అమెరికన్ ఎయిర్‌లైన్స్: విమానం కాలిపోతుంటే, ప్రయాణికులు రెక్కలపైకి ఎక్కారు..

అమెరికన్ ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, @flynnstone/X/Screengrab

ఫొటో క్యాప్షన్, విమానం రెక్కలపై ప్రయాణికులు
    • రచయిత, క్రిస్టల్ హాయెస్, రాచెల్ లూకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి మంటలు అంటుకోవడంతో, కొలరాడోలోని డెన్వర్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు దాని రెక్కలపైకి ఎక్కారు. చివరకు సిబ్బంది వారిని రక్షించారు.

విమానంలో మంటల కారణంగా ఎయిర్‌పోర్టులో పెద్ద ఎత్తున పొగ ఆవరించింది. అయితే, ప్రయాణికులెవరికీ హాని జరగలేదు.

బోయింగ్ విమానం రెక్కల పైన ప్రయాణికులు నడుస్తూ ఒక చోటకు చేరుకున్న దృశ్యాలు కనిపించాయి. వారిలో కొందరు చేతిలో బ్యాగ్స్ పట్టుకుని ఉన్నారు. విమానం కింద భాగంలో మంటలు కనిపిస్తున్నాయి.

డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి కిందకి దించేందుకు ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్స్‌ను (జారుడు మెట్లు) వాడినట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది.

ఈ ప్రమాదానికి కారణమేంటో విచారిస్తామని ఎఫ్ఏఏ చెప్పింది.

ఈ విమానం కొలరాడో స్ప్రింగ్స్ నుంచి టెక్సస్‌లోని డాలస్ పోర్ట్‌ వర్త్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరినట్లు ఎఫ్ఏఏ బీబీసీకి చెప్పింది.

ఇంజిన్‌లో వైబ్రేషన్స్ వస్తున్నట్లు విమాన సిబ్బంది ఫిర్యాదు చేసిన తర్వాత ఆ విమానాన్ని డెన్వర్ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎఫ్ఏఏ తెలిపింది.

ల్యాండ్ అయిన తర్వాత, విమానాశ్రయంలో టార్మాక్‌పై దీన్ని నిలిపి ఉంచినప్పుడు మంటలు అంటుకున్నట్లు ఎఫ్ఏఏ చెప్పింది.

ఈ విమానంలో 172 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

వీరందర్ని సురక్షితంగా కిందకి దించినట్లు కంపెనీ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ విమానం బోయింగ్ 737-800కి చెందినది. ఇందులో ఇంజిన్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తినట్లు కంపెనీ చెప్పింది.

విమానంలో పలు గేట్ల వద్ద నుంచి మంటలు, పొగ కనిపించినట్లు విమానాశ్రయ అధికార ప్రతినిధి మైఖేల్ కోనోపాసెక్ చెప్పారు.

మంటలను వెంటనే ఆర్పేయడంతో, ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి ఆలస్యం కాలేదు.

గాలిలో పెద్ద ఎత్తున నల్లటి పొగ కమ్ముకుని ఉండగా, విమానం రెక్కలపై ప్రయాణికులు నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేశారు.

ఈ వీడియోలలో ల్యాడర్లను (నిచ్చెనలు) నెట్టుకుంటూ విమానం రెక్కలవైపు సిబ్బంది పరుగెడుతూ కనిపించారు.

విమానంలో కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగుతున్నట్లు వీడియోల్లో కనిపించింది. విమానం వెనుక డోరు దగ్గర జారుడు మెట్లు కనిపించాయి.

అమెరికాలో ఈ మధ్య విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ.. విమాన ప్రయాణ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.

ఇటీవలే, అమెరికా ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రీజనల్ జెట్ ఆకాశంలోనే ఢీకొట్టడంతో 67 మంది మరణించారు. వాషింగ్టన్ డీసీలో ఇది ఘోర విమాన ప్రమాదం.

ఈ ప్రమాదంతో, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత, వారిపై ఉన్న వర్క్‌లోడ్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రభుత్వ ఖర్చుల తగ్గింపులో భాగంగా ఎఫ్ఏఏలో పనిచేసే వందల మంది ప్రొబెషనరీ వర్కర్లను ఇటీవల డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది.

డీసీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఈ లేఆఫ్‌లను ప్రకటించింది.

తొలగించిన ఎఫ్ఏఏ ఉద్యోగుల్లో మెయింటనెన్స్ మెకానిక్స్, ఎన్విరాన్‌మెంటల్ కంప్లయన్స్ వర్కర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీఓజీఈ)లో భాగంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)