మామునూరు: నిజాం కాలంనాటి ఈ ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఉన్న చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
వాణిజ్యం, పర్యటక రంగాల్లో అభివృద్ది కోసం దేశీయ విమాన సేవలను పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 'ఉడాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిద్వారా కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పాత వాటి అభివృద్ది, విస్తరణ చేపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్దనగరం వరంగల్ (మామునూరు)లో మరో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది.
కాగా, ఈ మామునూరు విమానాశ్రయానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఎయిర్ పోర్టును శత్రు స్థావరంగా భావిస్తూ భారత వైమానిక దళం గతంలో బాంబుదాడులు చేసినట్లు అప్పట్లో కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న వారు రాశారు.
మరో సందర్భంలో (చైనాతో యుద్దం సమయంలో) ఇదే సురక్షిత స్థానంగా భావించి భారత్ తన విమానాలను ఇక్కడి హ్యాంగర్లలో దాచి పెట్టిన చరిత్ర ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రచురించిన ఒక కథనంలో పేర్కొంది.
ఇలా, చరిత్రను చూస్తే మామునూరు విమానాశ్రయానికి సంబంధించి చాలా ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అవేంటో తెలియాలంటే నిజాం రాజ్య చరిత్రను తిరగేయాలి.


ఫొటో సోర్స్, Ministry of Culture/GOI
మామునూరు చరిత్ర
నిజాం రాజ్యంలో 1930లో మామునూరు ఎయిర్ పోర్ట్‌ను నిర్మించారు. చాలా ఏళ్లపాటు విమానాలు నడిచాయి కూడా. అయితే, 1980 నాటికి ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఈ ఎయిర్‌పోర్టులో రెండు రన్ వేలు, విమానాలు నిలిపే హ్యాంగర్‌లతో పాటూ సిబ్బంది క్వార్టర్స్, ఇతర వసతులు ఉన్నాయి. రన్ వే దెబ్బతింది.
''మామునూరు విమానాశ్రయాన్ని మిలటరీ అవసరాల కోసం వినియోగించడం, వరంగల్ పర్యటనలో భాగంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విమానం ఇక్కడ దిగడం నాకు తెలుసు. ఇక్కడి రన్ వే చాలా పొడవైనదని, గట్టిదని నా మిత్రులు చెప్పగా విన్నాను'' అని వరంగల్ ఆజాంజాహీ కాలనీకి చెందిన జె.ఎన్.శర్మ బీబీసీతో చెప్పారు.
కొత్తగా నిర్మించే విమానాశ్రయాలను గ్రీన్ ఫీల్డ్ అని, గతంలో కార్యకలాపాలు కొనసాగిన వాటిని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులని అంటుంటారు.
ఈ మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సిద్దంగా ఉందని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
''మాస్టర్ ప్లాన్ రెడీ చేశాం. అందుబాటులో ఉన్న 696 ఎకరాలకు అదనంగా భూమిని సేకరించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. రెండున్నరేళ్లలో టెర్మినల్, రన్ వేల నిర్మాణం పూర్తి చేస్తాం'' అని ఆయన ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
దీంతో, మరో 280 ఎకరాల భూసేకరణ పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
నిజాం రాజ్యంలో వైమానిక రంగం
స్వాతంత్య్రానికి పూర్వం.. ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించిన నిజాం రాజ్యం (Princely state of Hyderabad) దేశంలోని అతిపెద్ద సంస్థానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒక రాజ్యానికి ఉండే అన్నిరకాల సేవలు అంటే..సైన్యం, పోస్టల్, టెలిగ్రాఫ్, రైల్వే, వైమానిక, కరెన్సీలాంటివి ఈ సంస్థానానికి ఉండేవి.
పౌర, వాణిజ్య, మిలటరీ అవసరాలకు అనుగుణంగా ఏరో డ్రోమ్, ఎయిర్ ఫీల్డ్, ఎయిర్ స్ట్రిప్, ఎయిర్ పోర్ట్ ఇలా వివిధ పేర్లతో విమానాల రాకపోకల కోసం ఏర్పాట్లు ఉన్నాయి. బేగంపేట్, హకీంపేట్, దుండిగల్, బీదర్, ఆదిలాబాద్, చికల్తాన(ఔరంగాబాద్), మామునూరు ఎయిర్ ఫీల్డ్‌లు ఇందులో ప్రధానమైనవి.

ఫొటో సోర్స్, FB/Anuradha Reddy
స్వాతంత్ర్యానికి పూర్వం విమానయాన రంగంలో విశేష కృషి జరిగిన ప్రాంతాల్లో 'హైదరాబాద్ రాజ్యం' భారతదేశంలో మొదటి వరుసలో ఉందని హైదరాబాద్‌కు చెందిన చరిత్రకారిణి పి.అనురాధ రెడ్డి బీబీసీతో చెప్పారు.
"ఏవియేషన్ ఇన్ ది హైదరాబాద్ డొమినియన్స్'' పేరుతో ఆమె ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అందులో పలు అంశాలను ఆమె పేర్కొన్నారు.
''నిజాం రాజ్యంలో వస్త్రాలు, కాగితం తయారీ, చక్కెర , ఖనిజాలు, రసాయన ఇలా వివిధ రకాల పరిశ్రమలుండేవి. వాణిజ్య సంబంధిత ఎగుమతి దిగుమతులతో పాటూ మిలటరీ సంబంధిత కమ్యునికేషన్ల కోసం తన భూభాగంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ల కోసం ఎయిర్ ఫీల్డ్‌లను నిర్మించారు. డెక్కన్ ఎయిర్ వేస్ పేరుతో సొంత విమాన సంస్థ ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆగ్నేయాసియా కమాండ్‌కు సింగపూర్ కేంద్రంగా ఉండేది. భారత్‌లో వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన విమానాలు నిజాం రాజ్యంలోని ఎయిర్ స్ట్రిప్‌లలో విశ్రాంతి, ఇంధనం కోసం ఆగేవి'' అని అనురాధ రెడ్డి బీబీసీకి తెలిపారు.
1946లోనే హజ్ యాత్ర కోసం జెడ్డా వరకు డెక్కన్ ఎయిర్ వేస్ ప్రత్యేక చార్టర్ విమానాలను నడిపిందని తన పుస్తకంలో అనురాధా రెడ్డి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GOI/ Ministry of Culture
ఆపరేషన్ పోలో- బాంబు దాడులు
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, చివరి నిజాం రాజు తన రాజ్యాన్ని భారత్, పాకిస్తాన్ రెండింటిలోనూ కలపకుండా తటస్థంగా ఉన్నారు. ఈ సమయంలోనే భారత యూనియన్‌తో ఏడాది కాలానికి యధాతథ స్థితి (Standstill agreement) ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సమయంలో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది నిజాం ప్రతినిధి బృందం.
భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యంలోకి దిగుమతయ్యే వివిధ రకాల సరుకులపై ప్రభావం పడింది. ముఖ్యంగా ఆయుధాలు, మందుగుండు, పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్కువగా ఈ ప్రభావం ఉంది.
ఆ సమయంలో బియ్యం, గోధుమలు మినహా ఇతర ఆహారధాన్యాలు, నూనె గింజలు, ముడి పత్తి, బొగ్గు, సిమెంట్, కాగితం ఉత్పత్తుల్లో నిజాం రాజ్యం మిగులు స్థాయిలో ఉంది. మరోవైపు పెట్రోల్, కిరోసిన్, లూబ్రికెంట్లు, ఉప్పు, పరిశ్రమలకు సంబంధించిన విడిభాగాలు (స్పేర్ పార్ట్స్) విషయంలో మాత్రం భారత ప్రాంతాలు లేదా ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి ఉంది.
నిజాం రాజ్యానికి నలువైపులా భారత భూభాగం సరిహద్దులుగా ఉండటం, సముద్ర మార్గం లేకపోవడంతో ఆకాశమార్గంలో ఆయుధాలను తెచ్చేందుకు బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సిడ్నీ కాటన్ అనే మాజీ సైనికాధికారితో నిజాం ప్రతినిధులకు ఒప్పందం కుదిరింది.

ఫొటో సోర్స్, GOI/ Ministry of Culture
భారత గగనతలం నుంచి సిడ్నీ కాటన్ తన విమానంలో పలుమార్లు హైదరాబాద్ రాజ్యానికి వివిధ సరుకుల మాటున ఆయుధాలను తరలించారని అప్పటి నిజాం రాజ్య ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ తన ఆత్మకథ 'ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్'లో ప్రస్తావించారు.
తిరుగు ప్రయాణానికి అవసరమైన ఇంధనాన్ని కూడా సిడ్నీ కాటన్ అదే విమానంలో తెచ్చుకునే వారని ఆయన తెలిపారు.
నిజాం భూభాగాన్ని భారత యూనియన్‌లో కలిపే లక్ష్యంతో భారత్ ఆపరేషన్ పోలో పేరుతో సైనికచర్యను ప్రారంభించింది.
‘‘ఆయుధాల రవాణాకు బీదర్, మామునూరు ఎయిర్ పోర్టులను ఉపయోగిస్తున్నారని పసిగట్టిన భారత వైమానిక దళాలు వాటిపై పలుమార్లు బాంబు దాడులు చేసి విమానాలు దిగకుండా రన్ వేలను నష్టపరిచాయి. బీదర్, మామునూరు ఎయిర్ పోర్టులపై బాంబు దాడులు పెరగడంతో సరుకులతో వచ్చే విమానాలను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ ఉన్న హకీంపేట్ ఎయిర్ ఫీల్డ్‌లో దిగేలా ఏర్పాట్లు చేశాం’’ అని మీర్ లాయక్ అలీ ఆత్మకథలో రాశారు.
ఆపరేషన్ పోలో సమయంలో మామునూరు ఎయిర్ ఫీల్డ్ పై బాంబు దాడి జరిగిందని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమాండర్‌గా పని చేసిన నల్ల నరసింహులు ఆత్మకథ ‘తెలంగాణ సాయుధ పోరాటం-నా అనుభవాలు’ పుస్తకంలో రాశారు.
"మాకు ఏ వార్తా పత్రికలు కూడా సరిగా దొరకలేదు. సంస్థానంలో భారత సైన్యం జొచ్చుకురావటం వార్త రెండు రోజులకు తెలిసింది. మా దళాలు మామునూరుకు సమీప గ్రామం నందనంలో ఉన్నాయి. యుద్ధవిమానాలు మామునూరిలో నున్న నైజాం సైన్య స్థావరం, విమానాశ్రయం మీద 2,3 బాంబులు పడవేశాయి. దగ్గరిలో నున్న మేము బాంబు దాడులను గమనించి చెట్ల క్రింద దాక్కున్నాం. బాంబులు పడవేసి విమానాల వెళ్ళిపోయాయి. హైద్రాబాద్ సంస్థానంపై సైనిక చర్య ప్రారంభమైందన్న సంగతి మాకు అప్పుడు అవగతమైంది" అని నల్ల నరసింహులు రాశారు.

ఫొటో సోర్స్, UGC
రన్ వేల చుట్టూ కందకాలు
నిజాంకు చెందిన వరంగల్, బీదర్, రాయ్‌చూర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్ వైమానిక ప్రాంతాలు భారత వైమానిక దాడులతో దద్దరిల్లాయని, కొన్ని ఎయిర్ ఫీల్డ్‌లను భారత సైన్యం ఆక్రమించకుండా జేసీబీలతో రన్ వే చుట్టూ కందకాలు తవ్వామని, విమానాలు దిగకుండా భారీ వస్తువులను రన్ వే పై పెట్టామని మీర్ లాయక్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.
భారత సైన్యం తన స్వాధీనంలోకి వచ్చిన ఎయిర్ ఫీల్డ్‌లలో అవసరమైన మరమ్మతులు చేపట్టి నిఘా, సరఫరాలు, కమ్యునికేషన్ వంటి సైనిక అవసరాల కోసం ఉపయోగించింది. బీదర్ ఎయిర్ పోర్ట్‌లో బాంబుదాడులతో దెబ్బతిన్న రన్ వే పునరుద్దరణ పనులకోసం అక్కడి జైలులోని ఖైదీలను భారత సైన్యం వినియోగించింది.
ఆపరేషన్ పోలో కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్, పోర్చుగల్ దేశాలు నిజాంకు వాయు, నౌకా దళ సహాయం అందిస్తాయన్న వార్తల నేపథ్యంలో భారత వైమానిక దళ విమానాలు అప్పటికింకా పోర్చుగల్ స్వాధీనంలోనే ఉన్న గోవా వరకు రెక్కీ కొనసాగించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













