు. సమయానికి అనుగుణంగా రైళ్లు ప్రయాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

పాము వల్ల షింకెన్‌షెన్ సర్వీసు ఆగిపోవడం ఇదే తొలిసారి కాదు.

2024 ఏప్రిల్‌లో కూడా నగోయా, టోక్యో మధ్యలోని రైలు నుంచి 16 అంగుళాల (40.6 సెంటీమీటర్) పామును అధికారులు తొలగించారు. ఆ సమయంలో రైలు 17 నిమిషాలు ఆగిపోయినట్లు బీబీసీ న్యూస్ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)