అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఎలా, స్పేస్‌లోకి వెళ్లి వస్తే సంతాన సామర్థ్యం తగ్గుతుందా

ఫొటో సోర్స్, NASA
పీరియడ్స్ అనేవి ప్రతి మహిళకు ఒక సవాలుతో కూడుకున్న విషయమే. మరి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళలకు పీరియడ్స్ వస్తే ఎలా? అక్కడెలా మేనేజ్ చేస్తారు? సునీతా విలియమ్స్‌లాగే అనుకోకుండా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే?
సాధారణంగా మహిళలు ప్రయాణాలు పెట్టుకునేటప్పుడు, పీరియడ్ డేట్ ఎప్పుడు ఉంది? ఈ సమయంలో ప్రయాణం అవసరమా అని ఆలోచిస్తుంటారు?
ఎనిమిది రోజుల కోసమని వెళ్లిన సునీతా విలియమ్స్, తొమ్మిది నెలల పాటు అక్కడే ఉన్నారు. సునీతా విలియమ్స్ ఏజ్ ప్రకారం ఆమెకు ఈ సమస్య ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ, నెలసరి వచ్చే వయసులో ఉన్నవారు ఆమెలాగా నెలల తరబడి అంతరిక్షంలో ఉండాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఎలా మేనేజ్ చేయగలుగుతారన్న సందేహాలు వస్తుంటాయి.
అయితే, అంతరిక్షంలో పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలపై స్పేస్ గైనకాలజిస్ట్ డాక్టర్ వర్షా జైన్‌తో బీబీసీ గతంలో మాట్లాడింది. ఆమె నాసాతో కలిసి అంతరిక్షంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి పరిశోధనలు చేశారు.


అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఎలా?
2019లో వర్షా జైన్ బీబీసీ వ్యాఖ్యాత ఎమ్మా బార్నెట్‌తో ఈ విషయాల గురించి మాట్లాడారు.
ఎమ్మా బార్నెట్ అడిగిన ప్రశ్నలకు వర్షా జైన్ ఇచ్చిన సమాధానాలు ఆమె మాటల్లోనే..
‘‘అంతరిక్షంలో పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్‌ను అంతరిక్షంలోకి పంపేటప్పుడు నాసా ముందున్న ప్రశ్నలు ఇవే.
సమస్యగా మారనంత వరకూ దీన్నొక సమస్యగా చూడొద్దని అప్పటి మహిళా వ్యోమగాములు అన్నారు. కానీ, ఇంజినీర్లు అన్ని ప్రణాళికలూ వేసుకోవాలి. ఎన్ని శానిటరీ ప్రోడక్ట్స్ అవసరమవుతాయో అంచనా వేసుకోవాలి.
వారానికి 100 నుంచి 200 దాకా శానిటరీ ప్యాడ్లు అవసరమవుతాయని అప్పట్లో అంచనా వేశారు. అన్ని అవసరం లేదని తర్వాత తెలుసుకున్నారు.
ప్రస్తుతం మహిళా వ్యోమగాములు పీరియడ్స్‌ను ఆపేందుకు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. వారు ఆరోగ్యవంతులు కాబట్టి వాటిని వాడటం వల్ల సమస్యేమీ ఉండదు.
ఇంకా ఏయే మార్గాల ద్వారా పీరియడ్స్ రాకుండా చేయొచ్చన్న విషయంపైనా నేను పరిశోధనలు చేస్తున్నాను.’’

ఫొటో సోర్స్, NASA
ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన వందల మంది వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు.
సోవియట్ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరిష్కోవా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ. 1963లోనే ఆమె ఈ ఘనత సాధించారు.
ఆ తర్వాత 20 ఏళ్లకు గానీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తమ తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్‌ను అంతరిక్షంలోకి పంపలేకపోయింది.
శాలీ రైడ్ తొలిసారి అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు, 'మీతో పాటు మేకప్ కిట్ తీసుకువెళ్తున్నారా? అంతరిక్ష నౌక సిమ్యులేషన్ (నమూనా)లో లోపాలు కనిపించినప్పుడు ఏడ్చారా?'.. ఇవీ ఆమెను మీడియా అడిగిన ప్రశ్నలు.

ఫొటో సోర్స్, NASA
అంతరిక్ష వాతావరణ ప్రభావం మహిళలు, పురుషులపై భిన్నంగా ఉంటుందా?
వర్షా జైన్ ఇలా చెప్పారు...
‘‘మొత్తంగా అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడటం మహిళలు, పురుషుల్లో ఒకేలా ఉంటుంది. కానీ, కొన్ని తేడాలు ఉన్నాయి.
అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మహిళలకు ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంటుంది. పురుషులకైతే.. తిరిగి భూమి మీదకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.
అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక చూపు, వినికిడికి సంబంధించిన సమస్యలు పురుషులకు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు సంబంధించిన సమస్యలు మహిళలకు వస్తుంటాయి.
శరీరపరమైన, హార్మోన్ల తేడాల వల్లే ఇలా జరుగుతుందా అన్నది ఇంకా తెలియదు. ఇలాంటి వాటి గురించి లోతుగా అర్థం చేసుకుంటే దీర్ఘకాలంలో అంతరిక్షంలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన వస్తుంది.’’

ఫొటో సోర్స్, NASA
టాయిలెట్లతో వచ్చే సమస్యేంటి?
‘‘ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో రెండు టాయిలెట్లు ఉన్నాయి. అయితే, పీరియడ్స్ రక్తాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించలేదు.
అంతరిక్షంలో మూత్రాన్ని వృథా చేయరు. దాన్ని రీసైకిల్ చేసి, మంచి నీరు తయారు చేస్తారు.
పీరియడ్స్ రక్తాన్ని ఓ ఘనరూప పదార్థంగానే పరిగణిస్తారు. స్పేస్ స్టేషన్‌లోని టాయిలెట్లు దీని నుంచి ద్రవ పదార్థాలను వేరు చేయలేవు. కాబట్టి అందులో ఉండే నీటిని రీసైకిల్ చేయలేం.
నీటి వినియోగంలోనూ కొన్ని పరిమితులు ఉంటాయి. రుతుస్రావం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడం ఇబ్బందే.’’

ఫొటో సోర్స్, Science Photo Library
సంతాన సామర్థ్యంపై ప్రభావం పడుతుందా?
‘‘అంతరిక్ష యాత్రల వల్ల సంతాన సామర్థ్యం మీద ప్రభావం పడుతుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
అంతరిక్ష యాత్రలకు వెళ్లొచ్చిన తర్వాత పిల్లలను కన్న పురుషులు, మహిళలు ఉన్నారు.
తొలిసారి అంతరిక్ష యాత్ర చేపట్టే సమయానికే మహిళా వ్యోమగాముల సగటు వయసు 38 ఏళ్లుగా ఉంటోందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు.
భవిష్యత్తులో సంతానం పొందేందుకు అండాలను, వీర్యాన్ని ఘనీభవించి భద్రపరుచుకోవడమన్నది వారివారి వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో నాసా నిబంధనలేవీ పెట్టలేదు.
వ్యోమగాములకు అంతరిక్షంలో రేడియేషన్ ముప్పు ఉంటుంది. అయితే, అది సంతాన సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలియదు.
అంతరిక్ష ప్రయాణంలో వీర్య నాణ్యత తగ్గుతుంది. కానీ తిరిగివచ్చిన తర్వాత మళ్లీ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ప్రభావం ఎలా ఉంటున్నది మాత్రం అధ్యయనం చేయాల్సి ఉంది.
మహిళల్లో పుట్టేటప్పుడే వారి జీవితకాలానికి అవసరమయ్యే అండాలుంటాయి. అంతరిక్ష యాత్రలకు ముందు అండాలను భద్రపరచాలనుకునే మహిళా వ్యోమగాములకు నాసా చాలా సహకరిస్తోంది.’’

ఫొటో సోర్స్, Alamy
అంతరిక్షంలోకి మీరు వెళ్తారా?
‘‘ఎక్కువకాలమైతే ఉండాలనుకోను. ఎందుకంటే శారీరకంగా వచ్చే మార్పుల గురించి నాకు చాలా తెలుసు.
అంతరిక్షంలో శరీరం వయసు పైబడే ప్రక్రియ వేగం పెరిగినట్లుగా ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. తిరిగి భూమిపైకి వచ్చాక ఎన్ని మంచి చర్యలు తీసుకున్నా, అందులో కొన్ని భాగాలు తిరిగి కోలుకోవడం లేదు.
అంతరిక్షం నుంచి భూమిని చూడటం నాకూ ఇష్టమే. కానీ, దాన్నొక దీర్ఘకాలిక లక్ష్యంలా చూస్తా. ప్రస్తుతానికి నేను నా డ్రీమ్ జాబ్ చేస్తున్నా.’’ అన్నారు వర్షా జైన్
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














