స్ట్రెచర్‌పై సునీతా విలియమ్స్‌ సహా నలుగురు వ్యోమగాములను ఎందుకు తీసుకెళ్లారు?

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, నందిని వెల్లస్వామి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన తర్వాత నాసా సైంటిస్ట్ విక్టర్ గ్లోవర్‌తో చేసిన ఇంటర్వ్యూను నాసా వెబ్‌సైట్ ప్రచురించింది.

ఆ ఇంటర్వ్యూలో ''భూమిపైకి తిరిగొచ్చాక మీరు మొదట చూసిన వాసన ఏంటి?'' అని ఆయన కూతురు ప్రశ్నించారు.

సముద్రంలో స్టార్‌షిప్ దిగగానే తనకు మొదట సముద్రపు వాసన వచ్చిందని ఆయన బదులిచ్చారు.

''ఆ వాసన, గాలి చాలా అద్భుతం'' అని ఆయన చెప్పారు.

భూమికి తిరిగొచ్చాక కూడా తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన తెలిపారు. అనారోగ్యం బారిన పడటం కానీ, అసౌకర్యానికి గానీ గురికాలేదని చెప్పారు.

అయితే, వ్యోమగాములందరికీ గ్లోవర్‌కు దొరికిన అద్భుత అవకాశం దక్కుతుందా? అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, భూమి మీదకు వచ్చాక వ్యోమగాములకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ అనుభవాన్ని దూరం చేస్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సునీతా విలియమ్స్ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారా, ఎలా వస్తారా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది.

ఐఎస్‌ఎస్‌ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ నౌకలో సునీత, విల్‌మోర్‌లతో పాటు అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు.

నాసా సహాయక సిబ్బంది, డ్రాగన్ అంతరిక్ష నౌక లోపలి నుంచి సునీతా సహ వ్యోమగాములందరినీ స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. ఇలా ఎందుకు చేశారు? అంతరిక్షంలో 9 నెలలకు పైగా ఉన్న తర్వాత సునీతా విలియమ్స్ శరీరంలో ఎలాంటి మార్పులు సంభవించి ఉండొచ్చు?

నాసా

ఫొటో సోర్స్, Getty Images

అంతరిక్షంలో నివసించడం, భూమిపైకి తిరిగిరావడం అనేది కష్టమైన, సవాళ్లతో కూడిన ప్రయాణం. భూమికి తిరిగొచ్చాక కూడా వ్యోమగాములు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం, దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండి భూమిపైకి తిరిగొచ్చాక వ్యోమగాములు మామూలుగా నిలబడలేరు. కనీసం కుదురుగా నడవలేరు.

తమవారిని చూడటానికి వెంటనే నేరుగా ఇంటికి కూడా వెళ్లలేరు. అలాగే వారు మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు.

అంతరిక్షం నుంచి వచ్చాక వ్యోమగాముల శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. వాటి నుంచి వారు ఎలా కోలుకుంటారు? కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది?

శరీరంలో మార్పులు

వ్యోమగాములు, గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో నివసిస్తారు. వారు ప్రతీ గంటన్నరకు ఒకసారి సూర్యోదయాన్ని చూస్తుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రతీ 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది.

ఐఎస్‌ఎస్, భూమికి చీకటి వైపు ప్రయాణించినప్పుడు రాత్రి సమయాన్ని, వెలుతురు వైపు ప్రయాణించినప్పుడు పగలు సమయాన్ని వ్యోమగాములు అనుభవిస్తారు. ఇది వ్యోమగాముల శరీరాలపై ప్రభావం చూపుతుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల కలిగే ప్రభావాల నుంచి వ్యోమగాములు కోలుకోవడానికి రోజులు, వారాలు, కొన్నిసార్లు నెలల సమయం పట్టొచ్చు. వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

నాసా వ్యోమగాములు స్కాట్ కెల్లీ, క్రిస్టినా కోచ్ ఐఎస్‌ఎస్‌లో దాదాపు ఏడాది కాలం గడిపిన తొలి అమెరికన్లుగా గుర్తింపు పొందారు.

స్కాట్ కెల్లీ

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, స్కాట్ కెల్లీ దాదాపు ఒక సంవత్సరం పాటు అంతరిక్షంలో గడిపారు

ఎముకల నుంచి కంటిచూపు వరకు

అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాములు ఎదుర్కొనే తొలి సమస్య ఎముకల సాంద్రత క్షీణించడం.

గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల, భూమిపై ఉన్నప్పటిలా బరువును మోయగలిగేలా వెన్నెముక, పెల్విస్‌ పటిష్టంగా ఉండవు. కాబట్టి అంతరిక్షంలో రోజులు గడిచేకొద్దీ ఎముకల సాంద్రత ప్రతీ నెలకూ 1 నుంచి 1.5 శాతం వరకు క్షీణిస్తుంది.

భూమిపై ఉన్నప్పుడు పనిచేసేకొద్దీ కండరాలు బలపడతాయి. అంతరిక్షంలో శారీరక శ్రమ ఉండకపోవడం వల్ల వ్యోమగాములకు కండరాల సాంద్రత క్షీణిస్తుండటం మరో పెద్ద సమస్య.

కండరాల, ఎముకల బలహీనతను నివారించేందుకు వ్యోమగాములు రోజుకు 2 గంటల పాటు వ్యాయామం చేయాలి.

ఒకవేళ ఇలా వ్యోమగాములు వ్యాయామం చేయకపోతే ఏమవుతుంది?

అంతరిక్షంలో తేలుతూ ఉండి, భూమిపైకి వచ్చాక వ్యోమగాములు నిలబడలేరు, కనీసం నడవలేరు.

ఎముకలు బలహీనపడటం

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఎముక సాంద్రత క్షీణతను పై ఫోటో చూపిస్తుంది

గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శరీరంలో ద్రవాలు పైకి అంటే తలలోకి కదులుతాయి. ఇవి కళ్లపై ఒత్తిడి పెంచి కంటిచూపు సమస్యలకు దారి తీస్తాయి.

దీనితో పాటు ఎక్కువ కాలం అంతరిక్షయానం చేయడం వల్ల బరువు తగ్గడం, నాడీవ్యవస్థలో మార్పులు, చర్మ సమస్యలు వస్తాయని నాసా చెబుతోంది.

''అంతరిక్షంలో ఉన్నప్పుడు మన ఎత్తు పెరుగుతుంది. ఉదాహరణకు భూమి మీద 150 సెం.మీ ఎత్తు ఉన్న వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్లాక 153-154 సెం.మీ వరకు పెరుగుతారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్నునొప్పి, భూమి మీదకు వచ్చాక డిస్క్ జారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల డిస్క్‌లు సాగుతాయి. అందువల్ల ఎత్తు పెరుగుతుంది.'' అని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం మాజీ డైరెక్టర్ పాండియన్ చెప్పారు.

తగు జాగ్రత్తలు తీసుకోకపోతే డీ హైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని నాసా వెబ్‌సైట్‌లో పేర్కొంది.

బుచ్ విల్‌మోర్, సునీతా విలియమ్స్, అలెగ్జాండర్ గోర్బునోవ్, నిక్ హేగ్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, బుచ్ విల్‌మోర్, సునీతా విలియమ్స్, అలెగ్జాండర్ గోర్బునోవ్, నిక్ హేగ్ (వరుసగా ఎడమ నుంచి)

నడవడం, నిలబడటంలో ఇబ్బందులు

అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చాక వ్యోమగాములు ఎదుర్కొనే తొలి సవాలు జీరో గ్రావిటీ నుంచి భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తికి శరీరాన్ని సర్దుబాటు చేసుకోవడం.

''చేతులు-కన్ను మధ్య సమన్వయం, తల-కన్ను మధ్య సమన్వయం, బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొంతమంది వ్యోమగాములు అంతరిక్షంలో తేలుతూ ఉన్నట్లే భూమి మీద కూడా తేలుతున్న అనుభూతిని పొందుతారు'' అని నాసా చెబుతోంది.

కర్ణభేరిలో ఒత్తిడి కారణంగా న్యూరల్ ట్యూబ్ సమస్యలు రావొచ్చని పేర్కొంది.

''బ్యాలెన్స్‌గా ఉండటంలో కర్ణభేరి పాత్ర కూడా ఉంటుంది. కర్ణభేరిలో సమస్యలు వస్తే సరిగ్గా నిలబడం కష్టం అవుతుంది'' అని పాండియన్ చెప్పారు.

అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులు భూమి మీద నిలబడినప్పుడు రక్తపోటులో తేడాల కారణంగా తల తిరగడం, మూర్ఛపోయే అవకాశం ఉంది.

సుదీర్ఘ అంతరిక్షయానం తర్వాత వ్యోమగాములు నిలబడలేరని అందుకే వారిని స్ట్రెచర్‌పై తీసుకెళ్తారని పాండియన్ వివరించారు.

నాసా

ఫొటో సోర్స్, NASA

ఎలాంటి చికిత్సలు, శిక్షణ అవసరం?

అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములను 45 రోజుల పాటు నాసా కేంద్రంలో ఉంచి వారు శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి శిక్షణ ఇస్తారు.

''ఒక యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నవారు ఎలాగైతే తమ పనులు తామే స్వయంగా చేసుకోలేరో, వ్యోమగాముల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వారు వెంటనే లేచి నిలబడి, నడవలేరు. వారు తరచుగా అపస్మారక స్థితిలో ఉంటారు.

తర్వాత వారికి నాలుగు దశలలో రకరకాల శిక్షణలు అందిస్తారు. వామప్‌తో మొదలుపెట్టి స్ట్రెచింగ్, కార్డియోవాస్క్యులర్ వంటి వ్యాయామాలు చేయిస్తారు. అంతరిక్షంలో చేసినట్లు ఇక్కడ కూడా ట్రెడ్‌మిల్స్, సైకిళ్లపై వ్యాయామాన్ని కొనసాగించాలి.'' అని పాండియన్ వివరించారు.

ఒంటరిగా వారు ఇవన్నీ చేయలేరు. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ శిక్షణ పొందుతారు.

కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలు, మసాజ్ థెరపీ, హైడ్రో థెరపీ వంటివి వ్యోమగాములకు అందిస్తారు.

''పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పడుతుంది. ఎందుకంటే క్షీణించిన ఎముకల సాంద్రతను ఒక్కరోజులోనే తీసుకురాలేం. చాలా నెమ్మదిగా అవి సాధారణ స్థితికి వస్తాయి.

వారు మామూలుగా తినలేరు. వైద్య బృందం పర్యవేక్షణలో పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారాన్ని వారికి అందిస్తారు. ఇంకా వారికి ఏవైనా సమస్యలున్నాయో పూర్తిగా పరిశీలించి వాటికి అనుగుణంగా చికిత్స అందిస్తారు'' అని పాండియన్ వివరించారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆహారం తింటున్న శాస్త్రవేత్తలు

మానసిక ఆరోగ్యం

అంతరిక్షంలో ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల మానసిక అలసటకు కారణమయ్యే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి.

చాలా కాలం పాటు కుటుంబాలకు దూరంగా ఉండటం, వివిధ భావోద్వేగాలు వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

ఇవి మానసిక లేదా ప్రవర్తనా సమస్యలకు దారితీస్తాయని నాసా పేర్కొంది.

ఎలాంటి వినోదం లేకుండా అంతరిక్షంలో జీవించేలా వారు శిక్షణ పొంది ఉంటారు.

అదేవిధంగా, భూమికి వచ్చాక మానసికంగా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.

ఇందుకోసం వైద్య నిపుణులతో పాటు కుటుంబ సహకారం కూడా చాలా ముఖ్యమని పాండియన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)