పహల్గాం దాడి: పాకిస్తాన్‌కు చైనా సాయం చేస్తుందా, ఎంత వరకు...

భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాబాజ్ షరీఫ్, షీ జిన్ పింగ్
    • రచయిత, మునజ్జా అన్వర్, ఉమైర్ సలీమి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశం దాడి చేస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటున్నారు. అయితే, ఈ వివాదంలో చైనా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరుగుతోంది.

భారతదేశం చర్యలు తీసుకోకుండా చైనా, పాకిస్తాన్ కూటమి అడ్డుకోగలదా?

ఈ వివాదంలో పాకిస్తాన్‌కు చైనా ఎంత వరకు అండగా ఉంటుంది? చైనా ప్రయోజనాలు ఏంటి? అనేవి కీలకమైన ప్రశ్నలు.

పహల్గాం దాడి తర్వాత "భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను గమనిస్తున్నాం" అని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చెప్పారు.

పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్‌, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చర్చల సందర్భంగా ‘ఇరుపక్షాలు సంయమనం పాటించాలి’ అని సూచించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

పహల్గాంలో పర్యటకుల మీద తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాతి రోజు చైనా ఈ దాడిని ఖండించింది.

‘‘టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

భారత్‌లో చైనా రాయబారి కూడా బాధితుల పట్ల సానుభూతి ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చైనా పాత్ర ఎంత వరకు కీలకం, అది పాకిస్తాన్‌కు ఎంత వరకు సాయం చేస్తుంది అనే దానిపై బీబీసీ నిపుణులతో మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ జాతీయ భద్రత కమిటీతో సమావేశం నిర్వహించారు.

భద్రత గురించి పాకిస్తాన్ ఆందోళనలు ఏంటి?

వీలైనంత త్వరగా నిష్పాక్షిక దర్యాప్తు పూర్తి చేసేందుకు చైనా అండగా నిలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్‌ దార్‌తో సమావేశం సందర్భంగా చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి అన్నారు.

"గొడవల వల్ల భారత్ లేదా పాకిస్తాన్ ప్రాథమిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. అంతే కాకుండా ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం’’ అని వాంగ్‌ యి చెప్పినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

పహల్గాం దాడి విషయంలో పాకిస్తాన్‌పై వచ్చిన ఆరోపణల్ని ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ ‌షరీఫ్ తిరస్కరించారు.

చైనా నిరంతరంగా అందిస్తున్న మద్దతుకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పహల్గాంలో భారత ప్రభుత్వం భద్రతా దళాలను మోహరించింది.

పహల్గాం దాడిపై 'పారదర్శక దర్యాప్తు'

‘‘భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండానే పాకిస్తాన్ దాడి చేసినట్లు చెబుతోంది. ఆరోపణలకు నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి’’ అని బీజింగ్‌లోని టే హో ఇన్‌స్టిట్యూట్‌లో ది ఏసియా నెరెటివ్ సబ్ స్టాక్‌ చైర్మన్ ఇనార్ టంజెన్ చెప్పారు.

‘‘పాకిస్తాన్‌కు నీళ్లు ఆపేస్తామని భారత్ చేసిన హెచ్చరిక చాలా తీవ్రమైనది. అసలు ప్రశ్న ఏంటంటే, భారత్ నిజంగానే నీళ్లు ఆపేస్తుందా? అదే జరిగితే, రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, శాంతిని కొనసాగించాలంటే, నిష్పాక్షిక దర్యాప్తు చేసి, మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టాలి’’ అని ఇనార్ టంజెన్ అన్నారు.

‘‘ఈ దర్యాప్తులో పాకిస్తాన్, చైనాలనే కాదు, తుర్కియే లాంటి ఇతర దేశాలు, బ్రిక్స్ లాంటి సంస్థలు ఉంటే దర్యాప్తు పారదర్శకంగా ఉండటంతో పాటు ఇరుపక్షాలకీ ఆమోదయోగ్యంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద, చైనా పాకిస్తాన్‌లో 62 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

చైనా ప్రాధాన్యతలు ఏంటి?

పాకిస్తాన్, చైనా మధ్య కొన్ని దశాబ్దాలుగా దౌత్య సంబంధాలతో పాటు రక్షణ పరమైన సహకారం కూడా ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా చైనా మీద ఆధారపడటం పెరిగింది.

ఆధునిక ఆయుధాల సరఫరా, వార్షిక ద్రవ్యలోటుని పూడ్చుకునేందుకు రుణాలు, ఎఫ్ఏటీఎఫ్ కఠిన చర్యలు, ఇలా సమస్య ఏదైనా సరే, పాకిస్తాన్‌కు సాయం అందించేందుకు అనేకసార్లు చైనా ముందుకొచ్చింది.

చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) కింద, చైనా పాకిస్తాన్‌లో 62 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల గ్వాదర్‌లో చైనా నిధులతో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

చైనా, పాకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు చైనా నుంచి పాకిస్తాన్ భారీ సంఖ్యలో ఆయుధాలు కొనుగోలు చేస్తోంది.

గత 5 ఏళ్లలో పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో 81 శాతం చైనా నుంచేనని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది.

పాకిస్తాన్ గుండా చైనా గల్ఫ్ దేశాలతో సాన్నిహిత్యం పెంచుకోవచ్చు. అయితే పాకిస్తాన్‌లో చైనా పౌరులపై దాడులు జరుగుతున్నాయని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త తస్నీం అస్లాం చెప్పారు.

‘‘ఈ ప్రాంతంలో చైనా పెద్ద దేశం. దానికి భారత్, పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు పాకిస్తాన్ కారణమని భారత్ ఆరోపిస్తుంటే, బలూచిస్తాన్ సమస్యకు భారత్ కారణమని పాకిస్తాన్ అంటోంది. అయితే చైనా తన ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో శాంతిని కాపాడుతోంది. చైనాకు తన ఆర్థిక ప్రయోజనాలకు భద్రత ముఖ్యం’’ అని తస్నీం చెప్పారు.

"ఈ ప్రాంతంలో చైనా లేదా మరే ఇతర దేశమైనా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలదు. అయితే దానికి పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగినప్పుడు, ఆధారాలను గుర్తించినప్పుడే అది సాధ్యం" అని ఆయన అన్నారు.

భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

చైనా నుంచి పాకిస్తాన్ ఏం కోరుకుంటోంది?

ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా, దౌత్యం, రక్షణ సహకారంలో చైనా నుంచి పాకిస్తాన్ ఏమాశిస్తోంది?

"పహల్గాంలో దాడికి పాల్పడిన సంస్థకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు ఆధారాలు లభించినా, లేదా పాకిస్తాన్ ప్రభుత్వం నేరుగా దాడిలో పాల్గొన్నట్లు తేలినా, పరిస్థితులు మారవచ్చు" అని బీజింగ్‌కు చెందిన టంజెన్ చెప్పారు.

2020లో భారత్-అమెరికా మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీని కింద 'టెర్రరిజం' సహా అంతర్జాతీయ నేరాల్లో రెండు దేశాల మధ్య సహకారం ఉంటుంది.

దీన్ని ఉదహరిస్తూ, పాకిస్తాన్, చైనా కూడా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు టంజెన్ చెప్పారు.

"అయితే ఈ ఒప్పందం సైనిక సహకారం లాంటిది కాదు. ప్రస్తుతం చైనా-నార్త్ కొరియా మధ్య సైనిక సహకారానికి సంబంధించిన ఒప్పందం ఉంది" అని ఆయన చెప్పారు.

భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి

ఈ వివాదంలో చైనా ఏం చేయవచ్చు?

పాకిస్తాన్-చైనా సంబంధాలను కాయిద్-ఇ-ఆజం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మొహమ్మద్ షోయబ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుందని, రెండు దేశాలు సంయమనం పాటించాలని చెబుతుందని అన్నారు.

"చైనా ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. అమెరికాతో వాణిజ్య యుద్ధంలో చిక్కుకోవడంతో బీజింగ్‌పైనా ఒత్తిడి ఉంది. అందుకే అది భారత్‌తోను తగవు పెట్టుకోవాలని కోరుకోదు" అని షోయబ్ అన్నారు.

చైనాకు భారత్ పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అది భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటుందనేది ప్రొఫెసర్ షోయబ్ అభిప్రాయం.

‘‘పాకిస్తాన్ స్వీయ రక్షణకు సంబంధించిన విస్తృత అధికారాన్ని చైనా అర్థం చేసుకుంది. తన సార్వభౌమత్వాన్ని, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అండగా ఉంటుంది’’ అని చైనా ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, YouTube/@ISPR

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్

యుద్ధం జరిగితే చైనా పాకిస్తాన్‍‌కు ఎంత వరకు మద్దతిస్తుంది?

"యుద్ధం జరిగితే చైనా తమ తరఫున యుద్ధంలో పాల్గొనదని లేదా నేరుగా రంగంలోకి దిగదనే విషయం పాకిస్తాన్ నేతలకు తెలుసు" అని ప్రొఫెసర్ షోయబ్ అన్నారు.

''ఏడాది కింద ఇలాంటి పరిస్థితి ఉంటే, భారత్‌తో సరిహద్దుల వద్ద చైనా కొంత అలజడి సృష్టించేది. దాని ద్వారా భారత్‌కు 'నువ్వు రెండు సరిహద్దుల దగ్గరా పోరాడాల్సి ఉంటుంది' అన్న సందేశాన్ని చైనా పంపేది.

అయితే ఇటీవలి కాలంలో భారత్- చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని షోయబ్ భావిస్తున్నారు.

పాకిస్తాన్ చైనా మీద ఆధారపడటం గురించి ప్రొఫెసర్ షోయబ్ ఇలా చెప్పారు.

"మాది అభివృద్ధి చెందిన దేశం కాదు. అందుకే సమాచార పంపిణీలో కీలకమైన శాటిలైట్ల కోసం చైనా మీద ఆధారపడతాం. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి విషయాల్లో చైనా ఎప్పుడూ మోసం చేయలేదు" అని అన్నారు.

అలాగే భారత దేశపు యుద్ధ నౌకలు, సైనిక బలగాల కదలికల గురించిన సమాచారం కోసం పాకిస్తాన్ ఎక్కువగా చైనా మీద ఆధారపడుతోందని ఆయన చెప్పారు.

భారత్ పాకిస్తాన్, చైనా, పహల్గాం దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా యుద్ధ నౌకలు

చైనా నుంచే పాకిస్తాన్‌కు ఆయుధాలు

టెక్నాలజీతో పాటు బీవీఆర్ మిస్సైళ్ల కోసం కూడా చైనా మీద ఆధారపడుతోంది పాకిస్తాన్. ఆ దేశం దగ్గరున్న 80శాతం ఆయుధాలు చైనా నుంచి వచ్చినవే.

గత ఐదేళ్లలో పాకిస్తాన్ సమకూర్చుకున్న ప్రతి ఐదు ఆయుధాల్లో నాలుగు చైనా నుంచే వచ్చాయని ప్రొఫెసర్ షోయబ్ చెప్పారు. భారత్‌తో యుద్ధం వస్తే ఈ ఆయుధాలు పాకిస్తాన్‌కు ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారు.

పాకిస్తాన్‌కు చైనా పీఎల్ 15 క్షిపణులను ఇచ్చిందని ఇనార్ టంజెన్ చెబుతున్నారు. అయితే, ఈ ఆయుధాలు ముందుగా కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఇచ్చిందని, దీనికి తాజా సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.

చైనాకు చెందిన ఆధునిక బీవీఆర్ టెక్నాలజీలో భాగంగా పీఎల్ 15, ఎస్‌డీ 10 క్షిపణుల్ని తయారు చేసారు. ఈ క్షిపణులు సుదూర ప్రాంతం నుంచి నౌకల్ని ధ్వంసం చేయగలవు.

భారత్- పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం వల్ల యుద్ధం జరక్కపోవచ్చని ఇనార్ టంజెన్ భావిస్తున్నారు.

అయితే ప్రొఫెసర్ షోయబ్ మాత్రం "చైనా ఫ్యాక్టర్ చాలా కీలకమైనది" అని భావిస్తున్నారు. "భారతదేశం చాలాకాలం నుంచి రెండు సరిహద్దుల్లో యుద్ధం గురించి మాట్లాడుతోంది. అంటే పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేస్తుంది. అయితే చైనా దానిపై ఎలా స్పందిస్తుందో తెలియదు" అని షోయబ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)