బలూచిస్తాన్: తమ జీవితాల్లో లేని పురుషుల కోసం మార్చురీలన్నీ వెతుకుతున్న మహిళలు

మహరంగ్ బలూచ్

ఫొటో సోర్స్, BBC/Nayyar Abbas

ఫొటో క్యాప్షన్, బలూచిస్తాన్‌లో ఒక ఉద్యమాన్ని నడిపే మహరంగ్ తన తండ్రిని ఎత్తుకెళ్లి చంపేశారని చెప్పారు
    • రచయిత, ఫర్హత్ జావేద్
    • హోదా, బీబీసీ ఉర్దూ

సైరా బలూచ్ మొదటిసారి 15 ఏళ్ల వయస్సులో మార్చురీలో అడుగుపెట్టారు.

మసక వెలుతురు ఉన్న ఆ గదిలోకి వెళ్లగానే ఆమెకు ఆక్రందనలు వినిపించాయి. ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. అతని శరీరం బాగా హింసకు గురైనట్లుగా కనిపించింది.

ఆ మృతదేహానికి కళ్లు లేవు. దంతాలు ఊడిపోయి, ఛాతీపై కాలిన గుర్తులు ఉన్నాయి.

''ఇక మిగతా మృతదేహాలను నేను చూడలేకపోయాను. బయటకు వచ్చేశాను'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆమె సోదరుడు ఒక పోలీస్ ఆఫీసర్. 2018లో బలూచిస్తాన్‌లో జరిగిన తీవ్రవాద నిరోధక ఆపరేషన్‌ సమయంలో అరెస్ట్ అయినప్పటి నుంచి దాదాపు ఏడాది కాలం పాటు ఆయన కనిపించకుండా పోయారు.

తాను చూసిన ఆ మృతదేహం అపరిచితుడిది కావడం.. తన సోదరుడిది కాకపోవడంతో ఆమె కొంత ఉపశమనం పొందారు.

మార్చురీలో గుర్తించని మృతదేహాల వరుసల్లో తమవారి కోసం సైరా లాంటి మరికొందరు వెతుకుతున్నారు.

సైరా అక్కడ వెతికిన తరువాత ఒకదాని తరువాత మరో శవాగారానికి వెళ్లడం, అక్కడ మృతదేహాలను చూడటానికి అలవాటుపడ్డారు. అన్నిచోట్లా ఆమెకు ఇలాంటి ఘటనలే తారసపడ్డాయి.

మార్చురీకి వెళ్లిన ప్రతిసారి తాను వెతుకుతున్నది అక్కడ ఉండకూడదని ఆమె కోరుకుంటారు. అలా ఏడేళ్లు గడిచాయి. ఇప్పటికీ ఆమెకు సోదరుడు కనిపించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సైరా బలూచ్

ఫొటో సోర్స్, BBC/Farhat Javed

ఫొటో క్యాప్షన్, సైరా బలూచ్

గత 20 ఏళ్లలో పాకిస్తాన్ భద్రత దళాలు వేల మంది బలూచ్ ప్రజలను కనిపించకుండా చేశాయని అక్కడి యాక్టివిస్ట్‌లు ఆరోపిస్తున్నారు.

దశాబ్ద కాలంగా జరుగుతున్న వేర్పాటువాద తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలలో చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా నిర్బంధించడం, ఎత్తుకెళ్లి, హింసించి చంపేయడం వంటివి చేశారని యాక్టివిస్ట్‌లు ఆరోపిస్తున్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తుంది. అదృశ్యమైన వారిలో చాలామంది వేర్పాటువాద గ్రూపుల్లో చేరారని, లేదా దేశం నుంచి పారిపోయారని చెబుతోంది.

కొందరు చాలా ఏళ్ల తర్వాత తిరిగొస్తారు. వీళ్లు చితికిపోయి ఉంటారు. చాలామంది ఎప్పటికీ తిరిగిరారు. కొందరు మాత్రం బలూచిస్తాన్ అంతటా కనిపించే గుర్తుతెలియని సమాధుల్లో కనిపిస్తారు. వీరి శరీరాలు కుళ్లిపోయిన దశలో గుర్తుపట్టలేకుండా ఉంటాయి.

ఎదురుచూపులే జీవితంగా బతుకుతున్న మహిళలు మరోవైపు.

తమ జీవితాల్లో లేని పురుషుల మసకబారుతున్న ఫోటోలను పట్టుకుని, ముఖమంతా బాధతో నిండి ఉన్న యువతులు, మహిళలు, వృద్ధురాళ్లు నిరసనల్లో పాల్గొంటారు.

వాళ్ల ఇళ్ల వద్దకు వెళ్లి బీబీసీ వారిని కలిసినప్పుడు పెచ్చులు ఊడిపోయిన కప్పుల్లో సులేమానీ చాయ్‌ను అందించిన ఆ మహిళల గొంతు మాతో మాట్లాడేటప్పుడు బాధతో జీరపోయింది.

మేం మాట్లాడిన వాళ్లలో చాలామంది తమవారు అంటే తండ్రి, సోదరుడు, కుమారుడు ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సామూహిక శిక్ష కింద వారందరినీ తీసుకెళ్లారని చెప్పారు.

క్వెట్టాలో నిరసనలు

ఫొటో సోర్స్, BBC/Nayyar Abbas

ఫొటో క్యాప్షన్, క్వెట్టాలో తమ వారి ఆచూకీ చెప్పాలంటూ నిరసన చేస్తోన్న మహిళలు

మాతో మాట్లాడిన వారిలో సైరా ఒకరు.

తన సోదరుని ఆచూకీ గురించి పోలీసులను అడగడంతో పాటు రాజకీయ నాయకులను బతిమాలినప్పటికీ ఎలాంటి సమాధానాలు దొరక్కపోవడంతో నిరసనల్లో పాల్గొనడం మొదలుపెట్టానని సైరా చెప్పారు.

నుష్కీ నగరంలో మరో 10 మందితో పాటు ముహమ్మద్ అసిఫ్ బలూచ్‌ను 2018 ఆగస్టులో అరెస్ట్ చేశారు. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఈ నగరం ఉంటుంది. మరుసటి రోజు టీవీలో భయపడుతున్న, ఆందోళనగా కనిపించిన అతన్ని చూసి కుటుంబీకులకు ఈ విషయం అర్థమైంది.

వీరంతా అఫ్గానిస్తాన్‌కు పారిపోతున్న తీవ్రవాదులని అధికారులు పేర్కొన్నారు.

స్నేహితులతో కలిసి ముహమ్మద్ పిక్నిక్‌కు వెళ్లినట్లు ఆయన కుటుంబీకులు చెబుతున్నారు.

ముహమ్మద్ చాలా సరదాగా, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడని సైరా చెప్పారు. ''ముహమ్మద్ నవ్వును మర్చిపోలేకపోతున్నానంటూ మా అమ్మ చాలా బాధపడతారు'' అని సైరా అన్నారు.

క్వెట్టాలో యూనివర్సిటీలో చేరేందుకు తనకు ముహమ్మద్ ఎంతో మద్దతు ఇచ్చారని సైరా తెలిపారు.

''అతన్ని విడుదల చేయాలని కోరుతూ నేను క్వెట్టాలో అడుగుపెడతానని ఎప్పుడూ అనుకోలేదు'' అని సైరా చెప్పారు.

తన సోదరునితో పాటు నిర్బంధానికి గురైన ముగ్గురు 2021లో విడుదలయ్యారని, అప్పుడేం జరిగిందనే దానిపై వారెవరూ పెదవి విప్పలేదని ఆమె అన్నారు.

ముహమ్మద్ ఇప్పటికీ ఇంటికి రాలేదు.

బలూచిస్తాన్ ప్రావిన్స్

ఫొటో సోర్స్, BBC/Nayyar Abbas

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని పేద రాష్ట్రం బలూచిస్తాన్

గత కాలంలోనే బలూచిస్తాన్

మీరు పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌కు ప్రయాణిస్తుంటే మరో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లుగా ఉంటుంది.

పాకిస్తాన్ ప్రావిన్సుల్లో బలూచిస్తాన్ అతిపెద్దది. దేశంలో 44 శాతం భూభాగం బలూచిస్తాన్‌లోనే ఉంటుంది. చాలా విశాలమైనది. ఇక్కడ గ్యాస్, బొగ్గు, కాపర్, బంగారు నిధులు సమృద్ధిగా ఉంటాయి.

కానీ, బలూచిస్తాన్‌ వెనుకబడింది.

భద్రతా కారణాలరీత్యా బలూచిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. విదేశీ జర్నలిస్టులకు తరచుగా ప్రవేశాన్ని నిరాకరిస్తారు.

అక్కడ ప్రయాణించడం కూడా కష్టం. ముందుకు వెళ్తున్న కొద్ది మౌలిక వసతులు అందుబాటులో ఉండవు.

విద్యుత్ సౌకర్యం కూడా అక్కడక్కడ ఉంటుంది. నీటి కొరత ఉంటుంది. పాఠశాలలు, ఆసుపత్రులు దుర్భర పరిస్థితుల్లో ఉంటాయి.

ఎప్పడో వచ్చే కస్టమర్ల కోసం దుకాణాల ముందు యజమానులు ఎదురుచూస్తూ కూర్చుంటారు.

జీవితంపై కలలు ఉన్న యువకులు కరాచీకి వెళ్లిపోవడం, లేదా గల్ఫ్‌కు వెళ్లడం గురించి మాట్లాడుతుంటారు.

అదృశ్యమైన వ్యక్తుల ఫోటోలు

ఫొటో సోర్స్, BBC/Farhat Javed

ఫొటో క్యాప్షన్, బలూచిస్తాన్ నుంచి ఎంతమంది పురుషులు అదృశ్యమయ్యారో సరైన అంచనాలు లేవు

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎన్‌ఏ)ని పాకిస్తాన్, కొన్ని ఇతర దేశాలు తీవ్రవాద గ్రూపుగా పరిగణిస్తాయి.

బీఎల్‌ఏ ఈ నెల మొదట్లో బోలాన్ పాస్ వద్ద ఒక రైలును హైజాక్ చేసి వందల మంది ప్రయాణికులను నిర్బంధించింది.

బలూచిస్తాన్‌లో కనిపించకుండా పోయినవారిని విడుదల చేస్తేనే తమ వద్ద బందీలుగా ఉన్న ప్రయాణికులను వదిలేస్తామని డిమాండ్ చేసింది.

30 గంటల పాటు జరిగిన ఈ ముట్టడిలో 33 మంది బీఎల్‌ఏ మిలిటెంట్లు, 21 మంది బందీలైన పౌరులు, నలుగురు మిలిటరీ సిబ్బంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

బలూచిస్తాన్ ప్రావిన్సులో ప్రజల అదృశ్యాలు అనేవి తిరుగుబాటును అణచివేయడానికి ఇస్లామాబాద్ అనుసరించిన వ్యూహాల్లో భాగమని నమ్ముతారు.

కనిపించకుండా పోయిన వారిలో చాలామంది బలూచ్ నేషనలిస్ట్ గ్రూపుల సానుభూతిపరులు లేదా అనుమానిత సభ్యులు. స్వయం ప్రతిపత్తి, స్వాతంత్ర్యాన్ని బలూచ్ నేషనలిస్ట్ గ్రూపులు డిమాండ్ చేస్తాయి. అయితే అదృశ్యమైన వారిలో చాలామంది సాధారణ పౌరులు. వారికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు.

తప్పిపోయిన వ్యక్తుల సమస్యను ఒక క్రమపద్ధతిలో పరిష్కరిస్తున్నామని ఇటీవల ఒక విలేఖరుల సమావేశంలో పాకిస్తాన్ మిలిటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అన్నారు.

ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం 2011 నుంచి బలూచిస్తాన్‌లో అదృశ్యాలకు సంబంధించి 2900కు పైగా కేసులు నమోదైనట్లు అందులో 80 శాతం కేసులు పరిష్కారమైనట్లు ఆయన చెప్పారు.

అయితే, కనిపించకుండా పోయిన వారి సంఖ్య దాదాపు 7000 ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు.

రెండు వర్గాలు వెల్లడించిన ఈ డేటాను నిర్ధారించడానికి సరైన ఆధారాలు అందుబాటులో లేవు.

జన్నత్ బీబీ

ఫొటో సోర్స్, BBC/Nayyar Abbas

ఫొటో క్యాప్షన్, జన్నత్ బీబీ కనిపించకుండా పోయిన తన కుమారుని కోసం వెదుకుతున్నారు

''మౌనంగా ఉండటం పరిష్కారం కాదు''

జన్నత్ బీబీ వంటి మహిళలు అధికారులు వెల్లడించిన గణాంకాలను అంగీకరించట్లేదు.

తన కుమారుడు నజర్ ముహమ్మద్ కోసం ఆమె వెదుకులాట కొనసాగుతోంది. 2012లో ఒక హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా అతన్ని తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు.

''అతన్ని వెదుక్కుంటూ నేను అంతా తిరిగాను. ఇస్లామాబాద్‌కు వెళ్లొచ్చాను. బాధలు, తిరస్కరణలే నాకు ఎదురయ్యాయి'' అని ఆమె చెప్పారు.

క్వెట్టా శివార్లలోని ఒక చిన్న మట్టి ఇంట్లో 70 ఏళ్ల జన్నత్ బీబీ నివసిస్తున్నారు.

బిస్కెట్లు, పాలడబ్బాలు అమ్మే ఒక చిన్న దుకాణాన్ని నడిపే జన్నత్ బీబీకి ఒక్కోసారి నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లడానికి బస్సు చార్జీలు కూడా ఉండవు. కనిపించకుండా పోయిన వారి సమాచారాన్ని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు జరుగుతాయి. కొంత అప్పు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలకు ఆమె హాజరవుతారు.

''మౌనంగా ఉండటం పరిష్కారం కాదు'' అని ఆమె అన్నారు.

మహరంగ్

ఫొటో సోర్స్, BBC/Farhat Javed

ఫొటో క్యాప్షన్, తండ్రి సమాధి వద్ద మహరంగ్

అదృశ్యమైన పురుషుల్లో ఎక్కువ మంది 2006 తర్వాతే కనిపించకుండాపోయారు.

ఒక మిలిటరీ ఆపరేషన్‌లో కీలక బలూచ్ నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్తీ చనిపోయిన సంవత్సరం అది. దీని తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, సాయుధ తిరుగుబాటు ఘటనలు ఎక్కువయ్యాయి.

దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరించింది. ప్రజలు కనిపించకుండాపోవడం పెరగడంతో పాటు వీధుల్లో మృతదేహాలు సంఖ్య కూడా పెరిగింది.

క్వెట్టాకు 275 కి.మీ. దూరంలోని ఒక చిన్న పట్టణం టూటక్‌లో అదృశ్యమైన వ్యక్తుల సామూహిక సమాధుల్ని 2014లో గుర్తించారు.

అందులోని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఛిద్రమై ఉన్నాయి.

ఆ ఫోటోలు దేశాన్ని కుదిపేశాయి. అయితే, బలూచిస్తాన్ ప్రజలకు ఇలాంటి భయానక ఘటనలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.

మహరంగ్ బలూచ్ తండ్రి అబ్దుల్ గఫార్ లాంగోవ్ ఒక ప్రముఖ జాతీయవాద నాయకుడు. బలూచ్ ప్రజల హక్కుల కోసం ఆయన పోరాడారు. 2009 మొదట్లో ఆయన కనిపించకుండా పోయారు. అబ్దుల్ గఫార్ మొదట్లో పాకిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగి. తర్వాత తను నమ్మిన విశ్వాసాల కోసం ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.

లాస్‌బెల్లా జిల్లాలో అబ్దుల్ గఫార్ మృతదేహం దొరికిందంటూ మూడేళ్ల తర్వాత మహరంగ్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

''మా నాన్న మృతదేహం వచ్చినప్పుడు ఆయన ఒంటిపై అవే దుస్తులు ఉన్నాయి. కానీ, చిరిగిపోయి ఉన్నాయి. ఆయన్ను బాగా హింసించారు'' అని మహరంగ్ చెప్పారు.

తండ్రి స్పర్శను అనుభూతి చెందాలని సమాధిని కౌగిలించుకున్నానని, కానీ అలా అనిపించలేదని ఆమె చెప్పారు.

ఆయన అరెస్ట్ అయినప్పుడు మహరంగ్ జైల్లో ఉన్న ఆయన కోసం చాలా ఉత్తరాలు రాశారు

''చాలా ఉత్తరాలు రాశాను. ఈద్ కోసం గ్రీటింగ్ కార్డులు తయారు చేసి పంపాను. కానీ, వాటిని ఆయన తిరిగి పంపించారు. తన జైలు గది ఇలాంటి అందమైన కార్డులు ఉండే స్థలం కాదని చెప్పారు. వాటిని జాగ్రత్తగా ఇంట్లోనే దాచమన్నారు. ఇప్పటికీ మా నాన్నను హత్తుకోవడాన్ని చాలా మిస్ అవుతున్నా'' అని ఆమె చెప్పారు.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

తన తండ్రి మరణం తర్వాత తమ ప్రపంచం కుప్పకూలిందని మహరంగ్ అన్నారు.

తర్వాత 2017లో భద్రతా బలగాలు తన సోదరుడిని తీసుకెళ్లి దాదాపు మూడు నెలలు నిర్బంధించాయని పేర్కొన్నారు.

''అది చాలా భయంకరమైనది. నాన్నకు జరిగినట్లుగా నీకు జరగదంటూ నా సోదరుడికి చెప్పాను. కానీ అదే జరిగింది. నా ఫోన్ చూడాలంటే భయమేసేది. ఎక్కడ మా సోదరుడికి సంబంధించిన దుర్వార్త కనిపిస్తుందో అనే భయపడేదాన్ని'' అని మహరంగ్ వివరించారు.

బలవంతపు అదృశ్యాలు, చట్టవిరుద్ధ హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని మహరంగ్ నిర్ణయించుకున్నారు.

చంపుతామంటూ బెదిరింపులు, కేసులు, నిషేధాలు ఉన్నప్పటికీ 32 ఏళ్ల మహరంగ్, నిరసన ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు.

బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని వారాల తర్వాత శనివారం ఉదయం మహరంగ్‌ను అరెస్ట్ చేశారు.

తప్పిపోయిన వ్యక్తులుగా భావిస్తున్న 13 మంది వ్యక్తుల మృతదేహాలను నగరంలో ఖననం చేశారనే వార్తలతో ఆమె ఆధ్వర్యంలో క్వెట్టాలో ఒక నిరసన జరుగుతోంది.

''నన్ను ఎప్పుడో అరెస్ట్ చేస్తారు. కానీ, నేను భయపడను. ఇది మాకు కొత్తేమీ కాదు'' అని గతంలో మహరంగ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో అదృశ్యమైన తమ ఆత్మీయుల కోసం ఏళ్లుగా వెతుకుతున్న కుటుంబాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)