సూప్‌లో మూత్రం పోసిన యువకులు, 4 వేల మంది కస్టమర్లకు పదింతల పరిహారం చెల్లిస్తామన్న రెస్టారెంట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ న్యూస్
చైనాలోని అతిపెద్ద హాట్‌పాట్ చైన్ హైడిలావ్‌కు చెందిన ఓ బ్రాంచ్‌లో ఇద్దరు యువకులు తాము తిన్న సూప్ పాత్రలో మూత్రం పోశారు. హైడిలావ్‌కు చెందిన షాంఘై బ్రాంచ్‌లలోని ఓ బ్రాంచ్‌లో ఇది జరిగింది.
దీంతో హైడిలావ్ సంస్థ తమ రెస్టారెంట్లకు వచ్చిన 4 వేల మందికి పరిహారం చెల్లిస్తామని ముందుకొచ్చింది.
రెస్టారెంట్‌లోని ప్రైవేట్ రూమ్‌లో తింటున్న ఇద్దరు యువకులు తమ సూప్ పాత్రలో మూత్ర విసర్జన చేసిన వీడియో ఒకటి గత నెలలో వైరల్ అయింది.
ఆ ఘటనను ఎవరు వీడియో తీశారనేది తెలియలేదు. ఘటన తరువాత 17 ఏళ్ల యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
సూప్ పాత్రలో మూత్రం పోసిన యువకులు మద్యం తాగి ఉన్నారని పోలీసులు చెప్పారు.
అయితే, మూత్రం పోసిన సూప్‌ను ఎవరైనా తాగారా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ హైడిలావ్ తన కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది.
తమ అన్ని హాట్‌పాట్ గిన్నెలను, వంట పాత్రలను మార్చేసినట్లు తెలిపింది. ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసినట్లు పేర్కొంది.
ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగిన్పటికీ, సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ అయిన కొన్ని రోజుల తర్వాత కంపెనీ యాజమాన్యం గుర్తించింది.
ఈ సమయంలో డ్యూటీలో ఉన్న ఉద్యోగులు ఆ యువకులను ఆపడంలో విఫలమైనట్లు హైడిలావ్ చెప్పింది.
అసలు, ఈ ఘటన తమ ఏ అవుట్‌లెట్‌లో జరిగిందో గుర్తించేందుకు కంపెనీకి మరో వారం సమయం పట్టింది. షాంఘై నగరంలో ఈ హాట్‌పాట్ చైన్‌కు డజన్ల సంఖ్యలో అవుట్‌లెట్లు ఉన్నాయి.

హైడిలావ్‌లో ఫుడ్ తినడానికి వచ్చే వారు తమ ఆహారాన్ని వండుకోవడం కోసం సొంతంగా తమ వ్యక్తిగత హాట్‌పాట్ ఎక్విప్‌మెంట్‌ను వాడతారు. ఇతర కస్టమర్ల కోసం తిరిగి వాటిని ఉపయోగించరు. అయినప్పటికీ, ఒకవేళ ఆ అవుట్‌లెట్‌కు వచ్చిన కస్టమర్లకు ఆ పాత్రను వాడి ఉంటే, దాన్ని శుభ్రపరిచారా? లేదా? అనే విషయం స్పష్టత లేదు.
''ఈ ఘటనతో మా వినియోగదారులకు కలిగిన ఇబ్బందిని మేం పూర్తిగా అర్థం చేసుకోగలం. కానీ, ఏ విధంగానూ మేం పూర్తి నష్టాన్ని, ఇబ్బందిని భర్తీ చేయలేం. అయితే, దీని బాధ్యతను తీసుకునేందుకు మేం కట్టుబడి ఉంటాం'' అని హైడిలావ్ ప్రకటించింది.
హైడిలావ్ అవుట్‌లెట్‌కు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు వచ్చిన వినియోగదారులందరికీ పూర్తి రీఫండ్‌ను అందిస్తామని తెలిపింది. వారు చెల్లించిన మొత్తానికి పదింతల నగదు పరిహారం అందజేస్తామని ఆ అవుట్‌లెట్ చైన్ ప్రకటించింది.
జియాన్‌యాంగ్‌లో తొలి రెస్టారెంట్ తెరిచినప్పటి నుంచి హైడిలావ్ చాలా వేగంగా విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా రెస్టారెంట్లను ఇది నిర్వహిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














