సునీత, విల్‌మోర్‌లతో బయలుదేరిన డ్రాగన్ స్పేస్ క్యాప్సుల్, 17 గంటల్లో భూమికి చేరే అవకాశం..

ఫొటో సోర్స్, NASA
- రచయిత, రెబెకా మోరెల్లె, అలిసన్ ఫ్రాన్సిస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత, చివరికి ఈరోజు భూమిపైకి బయలుదేరారు. వారు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సుల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి విడివడి, భూమివైపు ప్రయాణం ప్రారంభించింది.
నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌తో కలిసి స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఇద్దరు భూమిపైకి వస్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వారిని తీసుకు వచ్చే స్పేస్‌క్రాఫ్ట్ మార్చి 18న (మంగళవారం) గ్రీనిచ్ కాలమానం ప్రకారం ఉదయం 5.05కి (భారత కాలమానం ప్రకారం ఉదయం 10.35కు) అంతరిక్షం నుంచి విడిపోతుందని (అన్‌డాకింగ్) నాసా ఇంతకు ముందే తెలిపింది. అనుకున్న సమయానికే అన్ డాకింగ్ పూర్తయి, స్పేస్ క్రాఫ్ట్ బయలు దేరింది.
ఈ నౌక దాదాపు 17 గంటలు ప్రయాణించి, ఫ్లోరిడా తీర ప్రాంతంలోని జలాల్లో మంగళవారం రాత్రి గ్రీనిచ్ కాలమానం ప్రకారం 21.57కు ( అంటే భారత కాలమానం ప్రకారం మార్చి 19 (బుధవారం) తెల్లవారుజామున 3.27కు) దిగుతుందని నాసా తెలిపింది.
ఈ ప్రక్రియనంతా అంటే అన్‌డాకింగ్ నుంచి స్పేస్‌క్రాఫ్ట్ ఫ్లోరిడా తీర ప్రాంతంలోని జలాల్లో దిగే వరకు లైవ్ కవరేజీ ఇస్తోంది నాసా.
అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే, ల్యాండింగ్ సమయం మారొచ్చు.

సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు భూమిపైకి రావడంపై ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే, చివరి దశలో జరిగే ఈ ప్రయాణం అంత సులువైనది కాదు.
అత్యంత వేగంగా, మండుతున్న అగ్నిగోళంలా భూవాతావరణంలోకి వచ్చే స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్, 1600 సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.
ఆ తర్వాత మెల్లగా వేగాన్ని తగ్గించుకున్నప్పుడు, వ్యోమగాములు జీ-ఫోర్స్‌లను (గ్రావిటేషనల్ ఫోర్స్) ఎదుర్కొంటారు. ఇది భూ గురుత్వాకర్షణ శక్తి కంటే నాలుగింతలు ఎక్కువగా ఉంటుంది.
చివరికి నాలుగు అతిపెద్ద పారాచూట్లు తెరుచుకుని, ఈ స్పేస్‌క్రాఫ్ట్ మెల్లగా సముద్రంలో దిగుతుంది.
ఇది చాలా థ్రిల్లిగ్ రైడ్ అని బ్రిటన్‌కు చెందిన తొలి వ్యోమగామి హెలెన్ షర్మాన్ అన్నారు.
‘‘వారు అనుభవమున్న వ్యోమగాములు. కానీ, తిరిగి భూమిపైకి రావడాన్ని చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతారు.'' అని ఆమె బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఎవరు?
సునీతా విలియమ్స్ గురించి..
సునీతా విలియమ్స్ తండ్రి భారత సంతతికి చెందిన వ్యక్తి. తల్లి స్లోవెనియన్ సంతతికి చెందిన మహిళ.
సునీతా వయసు యూఎస్ నేవల్ అకాడమీ నుంచి 1987లో ఫిజికల్ సైన్స్‌లో డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీని పొందారు.
1998లో తొలిసారి సునీతాను వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. ఈ అంతరిక్ష ప్రయాణానికి ముందు, ఆమె రెండు స్పేస్ మిషన్లను చేపట్టారు.
అంతరిక్ష కేంద్రానికి రష్యా అందించే సహకారానికి రష్యన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి మాస్కోలో కూడా ఆమె పనిచేశారు.
ఆ తర్వాత రోబోటిక్స్ డివిజన్ కోసం వర్క్ చేశారు. సునీతా విలియమ్స్ అంతకుముందు రెండు మిషన్లలో మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపారు.
ఆమె తొమ్మిది స్పేస్‌వాక్స్ చేపట్టిన మహిళగా రికార్డు పొందారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యారీ 'బుచ్' విల్‌మోర్ గురించి..
బుచ్ విల్‌మోర్ వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. టెన్నెస్సీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్, మాస్టర్ సైన్స్ డిగ్రీలను పొందారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ నుంచి ఏవియేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్ సైన్స్ డిగ్రీని సాధించారు.
ఆయనకు విస్తృతమైన సైనిక అనుభవం ఉంది. అమెరికా నేవీలో ఆఫీసర్‌గా, పైలట్‌గా కూడా పనిచేశారు. 8 వేలకు పైగా ఫ్లయిట్ అవర్స్‌ను, 663 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ల్యాండింగ్స్‌ను చేపట్టారు.
2000 జూలైలో నాసా ఆయన్ను వ్యోమగామిగా ఎంపిక చేసింది. యునైటెడ్ స్టేట్స్ నేవీ నుంచి పదవీ విరమణ పొందిన కెప్టెన్ ఆయన.
బుచ్ రెండు అంతరిక్ష యాత్రలతో అనుభవం సంపాదించారు. స్పేస్‌లో ఇప్పటి వరకు ఆయన 178 రోజులు గడిపారు. తాజా మిషన్‌లో ఆయన గడిపిన సమయంతో అంతరిక్షంలో ఆయన ఉన్న రోజులు మరింత పెరగనున్నాయి.
చివరి మిషన్‌లో ఆయన ఎక్స్‌పెడిషన్ 41కు ఫ్లయిట్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఎక్స్‌పెడిషన్ 42 బృందం వచ్చిన తర్వాత ఐఎస్ఎస్‌కు కమాండ్‌గా వ్యవహరించారు. మార్చి 2015లో భూమిపైకి తిరిగి వచ్చారు. ఆ మిషన్‌లో 167 రోజులు అంతరిక్షంలో గడిపారు. నాలుగు స్పేస్‌వాక్స్ చేపట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,డి ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














