చనిపోయారనుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యులతో కలిపిన ‘బీబీసీ తెలుగు’ కథనం

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
టీ తాగుదామని రైలు దిగి తమిళనాడులో 22 ఏళ్లు వెట్టిచాకిరిలో మగ్గిపోయిన కోనేరు అప్పారావు అలియాస్ కొండగొరి సుక్కయ్య ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
2003 నుంచి కుటుంబ సభ్యులకు దూరమైన కోనేరు అప్పారావు 2025 జనవరి 31న వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందినా వెంటనే తన కుటుంబసభ్యులను చేరలేకపోయారు.
ఆయనకు తన వివరాలు పెద్దగా గుర్తులేకపోవడమే దీనికి కారణం. అయితే తన ఊరు పార్వతీపురం సమీపంలోని జమ్మిడివలస, జింగిడివలస అంటూ కొన్ని గ్రామాల పేర్లు చెప్పారు.
ఈమేరకు అప్పారావు చెప్పిన గ్రామాల్లో ఆయనను ఎవరైనా గుర్తుపడతారేమోనని ఫిబ్రవరి 28, 2025న ఒడిశా, పార్వతీపురం సరిహద్దు గ్రామాల్లోని స్థానికులను బీబీసీ కలిసింది. కానీ ఎవరు గుర్తుపట్టలేదు. దాంతో ఆ వివరాలతోపాటు, అప్పారావు తాజా పరిస్థితిపై కథనాలను బీబీసీ ప్రచురించింది.
"బీబీసీ కథనం చూసి అప్పారావు కుటుంబసభ్యులు మార్చి 10న మమ్మల్ని సంప్రదించారు. మీ కృషి అభినందనీయం." అంటూ పార్వతీపురం-మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ బీబీసీకి ఫోన్ చేసి చెప్పారు.
"పని కోసం వెళ్లిన మా నాన్న ఆచూకీ దొరక్కపోయేసరికి ఆయన చనిపోయారనుకున్నాం. బీబీసీ న్యూస్‌లో చూసి మా నాన్నను గుర్తించాం" అని అప్పారావు కుమార్తె సాయమ్మ బీబీసీతో చెప్పారు.
"సెల్లులో బీబీసీన్యూస్‌లో చూడగానే...మా మామయ్యేనని తెలిసి ఆశ్చర్యమేసింది" అని బీబీసీకి చెప్పినప్పుడు కూడా అప్పారావు అల్లుడు చందు ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.
అప్పారావు ప్రస్తుతం పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ మునక్కాయవలసలో తన కుమార్తె సాయమ్మ ఇంటిలో ఉంటున్నారు.
ఒడిశాకు చెందిన అప్పారావు తమిళనాడులో వెట్టిచాకిరీలో ఎలా మగ్గిపోయారు, ఎలా విముక్తి పొందారు...ఆయనను కుటుంబం వద్దకు చేర్చేందుకు బీబీసీ చేసిన ప్రయత్నాలను ఒకసారి చూద్దాం..


2003లో ఏం జరిగిందంటే...
మునక్కాయవలసలోని కుమార్తె ఇంట్లో ఉన్న అప్పారావుని కలిసేందుకు బీబీసీ వెళ్లింది. అక్కడ వాతావరణం ఉత్సాహంగా ఉంది. అప్పారావు కుమార్తెతో పాటు ఆయన బంధువులు, అక్కాచెల్లెళ్లు ఆయనను చూసేందుకు వచ్చారు. అంతా కలిసి భోజనం చేస్తూ 20 ఏళ్ల కిందటి ఊరిలోని ముచ్చట్లు అప్పారావుకి చెబుతున్నారు.
22 ఏళ్ల కిందట ఏం జరిగిందో అప్పారావు అలియాస్ సుక్కయ్య బీబీసీతో చెప్పుకొచ్చారు.
‘‘మాది ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పెదవల్లాడ పంచాయితీ చినవల్లాడ గ్రామం. పని కోసం కొందరు స్నేహితులతో కలిసి 2003లో చెన్నై బయలుదేరాను. ఎక్కడో సరిగా గుర్తులేదు కానీ...తమిళనాడులోనే ఒక చోట టీ తాగుదామని రైలు దిగి, తిరిగి ఎక్కేలోపు ఆ రైలు కదిలిపోయింది.
దాంతో పాండిచ్చేరికి వెళ్లే మరో రైలు ఎక్కేశాను. అది కూడా మధ్యలో ఎక్కడో దిగేసి శివగంగ జిల్లాకు వెళ్లే బస్సు ఎక్కాను. అక్కడ కాఫీ తాగుతుండగా ఒకతను నా పేరు, ఊరు, వయసు వివరాలు అడిగాడు. మా ఊరు పంపిస్తానని, తన ఇంటికి తీసుకు వెళ్లాడు. అతడి పేరు అన్నాదురై.
అప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను మా ఊరు పంపకుండా తన గొర్రెలకు, మేకలకు కాపలదారుగా మార్చేశాడు.
ఎప్పుడు డబ్బులడిగినా బ్యాంకుకు వెళ్లి తేవాలంటూ 22 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాడు.
ఎట్టకేలకు జనవరి 31, 2025న అధికారులు గుర్తించి...ఆ వెట్టిచాకిరీ నుంచి బయటపడేశారు. అన్నాదురైని అరెస్ట్ చేశారు’’ అని చెప్పారు అప్పారావు.

2025,ఫిబ్రవరి 28న...
అప్పారావు తన కుటుంబసభ్యుల వివరాలు, తన సొంతూరు విషయాలు సరిగా చెప్పలేకపోవడంతో అతడిని తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఓల్డ్ఏజ్ హోంలో ఉంచారు.
ఓల్డ్‌ఏజ్ హోంలో ఉన్న అప్పారావుతో బీబీసీ మాట్లాడింది.
అప్పుడు తనది పార్వతీపురం సమీపంలోని జమ్మిడివలసని ఒకసారి, ఒడిశాలోని కొరాపుట్ జిల్లా జమ్మడవలస అని మరోసారి, అదే మండలంలోని జంగిడివలసని ఇంకోసారి చెప్పారు.
ఆయన చెప్పిన గ్రామాలన్నింటికీ వెళ్లి అప్పారావు కుటుంబసభ్యుల అచూకీ కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ ఎవరూ ఆయనను గుర్తు పట్టలేకపోయారు. దీంతో బీబీసీ తన ప్రయత్నాన్ని కథనం రూపంలో మార్చి 4న ప్రసారం చేసింది.

మార్చి 10: కలెక్టర్ నుంచి ఫోన్..
బీబీసీ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. పార్వతీపురం జిల్లా కలెక్టర్ కూడా తమ టీమ్‌లను పార్వతీపురంలోని కొన్ని గ్రామాలకు పంపించారు.వారికి కూడా ఎటువంటి ఫలితం లభించలేదు.
అయితే మార్చి 10న కోనేరు అప్పారావు కుటుంబం ఆచూకీ దొరికిందని పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బీబీసీకి ఫోన్ చేసి తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ..."బీబీసీలోని స్టోరీ చూసి కోనేరు అప్పారావు మా అన్నయ్యే అంటూ ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నుంచి ఒక వ్యక్తి ఫోన్‌లో సంప్రదించారు. అయితే, అతని పేరు కోనేరు అప్పారావు కాదని, కొండగొరి సుక్కయ్య అని, అతనిది కొరాపుట్ జిల్లాలోని చినవల్లాడ గ్రామమని చెప్పారు'' అని కలెక్టర్ తెలిపారు.
అప్పారావు కుమార్తె దొంబుదొర సాయమ్మ, అల్లుడు దొంబుదొర చందు పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ, మునక్కాయ వలస గ్రామంలో నివసిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
ఈ వివరాలు సరిచూసి...తమిళనాడులో ఉన్న కోనేరు అప్పారావు అలియాస్ కొండగొరి సుక్కయ్యని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ బీబీసీతో చెప్పారు.

మార్చి 15: తమిళనాడు శివగంగ జిల్లాలో...
అప్పారావు కుమార్తెనని చెప్పిన సాయమ్మ కుటుంబం అందించిన వివరాలను తమిళనాడులోని శివగంగ జిల్లా కలెక్టర్ తో పంచుకున్నారు పార్వతీపురం జిల్లా కలెక్టర్. అప్పారావు చెప్పిన వివరాలతో పోల్చి అతడి కుటుంబీకులేనని నిర్థరణకు అధికారులు వచ్చారు.
తన తల్లి చనిపోయిందని, తన తండ్రికి ఇంక ఎవరూ లేరని తానే చూసుకుంటానని అప్పారావు కుమార్తె సాయమ్మ పార్వతీపురం జిల్లా కలెక్టర్‌కు తెలిపారు.
దీంతో పార్వతీపురం నుంచి అధికారుల బృందం ఒకటి అప్పారావు కుమార్తె , అల్లుడుతో ప్రత్యేక వాహనంలో శివగంగ జిల్లాలో ఉన్న అప్పారావు వద్దకు వెళ్లారు.
అక్కడ అప్పారావుని చూసిన సాయమ్మ ఆయన తన తండ్రేనని గుర్తుపట్టారు. అలాగే సాయమ్మని అప్పారావు కూడా గుర్తు పట్టారు. ఒకరిని ఒకరు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
"22 ఏళ్ల తర్వాత నా తండ్రిని చూసిన క్షణం చాలా సంబరంగా అనిపించింది. మా నాన్న తప్పిపోయిన 3 నెలలకే మా అమ్మ బెంగతో చనిపోయింది. ఇప్పుడు ఇక మా నాన్నకి అన్నీ నేనే. మాతోనే ఉంటారు." అని అప్పారావు కుమార్తె సాయమ్మ బీబీసీకి చెప్పారు.

మార్చి 17: పార్వతీపురం జిల్లాలో...
తమిళనాడులో అధికారిక ప్రక్రియలు పూర్తి చేసుకున్న తర్వాత అప్పారావు, అతడి కుటుంబసభ్యులను మార్చి 17న పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకు వచ్చారు.
ఈ సందర్భంగా వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం కింద వసూలు చేసి తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ.2 లక్షల చెక్కును, రూ. 30 వేల నగదును అప్పారావుకు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అందజేశారు.
సుక్కయ్యకు తక్షణం ఆధార్ కార్డు వచ్చేలా చూస్తామని ఆయన అన్నారు. గొర్రెల పెంపకం యూనిట్ మంజూరు చేస్తామని, అవసరమైతే ఇంటిని కూడా మంజూరు చేస్తామని కలెక్టర్ అప్పారావుకి తెలిపారు.

మార్చి 18: అప్పారావుని కలిసిన బీబీసీ...
పార్వతీపురం జిల్లా డోకిశీల పంచాయితీ ములక్కాయవలస గ్రామంలో కుమార్తె ఇంట్లో ఉంటున్న అప్పారావుని, ఆయన కుటుంబాన్ని కలిసేందుకు బీబీసీ వెళ్లింది. అప్పుడు బీబీసీతో పంచుకున్న విషయాలు...
‘‘నా పేరు కొండగొరి సుక్కయ్య. కానీ అన్నాదురై వద్ద పనిలో ఉన్నప్పుడు అందరూ నన్ను అప్పారావు అని పిలిచేవారు. నాకూ అదే అలవాటైపోయింది. అందుకే నా పేరు అప్పారావు అని చెప్పాను. అన్నాదురై ఇంటికి తీసుకు వెళ్లిన తర్వాత అక్కడ రోజూ గొర్రెలు, మేకలు కాయడమే పని. ఇంటికి వెళ్లిపోతానని డబ్బులు అడిగితే బ్యాంకుకు వెళ్లి తేవాలి అనేవాడు. కానీ ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు. తిండి మాత్రం పెట్టేవాడు.
ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇక మా కూతురు, అల్లుడు ఇంట్లో ఉంటూ...తోట పనులు చేసుకుంటా. మనవళ్లతో ఆడుకుంటాను. అన్నాదురై నా పనికి ఏడాదికి రూ. 50 వేల వేసుకున్నా రూ. 10 లక్షలు ఇవ్వాలి’’ అన్నారు అప్పారావు అలియాస్ సుక్కయ్య.

‘‘చచ్చిపోయాడనుకుని మైల పాటించాం’’
"మా మామయ్య తప్పిపోవడానికి ఏడాది ముందే మా వివాహమైంది. ఆయన తప్పిపోయినప్పుడు నేను చెన్నై, తిరుపతి చుట్టుపక్కల చాలా ప్రదేశాల్లో వెతికాను. కానీ లాభం లేకుండా పోయింది" అని అప్పారావు అల్లుడు దొంబుదొర చందు బీబీసీతో చెప్పారు.
బీబీసీ న్యూస్‌లో మా మామయ్యని చూడగానే నమ్మలేకపోయా, వెంటనే ఊరిలోని పెద్ద మనుషులు ద్వారా కలెక్టర్ ని కలిశామని చందు బీబీసీతో చెప్పారు.
"అప్పారావుతో పాటు వెళ్లిన వాళ్లు ఊరికి వచ్చేశారు. కొంతకాలానికి అప్పారావు చచ్చిపోయి ఉంటారని చెప్పారు. దాంతో ఐదేళ్ల మైల ఆచారం పాటించాం" అని అప్పారావు సోదరి సీత చెప్పారు. కానీ ఇప్పుడు మా అన్నయ్య మా కళ్ల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
"కొంతకాలం మా ఆయన వెతికినా ఆ తర్వాత చచ్చిపోయాడనుకుని మానాన్నని వెతకడం మానేశాం. బీబీసీ న్యూస్ లో చూసి...మా నాన్నలాగే ఉన్నాడని గుర్తుపట్టాను" అని అప్పారావు కుమార్తె సాయమ్మ బీబీసీతో అన్నారు.
ఆ గ్రామం నుంచి బీబీసీ బయలుదేరుతుంటే అప్పారావు కుటుంబసభ్యులందరూ వచ్చి బీబీసీ బృందానికి ఆనందంగా వీడ్కోలు పలికారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














