ఔరంగజేబు: ఖుల్తాబాద్‌లోని ఈ మొగల్ చక్రవర్తి సమాధిని కూల్చేయాలని డిమాండ్లు, స్థానికులు ఏమంటున్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీకాంత్ బంగాలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
"భారతదేశంలో కొంతమంది విద్వేషపు దుకాణాలు తెరిచారు. వీళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రతిరోజూ దేశంలో నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు" మహారాష్ట్రలోని ఖుల్తాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి షేక్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలివి.
ఖుల్తాబాద్ పట్టణం ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు సమాధి ఇక్కడే ఉంది. దాన్ని కూల్చివేయాలనే డిమాండ్ ప్రస్తుతం ఊపందుకుంది.
షేక్ ఇక్బాల్‌కు ఈ ప్రాంతంలో పూలు, ప్రసాదాలు అమ్ముకునే షాప్ ఉంది.
ఖుల్తాబాద్‌లో ఔరంగజేబు సమాధి ఉన్న ప్రాంతానికి మార్చి 13న బీబీసీ బృందం వెళ్లింది. అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. సమాధిని ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం ఉందని పోలీసులు చెప్పారు.
ఔరంగజేబు సమాధి ప్రవేశ ద్వారం దగ్గర ఒక బోర్డు ఉంది. ‘‘ఇది రక్షిత స్మారక చిహ్నం, దీనిని ధ్వంసం చేసినా లేదా పాడు చేసినా భారత పురావస్తు శాఖ చట్టం ప్రకారం 3 నెలల జైలు శిక్ష లేదా రూ. 5,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు.’’ అని దానిపై ఉంది.


సమాధి వద్ద పోలీసుల మోహరింపు
బీబీసీ బృందంలోని సభ్యుల పేర్లు, మొబైల్ నంబర్లు, చిరునామా, ఆధార్ నంబర్లను పోలీసులు తమ రిజిస్టర్‌లో రాసుకున్నారు. మొబైళ్లు, బ్యాగులతో సహా వస్తువులన్నింటినీ తీసుకున్నారు. ఆ తర్వాతే సమాధిని సందర్శించడానికి అనుమతించారు.
ఔరంగజేబు సమాధి చాలా సాదాసీదాగా ఉంది. సమాధి మీద మట్టి ఉంది. దానిపై ఒక మొక్క ఉంది.
సమాధికి చుట్టుపక్కల చాలా షాపులు ఉన్నాయి. అందులోనే షేక్ ఇక్బాల్ దుకాణం కూడా ఉంది. ఆయన పూలదండలు, ప్రసాదాలు అమ్ముతారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఔరంగజేబు గురించి ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నారని ఇక్బాల్ ఆరోపించారు.
"300 సంవత్సరాల కిందట ఏం జరిగిందో అల్లాకు బాగా తెలుసు. అఫ్జల్ ఖాన్ సమాధికి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన వారసులు ఇప్పటి వరకు రక్షణ కల్పించారు. ఔరంగజేబు సమాధి కూడా ఇక్కడ 300 ఏళ్లుగా ఉంది. దానిని కూడా అలాగే రక్షించాలి.’’ అని ఇక్బాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'వివాదాస్పద ప్రకటనలు'
ఇక్కడే ఖుల్తాబాద్ పట్టణ మాజీ మేయర్, అడ్వకేట్ కూడా అయిన ఖైస్రుద్దీన్‌ను బీబీసీ బృందం కలిసింది.
‘‘ ఔరంగజేబు గురించి ఇంతకుముందూ వివాదం ఉంది, ఇప్పుడు కూడా జరుగుతోంది. కానీ చేస్తున్న ప్రకటనలను చూస్తుంటే ఇది ఒక రాజకీయ స్టంట్ అనిపిస్తుంది. నాయకుడు కావాలనుకునే వారు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ రాత్రికి రాత్రే పాపులర్ అయి, హీరోగా మారుతున్నారు. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్." అని అభిప్రాయపడ్డారు ఖైస్రుద్దీన్.
మేం స్థానికులతో మాట్లాడుతుండగా, కొంతమంది పర్యాటకులు ఔరంగజేబు సమాధిని చూడటానికి వస్తున్నారు. వారిలో కొందరు విదేశాల నుంచి వచ్చారు.

ఫొటో సోర్స్, Kiran Sakale
వ్యాపారంపై ప్రభావం
ఖుల్తాబాద్ మతపరమైన, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. భద్ర మారుతి ఆలయం ఇక్కడ ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం. ఖుల్తాబాద్ ప్రాంతంలో గిరిజీ దేవి, దత్ ఆలయాలూ ఉన్నాయి.
అంతేకాదు, సూఫీ ఉద్యమ సమయంలో ఖుల్తాబాద్ కీలక ప్రాంతంగా ఉండేది. దేశ, విదేశాల నుంచి సూఫీలు ఈ ప్రదేశానికి వచ్చేవారు. చాలామంది సమాధులు ఖుల్తాబాద్‌లో ఉన్నాయి. హిందూ-ముస్లిం ఐక్యతకు ఖుల్తాబాద్ చిహ్నంగా నిలిచిందని ఇక్కడి ముస్లిం వ్యాపారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, kiran sakale
షర్ఫుద్దీన్ రంజాని 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోని దర్గా కమిటీకి చైర్మన్. ఆయన ఆఫీసు ఔరంగజేబు సమాధికి సమీపంలో ఉంది.
‘‘ఖుల్తాబాద్ చాలా పాత ఊరు. ఇక్కడ హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత ఉంది. మేం అన్ని పండుగలను కలిసి జరుపుకుంటాం. శివాజీ జయంతి, అంబేద్కర్ జయంతి, హోలీ పండుగలను హిందువులతో కలిసి చేసుకుంటాం. వారిని ఈద్‌కు ఆహ్వానిస్తాం" అన్నారు.

గత కొన్ని రోజులుగా ఔరంగజేబు, ఆయన సమాధి గురించి రాజకీయ ప్రముఖులు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఖుల్తాబాద్‌లోని హిందూ, ముస్లిం, దళిత వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
"పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, అది ఇక్కడి స్థానిక ప్రజలకు నష్టం కలిగిస్తుంది. ఇక్కడ దేవాలయాలు, గుహలు, దర్గాలు ఇలా ఎన్నో పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. వేలమంది ఇక్కడ పనిచేస్తారు, దాదాపు 25 నుంచి 30 వేల మందికి ఇది జీవనాధారం. వివాదాస్పద ప్రకటనలు చేసేవారికి మాట్లాడే స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ, స్థానిక ప్రజలకు దీని వల్ల నష్టం కలుగుతుంది" అని ఖైస్రుద్దీన్ అన్నారు.

ఖుల్తాబాద్‌లోనే ఎందుకు కట్టారు?
దిల్లీ చక్రవర్తి ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ (ఇప్పుడు అహల్యానగర్‌గా పేరు మార్చారు)లో మరణించారు. ఆయన మృతదేహాన్ని ఖుల్తాబాద్‌కు తీసుకువచ్చారు.
మరణానంతరం తన గురువు సయ్యద్ జైనుద్దీన్ సిరాజీ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని ఔరంగజేబు వీలునామాలో రాశారని, అందువల్లే ఆయన కుమారుడు ఆజం షా తన తండ్రి సమాధిని ఖుల్తాబాద్‌లో నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ సమాధిని నిర్మించడానికి అప్పట్లో 14 రూపాయల 12 అణాలు ఖర్చయిందని చెబుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














