భూమికి, స్పేస్‌క్రాఫ్ట్‌కు మధ్య కమ్యూనికేషన్ తెగిపోతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, శారద.వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్పేస్ కమ్యూనికేషన్ అనేది దూరంగా ఉన్నవారికి సందేశం (మెసేజ్) పంపడం లాంటిది. ఆ మెసేజ్ మీకు చేరడానికి కొన్నిసార్లు నిమిషాలు, మరికొన్నిసార్లు గంటల సమయం పట్టొచ్చు.
ఎన్నో ఆధునిక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ, కమ్యూనికేషన్‌లో కొన్నిసార్లు అంతరాయాలు ఎదురుకావొచ్చు. అలాంటప్పుడు, అంతరిక్షంలోని వ్యోమగాములకు - భూమిపై ఉన్న కంట్రోల్ సెంటర్‌కి మధ్య కమ్యూనికేషన్ తెగిపోతుంది.
అలాంటి సమయాల్లో ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారు? స్పేస్‌క్రాఫ్ట్స్ ఎలా స్పందిస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
స్పేస్ కమ్యూనికేషన్ ఎలా పనిచేస్తుంది?
ఒక వాకీ - టాకీని ఊహించుకోండి. ఇందులో, ఒకవైపు సందేశం పంపేవారు ఉంటారు. మరోవైపు ఆ సందేశాన్ని స్వీకరించేవారు ఉంటారు. స్పేస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(అంతరిక్ష సమాచార సాంకేతికత)లు కూడా అదేవిధంగా పనిచేస్తుంది.
అంతరిక్షంలోని స్పేస్‌క్రాఫ్ట్‌లో సిగ్నల్స్ పంపేందుకు ట్రాన్స్‌మిటర్ ఉంటుంది. ఆ సందేశాన్ని రిసీవ్ చేసుకోవడానికి భూమిపై భారీ యాంటెన్నాలు (రిసీవర్లు) ఉంటాయి. అలాగే, భూమి నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌కు, అక్కడి నుంచి భూమికి సంకేతాలు పంపడంలో స్పేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ కీలకపాత్ర పోషిస్తుంది.

ఫొటో సోర్స్, NASA
భారీ యాంటెన్నాలు
స్పేస్ కమ్యూనికేషన్‌లో రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. స్పేస్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు భారీ యాంటెన్నాలను వినియోగిస్తారు.
వాటికి అందుబాటులో ఉన్న సిగ్నల్స్‌ను అవి రిసీవ్ చేసుకుని, అందిస్తాయి.
అంతరిక్షంలో ఉన్న స్పేస్‌క్రాఫ్ట్ దిశలోనే ఈ యాంటెన్నాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి అంతరాయాలు లేకుండా సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకోగలవు.
స్పేస్‌క్రాఫ్ట్‌కు అనుగుణంగా కదిలేలా ఈ యాంటెన్నాలను రూపొందిస్తారు.
భూభ్రమణం కారణంగా స్పేస్‌క్రాఫ్ట్ దిశ నుంచి యాంటెన్నాలు పక్కకు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి భూమిపై వేర్వేరు ప్రదేశాల్లో ఈ యాంటెన్నాలను ఏర్పాటు చేస్తారు.
డీప్ స్పేస్ కమ్యూనికేషన్
భూకక్ష్యకు సమీపంలో ఉన్న వాటికంటే, దూరంగా ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌లతో కమ్యూనికేట్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీలు అవసరం.
ఈ కమ్యూనికేషన్‌ను డీప్ స్పేస్ కమ్యూనికేషన్‌గా వ్యవహరిస్తారు. గ్రహాలు, చంద్రుడిపై ఎలా ఉంటుంది, ఉల్కల స్వభావం వంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ సాయపడుతుంది.
అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా తన సొంత డీప్ స్పేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది.
భూ భ్రమణం కారణంగా స్పేస్‌క్రాఫ్ట్‌లతో సమాచార సంబంధాలు కోల్పోకుండా ఉండేందుకు భూమిపై మూడు వేర్వేరు ప్రదేశాల్లో భారీ యాంటెన్నాలను ఏర్పాటు చేసుకుంది నాసా. అవి కాలిఫోర్నియా, స్పెయిన్, ఆస్ట్రేలియాల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యాధునికమైన, బలమైన డీప్ స్పేస్ కమ్యూనికేషన్ వ్యవస్థ నాసాకు ఉంది.
నాసా ఏర్పాటు చేసుకున్న భారీ యాంటెన్నాల వ్యాసం(డయామీటర్) 70 మీటర్లు. అంటే, అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే ఫుట్‌బాల్ స్టేడియం పరిమాణం మూడొంతులు అనుకుంటే, అందులో రెండొంతులు ఉంటుంది. ఈ యాంటెన్నా బరువు 2,700 టన్నులు. ఇవి బిలియన్ మైళ్ల దూరంలో ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌లను కూడా ట్రాక్ చేయగలవు.

ఫొటో సోర్స్, NASA
అంతరిక్షంలో, సౌర వ్యవస్థకు అవతల కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడాన్ని ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ కమ్యూనికేషన్ అంటారు. నాసా ప్రయోగించిన వోయేజర్ 1, వోయేజర్ 2 అనే రెండు ఉపగ్రహాలు మాత్రమే అక్కడి వరకు చేరుకున్నాయి. నాసాకి చెందిన భారీ యాంటెన్నాలు ఆ ఉపగ్రహాలతో కూడా కమ్యూనికేట్ చేయగలవు.
కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఏర్పాటు చేసిన ఈ కమ్యూనికేషన్ సెంటర్లలో భారీ యాంటెన్నాలతో పాటు చిన్నచిన్న యాంటెన్నాలు కూడా ఉన్నాయి. ఒకే సమయంలో, ఒకటి కంటే ఎక్కువ స్పేస్‌క్రాఫ్ట్‌లను ట్రాక్ చేయడానికి, వాటితో కమ్యూనికేట్ చేయడానికి, ఆదేశాలు పంపడానికి ఇవి ఉపయోగపడతాయి.
అలాగే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా డీప్ స్పేస్ కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏజెన్సీకి స్పెయిన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనాల్లో 35 మీటర్ల వ్యాసం కలిగిన భారీ యాంటెన్నాలు ఉన్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి ''బెంగళూరులో 32 మీటర్ల వ్యాసమున్న యాంటెన్నా ఉంది. చంద్రయాన్ ప్రాజెక్ట్ సమయంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసి ఉపయోగించారు. భారత్‌కు దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ కలిపి 18 సెంటర్లు ఉన్నాయి, వీటిలో 18 మీటర్ల వ్యాసం కలిగిన రెండు యాంటెన్నాలు కూడా ఉన్నాయి'' అని ఇస్రో మాజీ చైర్మన్ శివన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు, వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం రేడియో తరంగాలకు బదులు లేజర్ వినియోగం దిశగా కృషి చేస్తున్నారు.
స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్ ఏయే సందర్భాల్లో తెగిపోవచ్చు?
ఇన్ని రకాల కమ్యూనికేషన్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ, స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్ కోల్పోయే అవకాశాలు ఉంటుంటాయి. వీటిలో కొన్ని ఊహించగలిగినవి. మరికొన్ని ఊహకందనివి.
ఒక అంతరిక్ష నౌక అంతరిక్షంలోని ఏదైనా వస్తువుని దాటి, దాని వెనుకగా వెళ్తున్నప్పుడు భూమితో సంబంధం కోల్పోతుంది. అయితే, అది ఎలా, ఎప్పుడు జరుగుతుందో ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న వారికి తెలుస్తుంది కాబట్టి, అలాంటి సమయంలో భూమిపై నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా స్పేస్‌క్రాఫ్ట్ దానంతట అదే పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసి ఉంటాయి.
ఇలాంటివి కాకుండా, ఏవైనా లోపాల కారణంగా భూమికి - స్పేస్‌క్రాఫ్ట్‌కు మధ్య కమ్యూనికేషన్ తెగిపోవచ్చు. అలాంటి సమయంలో, వ్యోమగాములు ఏం చేయాలనే దానిపై వారికి ముందుగానే శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, NASA
స్పేస్‌క్రాఫ్ట్‌కు, భూమికీ కమ్యూనికేషన్ తెగిపోతే..?
''అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలో ఆస్ట్రోనాట్స్‌కు శిక్షణ ఇస్తారు. ఎప్పుడూ మరో ప్లాన్ సిద్ధంగా ఉంటుంది. అది స్పేస్‌క్రాఫ్ట్‌కు కూడా వర్తిస్తుంది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ (మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రాజెక్ట్) సమయంలో, ఒకవేళ స్పేస్‌క్రాఫ్ట్ నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవ్వకపోతే, మరే ఇతర ప్రదేశాల్లో ల్యాండింగ్ అవ్వొచ్చు, ఆ ల్యాండింగ్ ఎలా జరగాలి వంటి ఆదేశాలు స్పేస్‌క్రాఫ్ట్‌కు ముందే నిర్దేశించి ఉంటుంది. భూమితో కమ్యూనికేషన్ ఆగిపోయినంత మాత్రాన ప్రతీదీ ఆగిపోతుందని కాదు'' అని ఇస్రో మాజీ డైరెక్టర్ మయిల్‌సామి అన్నాదురై బీబీసీతో చెప్పారు.
"స్పేస్‌క్రాఫ్ట్‌లో లోపాలు తలెత్తితే ఆస్ట్రోనాట్స్ వాటిని సరిచేయగలరు, దానిపై వారికి శిక్షణ ఇస్తారు" అని చెప్పారు.
''ఆటోమేటెడ్ కారు నడుపుతున్నప్పుడు ఏదైనా లోపం తలెత్తితే వెంటనే కారును డ్రైవర్ నియంత్రణలోకి తీసుకుంటారు. అలాగే, స్పేస్‌క్రాఫ్ట్ విషయంలోనూ జరుగుతుంది. అనుకోకుండా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే ఆస్ట్రోనాట్స్ దానిని సరిచేయగలరు. కాకపోతే, స్పేస్‌క్రాఫ్ట్ బయట ఏదైనా సమస్య తలెత్తితే, వాళ్లేమీ చేయలేరు'' అని ఆయన వివరించారు.
2023లో, హ్యూస్టన్‌లోని నాసా భవనంలో విద్యుత్ అంతరాయం కారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)తో కమ్యూనికేషన్ తెగిపోయింది.
ఆ సమయంలో, వాయిస్ మెసేజ్‌లతో సహా ఎలాంటి కమ్యూనికేషన్ వీలుపడలేదు. ఆ సమయంలో, రష్యన్ స్పేస్ కమ్యూనికేషన్ సాయంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయినట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు సమాచారం అందించింది.
అయితే, బ్యాకప్ కంట్రోల్ సెంటర్స్ వెంటనే పనిచేయడం మొదలుపెట్టాయని, 90 నిమిషాల్లోనే భూమితో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించాయని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మేనేజర్ జోయెల్ మాంటల్బానో తెలిపారు.
అంగారకుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సమాచారం చేరడానికి 4 నిమిషాలు పడుతుంది. అదే భూమి నుంచి గరిష్ఠ దూరంలో ఉన్నప్పుడు 24 నిమిషాలు పడుతుంది.
''వివిధ కారణాల వల్ల ఈ సమయం మారుతుంది. సందేశాన్ని పంపుతున్న దూరమెంత, ఆ సందేశాన్ని టెక్స్ట్, ఆడియో, లేదా వీడియో రూపంలో పంపుతున్నారా వంటి విషయాలను అనుసరించి ఏ టెక్నాలజీ వినియోగించాలనేది ఆధారపడి ఉంటుంది'' అని అన్నాదురై చెప్పారు.
గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం భారత్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తోంది.
"దీని ద్వారా అంతరిక్షం నుంచి 24 గంటలూ సమాచారం పొందవచ్చు. ట్రాకింగ్ అండ్ డేటా రిలే శాటిలైట్‌గా పిలిచే ఈ వ్యవస్థ ఇప్పటికే నాసా దగ్గర ఉంది. భారత్ సొంతంగా దానిని అభివృద్ధి చేస్తోంది" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














