‘అంతరిక్షంలోకి సమోసా, భగవద్గీత తీసుకెళ్లా’ అన్న సునీతా విలియమ్స్ భారతీయ మూలాల కథ ఏంటి?

సునితా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు ప్రయాణిస్తున్న స్పేస్‌క్రాఫ్ట్ భూమిపై దిగుతుంది.

సునీతా విలియమ్స్ 9 సార్లు, 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్‌వాక్స్ చేయడంతో... స్పేస్‌వాక్స్‌లో అత్యంత అనుభవం ఉన్న రెండో మహిళగా పేరొందారు.

''అంతరిక్షం నుంచి మనం నివసించే భూమిని చూసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తాను.'' అని తన స్పేస్ మిషన్ల గురించి మాట్లాడిన సందర్భంగా సునీతా విలియమ్స్ అన్నారు.

ప్రస్తుతం మరో అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకుని, భూమిపైకి వస్తున్నారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్‌కు, బుచ్ విల్‌మోర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా అసలు సునీతా విలియమ్స్ జీవితం ఏంటి ? భారత్‌లో ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? అనే విషయాలు మనం తెలుసుకుందాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, DINESH PATEL

ఫొటో క్యాప్షన్, సునీతా విలియమ్స్ భారత్‌‌కు వచ్చినప్పుడు తీసిన ఫోటో

సునీతా విలియమ్స్ అమెరికాలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి భారతీయుడు. సునీత లిన్ విలియమ్స్ భారత మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి.

సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఝులాసన్‌లో పుట్టి పెరిగారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఝులాసన్‌ ఉంటుంది.

సునీత విలియమ్స్ తన అంతరిక్ష యాత్రల తర్వాత 2007, 2013లో రెండుసార్లు ఝులాసన్‌కు వచ్చారు.

దీపక్ పాండ్యా ఒక డాక్టర్. అహ్మదాబాద్‌లో వైద్య విద్య చదివిన తర్వాత, తన సోదరుడు అమెరికాలో ఉండటంతో ఆయన కూడా అక్కడికి వెళ్లారు.

అక్కడే స్లోవెనియన్ సంతతికి చెందిన ఉర్సులిన్ బోనీని పెళ్లాడారు. వారికి ముగ్గురు సంతానం. సునీతా విలియమ్స్ 1965లో ఓహాయోలో పుట్టారు.

సునీత తండ్రి హిందువు కాగా, తల్లి క్యాథలిక్. తన ఇంట్లో అన్ని మతాల వారిని గౌరవించడం ఆమె నేర్చుకున్నారు.

సునీత తండ్రి భగవద్గీత పట్టుకుని ఆదివారాలు చర్చికి వెళ్లేవారు. రామాయణ, మహాభారతంలో ఉన్న కథలను పిల్లలకు చెప్పేవారు దీపక్ పాండ్యా.

దీంతో, భారతీయ సంప్రదాయంతో వారికి అనుబంధం ఏర్పడింది.

తండ్రితో సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తండ్రి దీపక్ పాండ్యాతో 2007లో భారత్ వచ్చిన సునీత

వ్యాయామంపై సునీతా విలియమ్స్ ఎక్కువగా దృష్టి పెట్టేవారు. సునీత, ఆమె తోబుట్టువులు స్విమ్మింగ్ నేర్చుకున్నారు.

ఉదయం రెండు గంటలు, స్కూల్ అయిన తర్వాత సాయంత్రం రెండు గంటలు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవారు.

సునీతకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఆరేళ్ల నుంచే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ.. పలు పతకాలను సాధించారామె.

జంతువులపై ఉన్న ప్రేమతో ఆమెకు వైద్య విద్యపై ఆసక్తి పెరిగింది. ఈ కారణంతోనే ఆమె పశు వైద్యురాలు కావాలనుకున్నారు.

కానీ, కాలం ఆమెను మరో దారిలో నడిపించింది. సునీతా పశు వైద్యురాలు కావడం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆమె కోరుకున్న కాలేజీలో సీటు రాలేదు. ఆ తర్వాత తన సోదరుడి సూచన మేరకు యూఎస్ నేవల్ అకాడమీలో చేరారు.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కల్పనా చావ్లా తర్వాత సునీతా విలియమ్స్ భారత మూలాలున్న అమెరికా వ్యోమగామి

నేవీలో సాహసోపేతమైన జీవితం మొదలైంది..

వ్యోమగామిగా పలు డేరింగ్ మిషన్లను సునీతా విలియమ్స్ చేపట్టినప్పటికీ, ఆమె వృత్తి జీవితం మాత్రం నేవీలోనే మొదలైంది.

1983లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరిన ఆమె, 1987లో ఫిజికల్ సైన్స్‌లో డిగ్రీని పొందారు.

అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత, 1989లో ట్రైనీ పైలట్‌గా నేవీలో చేరారు. ఆమె 30 వేర్వేరు రకాల విమానాలను 2700 గంటలకు పైగా నడిపారు.

సునీత విలియమ్స్ మొదట ఒక నేవల్ ఏవియేటర్‌గా పనిచేశారు.

1993లో మేరీల్యాండ్‌లో నేవల్ టెస్ట్ పైలట్‌ స్కూల్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సమయంలోనే హ్యూస్టన్‌లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్‌ను సందర్శించారు.

చంద్రుని మీదకు వెళ్లొచ్చిన ఆస్ట్రోనాట్ జాన్ యంగ్‌తో కలిసి ఆమె పనిచేశారు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన సునీతా విలియమ్స్, నాసాకు దరఖాస్తు చేసుకున్నారు.

కానీ, ఆ దరఖాస్తు రిజెక్ట్ అయింది. కానీ, సునీతా వెనకడుగు వేయలేదు. 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీని పొందారు. 1997లో మళ్లీ నాసాకు దరఖాస్తు చేసుకున్నారు.

1998లో తొలిసారి సునీతాను ట్రైనీ వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది.

తొలిసారి ఆమె 2006 డిసెంబర్ 9న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్‌పెడిషన్ 14 బృందంతో కలిసి పనిచేశారు. ఎక్స్‌పెడిషన్ 15 స్పేస్‌క్రాఫ్ట్‌పై కూడా పనిచేశారు. 2007 జూన్ 22న భూమికి తిరిగి వచ్చారు.

రెండోసారి 2012 జులై 15న అంతరిక్షానికి వెళ్లారు. అదే ఏడాది నవంబర్ 19న తిరిగి వచ్చారు.

వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి వ్యోమగామిగా 2015లో సునీతా విలియమ్స్ పేరును ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్‌ను కొనసాగించిన సునీతా విలియమ్స్, 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

కానీ, వారిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో, వారిని తీసుకురాకుండానే స్టార్‌లైనర్ తిరిగి భూమిపైకి వచ్చింది.

దీంతో, ఈసారి అంతరిక్ష యాత్ర 8 రోజులు కాస్త 9 నెలలు అయింది.

59 ఏళ్ల సునీతా విలియమ్స్ తన అంతరిక్ష ప్రయాణాల్లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. అక్కడే నెలల పాటు ఉండాల్సి వచ్చినా...ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు నాసా తెలిపింది.

సునీతా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ప్రేమ..పెళ్లి.. భగవద్గీత

నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే మైఖేల్ విలియమ్స్‌తో పరిచయం ఏర్పడింది.

అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వారు మళ్లీ కలుసుకోలేదు. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ పెళ్లిలో కలిశారు. స్నేహం మళ్లీ చిగురించి అది ప్రేమగా మారింది.

రెండేళ్ల డేటింగ్ తర్వాత 1987లో మైఖేల్, సునీతాలు పెళ్లి చేసుకున్నారు.

ఆమె ప్రముఖ వ్యోమగామి అయినప్పటికీ, వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎక్కువగా బయటికి చెప్పలేదు.

అంతరిక్ష ప్రయాణాలకు వెళ్లినప్పుడు తనతోపాటు సమోసా తీసుకెళ్లినట్లు 2013లో విద్యార్థులతో మాట్లాడుతూ సునీతా చెప్పారు.

చదువుకోవడానికి ఉపనిషత్తులు, భగవద్గీతను కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

భారతీయ ఆహారంపై ప్రశంసలు కురిపిస్తూ, .అసలు ఈ ఆహారం ఎవరికీ నచ్చకపోవడం అనేది ఉండదని విద్యార్థులతో చెప్పారు.

''ఇవి నా హృదయానికి చాలా దగ్గర. నా తండ్రి నాకు బహుమతిగా ఇచ్చారు. ప్రతి ఒక్కరి లాగానే నేను అంతరిక్షంలో ఉన్నాను అని చూపించేందుకు ఇవి నాకు సాయం చేస్తాయి.'' అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,డి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)