ఇస్రోకు కొత్త చీఫ్ కానున్న నారాయణన్ నేపథ్యం ఏమిటి, ఆయన ఇప్పటిదాకా ఏం చేశారు?

నారాయణన్

ఫొటో సోర్స్, LPSC.GOV.IN/https://x.com/isro

అంతరిక్ష వాణిజ్యంలో బారత్ వాటాను 2 నుంచి10 శాతానికి పెంచాలన్న నారాయణన్ ఇస్రో చీఫ్ కానున్నారు. ఇప్పుడాయన ఆ లక్ష్యాన్ని సాధించగలరా?

ఇస్రో క్యాలెండర్ 2025లో చాలా బిజీగా ఉంది. అందులోనూ జనవరిలో పనులు ఎక్కువగా ఉన్నాయి.

ఇలాంటి కీలక సమయంలో ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ వి. నారాయణన్‌ను నియమిస్తూ జనవరి 7 ,2025న అపాయింట్స్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొంది.

పదకొండవ ఇస్రో చైర్మన్‌గా జనవరి 14న నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న సోమనాథ్ పదవీ కాలం ఆ రోజుతో ముగుస్తుంది. డాక్టర్ వి నారాయణన్ ప్రస్తుతం కేరళలోని వలియమాలలో ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇస్రో

ఫొటో సోర్స్, https://x.com/isro

ఫొటో క్యాప్షన్, 2025లో ఇస్రో క్యాలెండర్ చాలా బిజీగా ఉంది.

"జనవరి చివరిలో మాకు జీఎస్ఎల్వీ ఎంకే-2/ ఐఆర్ఎన్ఎస్ఎస్-1కె మిషన్ ఉంది. గగన్‌యాన్-1 కార్యక్రమంలో భాగంగా మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించుకున్నాం. ఎల్వీఎం3ని ఉపయోగించి కమర్షియల్ శాటిలైట్లను పంపించాల్సి ఉంది. వీటితోపాటు గగన్‌యాన్‌కు సంబంధించి అనేక ప్రయోగాలు వరుసలో ఉన్నాయి. ఇదంతా చూస్తే మాకు చేతి నిండా పని ఉంది" అని ది హిందూతో చెప్పారు డాక్టర్ నారాయణన్.

ఇస్రో

ఫొటో సోర్స్, https://x.com/isro

ఫొటో క్యాప్షన్, ఇస్రో లోగో

అంతరిక్ష వాణిజ్యంలో భారత్ వాటా పెరగాలన్న నారాయణన్

ఇస్రోలో నారాయణన్ 40 ఏళ్లుగా వివిధ విభాగాల్లో పని చేశారు. ముఖ్యంగా రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ నిపుణుడిగా అనేక మిషన్లలో పాల్గొన్నారు.

భారతీయ అంతరిక్ష పరిశోధనలు సంస్కరణల దిశగా పరుగులు తీస్తున్న సమయం, ఇస్రో కీలకమైన భారీ మిషన్లకు సిద్ధమవుతున్న సందర్భంలో ఆయన ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

మానవ సహిత గగన్‌యాన్ స్పేస్ మిషన్, చంద్రయాన్ 4, అంతరిక్షంలో ఇండియన్ స్సేస్ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు లాంటి ప్రాజెక్టులన్నీ 2025 ఇస్రో క్యాలెండర్‌లో ప్రధానంగా ఉన్నాయి.

"ఇది చాలా గొప్ప బాధ్యత, అంతే కాదు ఇస్రోను నడిపించిన మహనీయుల బాటలో నడిచేందుకు వచ్చిన గొప్ప అవకాశం"అని తనకు ఇస్రో చైర్మన్‌గా పని చేసే అవకాశం దక్కడంపై ఆయన ది హిందూ పత్రికకు చెప్పారు.

అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత కీలకమైన రాకెట్ల తయారీలో రాకెట్ ప్రొపల్షన్ విభాగంలో పని చేస్తూ ఆ విభాగానికి డైరెక్టర్ అయ్యారు నారాయణన్.

"అంతరిక్షంలో భారత్ అస్తిత్వాన్ని పెంచడమే నా ప్రాధాన్యాల్లో ముఖ్యమైనది" అని ఆయన గతంలో చెప్పారు.

అంతరిక్ష వాణిజ్యంలో భారత్ వాటాను 2 శాతం నుంచి పది శాతానికి పెంచాలని చెప్పడం ద్వారా నారాయణన్ అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలతో కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కూడా నారాయణన్ గతంలో స్పష్టం చేశారు.

‘స్పేస్ ఎకానమీపై దృష్టిపెట్టాలి’

"స్పేస్ ఎకానమీ మీద మనం ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టలేదు. మన వాటాకు సంబంధించిన లోటు ఇంకా అలాగే ఉంది. మనం 10 శాతం లక్ష్యంగా పెట్టుకున్నాం" అని అన్నారు.

ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలతో కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కూడా నారాయణన్ గతంలో స్పష్టం చేశారు.

నారాయణన్‌ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సి వన్నియ పెరుమాళ్ వ్యవసాయం చేసేవారు. తల్లి తంగమ్మాళ్ గృహిణి. వారిది కన్యాకుమారి జిల్లాలోని మేలకట్టువిలై . ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. నారాయణన్‌తోపాటు ఆయన అన్నాచెల్లెళ్లందరూ గ్రామంలో ఉన్న పాఠశాలలో తమిళ మీడియంలోనే చదువుకున్నారు. నారాయణన్ తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల ఇంటికి కరెంట్ కనెక్షన్ వచ్చింది. టెన్త్ క్లాస్‌లో నారాయణన్ టాపర్‌.

నారాయణన్ ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి. 1989లో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. అందులో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు.

రాకెట్ ప్రొపల్షన్ నిపుణుడిగా గుర్తింపు పొందిన నారాయణన్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, "అంతరిక్షంలో భారత్ అస్తిత్వాన్ని పెంచడమే నా ప్రాధాన్యాల్లో ముఖ్యమైనది" అంటారు నారాయణన్

ఇస్రోలో ఏ హోదాల్లో పనిచేశారంటే...

1984 ఫిబ్రవరి 1న ఇస్రోలో చేరినప్పుడు ఆయన విక్రమ్ సారాబాయ్ స్సేస్ సెంటర్‌లో సాలిడ్ ప్రొపల్షన్ మీద పని చేశారు. 1989లో క్రయోజనిక్ ప్రొపల్షన్ కోసం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌లో చేరారు.

"క్రయోజనిక్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయన సేవల వల్ల ప్రపంచంలోని ఆరు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా ఈ విభాగంలో భారత్ స్వయం సంవృద్ధి సాధించింది. అంతే కాదు. ఆయన రానున్న ఇరవై ఏళ్లకు ఇస్రో ప్రొపల్షన్ విభాగం ఏం చేయాలనే దాని గురించి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు" అని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ తెలిపింది.

లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌లో ఆయన బృందం ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో ఉపయోగించే సెమీ క్రయోజనిక్ అండ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీస్‌పై కృషి చేస్తోంది.

డాక్టర్ నారాయణన్ ఎన్‌కే కవితారాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

రాకెట్ ప్రొపల్షన్ నిపుణుడిగా ఆయన ఇస్రోకు సంబంధించిన అనేక మిషన్లలో కీలకమైన వ్యక్తిగా మారారు. క్రయోజనిక్ టెక్నాలజీతోపాటు చంద్రయాన్ వన్, టూ మిషన్లు, మంగళయాన్, ఆదిత్య ఎల్ వన్ మిషన్లలో పాలు పంచుకున్నారు. అంతే కాదు ఇస్రో చేపట్టనున్న మిషన్లలోనూ ఆయన పాత్ర కీలకంగా ఉంది.

జనవరి 14న పదవీ విరమణ చెయ్యబోతున్న సోమనాథ్ 2022 జనవరిలో ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇస్రో చైర్మన్‌గా ఉన్నప్పుడే భారత్ చంద్రుడి మీదకు రోవర్‌ను పంపించింది.

చంద్రుడి దక్షిణ ధృవం మీదకు రోవర్ పంపిన తొలి దేశంగా గుర్తింపు పొందింది.

చంద్రుడి మీద సాఫ్ట్ లాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత దేశం నిలిచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)