‘‘టార్గెట్స్ చేరుకోకపోతే, కంపుకొట్టే బాతుగుడ్లు తినిపిస్తారు’’ మియన్మార్ సైబర్ క్రైమ్ ముఠా బాధితుడి అనుభవాలు

ఫొటో సోర్స్, X/MEAIndia
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''టార్గెట్స్ చేరుకోకపోతే ఎండలో 3-4 కిలోమీటర్లు పరిగెత్తిస్తారు. దుర్వాసన వచ్చే బాతు గుడ్లు తినిపిస్తారు.'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు మధుకర్ రెడ్డి.
ఆయన ఈ మధ్యనే మియన్మార్ సరిహద్దులో సైబర్ క్రైమ్స్ ముఠా చెర నుంచి బయటపడ్డారు.
''అదొక ఐటీ పార్కు తరహాలో ఉంటుంది. థాయ్‌లాండ్ మియన్మార్ సరిహద్దులో ఉంది. మొదట థాయ్‌లాండ్‌లో ఉద్యోగమనిచెప్పి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాకే అది మియన్మార్ పరిధని తెలిసింది .'' అని చెప్పారాయన.

మొత్తం 589 మంది వెనక్కి..
మియన్మార్ సరిహద్దులో సైబర్ నేరగాళ్ల ముఠా గుప్పిట్లో చిక్కుకున్న 589 మంది భారతీయులను రక్షించి తీసుకువచ్చినట్లుగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల ప్రకటించింది.
వీరిలో గుజరాత్, యూపీ, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ, బిహార్‌కు చెందిన వారున్నారు.
వీరందరినీ రెండు ప్రత్యేక విమానాల్లో థాయ్ లాండ్, మియన్మార్ నుంచి తీసుకువచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
అలా వచ్చిన వారిలో 24 మంది తెలంగాణవాసులున్నారు. వారిలో మధుకర్ రెడ్డి ఒకరు.
మధుకర్ రెడ్డిది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి కరీంనగర్‌లో నివసిస్తున్నారు.
31 ఏళ్ల మధుకర్ రెడ్డి ఎంబీఏ మధ్యలో ఆపేశారు. కొన్ని రోజులు దుబయిలో ప్యాకింగ్ బిజినెస్ చేశారు. అందులో నష్టాలు రావడంతో పోయినేడాది ఇండియాకు తిరిగి వచ్చారు.తరువాత తాను సభ్యునిగా ఉన్న టెలిగ్రామ్ గ్రూపులో 'డేటా ఎంట్రీ ఆపరేటర్' ఉద్యోగాలంటూ వచ్చిన మేసేజ్‌ను చూసి.. హాయ్ అని మేసేజ్ పెడితే వివరాలు పంపించినట్లు వివరించారు మధుకర్ రెడ్డి.
''1100డాలర్లు జీతం, అకామిడేషన్, ట్రాన్స్‌పోర్ట్, వన్ ఇయర్ వీసా అని చెప్పారు. వీడియోకాల్‌లో ఇంటర్వూ చేశారు. రెండు రోజుల తర్వాత థాయ్‌లాండ్‌కు విమాన టికెట్ పంపించారు.'' అని మధుకర్ రెడ్డి తెలిపారు.

బస్సులో వెళ్లి.. నదిని దాటి..
నిరుడు డిసెంబరు 18న థాయ్‌లాండ్ చేరుకున్నట్లు చెప్పారు మధుకర్ రెడ్డి. అక్కడికి వెళ్లాక ఏజెంట్ సూచనల మేరకు బస్సులో మైసెట్ అనే ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ గుజరాత్‌కు చెందిన వ్యక్తి వీడియోకాల్‌లో ఇంటర్వ్యూ చేసి.. మియన్మార్ -థాయ్ లాండ్ బోర్డర్‌లో నది దాటి రావాలని చెప్పారు.
అక్కడి నుంచి సైబర్ క్రైమ్స్‌కు పాల్పడే కంపెనీకి చేరుకున్నాను.
''మెడికల్ టెస్టులు చేశారు. తర్వాత పాస్ పోర్టు తీసుకున్నారు. అగ్రిమెంట్‌పై సంతకం చేసేటప్పుడు కేవలం రూ.60 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఇండియా వెళ్లిపోతానని గొడవ పెట్టాను. నన్ను పంపించిన ఏజెంటుకు 3వేల డాలర్లు ఇచ్చామని, ఆ మేరకు డబ్బు చెల్లిస్తే వెళ్లిపోవచ్చని చెప్పారు.
''అంత డబ్బు నా దగ్గర లేదని చెప్పేసరికి, పని చేయాల్సిందేనన్నారు.'' అని మధుకర్ రెడ్డి చెప్పారు.సైబర్ క్రైమ్స్ చేయాలనే సంగతి ముందు తనకు తెలియదని చెప్పారాయన.
''ఆ ప్రాంతమంతా ప్రైవేటు ఆర్మీ కంట్రోల్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ తుపాకులతో కాపలా కాస్తున్నారు. శిక్షణ మొదలయ్యాకే సైబర్ క్రైమ్స్ చేయించడానికి తీసుకువచ్చారని తెలిసింది.'' అని వివరించారు.
మధుకర్ థాయ్‌లాండ్ వెళుతున్నట్లు ఇంట్లో చెప్పలేదని ఆయన భార్య బీబీసీతో చెప్పారు.
''మళ్లీ దుబయి వెళుతున్నట్లే ఇంట్లో చెప్పారు. అలాంటి ఒకచోటుకు వెళుతున్నారని ముందుగానే తెలిస్తే వెళ్లనిచ్చేవాళ్లం కాదు.'' అని అన్నారామె.

వీసా అవసరం లేకపోవడంతో..
థాయ్‌లాండ్‌కు వీసా లేకుండా వెళ్లే వీలుండటంతో.. ముందుగా అక్కడకు తీసుకువెళ్లి, అక్కడి నుంచి మియన్మార్‌కు పంపుతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం ప్రసాద్ బీబీసీకి చెప్పారు.
ఉద్యోగాల పేరిట థాయ్‌లాండ్, మియన్మార్ పంపిస్తున్న ఏజెంట్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పది కేసులు నమోదు చేసింది .
''హైదరాబాద్‌లో ఇద్దరు, సిరిసిల్లలో ఇద్దరు, కరీంనగర్ ఒకరు, నిజామాబాద్‌లో ఇద్దరిని అరెస్టు చేశాం. వారిపై మానవ అక్రమ రవాణా కేసులు పెట్టాం. నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.'' అన్నారు డీఎస్పీ కేవీఎం ప్రసాద్.

సైబర్ క్రైమ్స్ ఎలా చేస్తారంటే..
అమెరికా, కెనడాలో ఉంటున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని సైబర్ క్రైమ్స్ చేయిస్తారని మధుకర్ రెడ్డి చెప్పారు .
ఆ కంపెనీని చైనీయులు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు.
''మాకు ఫేస్ బుక్, ఇన్‌స్టా, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి లేదా హ్యాక్ చేసి ఇస్తారు. ఇండియన్ మోడల్స్ ఫొటోలు అప్ లోడ్ చేసి అబ్బాయిలకు గ్రీటింగ్ మేసేజ్ పంపించేవాళ్లం. వారి నుంచి రిప్లై వస్తే మెల్లగా మాటలు కలిపి హానీ ట్రాప్ చేయాలి. '' అన్నారు.
ముందుగా కస్టమర్ల నుంచి ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. తర్వాత పూర్తి సమాచారం తీసుకుంటారు.ఆ వివరాలను టీం లీడర్ కు ఇవ్వాలి. తర్వాత అందరూ కలిసి క్రిప్టో కరెన్సీ రూపంలో ఇన్వెస్ట్ చేయాలని ఆశ పెడతారు.
మొదట్లో నమ్మకం కోసం 20శాతం లాభం వచ్చిందని నమ్మిస్తారు. తర్వాత లాభాలు వచ్చాయని, వ్యాలెట్ లోనే ఉంచాలని మరింత పెట్టుబడి పెట్టాలని ఆశచూపుతారు. అలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే వెంటనే డబ్బులన్నీ విత్ డ్రా చేసేసి.. కమ్యూనికేషన్ నిలిపివేస్తారు.
''నేను వెళ్లిన రెండు రోజులకు ఒకతను, ఓ కస్టమర్‌తో 2లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేయించారు. విత్ డ్రాయల్ అడిగితే ఇవ్వకుండా బ్లాక్ చేశాడు. అతను ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషయం అతని భార్య సోషల్ మీడియాలో మేసేజ్ చేసేసరికి తెలిసింది. ఒక భారతీయుడిగా ఉండి మరో భారతీయుడిని దోపిడీ చేసి చనిపోయేలా చేయడమంటే.. చాలా బాధ, భయంగా అనిపించింది.'' అన్నారు మధుకర్ రెడ్డి.
ఆన్సర్లన్నీ ముందే సిద్ధం
''ఎవరైనా కస్టమర్ కు అనుమానం వచ్చి వాయిస్ కాల్ మాట్లాడాలని ఒత్తిడి చేస్తే, అలా మాట్లాడేందుకు అమ్మాయిలు ఉంటారు.వారు భారతీయ భాషల్లో మాట్లాడగలరు. వీడియోకాల్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.'' అని చెప్పారు మధుకర్ రెడ్డి.
కస్టమర్లు చెప్పే సమాధానాలను బట్టి ముందుగానే జవాబులు సిద్ధమై ఉంటాయి.
''వీడియోకాల్ అడిగితే ఏ స్టోరీ చెప్పాలో ముందుగానే సిద్ధంగా ఉంచుతారు. యూనివర్సిటీ చదువుకు , బాల్యం, స్కూల్ ఇలా ఏ విషయం గురించి అడిగినా.. ఆ విషయానికి సంబంధించి స్టోరీ రెడీగా ఉంటుంది. వాటని కాపీ చేసి పేస్ట్ చేయడమే.'' అని మధుకర్ రెడ్డి వివరించారు.
రోజూ ముగ్గురు కస్టమర్లతో మాట్లాడాలి అందులో ఇద్దరి నుంచి ప్రాథమిక వివరాలు సేకరించాలి.. మిగిలిన వ్యక్తి నుంచి పూర్తి సమాచారం సేకరించాలనే టార్గెట్ విధిస్తారు.
తెలుగు తెలిసిన వ్యక్తి మరో తెలుగు తెలిసిన వ్యక్తిని ట్రాప్ చేయాలి. లేదా ఇతర భాషల వ్యక్తిని ట్రాప్ చేస్తే, చాట్ జీపీటీ సాయంతో భాషను ట్రాన్స్ లేట్ చేసి పోస్టు చేయాలని చెప్పేవాళ్లని మధుకర్ రెడ్డి తెలిపారు.

బాతుగుడ్లు తినిపించేవారు..
పని చేయనని గొడవ పెట్టుకున్నా, వెళ్లిపోతానని చెప్పినా శిక్షలు అనుభవించాల్సిందే. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తే 4-5శాతం కమీషన్లు ఇస్తామని నమ్మబలికేవారు. అదే సమయంలో లక్ష్యం చేరుకోకపోతే జీతంలో కోత పెట్టడం, శిక్షలు వేయడం చేసేవారని చెప్పారు మధుకర్ రెడ్డి.
''నాకు జీతమే 25200 థాయ్ బత్ (థాయ్ లాండ్ రూపీ) కింద ఇచ్చేవారు. పని చేయకపోతే అందులోంచే ఫైన్లు వేసి కోత పెట్టేవారు. '' అని చెప్పారు.
''పని చేయకపోయినా, లక్ష్యాలు చేరుకోకపోతే ఎండలో 3-4 కిలోమీటర్లు పరిగెత్తిస్తారు. 20 లీటర్ల వాటర్ క్యాన్ చేతితో పెట్టి అరగంటో,గంటలోఎండలో నిలబెడతారు. డిప్స్ కొట్టిస్తారు. దుర్వాసన వచ్చే బాతు గుడ్లు బలవంతంగా తినిపిస్తారు. అవి తింటే రెండు రోజుల పాటు ఏమీ తినలేక నరకయాతన అనుభవించేవాళ్లం.'' అని మధుకర్ రెడ్డి వాపోయారు.
ఎవరైనా పెద్ద తప్పు చేశారని భావిస్తే ''ప్రైవేటు ఆర్మీ వచ్చి జైలులో వేసి ఆహారం పెట్టకుండా నిర్బంధించేది.'' అని చెప్పారాయన.
''మళ్లీ ఇండియాకు తిరిగి వస్తాననే నమ్మకం పోయిందని, తమ పరిస్థితిని ఇండియన్ ఎంబసీకి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లాం.'' అని చెప్పారు మధుకర్ రెడ్డి.
''మేం బయటపడటానికి ముందు మియన్మార్ ఆర్మీ వచ్చింది. మేం పనిచేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించింది.'' అని వివరించారు.

విదేశీ ఉద్యోగాలపై మొగ్గు ఎందుకంటే..
డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు ఎక్కువ జీతం ఆశ చూపి యువతను మోసం చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చెబుతున్నారు.
ఇండియాలో ఉంటే రూ.30వేలు ఇచ్చే ఉద్యోగం దొరకకపోగా.. థాయ్‌లాండ్ వెళితే ఒకేసారి రూ.70-80 వేలు ఇచ్చే జీతం అనే సరికి ఆశ పడుతున్నారని చెప్పారు డీఎస్పీ ప్రసాద్.
''అక్కడికి వెళ్లాక సైబర్ నేరాలు చేయించే చైనీయులు యువతకు మాయమాటలు చెబుతారు. నేరం చేసినా ఎవరూ పట్టుకోలేరని, అరెస్టు చేయరని, రెండు దేశాల మధ్య అరెస్టుల పరంగా ఒప్పందాలు లేవని చెబుతారు. అలా బ్రెయిన్ వాష్ చేసి, వారిని ఊబిలో దించుతున్నారు. జీతం ఎక్కువ వస్తోందని యువత కూడా ఆశ పడుతున్నారు.'' అని చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి
ఓవర్సీస్ ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు .
ఏజెంట్ల వివరాలు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో తనిఖీ చేసుకోవాలి. ఏయే కంపెనీలు రిజిస్టర్ అయ్యాయో కూడా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.
రిజిస్టర్ చేసుకోని ఏజెంట్ల ద్వారా వెళితే, ఇక్కడ ప్రచారం చేసే ఉద్యోగం ఒకటి.. అక్కడికి వెళ్లాక చేయాల్సింది మరొకటి ఉండే అవకాశం ఉందంటున్నారు.
''ముందుగానే జాబ్ ప్రొఫైల్ వెరిఫై చేసుకోవాలి. కంపెనీ పాత ప్రొఫైల్ ఏంటి.. ఇచ్చిన నంబర్లు కరెక్టా కాదా వెబ్‌సైట్, మెయిల్ ఐడీ ఇలా ప్రతిదీ వెరిఫై చేసుకుని, అప్పుడే ఒక అభిప్రాయానికి రావాలి'' అని డీఎస్పీ కేవీఎం ప్రసాద్ బీబీసీతో చెప్పారు
ఇలాంటి వ్యవహారాలపై టోల్ ఫ్రీ నంబరు 1930 లేదా cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














