మనిషి కంటే ముందే అంతరిక్షంలోకి వెళ్లిన లైకా ఎలా మరణించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇటికాల భవాని
- హోదా, బీబీసీ తెలుగు
సోవియట్ యూనియన్ 1957లో మొదటి ప్రాణిని భూకక్ష్యలోకి పంపింది. ఈ తొలి ‘అంతరిక్ష హీరో’ మాస్కో వీధుల్లో నుంచి వచ్చిన శునకం లైకా. స్పుత్నిక్ II అంతరిక్షనౌకలో స్పేస్‌లోకి ఒంటరిగా వెళ్లిన లైకా అంతకుముందు మానవులెవరూ వెళ్లని ప్రదేశానికి వెళ్లి.. మనుషుల అంతరిక్ష యానానికి మార్గం చూపించింది.
అది ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న కాలం. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపై అడుగు పెట్టడాని కంటే రెండు దశాబ్దాల ముందుఀ అమెరికా, సోవియట్ రష్యా జంతువులను స్పేస్‌లోకి పంపాయి.
అమెరికన్లు కోతులు, చింపాంజీలతో ప్రయోగాలు చేస్తే రష్యన్లు కుక్కలను స్పేస్‌లోకి పంపాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాటికి శిక్షణ ఇవ్వడం సులభం.
కుక్కలు మనుషుల్లాగే బంధాలను ఏర్పరుచుకుంటాయి. సులభంగా అందుబాటులో ఉంటాయి. రష్యన్లు అంతరిక్షంలోకి పంపించేందుకు అన్నీ ఆడ శునకాలను, వీధి కుక్కలను ఎంచుకున్నారు.
ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అవి మనుగడ కోసం పోరాడతాయి. కాబట్టి అంతరిక్ష ప్రయోగానికి అత్యంత అనుకూలమైనవనేది రష్యా శాస్త్రవేత్తల భావన. వాటికి వైద్య పరీక్షలు చేసి, స్పేస్‌సూట్‌లో సౌకర్యంగా ఉండేందుకు శునకాలకు శిక్షణ ఇచ్చారు.

1957 అక్టోబర్ 4న స్పుత్నిక్ 1 ప్రయోగం విజయవంతమైన తరువాత అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ నెల రోజుల్లో ఒక కుక్కను అంతరిక్ష నౌకలో పంపాలని ఆదేశించారు. కృశ్చేవ్ ఆదేశం తర్వాత అంతరిక్ష నౌకను సకాలంలో సిద్ధం చేయడానికి పడిన తొందరలో అందులో పంపించే కుక్క లైకాను సజీవంగా ఎలా తీసుకురావాలనేది ఎవరూ ఆలోచించలేదు. అలా 1957 నవంబర్ 3న లైకాను ఇరుకైన స్పుత్నిక్ IIలో అంతరిక్షంలోకి పంపించారు.
లైకాను అంతరిక్షనౌక ఎక్కించిన ఇంజనీర్లు తనని చూడటం అదే చివరిసారి.

ఫొటో సోర్స్, Getty Images
లైకా చురుకైనది...
లైకా బరువు దాదాపు 6 కిలోలు. అంతరిక్ష యాత్రకు సిద్ధం అయ్యే ముందు మాస్కో వీధుల్లో నివసించేది.
తన చిన్నతనంలో లైకాతో ఆడుకుమన్నాని ప్రొఫెసర్ విక్టర్ యాజ్డోవ్స్కీ బీబీసీతో ఓ ఇంటర్వూలో చెప్పారు. ప్రొఫెసర్ విక్టర్ తండ్రి లైకా ట్రైనింగ్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
"మా నాన్న లైకాను ల్యాబ్ వాతావరణం నుంచి కొంత సమయం బయటికి తీసుకురావలనుకున్నారు. అలా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మేం లైకాతో ఆడుకునే వాళ్లం... లైకా చాలా చురుగ్గా ఉండేది. లైకా చాలా తెలివైనదని.. శిక్షణ ఇవ్వడం సులభమని అంతా అనేవారు" అని ప్రొఫెసర్ విక్టర్ వివరించారు.
లైకా అంతరిక్షంలో మరణించిన తరువాత తన జ్ఞాపకార్థం ప్రత్యేక స్టాంపులు, ఎన్వలప్‌లు తయారు చేశారు. లైకా పేరుతో సిగరెట్ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు కూడా అప్పట్లో దొరికేవి.
ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రపంచంలోనే ఫేమస్ శునకం లైకా అసలు పేరు వేరు. కుద్రియావ్కా (కర్లీ) తన అసలు పేరు. కానీ తరువాత లైకా అని మార్చారని నాసా వెబ్‌సైట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరుకైన అంతరిక్ష నౌకలో లైకా
స్పుత్నిక్ 2 భూమి కక్ష్యలోకి ప్రవేశించిన రెండో అంతరిక్ష నౌక. ఓ ప్రాణిని మొదటిసారిగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. నాసా ప్రకారం స్పుత్నిక్ IIను 4 మీటర్ల ఎత్తు, దిగువన 2 మీటర్ల వ్యాసంతో కోన్ ఆకారంలో అనేక కంపార్ట్‌మెంట్లుతో నిర్మించారు.
ఇందులో లైకా కోసం ఓ ప్రత్యేక క్యాబిన్, రేడియో ట్రాన్స్‌మిటర్లు, భూమికి డేటాను ప్రసారం చేసే టెలిమెట్రీ వ్యవస్థ, ప్రోగ్రామింగ్ యూనిట్, ఉష్ణ నియంత్రణ వ్యవస్థ వంటి సైంటిఫిక్ పరికరాలతో పాటు లైకాను పరిశీలించడానికి ఒక టెలివిజన్ కెమెరాను అమర్చారు. ఇది లైకా కంపార్ట్‌మెంట్ నుంచి భూమికి సెకన్‌కు 10 ఫ్రేమ్‌లను ప్రసారం చేసేది.
అయితే లైకా క్యాబిన్ చాలా చిన్నది. అది పడుకోవడానికి లేదా నిలబడటానికి తగినంత స్థలం మాత్రమే ఉండేది.
విమాన ప్రయాణంలో లైకాను పర్యవేక్షించడానికి తన ప్రధాన నాడిని చర్మానికి దగ్గరగా లాగి, ఒక ట్రాన్స్‌మిటర్‌ను జత చేశారు. పక్కటెముకలు, మెడకు మరిన్ని ట్రాన్స్‌మిటర్‌లను జోడించారని ప్రొఫెసర్ విక్టర్ చెప్పారు.
ఆక్సిజన్‌ను అందించేందుకు గాలి పునరుత్పత్తి వ్యవస్థను, వ్యర్థాలను సేకరించడానికి ఒక బ్యాగ్ అమర్చారు. ఆహారం, నీటిని జెల్లీ రూపంలో పంపారు.
ఒక జంతువును క్యాప్సూల్‌లో పంపించడం ద్వారా అంతరిక్ష సాంకేతికత రేసులో రష్యన్లు అమెరికన్ల కంటే ముందున్నట్లు అందరికి అనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
లైకా ఎలా మరణించింది?
ఊహించినట్లే స్పుత్నిక్ II విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. నాసా ప్రకారం దాదాపు 10 రోజులకు సరిపడా ఆక్సిజన్ స్పుత్నిక్ IIలో పంపారు. అయితే లైకా ఒక వారం తర్వాత ఎటువంటి నొప్పి లేకుండా చనిపోయిందని రష్యా అప్పుడు ప్రకటించింది. అంతరిక్ష శునకం లైకా జాతీయ హీరో అయింది.
కానీ దాదాపు 40 ఏళ్ల తర్వాత లైకా మరణానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.
లైకా అంతరిక్షంలో ఏడు గంటలు మాత్రమే జీవించిందని, భయం, వేడి అలసటతో చనిపోయిందని బయటపడింది.
ఈ విషయాన్ని మాస్కోలోని ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్‌కు చెందిన దిదీనికి సంబంధించిన ఆధారాలను మాస్కోలోని ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్‌కు చెందిన దిమిత్రి మలషెంకోవ్ 2002లో అమెరికాలో జరిగిన వరల్డ్ స్పేస్ కాంగ్రెస్‌లో సమర్పించారు.
తొలుత రికార్డైన టెలిమెట్రీ ప్రకారం.. లైకా భాయాందోళకు గురైంది. మలషెంకోవ్ అందించిన ఆధారాల ప్రకారం లాంచ్ సమయంలో లైకా పల్స్ రేటు విశ్రాంతి స్థాయి కంటే మూడు రెట్లు పెరిగింది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావం నుంచి బయటపడిన తరువాత ఇలా జరిగింది. ఇది లైకా బాగా ఒత్తిడికి గురైందని సూచిస్తుంది.
టెలిమెట్రీ మిషన్ రికార్డుల ప్రకారం లాంచ్‌కి ఐదు నుంచి ఏడు గంటల తర్వాత లైకా నుంచి ఎటువంటి సంకేతాలు అందలేదు.
నాలుగో కక్ష్య ప్రారంభంలో ఉష్ణోగ్రత, తేమ పెరగడంతో, వేడికి, ఒత్తిడి కారణంగా లైకా మరణించింది.
అయితే నాసా తన వెబ్‌సైట్‌లో లైకా రెండు రోజులు మాత్రమే జీవించి ఉంటుందని పేర్కొంది.
కక్ష్యలోకి చేరుకున్న తర్వాత స్పుత్నిక్ II నౌక నోస్‌కోన్(ముందు భాగం) విజయవంతంగా విడిపోయింది. కానీ బ్లాక్ ఏ కోర్ ప్రణాళిక ప్రకారం వేరు కాలేదు. ఉష్ణ నియంత్రణ వ్యవస్థ అనుకున్నట్టు పని చేయలేదు. ఇన్సులేషన్ వదులుగా మారింది. క్యాబిన్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి చేరుకున్నాయి.
ఎప్పుడు మరణించింది అని ఇద్దరు చెబుతున్నదాంట్లో తేడా ఉన్న ఒకటి మాత్రం స్పష్టమైంది. లైకా భయాందోళనకు గురికావడంతో పాటు వేడి కారణంగానూ వారం రోజుల్లోపే మరణించింది.
అయితే స్పుత్నిక్ II అంతరిక్ష మిషన్ ప్రయాణంలో లైకా మరణం ఊహించిందే. ఎందుకంటే కక్ష్యలోకి పంపించిన ప్రాణిని తిరిగి భూమికి తీసుకువచ్చే సాంకేతికత అప్పటికి అభివృద్ధి చెందలేదు.
స్పుత్నిక్ 2 భూమిని 5 నెలల పాటు 2,570 సార్లు చుట్టి 1958 ఏప్రిల్‌లో భూ వాతావరణంలో ప్రవేశించి కాలిపోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














