అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోతుందా? భూమిపై ఎక్కడ పడుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి భూమ్మీదకు తిరిగొచ్చారు.
అయితే, ఇన్నాళ్లు సునీత ఆశ్రయం పొందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2031లో తన మిషన్‌ను ముగించనుంది.
1998లో ఐఎస్‌ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి అంతరిక్ష పరిశ్రమ పురోగతికి ఒక చిహ్నంగా ఉంది.
భూమి నుంచి దాదాపు 400-415 కి.మీ ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రం పొడవు 109 మీటర్లు. అంటే ఒక ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉంటుంది. దీని బరువు 4 లక్షల కిలోలు. దాదాపు 80 ఆఫ్రికన్ ఏనుగుల బరువుకు సమానం.
40కి పైగా జరిగిన అంతరిక్ష కార్యక్రమాలు భూమి నుంచి తీసుకువెళ్లిన వస్తువులను తీసుకొచ్చి అంతరిక్షంలో నిక్షిప్తం చేశాయి.
ఒకవేళ ఈ విశాల అంతరిక్ష కేంద్రం కూలిపోతే ఏం జరుగుతుంది?


ఫొటో సోర్స్, Reuters
ఐఎస్ఎస్ కాలపరిమితి ముగిసిందా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గంటకు 17,500 మైళ్ల వేగంతో అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటుంది.ఇది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అంటే ప్రతిరోజూ భూమి చుట్టూ 16 సార్లు తిరుగుతుంది.
ఇంత వేగంగా పరిభ్రమించే ఇలాంటి ఓ భారీ నిర్మాణం అకస్మాత్తుగా, నియంత్రణ లేకుండా భూ వాతావారణంలోకి ప్రవేశిస్తుందనే ఆలోచనే నిజంగా భయపెడుతుంది. ఈ ప్రమాదం రాకుండా నాసా ఒక నిర్ణయానికి వచ్చింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2031లో మూసేయాలనే నిర్ణయం తీసుకుంది.
ఇందుకో స్పష్టమైన కారణం ఉంది. నిజానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాలపరిమితి ముగిసిపోతోంది.
రష్యా, అమెరికా, కెనడా, జపాన్, ఇతర యూరప్ దేశాలు సంయుక్తంగా 1998లో ఐఎస్‌ఎస్‌ను నిర్మించాయి.
తర్వాత, అనేక దశల్లో దీనికి మెరుగులు దిద్దారు. మొదట 15 ఏళ్లుపాటు పనిచేసేలా దీనిని రూపొందించారు. కానీ శాస్త్రీయ పరిశోధనల్లో, అంతరిక్ష పరిశ్రమలో అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో ఐఎస్‌ఎస్ సాధించిన నిరంతర విజయాల కారణంగా అనేకసార్లు దీని ఉపసంహరణ (డీకమిషనింగ్) వ్యవధిని పొడిగించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (2021) హయాంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పదవీకాలాన్ని 2030 వరకు పొడిగించారు.

ఫొటో సోర్స్, NASA
రష్యా హెచ్చరిక
అంతరిక్ష కేంద్రానికి సంబంధించి 2021లోనే రష్యా ఓ హెచ్చరికను జారీ చేసింది. హార్డ్‌వేర్, సామగ్రి కారణంగా అంతరిక్ష కేంద్రంలో సరిదిద్దలేని సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించింది.
అంతరిక్ష కేంద్రంలోని రష్యా భాగానికి చెందిన 80 శాతం ఇన్‌స్ట్రుమెంటేషన్ వ్యవస్థల గడువు ముగిసిందని రష్యా మాజీ కాస్మోనాట్ వ్లాదిమిర్ సోలోవ్యోవ్ చెప్పారు. పైగా వాటిలో చిన్న చీలికలు కనిపిస్తున్నాయి. కాలం గడిచినకొద్దీ అవి పెద్దవిగా మారొచ్చు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గడువు 2030 వరకు ఇవ్వకూడదని, రెండేళ్లలోపు దాన్ని మూసేయాలని ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవాలన్నారు.
''కక్ష్య నుంచి అంతరిక్ష కేంద్రాన్ని తొలగించాల్సిన సమయం వచ్చింది. దాని నిర్మాణ ఉద్దేశం నెరవేరింది. ఇప్పుడు మనం అంగారక గ్రహంపై దృష్టి పెట్టాలి'' అని ట్వీట్‌లో మస్క్ రాశారు.

ఫొటో సోర్స్, NASA
ఎక్కడ పడుతుంది?
ముందే చెప్పుకున్నట్లుగా ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, భూభ్రమణ సమయంలో కాలానుగుణంగా దాని కక్ష్య, అట్మాస్పిరిక్ డ్రాగ్ ద్వారా ప్రభావితం అవుతుంది. సూర్యుడి ప్రభావం కారణంగా ఒకటి లేదా రెండేళ్లలో తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి వైపు పడిపోతుంది.
భూమిపై నివసించే ప్రజలకు ఇది పెను ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే అంతరిక్ష కేంద్రాన్ని కార్యాచరణలో ఉంచే 'రీ బూస్ట్' ప్రక్రియ జరుగుతోంది.
ఐఎస్‌ఎస్‌ను మూసివేసే పని త్వరలో మొదలవుతుందని నాసా చెబుతోంది.
ఇందులో భాగంగా, తొలి దశలో అట్మాస్పిరిక్ డ్రాగ్ ప్రభావంతో ఐఎస్ఎస్ తనంతట తాను ధ్వంసం అయ్యేలా చూస్తారు. అంటే రీబూస్ట్ ప్రక్రియను తగ్గిస్తారు.
దీనితో పాటు ఐఎస్‌ఎస్ వేగాన్ని తగ్గించే ప్రక్రియనూ ప్రారంభిస్తారు. దీనికోసం అంతరిక్ష నౌక, అంతరిక్ష స్టేషన్‌లో ఉన్న ప్రోగ్రెస్ (రష్యా అంతరిక్ష నౌక) వంటి ఇతర ప్రొపల్షన్ మాడ్యూళ్లను ఉపయోగిస్తారు.
అనవసరమైన మాడ్యూళ్లను వేరు చేసి ఒక్కొక్కటిగా కక్ష్య నుంచి తొలగిస్తారు.
ఈ వ్యవధిలో(2026-2030) ఐఎస్‌ఎస్ ఎత్తు 415 కి. మీ నుంచి క్రమంగా తగ్గుతుంది. తర్వాత ఎత్తు 280 కి.మీ వరకు తగ్గుతుంది.
ఒక ప్రత్యేక అంతరిక్ష నౌక సహాయంతో దాని దూరాన్ని 120 కి.మీ వరకు తగ్గించడానికి చివరి బూస్ట్‌ను అందిస్తారు.
అనుకున్నట్లుగా ఈ ప్రయత్నం విజయవంతమైతే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 120 కి.మీ ఎత్తుకు సమీపిస్తుందని భావిస్తున్నారు.
ఐఎస్‌ఎస్ 120 కి.మీ వరకు చేరుకుంటే, గంటకు 29,000 కి.మీల భయంకరమైన వేగంతో భూ వాతావరణాన్ని ఢీకొంటుంది.
భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో విపరీతమైన వేడి కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అధిక భాగాలు కాలిపోయి నాశనమవుతాయని నాసా చెబుతోంది.
మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని 'పాయింట్ నెమో' (దీనిని అంతరిక్ష వ్యర్థాల వాటికగా చెబుతుంటారు) ప్రాంతంలో పడిపోతాయి. ఇది జనావాసాలు లేని ప్రాంతం కాబట్టి దీనివల్ల ఎలాంటి హాని జరుగదని నాసా చెబుతోంది. సాధారణంగా పనికిరాని అంతరిక్ష నౌకలన్నీ ఈ ప్రదేశంలోనే కూలిపోతాయి.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డీకమిషనింగ్‌కు నాసా గతేడాది జూన్‌లో ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌ను ఎంచుకుంది.
ఇందుకోసం స్పేస్ ఎక్స్‌తో 843 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఫొటో సోర్స్, NASA
ప్రత్యామ్నాయం ఉందా?
ఐఎస్‌ఎస్ మూసి వేయడానికి ముందే ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాలు పనిచేయడం మొదలు పెడతాయని నాసా వెల్లడించింది. లో ఎర్త్ ఆర్బిట్‌లో వాణిజ్య అంతరిక్ష సర్వీసులు ప్రారంభించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఇప్పటికే ఆక్సిమ్ స్పేస్, బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. 2031 తర్వాత చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మనుషులను పంపడంపై దృష్టి సారిస్తామని నాసా తెలిపింది.
దీనితో పాటు ఇతర దేశాలు కూడా తమ సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్మించుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి.
భారత అంతరిక్ష కేంద్రం పేరుతో 2035 నాటికి ఒక స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవడానికి భారత్ ప్రణాళికలు రచిస్తోంది.
దీని మొదటి భాగం 2028లో మొదలవుతుందని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ నిరుడు చెప్పారు. మొదటి భాగం ప్రారంభమైన ఏడేళ్ల తర్వాత భారత్ తన అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించగలుగుతుందని అన్నారు.
చైనా 2022లో తమ అంతరిక్ష కేంద్రానికి చెందిన తొలి మాడ్యూల్ తియాంగెంగ్‌ను భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ప్రస్తుతమున్న అంతరిక్ష కేంద్రాన్ని చాలా దేశాలు కలిసి నిర్మించాయి. కానీ, చైనా మాత్రం ఒంటరిగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2031 తర్వాత కచ్చితంగా తమ అంతరిక్ష కేంద్రం భర్తీ చేస్తుందని చైనా విశ్వసిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














