డార్క్ ప్యాటర్న్స్: ఫ్రీ, ఆఫర్, డిస్కౌంట్ అంటూ మాయ చేసి కొనిపించే 13 మార్కెటింగ్ పద్ధతులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇటికాల భవాని
- హోదా, బీబీసీ ప్రతినిధి
సరిగ్గా ఆకలిగా ఉన్న సమయంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు భోజనం చేయమని గుర్తుచేస్తూ క్యాచీ నోటిఫికేషన్స్‌తో ‘మీ కోసమే ఈ ఆఫర్, కేవలం 199 రూపాయలకే బిర్యానీ, వెంటనే అర్డర్ పెట్టండి’ అంటూ తొందరపెడతాయి.
సరే అని పేమెంట్ చేద్దామని చూస్తే ప్లాట్‌ఫామ్ ఫీజులు, ప్యాకేజింగ్ ఫీ అంటూ దాదాపు ఓ 70- 100 రూపాయలు అదనంగా చూపిస్తుంది.
దీన్ని ‘డ్రిప్ ప్రైసింగ్’ అంటారు.
యాప్స్ అనుసరించే ఇలాంటి పద్ధతులు కొందరు వినియోగదారులకు సాధారణంగానే అనిపించవచ్చు. కానీ, ‘బిజినెస్ డిక్షనరీ’లో ఇలాంటి వాటిని డార్క్ ప్యాటర్న్స్ అంటారు.
అంటే అనైతిక వ్యాపార విధానాలను పాటించడం. ఇలాంటి డార్క్ ప్యాటర్న్స్‌తో వ్యాపార సంస్థలు మన జేబుకు చిల్లు పెడతాయని నిపుణులు చెప్తున్నారు.

ఆఫర్లంటూ తొందరపెట్టి..
డిస్కౌంట్ కూపన్లు, వన్ ప్లస్ వన్ ఆఫర్‌లు, మరో వైపు పది నిమిషాల్లో స్పీడ్ డెలివరీ అంటూ యాప్‌లలో ఎన్నో రకాల ఆకర్షణలుంటాయి.
కానీ, పేమెంట్ పేజీల్లో చివరగా మనం చెల్లించాల్సిన మొత్తం మాత్రం చాలా సందర్భాలలో ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండదు.
ఒక్కోసారి ‘ఇప్పుడే కొనేయండి. పది నిమిషాల్లో స్టాక్ అయిపోతుంది’ అంటూ హడావుడి పెట్టే నోటిఫికేషన్లు వస్తుంటాయి.
చెక్ అవుట్ చేసేటప్పుడు కస్టమర్ దృష్టికి రాకుండానే కార్ట్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీజు యాడ్ అయ్యి ఉంటుంది. లేదా డెలివరీ టిప్ అనో, డొనేషన్ అనో ఆటోమేటిక్‌గా చెక్ అవుట్ పేజిలో అదనపు చార్జీలు వేస్తారు. కస్టమర్‌లు అప్రమత్తంగా లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంటుంది.
యాప్‌లలో కొనుగోళ్లపై అంతగా అవగాహన లేనివారు, వయోధికులు, పిల్లలు ఇలాంటి చోట నష్టపోయే అవకాశాలు ఎక్కువ.
‘మోసపూరిత డిజైన్లు, యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించడం అనైతికం. ఇది దీర్ఘకాలిక యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను దెబ్బతీస్తుంది.
ఈ- కామర్స్ యాప్‌లు డార్క్ ప్యాటర్న్స్‌ను ఉపయోగించి వినియోగదారులు నిర్ణయాలు తీసుకునే శక్తిని దెబ్బతీయకూడదు’ అని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్’ పేర్కొంది.
డార్క్ ప్యాటర్న్స్ పూర్తిగా అనైతిక వాణిజ్య పద్ధతులని... ఇలాంటి ప్యాటర్న్స్ ఉపయోగించే కంపెనీలు ‘వినియోగదారుల రక్షణ చట్టం- 2019’ను ఉల్లంఘిస్తున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ 2023 నవంబరులో విడుదల చేసిన ఓ గెజిట్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
డార్క్ ప్యాటర్న్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది?
అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ), ‘పారలల్ హెచ్ క్యూ’ సంస్థలు గత ఏడాది ఓ నివేదిక విడుదల చేశాయి. భారత్‌లోని 53 యాప్‌లలో డార్క్ ప్యాటర్న్స్‌పై వీరు అధ్యయనం చేసి వివరాలు వెల్లడించారు.
ఓలా, ఉబర్, రాపిడో, అమెజాన్, మింత్రా, స్విగ్గీ, జొమాటో, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, బ్లింక్‌ఇట్, బిగ్ బాస్కెట్, టాటా వన్ ఎంజీ, బైజూస్ యాప్‌లనూ ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు.
డార్క్ ప్యాటర్న్స్ వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తాయని, వినియోగదారుల ఆన్‌లైన్ గోప్యత, భద్రత విషయంలో రాజీ పడతాయని ఆ రిపోర్ట్ పేర్కొంది.
53 యాప్‌లలో 52 కనీసం ఒక్క డార్క్ ప్యాటర్న్ అయినా ఉపయోగించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అధ్యయనం చేసిన యాప్‌లో ప్రతి యాప్ సగటున 2.7 డార్క్ ప్యాటర్న్స్ ఉపయోగించినట్లు తేలింది.
ఎక్కువగా ట్రావెల్ బుకింగ్, డెలివరీ, లాజిస్టిక్స్ పరిశ్రమలకు చెందిన యాప్స్ డార్క్ ప్యాటర్న్స్ ఏఎస్‌సీఐ నివేదిక పేర్కొంది.
డార్క్ ప్యాటర్న్స్ ఎన్ని రకాలు
డార్క్ ప్యాటర్న్న్ అనే పదాన్ని బ్రిటన్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ పరిశోధకుడు హ్యారీ బ్రిగ్నల్ 2010లో తొలిసారి ఉపయోగించినట్లు చెప్తారు.
దేశంలో ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వాడకం గణనీయంగా పెరిగిన తరువాత రోజువారీ జీవితాల్లో యాప్‌లు కీలకంగా మారాయి.
మరోవైపు కస్టమర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే డార్క్ పాటర్న్స్ ఉపయోగం కూడా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి.
ఈ ధోరణి తీవ్రతని గుర్తిస్తూ డ్రిప్ ప్రైసింగ్‌తో పాటు మరో పన్నెండు పద్ధతులను డార్క్ ప్యాటర్న్స్‌గా ‘సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ’ తన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఫాల్స్ అర్జెన్సీ
కస్టమర్లు తక్షణమే కొనుగోలు చేసేలా తొందర పెట్టడం.
ఇలాంటి పద్ధతిని ఎక్కువగా దుస్తుల కొనుగోలు.. బస్సులు, విమానాల టికెట్లు.. హోటల్ రూమ్ బుకింగ్ యాప్‌లలో గమనిస్తాం.
‘ఈ రూట్‌లో ఇంకా రెండే సీట్స్ ఉన్నాయి’ అంటూ.. ‘ఆల్‌రెడీ 30 మంది ఈ హోటల్ రూం బుక్ చేయాలని చూస్తున్నారు’ అంటూ ఫాల్స్ అర్జెన్సీ సృష్టిస్తారు.
ఫ్యాషన్ గూడ్స్ విక్రయించే యాప్స్ తరచుగా ‘ఎక్స్‌క్లూజివ్ సేల్’.. ‘పదిహేను నిమిషాల్లో స్టాక్ అవుట్ అయిపోతుంది’ అంటు రకరాలుగా వినియోగదారులను తొందరపెట్టేందుకు ఫాల్స్ అర్జెన్సీ పద్దతులను ఉపయోగిస్తారు’ అని ఈ నోటిఫికేషన్‌లో వివరించారు.

బాస్కెట్ స్నీకింగ్
వినియోగదారుడి అనుమతి లేకుండా ఉత్పత్తులు, సేవలు, చారిటీకి విరాళం వంటి అదనపు చార్జీలు చెక్అవుట్ సమయంలో చేర్చడమే బాస్కెట్ స్నీకింగ్.
కస్టమర్ కొనాలకున్న వస్తువుకు చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువగా బిల్ చేయడమే ఈ బాస్కెట్ స్నీకింగ్.
చెక్ అవుట్ సమయంలో కార్ట్‌లో సబస్క్రిప్షన్ ఫీజు యాడ్ అయ్యి ఉండటం గమనించే ఉంటారు.
బస్సు, రైలు విమానం - ప్రయాణం ఏదైన సరే ట్రావెల్ బుకింగ్ కంపెనీల యాప్‌లలో తరుచుగా కస్టమర్ అనుమతి లేకుండా, డీఫాల్ట్‌గా ఇన్స్యూరెన్స్ ఫీజ్ కూడా జోడిస్తుంటారు. ఇవన్నీ బాస్కెట్ స్నీకింగ్ కిందకే వస్తాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఇతర యాప్ ల కంటే డెలివరీ, లాజిస్టిక్స్ సంబంధించిన యాప్స్ నాలుగింతలు ఎక్కువగా బాస్కెట్ స్నీకింగ్ వాడుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి.

కన్ఫర్మ్ షేమింగ్
కొనుగోలుదారులను భయాందోళనకు గురి చేసి, వారి మనస్సులో సిగ్గు వంటి భావనలను సృష్టించి వారి నిర్ణయాలను ప్రభావితం చేసి, అదనపు చార్జీలు సేకరించేలా ప్రేరేపించడం.
ట్రావెల్ బుకింగ్ యాప్‌లలో బాస్కెట్ స్నీకింగ్ ద్వారా చేర్చిన ఇన్స్యూరెన్స్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తే ‘నేను సురక్షితంగా ఉండను’ అనే ఒక పాప్ అప్ వస్తుంది.
అలాగే విరాళం తొలగించడానికి ప్రయత్నిస్తే "చారిటీ ధనవంతుల పని, నేను పట్టించుకోను" అని వస్తుంది.

ఫోర్స్‌డ్ యాక్షన్
అదనపు వస్తువులను కొనుగోలు చేయమని, సంబంధం లేని సేవలకు సబ్‌స్క్రైబ్ చేసుకోమని, లోకేషన్ వంటి వ్యక్తిగత సమాచారం అందించాలని బలవంతం చేయడం.
అధిక రేటుతో అప్‌గ్రేడ్ చేయకపోతే మొదట చెల్లించిన ఛార్జికి సంబంధించిన సేవల వినియోగాన్ని నియంత్రించడం, సంబంధం లేని ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని బలవంతం చేయడం, అవసరం లేకున్నా ఆధార్ లేదా క్రెడిట్ కార్డ్‌తో అనుసంధానించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాలని అడగడం.. కాంటాక్ట్స్ లేదా సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల వివరాలను పంచుకోకపోతే యాప్ సేవలు ఉపయోగించకుండా చేయడం వంటివన్నీ ‘ఫోర్స్‌డ్ యాక్షన్’ కిందకు వస్తాయి.
ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వమని ప్రోత్సహించడం, అధికంగా, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రైవసీ సెట్టింగ్‌లను సులువుగా మార్చుకునేలా వెసులుబాటు కల్పించకపోవడం వంటివన్నీ ఇందులో భాగమే.

నాగింగ్
కొనుగోలు సమయంలో పదేపదే అంతరాయం కలిగించడం.
ఫోన్ లో యాప్‌కు బదులుగా బ్రౌజర్ వాడటానికి ప్రయత్నిస్తే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని.. యాప్ వాడుతున్నప్పుడు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలని, లేదంటే కుకీస్ అంగీకరించాలని పాప్ అప్స్ రావడం.

ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్
తెలివైన డిజైన్లతో యూజర్ ఇంటర్‌ఫేస్‌లో కొంత మాత్రమే హైలైట్ అయ్యేలా చేయడం, కొంత భాగాన్ని దాచేసి వినియోగదారుల నిర్ణయ శక్తిని ప్రభావితం చేయడం కానీ, దెబ్బతీయడం కానీ ఈ డార్క్ ప్యాటర్న్ ఉద్దేశం.
యాప్ కోరుకున్నట్టుగా తప్పుదారి పట్టించడమే ఈ విధానం.
ఫిన్‌టెక్, గేమింగ్ యాప్‌లు డార్క్ ప్యాటర్న్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి అని ఏఎస్‌సీఐ రిపోర్ట్ పేర్కొంది.
నాగింగ్ లాగే కొనుగోలు సమయంలో, పాప్ అప్స్ వస్తే దాని మూసివేయడానికి ప్రయత్నిస్తే, మరో పేజికి కస్టమర్ లను మళ్లించడం. నో అనే ఆప్షన్‌ను తేలిక రంగుల్లో లేదా చిన్న అక్షరాలతో డిజైన్ చేయడం.

సాస్ బిల్లింగ్
సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) ద్వారా వినియోగదారుల నుంచి రికరింగ్ పేమెంట్స్ తీసుకునే ప్రక్రియ ఇది. అయితే ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉచిత ట్రయల్ ను పెయిడ్ సర్వీసుగా మార్చడం, వినియోగదారుకు సమాచారం ఇవ్వకుండా ఆటో రెన్యువల్ కోసం ఖాతా నుంచి డెబిట్ చేయడం వంటివన్నీ ఇలాంటివే.

సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్
ఒకవేళ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే అస్పష్టమైన, గందరగోళమైన, గజిబిజి సూచనలను ఇవ్వడం.
యాప్/వెబ్‌సైట్‌లలో అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్ దొరకకుండా డిజైన్ చేయడం.
ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందడానికి ఆటో డెబిట్‌ల కోసం బ్యాంక్ వివరాలు అందించమని వినియోగదారుని బలవంతం చేయడం వంటివన్నీ ఈ పద్ధతిలోకి వస్తాయి.

బెయిట్ అండ్ స్విచ్
వినియోగదారుడు సెర్చ్ చేస్తున్నదాని ఆధారంగా, తాను కొనుగోలు చేయాలనుకునే వస్తువు కాకుండా ప్రత్యామ్నాయ వస్తువులు చూపించడం.
కస్టమర్ ఓ వస్తువు కొనాలనుకుంటాడు. అది చౌక ధరకే యాప్‌లో కనిపిస్తుంది. పేమెంట్ పేజికి వెళ్తే స్టాక్ లేదని చూపించి, ఖరీదైన అలాంటి వస్తువు ఇంకోటి చూపించడం.

డిస్గైజ్డ్ అడ్వర్టైజ్‌మెంట్
వాణిజ్య ప్రకటనలు అని చెప్పకుండా యాప్ ఇంటర్‌ఫేస్‌లో కలిసిపోయేలా వాటిని కస్టమర్లకు కనిపించేలా చేసి వారు క్లిక్ చేసేలా మోసగించడం.
ఇలాంటి ప్రకటనలను బహిర్గతం చేయాలని గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది.

ట్రిక్ క్వశ్చన్
గందరగోళ భాష, అస్పష్టమైన పదాలను ఉపయోగించి వినియోగదారులను తప్పుదారి పట్టించడం.
ఉదాహరణకు - "మా కలెక్షన్లు, డిస్కౌంట్‌లపై అప్డేట్స్ మీకు పంపుతాం" అని పాప్అప్ స్క్రీన్‌పై వస్తుంది. దానికి "అవును", "వద్దు" అని ఆప్షన్‌లు బదులుగా, "అవును", "ఇప్పుడు కాదు" అనే పదాలు వాడటం.

రోగ్ మాల్వేర్స్
రాన్సమ్‌వేర్ లేదా స్కేర్‌వేర్‌ను ఉపయోగించి వినియోగదారుల, కంప్యూటర్‌లో వైరస్ ఉందని నమ్మించి, నకిలీ టూల్‌ను అమ్మడం.
ఇది ఎక్కువగా పైరేటింగ్ వెబ్‌సైట్లలో కనిపిస్తాయి. ఉచిత కంటెంట్, అందిస్తామని హామీ ఇచ్చి, వినియోగదారులను ఆకర్షించి వెబ్‌సైట్లో లేదా పాప్-అప్ ప్రకటనల మాల్వేర్‌ను ఎంబెడ్ చేయడం.

డ్రిప్ ప్రైసింగ్
డ్రిప్ ప్రైసింగ్ అంటే ముందుగా ఒక ధరతో ఆకర్షించి చెక్ అవుట్ చేసేటప్పుడు వేరే ధర చెప్పడం.
అలాగే, ఉచితం అంటూ ఆకర్షించి కొద్ది రోజుల తరువాత పేమెంట్ డిమాండ్ చేయడం వంటివన్నీ ఇందులోకి వస్తాయి.
అమెజాన్, ఇండిగో, బుక్ మై షో డార్క్ ప్యాటర్న్స్ ఉపయోగించాయా ?
అమెజాన్ సంస్థ డార్క్ ప్యాటర్న్స్ సహాయంతో వినియోగదారుల అనుమతి లేకుండా అమెజాన్ ప్రైమ్ చెలింపులు రెన్యువల్ చేసిందని, కస్టమర్లు ప్రైమ్ సేవలు రద్దు చేసే ప్రకియను కష్టంగా మార్చిందని జూన్ 2023లో, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్ టీ సీ) ఫిర్యాదు చేసింది. 2025జూన్‌లో కోర్టు ఈ కేసును విచారించనుంది.
టిక్కెట్లను బుక్ చేసుకున్న తర్వాత బుక్ మై షో కస్టమర్ల అనుమతి లేకుండా 'బుక్ ఏ స్మైల్'కు కాంట్రిబ్యూషన్‌గా టికెట్‌కు రూ. 1 ఆటోమేటిక్‌గా జోడిస్తున్నట్టు గమనించి 'బాస్కెట్ స్నీకింగ్' డార్క్ ప్యాటర్న్స్‌గా నిర్ధరించింది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ).
సీసీపీఏ జోక్యంతో బుక్ మై షో ఈ సమస్యను పరిష్కరిస్తూ కస్టమర్‌ల అనుమతితోనే బుక్ ఏ స్మైల్ కు విరాళం యాడ్ చేసేలా తన యాప్‌లో డిజైన్ మార్చింది.
అలాగే విమానయాన సంస్థ ఇండిగో పై వచ్చిన అనేక ఫిర్యాదులుపై స్పందిస్తూ, సీసీపీఏ
ఇండిగో కన్ఫర్మ్ షేమింగ్ పద్ధతిని ఉపయోగించిదని గ్రహించి కంపెనీకి నోటిసులు పంపింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ యాప్‌లో ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌ను నిరాకరించే ఆప్షన్ "వద్దు నేను రిస్క్ తీసుకుంటాను" అని చూపించడాన్ని తప్పుబట్టింది సీసీపీఏ.
నోటిసులు పంపిన తర్వాత దీన్ని "వద్దు, నా ట్రిప్‌కు జత చేయకు" అని ఆ సంస్థ మార్చింది.
ప్రభుత్వాల పాత్ర...
ప్రపంచవ్యాప్తంగా డార్క్ పాటర్నన్స్ నియంత్రణపై దృష్టి పెరుగుతోంది, యూరోపియన్ యూనియన్, అమెరికా డార్క్ పాటర్న్స్ కు సంబంధించి చట్టాలు అమలు చేశాయి. ఈ నియమాల కారణంగా అమెజాన్ సంస్థపై అమెరికాలో కేసు విచారణ జరగనుంది.
భారత దేశంలో పెరుగుతున్న డిజిటల్ మార్కెట్‌లో ఉద్దేశించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు వినియోగదారుల హక్కులను రక్షిండంలో తొలి మెట్టు. కాని వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్ సీఐ) సీఈఓ మనీషా కపూర్ బీబీసీతో అన్నారు.
"ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం డార్క్ పాటర్న్స్ దేనినైనా ఉపయోగించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే. ఎఎస్ సీఐ నివేదికను అనుసరించి బ్రాండ్‌లు, యూజర్ ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్‌లు డార్క్ ప్యాటర్న్స్ వాడకుండా యాప్ డిజైన్ చేయొచ్చు.అప్పుడేవినియోగదారుల విశ్వాసాన్ని, స్థిరమైన ఆన్‌లైన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించవచ్చు. డిజిటల్ యుగంలో వినియోగదారుల హక్కులను రక్షించడంలో పరిశ్రమ చొరవ తీసుకొని స్వీయ-నియంత్రణ చేసుకోవాలి. అవసరమైనప్పుడు ప్రభుత్వ జోక్యం చేసుకోవడం మంచిది." అని మనీషా కపూర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














